షార్ట్ కట్... హిట్ కొట్టు!! | new telugu directors follow to short films | Sakshi
Sakshi News home page

షార్ట్ కట్... హిట్ కొట్టు!!

Published Tue, Aug 2 2016 12:19 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

షార్ట్ కట్... హిట్ కొట్టు!! - Sakshi

షార్ట్ కట్... హిట్ కొట్టు!!

‘‘జీవితంలో షార్ట్ కట్‌లు తీసుకోకూడదు..
జర్నీ ఎంత లాంగ్ అయితే అంత గొప్పవాడివి అవుతావ్..
అసలు, జర్నీని ఎంజాయ్ చేయవోయ్..
లక్ష్యం గురించి ఎందుకు ఆలోచిస్తావ్..’’
ఇది కదా మన పెద్దలు మనకు చెప్పింది. ఇప్పుడు షార్ట్ కట్‌లోనే
లాంగ్ జర్నీ కొట్టేస్తున్నారీ కొత్త డెరైక్టర్లు. షార్ట్ ఫిల్మ్ చేసి పెద్ద సినిమాకి చాన్స్ కొట్టేస్తున్నారు. ఆ ‘షార్ట్ కట్.. హిట్ కొట్టు’ కహానీ ఇది.   


డైరెక్టర్ కావాలనుందా? అయితే, ముందు మీ టాలెంట్ చూపించేలా ఓ షార్ట్ ఫిల్మ్ తీయండి. తీసి యూట్యూబ్‌లో పెట్టండి. లేదంటే ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి పంపండి. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావడానికి షార్ట్ ఫిల్మ్స్... ఓ షార్ట్ కట్! మీ షార్ట్ ఫిల్మ్ బాగుంటే... ఫేమస్ అయితే... ఇండస్ట్రీ నుంచి పిలుపు వస్తుంది. ఆ షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఓ ఐదు వేలు కూడా లేవనుకుంటున్నారా? చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఫోనుతోనే మీ షార్ట్ ఫిల్మ్ షూట్ చేసి టాలెంట్ చూపించండి. ఏళ్లకు ఏళ్లు ఓ డెరైక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తేనేడైరెక్టర్ అవుతారనేది ఒకప్పటి మాట. షార్ట్ ఫిల్మ్స్‌తో సత్తా చాటి లాంగ్ ఫిల్మ్స్ తీసిన దర్శకులున్నారు. ఇటీవల టాలీవుడ్‌లో హిట్ హిట్ హుర్రే అంటున్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ లాంగ్ జర్నీ...


స్టార్ తిరిగింది రాజా
నాన్న సీఏ, అన్నయ్య అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇంట్లో ఐఏఎస్ లేదా ఐపీఎస్ చదవమంటున్నారు. కానీ, సుజిత్ మనసంతా తెలుగు సినిమాపైనే ఉంది. 17 ఏళ్ల వయసులో నోకియా 6600 ఫోనుతో షార్ట్ ఫిల్మ్స్ తీయడం ప్రారంభించారు. సుమారు 30 షార్ట్ ఫిల్మ్స్ వరకూ తీశారు. ఐదేళ్ల తర్వాత దర్శకుడిగా అవకాశం వచ్చింది. కానీ, షూటింగ్ మరో వారంలో మొదలవుతుందనగా నిర్మాతలు సారీ చెప్పారు. అనుకోని కారణాల వలన సినిమా ఆగింది. కానీ, సుజీత్ తన ఆశలు వదులుకోలేదు. రెండేళ్ల క్రితం యూవీ క్రియేషన్స్ సంస్థ సుజిత్‌కి ‘రన్ రాజా రన్’ తీసే అవకాశం ఇచ్చింది. ఈ సినిమాతో శర్వానంద్‌కి కొత్త ఇమేజ్ వచ్చింది. లవ్, కామెడీ మిక్స్ చేసిన క్యారెక్టర్స్ బాగా చేయగలడని పేరొచ్చింది. ‘రన్ రాజా రన్’తో సుజిత్ స్టార్ తిరిగింది. ప్రస్తుతం ప్రభాస్ కోసం ఆయన ఓ కథ సిద్ధం చేశారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రం నిర్మిస్తుందని సమాచారం.

 

గాంధి ఎక్స్‌ప్రెస్
‘ఖర్మరా దేవుడా.. బుద్దిగా ఏదో జాబ్ చేయకుండా సినిమా డెరైక్షన్ అంటాడేంటి వీడు’ - సాధారణంగా సినిమా డెరైక్షన్ అంటూ తిరుగుతుంటే ఇంట్లో పెద్దలు అనేమాట. కానీ, మేర్లపాక గాంధీకి ఆ సమస్య లేదు. తండ్రి మేర్లపాక మురళి మంచి రచయిత. అందుకని తనయుణ్ణి ఎంకరేజ్ చేశారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’లతో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నారు గాంధి. అంతకు ముందు గాంధీకి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్స్ చేస్తున్న సమయంలో తీసిన ‘ఖర్మరా దేవుడా’ షార్ట్ ఫిల్మే.


నిన్నటి వెన్నెల... రేపటి ఉయ్యాల
కొత్త కుర్రాడు విరించి వర్మ చెప్పిన కథ నిర్మాత పి. రామ్మోహన్‌కి బాగా నచ్చింది. కానీ, సినిమా తీయగలడా? లేదా? చిన్న డౌట్. కుర్రాడి దర్శకత్వ ప్రతిభ తెలుసుకోవడానికి మరో కథతో షార్ట్ ఫిల్మ్ తీయమని అడిగారు. ఫిక్స్డ్ బడ్జెట్‌లో ‘నిన్నటి వెన్నెల’ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు విరించి వర్మ. రామ్మోహన్ మైండ్‌లో నో మోర్ డౌట్స్. ఆ కుర్రాడికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ కథతో విరించి వర్మ తీసిన సినిమా ‘ఉయ్యాలా జంపాలా’. సినిమా హిట్టు.. దర్శకుడు కూడా. ఆ జోష్‌తో రెండో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ప్రస్తుతం నాని ‘మజ్ను’కి దర్శకత్వం వహిస్తున్నారు. 


బంపర్ ఆఫర్
‘సైన్మా’.. అంటే ఏంటని ఆలోచిస్తున్నారా? తెలంగాణ యాసలో సినిమాని గట్లనే అంటారు మరి. ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ముందు షార్ట్ ఫిల్మ్స్‌తోనే కెరీర్ స్టార్ట్ చేశారు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసినా... ‘అనుకోకుండా’, ‘సైన్మా’లు సోషల్ మీడియాలో తరుణ్ భాస్కర్‌కి పిచ్చ పాపులారిటీ తెచ్చాయి. వాటితో టాలీవుడ్‌లో ఎంట్రీ దొరికింది. ‘సైన్మా’ చూసిన మంచు లక్ష్మీ, నిర్మాత రామ్మోహన్ తదితరులు ఎంకరేజ్ చేశారు. తరుణ్ తండ్రి స్వస్థలం వరంగల్. తరుణ్ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. దాంతో తెలంగాణ యాస, భాషపై మంచి పట్టుంది. షార్ట్ ఫిల్మ్స్, సినిమాలో ఆ యాస, భాషలను ఉపయోగించారు. ఇటీవల విడుదలైన ‘పెళ్లి చూపులు’తో హిట్ అందుకున్నారీ హైదరాబాదీ. ఈ సినిమా విడుదల చేసిన డి.సురేశ్‌బాబు తన సురేశ్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయమని బంపర్ ఆఫర్ ఇచ్చారు.


భలే మంచి డెరైక్టర్
మనుషులే కాదు.. పుస్తకం, కుర్చీ, గడియారం, టీవీ, ఫోన్‌లూ షార్ట్ ఫిల్మ్‌లో పాత్రలే. అవి కూడా నటిస్తాయి. కావాలంటే.. శ్రీరామ్ ఆదిత్య తీసిన ‘ది కాన్స్పిరసీ’ షార్ట్ ఫిల్మ్ చూడండి. దీనికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. 10వ తరగతిలోనే శ్రీరామ్ ఆదిత్యకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఇంజినీరింగ్‌లో షార్ట్ ఫిల్మ్స్ తీయడం ప్రారంభించారు. మొత్తం ఎనిమిది షార్ట్ ఫిల్మ్స్ తీయగా.. రెండిటికి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దర్శకత్వంపై మక్కువతో గూగుల్, ఫేస్‌బుక్ కంపెనీల్లో ఉద్యోగం మానేసి ఫిల్మ్ నగర్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టారు. కొంత స్ట్రగుల్ తర్వాత ‘భలే మంచిరోజు’ అవకాశం వచ్చింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన తర్వాత టాలీవుడ్‌కి మరో కొత్త దర్శకుడు వచ్చాడన్నారు. ‘శ్రీరామ్‌తో సీతామాలక్ష్మి’లో అనే షార్ట్ ఫిల్మ్‌లో ఈ దర్శకుడు నటించారు కూడా.  


‘బేవార్స్’, ‘లవ్ ఫార్ములా 31’, ‘లూజర్’ ,‘తూర్పు పడమర’.. చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు పవన్ సాధినేని. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో దర ్శకుడయ్యారు. నారా రోహిత్ హీరోగా తీసిన ‘సావిత్రి’ దర్శకుడిగా పవన్ సాధినేని రెండో సినిమా. సిద్దార్ధ్, అమలా పాల్ జంటగా నటించిన ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమా గుర్తుందా? సినిమాగా తీయక ముందు అది ఓ షార్ట్ ఫిల్మ్. ‘కాదలిల్ సొదప్పువదు ఎప్పడి’ అని తమిళంలో బాలాజీ మోహన్ తీసిన 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ చూసిన సిద్దార్ధ్ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. కథ కూడా షార్ట్ ఫిల్మ్ నుంచే తీసుకున్నారు.   ‘మీకు మీరే మాకు మేమే’తో దర్శకుడిగా పరిచయమైన హుస్సేన్ షా కిరణ్‌ది షార్ట్ ఫిల్మ్స్ నేపథ్యమే. ‘నాన్నకు ప్రేమతో..’ సినిమా స్క్రిప్ట్ విభాగంలో వర్క్ చేశారీయన.


రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు తీస్తుండడం ఈ న్యూ ఏజ్ డెరైక్టర్స్ స్పెషాలిటీ. హీరోల పాత్రలను యువతరం తమను తాము చూసుకునే విధంగా మలుస్తున్నారు. ఎలాంటి కథలోనైనా ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేసి హిట్స్ అందుకుంటున్నారు. జనరల్‌గా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఫార్ములా సక్సెస్ అయితే దాన్ని చాలామంది ఫాలో అవుతారు. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ డెరైక్టర్స్‌ని ఆదర్శంగా తీసుకుని చిన్న చిత్రాల నుంచి పెద్ద చిత్రాలకు వచ్చేవారి జాబితా పెరుగుతుందని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement