
‘షీ–టీమ్స్’ షార్ట్ ఫిల్మ్ సీడీని ఆవిష్కరిస్తున్న కమిషనర్ మహేందర్‌రెడ్డి, స్వాతిలక్రా తదితరులు
హిమాయత్‌నగర్: నగరంలో పోలీస్ శాఖతో సంబంధం లేకుండా జరిపిన సర్వేలో 76 శాతం మంది మహిళలు ‘షీ టీమ్స్’ వల్ల ధైర్యంగా జీవిస్తున్నామని తెలిపారని నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. మహిళలకు ‘షీ టీమ్స్’పై మరింత అవగాహన కల్పించేందుకు లిటిల్ మ్యూజిక్ ఫౌండేషన్ మ్యుజిషీయన్ రామాచారి, షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ జయభారత్, డబ్బింగ్ ఆర్టిస్ట్ వంశీ నటించి, నిర్మించిన మూడు షార్ట్ ఫిల్మ్స్ ను గురువారం బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు.
తొలి సీడీని అడిషనల్ కమిషనర్ క్రైమ్ స్వాతిలక్రా, అడిషనల్ సీపీ అడ్మిన్ మురళీకృష్ణ, ట్రాఫిక్ కమిషనర్ జితేందర్, ఎస్‌బీ జాయింట్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, అడిషనల్ డీసీపీలు అవినాష్‌మహంతి, రంజన్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... నగరంలో మహిళల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నగర వ్యాప్తంగా రెండేళ్ల క్రితం 100 షీటీమ్స్‌ను ప్రారంభించిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు షీటీమ్స్ బస్టాప్‌లు, సినిమా థియేటర్‌లు, షాపింగ్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ నిఘాను ఏర్పాటు చేసి వీడియో రికార్డింగ్ సహాయంతో ఈవ్‌టీజర్స్‌ను పట్టుకున్నారన్నారు.
నగరంలోని మహిళలకు ‘షీ టీమ్స్’ అభయహస్తంగా పని చేస్తున్నాయన్నారు. మొదటి రెండుసార్లు తప్పుచేసిన వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామని, మళ్లీ వారు తప్పు చేస్తే జైలుకు పంపుతున్నామన్నారు. షీటీమ్స్‌పై స్త్రీలకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ వీడియోలు, ఆడియోలు రూపొందించారన్నారు. స్వాతిలక్రా మాట్లాడుతూ... నిమిషం నిడివి గల ఈ మూడు వీడియోలు అన్ని సినిమా థియేటర్స్‌లో ప్రదర్శిస్తామని, ఆడియో క్లిప్పింగ్‌లు ప్రతీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్లే అవుతాయన్నారు.
వేధింపులకు గురయ్యేవారు నిర్భయంగా తమను వేధించేవారిపై షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయొచ్చని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్వాతిలక్రా భరోసా ఇచ్చారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ నంబర్‌లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ‘షీ టీమ్స్’ ఏసీపీ కవిత పనితీరును మొచ్చుకుంటూ కమిషనర్ మహేందర్‌రెడ్డి జ్ఞాపికను అందచేశారు. ఈ షార్ట్‌ఫిల్‌్మలకు సహకారం అందించిన రామాచారి, జయభారత్, వంశీలను సత్కరించారు.