కొత్త క్యాంపస్‌లోకి ఇన్ఫోసిస్
సాక్షి, హైదరాబాద్: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న సువిశాల నూతన ప్రాంగణంలోకి కార్యాలయాన్ని మార్చనుంది. 25,000 మంది పనిచేయగల సామర్థ్యంతో పోచారం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాంగణంలో ఇప్పటికే 12,000 సీటింగ్ సామర్థ్యం వరకు పనులు పూర్తయ్యాయి. మంత్రి కె.తారక రామారావుకు ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ఈ విషయాలను వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కలసి సోమవారం టీ-హబ్‌ను సందర్శించిన అనంతరం మంత్రి కేటీఆర్‌తో విశాల్ సిక్కా భేటీ అయ్యారు. సంస్థ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవానికి రావాలని మంత్రిని ఆహ్వానించారు.
ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో ఇన్ఫోసిస్‌కు 10,000 మంది సీటింగ్ సామర్థ్యం గల ప్రాంగణం ఉంది. ఇక 2008లో రెండో ప్రాంగణం నిర్మాణ పనులను ఇన్ఫోసిస్ ప్రారంభించింది. రూ. 1,250 కోట్లతో 447 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మిస్తున్నారు. పదేళ్లలో మూడు దశలుగా దీని నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అంచనా. ఈ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇన్ఫోసిస్ నూతన ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశముందని చెప్పారు. టీ-హబ్‌లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇన్ఫోసిస్ సంస్థ ఇన్నోవేషన్ ఫండ్ నుంచి సహకారం అందించేందుకు విశాల్ సిక్కా ఆసక్తి చూపించారని తెలిపారు.