భారత 15వ ప్రధానిగా నరేంద్ర మోదీ.. | Narendra Modi sworn in as India's 15th Prime Minister | Sakshi
Sakshi News home page

భారత 15వ ప్రధానిగా నరేంద్ర మోదీ..

Published Wed, Dec 31 2014 11:57 PM | Last Updated on Thu, Jul 18 2019 2:07 PM

భారత 15వ ప్రధానిగా నరేంద్ర మోదీ.. - Sakshi

భారత 15వ ప్రధానిగా నరేంద్ర మోదీ..

ప్రపంచంలోనే తొట్టతొలి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, పలు దేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా వర్సీటిలో 821 ఏళ్ల తర్వాత మళ్లీ లాంఛనంగా సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ వర్సిటీని పునరుద్ధరించాలని 2006 లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా ప్రతిపాదించారు.
 
 -    12వ ప్రవాసీ భారతీయ దివస్ న్యూఢిల్లీలో జనవరి 7నుంచి 9 వరకు జరిగింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వివిధ రంగాల్లో సేవలందించిన 13 మంది ప్రవాస భారతీయులకు ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రదానం చేశారు.
 
-    ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిర్మించిన ప్లాట్‌ఫామ్ నెంబర్-1 ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌గా రికార్డుల్లోకెక్కింది. దీని పొడవు 1,355.40 మీటర్లు.
 
-    కౌమారదశలో ఆరోగ్య, ఆహార, ఇతర సాంఘిక సమస్యలను అధిగమించేందుకు 10-19 ఏళ్ల లోపు వారికోసం కేంద్రం కొత్తపథకాన్ని ఆరంభించింది. దీనికి రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌కేఎస్‌కే)గా పేరుపెట్టింది.
 
-    ఒడిశాలోని చిలక సరస్సును సుస్థిర పర్యాటక రంగం, జీవనోపాధి వనరుల అభివృద్ధి, పక్షుల వలస కొనసాగింపునకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఎంపిక చేసింది. చిలక సరస్సుతో కలిపి ఎనిమిది ప్రాంతాలను ఈ సంస్థ ఎంపిక చేసింది. ఆసియాలో చిలక ప్రాంతం ఒక్కటే యూఎన్ ప్రాజెక్టుకు ఎంపికవడం విశేషం.
 
 -    జైనులకు మైనారిటీ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ జనవరి 20న నిర్ణయం తీసుకుంది. దేశంలో వీరి జనాభా 50 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటివరకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మైనారిటీ హోదాను కలిగి ఉన్నారు.
 
 -    జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్- ఎన్‌యూహెచ్‌ఎం) పథకాన్ని అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ బెంగళూర్‌లో జనవరి 20న ప్రారంభించారు. పట్టణ పేద ప్రజలకు సమర్థంగా ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2015 మార్చి నాటికి 50 వేలకు పైగా జనాభా ఉండే 779 పట్టణాలకు పథకాన్ని వర్తింపజేస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 220 మిలియన్ల మందికి ఆరోగ్య సేవలు అందుతాయి.
 
-    దేశంలోనే మొట్టమొదటి మోనోరైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మొదటిదశను ఫిబ్రవరి 1న ప్రారంభించారు. వడాలా-చెంబూర్‌ల మధ్య 8.93 కిలోమీటర్ల మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది.
 
 -    పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పారిస్‌కు చెందిన రిపోర్టర్‌‌స విత్ ఔట్ బోర్డర్‌‌స ఫిబ్రవరి 12న విడుదల చేసిన నివేదికలో భారత్‌కు 140వ స్థానం దక్కింది. 180 దేశాల జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది.
 -    ఒడియా భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. దీంతో ఈ హోదా ఉన్న భాషల సంఖ్య ఆరుకు చేరింది. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు ఈ హోదా ఉంది.
 
 -    దేశంలో తొలి పోస్టాఫీస్ ఏటీఎంను చెన్నైలో ఫిబ్రవరి 27న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రారంభించారు.
 
 -    లోక్‌సభ, శాసనసభ ఎన్నికల వ్యయపరిమితిని పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. లోక్‌సభ వ్యయపరిమితిని పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలకు పెంచారు. ఇది గతంలో పెద్ద రాష్ట్రాల్లో రూ.40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.22 లక్షలుగా ఉంది.
 
 -    దేశంలో అత్యంత ఎత్తయిన జెండా స్తంభాన్ని ఢిల్లీలోని సెంట్రల్ పార్‌‌కలో మార్చి 7న ఆవిష్కరించారు. ఈ స్తంభం ఎత్తు 207 అడుగులు. స్తంభంపై ఎగురవేసిన జెండా పొడవు 90 అడుగులు, వెడల్పు 60 అడుగులు, బరువు 35 కిలోలు. దేశంలో అత్యంత పెద్దదైన జాతీయ పతాకంగా ఇది రికార్డుకెక్కింది.
 
 -    హిజ్రాలను మూడో లింగ వర్గంగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న తీర్పు ఇచ్చింది. వారిని సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా పరిగణించాలని, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు తోడ్పడే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది.
 
 -    భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మార్చి 27న అధికారికంగా ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వో.. భారత్‌తో కలిపి మొత్తం 11 దేశాలను పోలియో వైరస్ రహిత దేశాలుగా ప్రకటించింది.
 
-    దేశంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ముంబైలో ఏప్రిల్ 18న ప్రారంభమైంది. శాంతాక్రజ్- చెంబూర్ లింక్‌రోడ్ (ఎస్‌సీఎల్‌ఆర్) ప్రాజెక్టు ముంబై తూర్పు-పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది.
 
 -    ప్రజావేగుల రక్షణ బిల్లు-2011కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మే 13న ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది.
 
 -    దేశంలో తొలి పొగాకు రహిత గ్రామంగా నాగాలాండ్‌లోని గరిపెమ అనే పల్లె రికార్డులకెక్కింది. మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గరిపెమను పొగాకు రహిత గ్రామంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
 
 -    16వ లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ 282 స్థానాల్లో విజయం సాధించింది. మే 16న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల కంటే 10 స్థానాలను అదనంగా సాధించింది. ఆ పార్టీ నేత నరేంద్రమోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి 3,71,784 ఓట్ల మెజారిటీతోనూ, వడోదర నుంచి 5,70,128 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి 336 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్, మిత్రపక్షాలు ఘోరపరాజయం చవిచూశాయి. దేశ 15వ ప్రధానిగా మోదీ మే 26న ప్రమాణం చేశారు.
 
 -    ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో 70 అంతస్తులతో 213 మీటర్ల ఎత్తయిన చంద్రోదయ మందిర నిర్మాణ పనులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ ఆగస్టు 18న ప్రారంభించారు. ఆలయనిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తై గుడిగా చంద్రోదయ మందిరం ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
 
 -    అంతర్జాతీయ నివాసయోగ్య ప్రాంతాల్లో దేశ రాజధాని ఢిల్లీ111వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్లోబల్ లివబులిటి సంస్థ సర్వే పేర్కొంది. మొదటి స్థానాన్ని వరుసగా నాలుగోసారి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరం సొంతం చేసుకొంది.
 
 -    నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్‌ఏఎమ్)ను ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 15న ఆమోదించింది. అ్గ్ఖఏ అనే ఈ పదం ఆయుర్వేదం, యోగా అండ్ నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతిలను సూచిస్తుంది. ఆయుష్‌ను ప్రత్యేక మంత్రిత్వశాఖగా మోదీ ప్రభుత్వం గుర్తించింది. ఆ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా)గా శ్రీపాద యశోనాయక్ నవంబరు 11న బాధ్యతలు స్వీకరించారు.
 
 -    శిశు మరణాల విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2013లో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన అయిదేళ్లలోపు శిశుమరణాలపై ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 16న నివేదికను విడుదల చేసింది. 2013లో దేశంలో ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 41 మరణాలు నమోదైనట్లు తెలిపింది.
 
 -    స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 2న న్యూఢిల్లీలో ప్రారంభించారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ పేరుతో ఐదేళ్లపాటు ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా ఆరుబయట మలవిసర్జన నిర్మూలించడం, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలు చేపడతారు.
 
 -    దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) విద్యా మంత్రుల, అధికారుల రెండో సదస్సు న్యూఢిల్లీలో అక్టోబరు 31న జరిగింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, విద్యా నాణ్యతను మెరుగుపరచుకోవడంలో పరస్పరం సహకరించుకోవాలని సదస్సు నిర్ణయించింది.
 
 -    పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమయేవ జయతే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబరు 16న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీని కింద ఐదు పథకాలను ప్రారంభించారు. అవి.. శ్రమ సువిధ పోర్టల్, ర్యాండమ్ ఇన్‌స్పెక్షన్ పథకం, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్), అప్రెంటీస్ షిప్ ప్రోత్సాహన యోజన, సవరించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా.
 
 -    గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద ల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న ప్రకటించింది. దీనికోసం రూ. 500 కోట్లు కేటాయించింది.
 
 -    భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31ని జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివాస్)గా కేంద్రం ప్రకటించింది.
 
 -    స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్‌ను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోకపోతే అలాంటి వారికి శిక్ష తప్పదన్నది ఈ బిల్లులోని సారాంశం.
 
 -    పట్టణాల్లో కొత్తగా ఇళ్ల నిర్మాణాల కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ గృహ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు నవంబరు 13న ప్రకటించారు.
 
 -    దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్‌జ్యోతి యోజన కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ నవంబరు 20న ఆమోదించింది. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (ఆర్‌జీజీవీవై) స్థానంలో దీన్ని చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడమే పథకం ప్రధాన లక్ష్యం.
 
 -    పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భారత్ 43 దేశాలకు చెందిన ప్రజలకు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పించింది. దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నవంబరు 27న న్యూఢిల్లీలో ప్రారంభించారు.
 
 -    మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబరు 25ను జాతీయ సుపరిపాలనా దినంగా నిర్ణయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.
 
 -    ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి ఖాతా పథకాన్ని కేంద్రం డిసెంబరు 4న ప్రారంభించింది. ఈ ఖాతాను బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో తెరవొచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలకు వర్తిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 ఏళ్లు పూర్తయ్యాక పథకం ముగుస్తుంది. 14 ఏళ్లు పూర్తయేంత వరకే డబ్బు జమ చేయాల్సి ఉంటుంది.
 
 -    ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించవద్దని, దీనికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఐపీసీ)లోని 309వ సెక్షన్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని డిసెంబర్ 10న రాజ్యసభలో వెల్లడించింది.
 
 -    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య డిసెంబర్ 11న ఢిల్లీలో సద స్సు జరిగింది. పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సదస్సులో రక్షణ, చమురు, గ్యాస్, వైద్యం, గనులు, కమ్యూనికేషన్లు తదితర కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి.
 
 -    భూసేకరణ చట్టం(2013)లో కొత్త సవరణలతో కూడిన ఆర్డినెన్సుకు డిసెంబర్ 29న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ఉన్న ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరిపే సమయంలో.. ప్రభావిత రైతుల్లో కనీసం 70% మంది, ప్రైవేటు ప్రాజెక్టుల విషయంలో కనీసం 80% మంది అంగీకారం తప్పనిసరిగా అవసరమన్న నిబంధనను తొలగిస్తూ భూసేకరణ చట్టంలో సవరణలు చేసింది. ఆయా ప్రాజెక్టులకు సామాజిక ప్రభావ అంచనా(ఎస్‌ఐఏ) నిబంధనను కూడా తొలగించింది.
 
 లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతిని పురస్కరించుకొని ఎంపీ ఆదర్శగ్రామ పథకాన్ని ప్రధాని మోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభించారు. పథకం కింద ప్రతీ ఎంపీ తన నియోజకవర్గంలోని ఏవైనా మూడు గ్రామాల్లో సదుపాయాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకోవాలి. ఈ పథకం కింద వారణాసికి సమీపంలోని జయపూర్ గ్రామాన్ని మోదీ దత్తత తీసుకున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement