New campus
-
నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్‌లో బుధవారం కొత్త క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తోంది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం కోకాపేటలో జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్‌తో కలిసి పాల్గొంటారు. హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ద్వారా మరో 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ దృష్టి సారిస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఈ నెల 5న కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ భేటీ అయ్యారు. కాగ్నిజెంట్ విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని రవికుమార్ ఈ భేటీ అనంతరం ప్రకటించారు. న్యూజెర్సీలో ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కేవలం పది రోజుల వ్యవధిలోనే కొత్త క్యాంపస్ పనులకు కాగ్నిజెంట్ శ్రీకారం చుడుతోంది. 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరిస్తోంది. రాష్ట్రంలో 2002 నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థకు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం కాగ్నిజెంట్ హైదరాబాద్ క్యాంపస్‌లో 57 వేల మంది ఉద్యోగులున్నారు. తెలంగాణ ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్‌కు పేరుంది. గత రెండేళ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7,500 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ తెలంగాణ నుంచి రూ.7,725 కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది. గడిచిన ఐదేళ్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.22.5 కోట్లతో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. -
Narendra Modi: ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా భారత్
రాజ్‌గిర్: అత్యాధునిక, పరిశోధనల ఆధారిత ఉన్నత విద్యా వ్యవస్థతో ప్రపంచంలోనే అతిముఖ్యమైన వైజ్ఞానిక కేంద్రంగా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఎల్లప్పుడూ జిజ్ఞాస, ధైర్యసాహసాలు కలిగి ఉండాలని విద్యార్థులకు ఉద్బోధించారు. బిహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 10 రోజుల వ్యవధిలోనే ఇక్కడికి వచ్చే అవకాశం దక్కడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. విజ్ఞానాన్ని అగి్నకీలలతో కాల్చి బూడిద చెయ్యలేమని, ఇందుకు నలంద విశ్వవిద్యాలయమే ఒక ఉదాహరణ అని చెప్పారు. 21వ శతాబ్దంలో భారత్ కీలక పాత్ర పోషించనుందని, ఆ శతాబ్దం ఆసియాదేనని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని పునరుద్ఘాటించారు. విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాలే ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్యాలుగా ఎదుగుతాయని, ఇది చరిత్ర చెబుతున్న సత్యం అని పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో మన దేశం ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్య హోదాను అనుభవించిందని గుర్తుచేశారు. అప్పట్లో నలంద, విక్రమశిల వంటి విద్యాసంస్థలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయన్నారు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో మన వర్సిటీలు భారత్‌ను ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా చిన్నారుల్లో నవీన ఆలోచనలను ప్రోది చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ల ద్వారా కోటి మందికిపైగా బాలలకు అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. చంద్రయాన్, గగన్‌యాన్ వంటి ప్రయోగాలు మన బాలబాలికల్లో సైన్స్ పట్ల ఉత్సకతను కలిగిస్తున్నాయని చెప్పారు. పదేళ్ల క్రితం మన దేశంలో కేవలం 100 స్టార్టప్ కంపెనీలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.30 లక్షలు దాటేసిందని హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పేటెంట్లు మనకు లభిస్తున్నాయని, రీసెర్చ్ పేపర్ల ప్రచురణలో ముందంజలో ఉన్నామని పేర్కొన్నారు. పరిశోధన, నవీన ఆవిష్కరణలకు మరింత ఊతం ఇవ్వడానికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధిని ప్రకటించామన్నారు. గత పదేళ్లుగా చూస్తే మన దేశంలో సగటున ప్రతి వారానికొక యూనివర్సిటీని నెలకొల్పినట్లు, ప్రతి పది రోజులకొక ఐటీఐని స్థాపించినట్లు తెలుస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. రెండు రొజులకొక అటల్ టింకరింగ్ ల్యాబ్, ప్రతిరోజూ రెండు కొత్త కాలేజీలు ఏర్పాటయ్యాయని స్పష్టంచేశారు. ప్రస్తుతం 23 ఐఐటీలు, 21 ఐఐఎంలు, 22 ఎయిమ్స్‌లు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో మెడికల్ కాలేజీ సంఖ్య రెండింతలు అయ్యిందన్నారు. నలంద మహా విహార సందర్శనబిహార్ రాష్ట్రం నలంద జిల్లా రాజ్‌గిర్‌లోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలలో కూడిన నలంద మహా విహారను ప్రధాని మోదీ బుధవారం సందర్శించారు. ఈ కట్టడం విశేషాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ మహా విహార యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది.మోదీ వేలిపై సిరా గుర్తు ఉందా? నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ప్రారం¿ోత్సవంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీ ఎడమ చేతిని కొద్దిసేపు పట్టుకొని చూశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన మోదీ చూపుడు వేలిపై సిరా గుర్తు ఇంకా ఉందా? అని పరిశీలించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నితీశ్ ఆకస్మిక చర్యకు మోదీ కూడా కొంత ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించారు. అంతేకాదు ఆయన వెనుక ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. -
Infy New Campus: సీఎం జగన్ తోడ్పాటు హర్షణీయం: ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్
ఆంధ్రప్రదేశ్‌లో సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్న సీఎం జగన్ చేస్తున్న కృషి హర్షణీయం అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్ రాయ్ అన్నారు. సీఎం జగన్ వైజాగ్‌లోని రుషికొండలో సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలంజన్ రాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విశాఖపట్నం ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు అందిస్తున్న మద్దతుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డిజిటల్ వంటి సాంకేతికతలపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. సంస్థ భవనాన్ని 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1,000 మంది ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ కోసం అన్ని వసతులు కల్పించేలా దీన్ని రూపొందించామన్నారు. -
గుడ్ న్యూస్: 15,000 ఉద్యోగాలు.. ప్రారంభమైన సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ నిర్మాణం
జర్మనీకి చెందిన మల్టీనేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ శాప్ (SAP) ల్యాబ్స్ బెంగళూరులో రెండో క్యాంపస్ నిర్మాణాన్ని తాజాగా ప్రారంభించింది. 15,000 మంది ఉద్యోగులు పని చేసేందుకు సరిపోయేలా ఈ క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్ వైస్ ప్రెసిడింట్ సింధు గంగాధరన్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 41.07 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. ఇది 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ‘శాప్ ల్యాబ్స్ ఇండియా 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం బెంగళూరులో 15,000 ఉద్యోగాలను సృష్టించే కొత్త 41 ఎకరాల క్యాంపస్‌తో భారతదేశంలో మా పెట్టుబడులను మరింతగా పెంచుతున్నాం’ అని శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్ వైస్ ప్రెసిడింట్ సింధు గంగాధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం శాప్ ల్యాబ్స్‌కు అతిపెద్ద ఆర్అండ్డీ హబ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ మొత్తం ఆర్అండ్డీ విభాగంలో 40 శాతం వాటా దీని నుంచి ఉంది. కొత్త క్యాంపస్ నిర్మాణం భారతదేశం పట్ల తమ నిబద్ధతను మరింత బలపరుస్తుందని శాప్ కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ట్విటర్ క్రాష్: ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను పీకేస్తే ఇలాగే ఉంటుంది! -
హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్
-
అమెజాన్ అతిపెద్ద క్యాంపస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఆఫీస్ స్పేస్ 18 లక్షల చదరపు అడుగులు కైవసం చేసుకుంది. మొత్తం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి. 39 నెలల్లోనే నిర్మాణం పూర్తి అయింది. ప్రతిరోజు సగటున 2,000 మంది కార్మికులు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈఫిల్ టవర్‌కు వినియోగించిన ఇనుము కంటే రెండున్నరెట్లు ఈ భవనానికి వాడారు. ఒకే సమయంలో 972 మంది వెళ్లగలిగేలా 49 లిఫ్టులున్నాయి. ఇవి సెకనుకు ఒక్కో అంతస్తును దాటతాయి. 86 మీటర్ల ఎత్తున్న ఈ భవనంలో విభిన్న రెస్టారెంట్లతో 24 గంటలూ నడిచే భారీ కెఫెటేరియా, హెలిప్యాడ్, 290 కాన్ఫరెన్స్ రూమ్స్ ఏర్పాటు చేశారు. నిర్మాణానికి రూ. 1,500 కోట్లకుపైగా వెచ్చించినట్టు సమాచారం. తొలుత హైదరాబాద్ నుంచే.. అమెజాన్‌కు యూఎస్ వెలుపల ఇది ఏకైక సొంత భవనం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో సంస్థకు 300 క్యాంపస్‌లు ఉన్నాయి. అన్ని కేంద్రాల విస్తీర్ణం 4 కోట్ల చదరపు అడుగులు ఉంది. భారత్‌లో 13 రాష్ట్రాల్లో 50 గిడ్డంగులున్నాయి. ఇక హైదరాబాద్‌లో కంపెనీకి ఎనిమిది ఆఫీసులున్నాయి. 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి నెలకొన్నాయి. 2004లో భారత్‌లో అడుగుపెట్టిన అమెజాన్ తొలుత భాగ్యనగరి కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించింది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ టీమ్స్తోపాటు పెద్ద ఎత్తున కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ హైదరాబాద్ నుంచి జరుగుతున్నాయి. కాగా, నూతన క్యాంపస్‌ను తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించారు. భారత్ నుంచి ఎగుమతులకు ఊతం.. భారత్‌లో అమెజాన్‌కు 30 ఆఫీసులున్నాయి. 62,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. వీరిలో 20,000కుపైగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 1.55 లక్షల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు భారత్‌లో రూ.35,000 కోట్ల పెట్టుబడి పెట్టామని అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు ఫుడ్, రిటైల్‌లో ఖర్చు చేశామన్నారు. గ్లోబల్ రియల్ ఎస్టేట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ షోట్లర్తో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘గ్లోబల్ సెల్లింగ్ వేదిక ద్వారా ఇక్కడి చిన్న వర్తకులు విదేశాల్లో తమ ఉత్పత్తులు విక్రయించుకునే సౌలభ్యం కల్పించాం. 50,000 మంది విక్రేతలు 14 కోట్ల ఉత్పత్తులు అమ్మకానికి ఉంచారు. ఇప్పటి వరకు రూ.7,000 కోట్ల విలువైన ప్రొడక్టులు ఎగుమతి అయ్యాయి. వచ్చే మూడేళ్లలో ఇది రూ.35,000 కోట్లకు చేరుతుందని ఆశిస్తున్నాం. ఈ–కామర్స్ రంగంలో మందగమనం లేదు’ అని వివరించారు. ఆఫీసులో లోపలి ప్రదేశం ఉద్యోగులకు ఆటవిడుపు. ఇండోర్ క్రికెట్ విశాలమైన కార్యాలయం క్యాంపస్‌లో భారీ కెఫెటేరియా -
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఫేస్బుక్...
వాషింగ్టన్ : టెక్ కంపెనీలంటేనే అధిక జీతాలతో పాటు ఆకర్షణీయమైన సౌకర్యాలకు పెట్టింది పేరు. గూగుల్, ఫేస్బుక్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలు కల్పిస్తాయనే విషయం తెలిసిందే. కానీ త్వరలోనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఉద్యోగులకు కల్పించే ఉచిత భోజన సౌకర్యాన్ని దూరం చేయనుందని సమాచారం. ఇక మీదట ఫేస్బుక్ ఉద్యోగులకు కల్పించే ఇన్ హౌస్ డైనింగ్ (ఆఫీస్‌లోనే ఉచిత భోజనం) సదుపాయాలను నిలిపి వేయనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఉద్యోగులకు ఆఫీస్‌లో టీ, కాఫీ, హ్యాండ్ రోల్ సుశీ(ఫ్రాంకీస్) వంటివేవి లభించబోవని తెలిసింది. అయితే ఈ నిబంధన అందరికీ వర్తించదట. త్వరలోనే సిలికాన్ వ్యాలీ, మౌంటెన్ వ్యూలో ప్రారంభించబోయే నూతన క్యాంపస్‌కి మారబోయే 2,000 మంది ఉద్యోగులకు మాత్రమే ఈ నిబంధన వర్తించనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం మౌంటెన్ వ్యూ నిబంధనలు. మౌంటెన్ వ్యూలో ప్రారంభించబోయే ఏ కంపెనీలు కూడా తమ కార్యాలయాల్లో ఉచిత భోజన సౌకర్యాలు కల్పించకూడదు. ఈ నియమం 2014 నుంచి అమల్లో ఉంది. ఇందుకు మౌంటెన్ వ్యూ అధికారులు చెప్పే కారణం ఏంటంటే ‘కార్యాలయాల్లోనే భోజన సదుపాయాలు కల్పించడం వల్ల సిలికాన్ వ్యాలీ చుట్టు పక్కల ఉన్న స్థానిక వ్యాపారాలు దెబ్బతింటాయి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ నిర్ణయం 2014 నుంచి అమల్లో ఉంది. 2014కు ముందు ప్రారంభించిన కంపెనీలకు ఈ నియమం వర్తించదు’ అని తెలిపారు. నూతన కార్యాలయంలో ఉచిత భోజన సౌకర్యం తొలగింపు గురించి ఫేస్బుక్ అధికారి ఒకరు ‘త్వరలో మౌంటెన్ వ్యూలో ప్రారంభించబోయే నూతన క్యాంపస్‌లో ‘కెఫెటేరియా’ సౌకర్యం లేదు. కార్యాలయాల్లోనే వంటశాల ఉండటం మౌంటెన్ వ్యూ నిబంధనలకు విరుద్ధం. కానీ ఉద్యోగులు బయట భోజనం చేసినందుకు అయిన ఖర్చును కంపెనీనే, ఉద్యోగులకు చెల్లిస్తుంది’ అని తెలిపారు. -
కొత్త క్యాంపస్‌లోకి ఇన్ఫోసిస్
సాక్షి, హైదరాబాద్: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న సువిశాల నూతన ప్రాంగణంలోకి కార్యాలయాన్ని మార్చనుంది. 25,000 మంది పనిచేయగల సామర్థ్యంతో పోచారం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాంగణంలో ఇప్పటికే 12,000 సీటింగ్ సామర్థ్యం వరకు పనులు పూర్తయ్యాయి. మంత్రి కె.తారక రామారావుకు ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ఈ విషయాలను వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కలసి సోమవారం టీ-హబ్‌ను సందర్శించిన అనంతరం మంత్రి కేటీఆర్‌తో విశాల్ సిక్కా భేటీ అయ్యారు. సంస్థ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవానికి రావాలని మంత్రిని ఆహ్వానించారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో ఇన్ఫోసిస్‌కు 10,000 మంది సీటింగ్ సామర్థ్యం గల ప్రాంగణం ఉంది. ఇక 2008లో రెండో ప్రాంగణం నిర్మాణ పనులను ఇన్ఫోసిస్ ప్రారంభించింది. రూ. 1,250 కోట్లతో 447 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మిస్తున్నారు. పదేళ్లలో మూడు దశలుగా దీని నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అంచనా. ఈ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇన్ఫోసిస్ నూతన ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశముందని చెప్పారు. టీ-హబ్‌లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇన్ఫోసిస్ సంస్థ ఇన్నోవేషన్ ఫండ్ నుంచి సహకారం అందించేందుకు విశాల్ సిక్కా ఆసక్తి చూపించారని తెలిపారు. -
వోక్సెన్ స్కూల్ కొత్త క్యాంపస్ రెడీ
- తొలి దశలో రూ.200 కోట్ల వ్యయం - స్టార్టప్‌ల కోసం రూ.100 కోట్ల ఫండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేనేజ్మెంట్ విద్యనందిస్తున్న వోక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కొత్త క్యాంపస్ రెడీ అయింది. హైదరాబాద్ సమీపంలోని సదాశివపేట వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. తొలి దశలో రూ.200 కోట్లు ఖర్చు చేశారు. యూకే కేంద్రంగా వ్యాపారాలు సాగిస్తున్న ఎన్నారై ప్రవీణ్ పుల దీన్ని ఏర్పాటు చేశారు. మూడు దశల్లో రానున్న ఈ క్యాంపస్ పూర్తయితే ఏక కాలంలో 2,000 మంది విద్యార్థులు చదువుకునే వీలుంది. రెండేళ్ల వ్యవధి గల పీజీ డిప్లమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సు ఫీజు రూ.17.5 లక్షలు. ఏడాది వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఫర్ ఎక్స్పీరియెన్స్డ్ ప్రొఫెషనల్స్ కోర్సు ఫీజు రూ. 18.05 లక్షలు. ఒక బ్యాచ్ ఇప్పటికే పూర్తయింది. క్యాంపస్ కోసం మొత్తం రూ.500 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రవీణ్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. కాగా విద్యార్థుల కోసం వోక్సెన్ ట్రేడ్ టవర్ పేరిట ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఈవో శ్రీకుమార్ సంగయ తెలిపారు. చక్కని వ్యాపార ఆలోచనకు ఫండింగ్ చేస్తామని, దీని కోసం రూ.100 కోట్ల ఫండ్ ఏర్పాటు చేశామని వె ల్లడించారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు పెద్ద పీట వేస్తామన్నారు. ఒక విద్యార్థికి రూ.1 కోటి సీడ్ ఫండ్ అందించామన్నారు.