వృత్తి కాంపౌండర్‌.. ప్రవృత్తి యాక్టర్‌ | Short Films Producing in West Godavari | Sakshi
Sakshi News home page

వెండితెరకు 'షార్ట్‌'కట్‌

Published Mon, Mar 9 2020 11:38 AM | Last Updated on Mon, Mar 9 2020 11:38 AM

Short Films Producing in West Godavari - Sakshi

లఘుచిత్రం పాట చిత్రీకరణలో నిమగ్నమైన ఆర్టిస్టులు, కెమెరామెన్‌

కలలు కనండి.. నిజం చేసుకోండి అన్నారు అబ్దుల్‌ కలాం.. నేటి యువత అదే చేస్తున్నారు.. సినిమాల్లోకి వెళ్లాలనుకున్న వారికి కలను నిజం చేసుకునేందుకు ‘షార్ట్‌’కట్‌ ఎంచుకున్నారు. షార్ట్‌ఫిల్మ్‌ మేకింగ్‌ ద్వారా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.. అయితే చిన్న సినిమా అని అదేదో ఆషామాషీ విషయం అనుకోకండి.. కేవలం 15 నిమిషాల నిడివిలో రెండున్నరగంటల సినిమా చూపించాలి.. లైక్‌లు కొట్టించాలి.. ఈ విషయంలో పాలుకొల్లు డైరెక్టర్లు ప్రేక్షకుల నాడిపట్టారనే చెప్పవచ్చు.. దాసరి, కోడి రామకృష్ణ వారసత్వం కదా! ఆ మాత్రం విషయం ఉంటాది మరి.  

పాలకొల్లు అర్బన్‌:  పాలకొల్లు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు యువకులు ఐదు నుంచి 15 నిమిషాల నిడివితో లఘు చిత్రాన్ని నిర్మించి వారి ప్రతిభను చాటుకుంటున్నారు. సినిమాల్లో అవకాశం దక్కించుకుంటున్నారు. పట్టణానికి చెందిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ అలాగే చాన్స్‌ కొట్టారు. హీరో రాజశేఖర్‌తో ఆయన కల్కి సినిమా తీసి తన టాలెంట్‌ నిరూపించుకున్నారు. ప్రస్తుతం పాలకొల్లు కేంద్రంగా 20 మంది ఔత్సాహిక దర్శకులు ఉన్నారు. వీరిలో సుమారు 10 మంది కంటిన్యూగా ఒకటి తర్వాత ఒకటి షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు. పాలకొల్లు కేంద్రంగా మూడు సంవత్సరాలుగా లఘు చిత్రాల నిర్మాణం ఎక్కువగా సాగుతోంది. గోదావరి నదీ ప్రాంతాలతో పాటు, పేరుపాలెం బీచ్, రిసార్ట్సు, సుందరమైన ఆలయ గోపురాలు, పచ్చని వరి పొలాలు, జలజలా పారే పిల్ల కాలువలే వీరి లొకేషన్లు. అలాగే పాలకొల్లులో కొంతకాలంగా క్షీరపురి అంతర్జాతీయ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ పేరుతో పోటీలు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారు ఔత్సాహికులు. అలాగే కాకినాడ, విశాఖపట్టణం, హైదరాబాద్, విజయవాడ, భీమవరం, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో షార్ట్‌ ఫిలిం పోటీలు నిర్వహిస్తుండటంతో యువత పట్టుదలతో హిట్‌ కొట్టాలని కృషి చేస్తున్నారు. 

లఘు చిత్రంలో ఓ సన్నివేషంలో  ఆర్‌ఎంపీ వైద్యుడు చిర్ల శ్రీనివాసరెడ్డి తదితరులు, లఘుచిత్రం చిత్రీకరణలో నటుడు అంబటి పెదవెంకట్రాజు
వృత్తి కాంపౌండర్‌.. ప్రవృత్తి యాక్టర్‌
తనకు పాలకొల్లు గద్దర్‌గా పేరుందని నటుడు అంబటి పెద వెంకట్రాజు తెలిపాడు. స్వతహాగా తాను గాయకుడ్నినని, ఆర్కెస్ట్రాతో పాటు ఆధ్యాత్మిక గీతాలు పాడుతుంటానని చెప్పాడు. వృత్తిరీత్యా పాలకొల్లులోని డా.నెక్కంటి నరేంద్ర గారి ఎముకల ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నానని, ఇప్పటివరకు 29 లఘుచిత్రాల్లో నటించానని చెప్పాడు. పలు చిత్రాలకు అవార్డులు అందుకున్నట్టు తెలిపాడు.

ఎందుకే ప్రేమ..
ఈ చిత్రంలోని యువకుడి పేరు కానుకొలను శ్రీరామ్‌ (పవన్‌). పాలకొల్లులో 15 ఏళ్లుగా పండ్లవ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్లుగా లఘుచిత్రాలపై మోజు పెంచుకున్నాడు. తనే స్వయంగా స్టోరీ రాసుకుని, డైరెక్ట్‌ చేస్తూ నటిస్తూ విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు.   ఎందుకే ప్రేమ (ప్రేమకథా చిత్రం), మాయ(హర్రర్‌ మూవీ), లిక్కర్, నా లైఫ్‌ కి నేనే హీరో లఘు చిత్రాలను చిత్రీకరించాడు.

సినిమాలంటే పిచ్చి  
డిగ్రీ పూర్తి చేశా. నాకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే చదువు పూర్తికాగానే చెన్నై, కేరళలో పలు సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. ప్రస్తుతం లఘు చిత్రాలు నిర్మిస్తున్నా. 11 లఘు చిత్రాలు నిర్మించా. స్త్రీ, ట్రూ లవ్‌ స్టోరీ, 50 లక్షలు లఘు చిత్రాలకు క్షీరపురి అంతర్జాతీయ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డులు లభించాయి. సినిమా రంగంలో స్థిర పడడమే తన లక్ష్యం. –నవీన్‌ ఏబీ, పాలకొల్లు

లఘుచిత్రంలో  డబ్బింగ్‌ చెబుతున్న ఆర్టిస్ట్‌కి సూచనలు చెబుతున్న దర్శకుడు, నిర్మాత నవీన్‌ ఏబీ
50 లఘు చిత్రాల్లో నటించా..
నేను ఆర్‌ఎంపీ వైద్యుడ్ని. ఒక వైపు వృత్తి చేసుకుంటూ లఘుచిత్రాల్లో గత ఐదారు సంవత్సరాల నుంచి నటిస్తున్నా. జై భారత్‌లో పిచ్చివాడి వేశానికి అవార్డు వచ్చింది. లఘుచిత్రాల్లో నటించడం ద్వారా, టీవీ సీరియల్, సినిమా అవకాశాలు వచ్చాయి. మౌన రాగాలు సీరియల్‌ చేశా. హీరో గోపీచంద్‌ సరసన ఎమ్మెల్యే పాత్ర చేసే అవకాశం వచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల యాక్ట్‌ చేయలేకపోయాను. –చిర్ల శ్రీనివాసరెడ్డి, పాలకొల్లు

టాలెంట్‌ని గుర్తిస్తున్నారు
ద మేట్‌ లఘు చిత్రంలో నటించా. దీన్ని యూ ట్యూబ్‌లో ఆరు లక్షల మంది చూశారు. హలో మాస్టారు, ఆడది... ఆడదాని బ్రతుకు లఘు చిత్రాలు పేరు వచ్చాయి. కడప సేన, దేశానికి రైతే ప్రాణం లఘు చిత్రాలు నటించాను. ఈ రెండు త్వరలో యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయబోతున్నారు.–ఉమాదేవి, ఆర్టిస్ట్‌

22 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు
నాకు టిక్‌టాక్‌లు చేయడం సరదా. ఫేస్‌బుక్‌లో పాలకొల్లు పద్దుగా పేరు.  22 వేల మంది టిక్‌టాక్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. టీవీ సీరియల్స్, లఘు చిత్రాల్లో నటిస్తున్నా. ఇటీవల దేశానికి రైతే ప్రాణం లఘు చిత్రంలో టీచర్‌ పాత్ర చేశా. ఔత్సాహిక నటీనటులకు మంచి అవకాశాలు వస్తున్నాయి.  –వడ్లమూడి పద్మ, పాలకొల్లు

సినిమా నటి కావాలని..
నేను ప్రస్తుతం పాలకొల్లులో ఓ ప్రయివేటు స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాను. నాకు సినిమా నటి కావాలని కోరిక. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు నేర్చుకుంటున్నా. నా తండ్రి లక్ష్మీపతి హైస్కూల్‌లో టీచర్‌. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుగా లఘు చిత్రాల్లోనూ, కవర్‌ సాంగ్స్‌లో నటిస్తున్నాను.           –ముంజులూరి సాయి ప్రకర్ష, పాలకొల్లు

డబ్బింగ్‌ థియేటర్‌ పెట్టా...
పాలకొల్లు కళలకు పెట్టింది పేరు. నేను చదువు పూర్తయిన తర్వాత ముంబయ్‌లో స్టుడియోలో యానిమేషన్‌ వర్కు సొంతంగా చేసుకునేవాడ్ని. ఇటీవల పాలకొల్లు వచ్చాను. సొంతంగా డబ్బింగ్‌ థియేటర్‌ పెట్టాను. నెలకి మూడు నుంచి నాలుగు షార్ట్‌ ఫిలింలకు  డబ్బింగ్‌ చేస్తున్నా.   –బంగారు మణికంఠ, పాలకొల్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement