
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు దాదాపు రూ.40 కోట్ల సొత్తు, నగదు దోచుకుపోయారు. ఒక ఆటో ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. సంఘటన జరిగిన ఇరవై గంటల్లోనే ముగ్గురు నిందితులను పట్టుకుని, సొత్తు రికవరీ చేశారు. రోహిత్ కేడియా తన ఉమ్మడి కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన కుటుంబ సంస్థ కేడియా ఆయిల్స్ కంపెనీలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇరవైమంది పని చేస్తున్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలోని తమ ఇంటి ప్రాంగణంలోనే పనివారి కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు.
రోహిత్ ఇంట్లో బిహార్‌లోని బీరుల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పనిచేసి, ఏడాది కిందట మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయమైంది. దుబాయ్‌లో డెస్టిన్‌షన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల్లో సహాయంగా ఉండటానికి సుశీల్‌ను రోహిత్ 15 రోజుల కిందట పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి సుశీల్‌తో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది.
సుశీల్, బసంతి మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ కుటుంబం మొత్తం ఫిబ్రవరి రెండో వారంలో దుబాయ్ వెళ్లారు. దీన్ని అదనుగా భావించిన సుశీల్ ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను పిలిపించాడు. ఫిబ్రవరి 10న వచ్చిన మోల్హు అదే రోజు అర్ధరాత్రి దాటాక సుశీల్‌తో కలిసి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించాడు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాభరణాలు, 1.4 కేజీల ఇతర బంగారు ఆభరణాలు, రూ.19.63 లక్షల నగదు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి తస్కరించారు.
ఈ సొత్తుతో పాటు బసంతిని తీసుకుని ఉడాయించారు. ఫిబ్రవరి 11న ఉదయం రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని మిగిలిన పనివాళ్లు గుర్తించి దుబాయ్‌లో ఉన్న యజమానికి చెప్పారు. ఈ కేసు ఛేదించడానికి నారాయణగూడ పోలీసులు, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. రోహిత్ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నా, మానిటర్ లేదు. రోహిత్ కుటుంబ సభ్యులు తమ సెల్‌ఫోన్లలోనే ఈ దృశ్యాలు చూస్తుంటారు. సెల్‌ఫోన్‌లో రికార్డయిన అనుమానితుల వీడియోలు తమకు పంపాలని పోలీసులు రోహిత్‌ను కోరారు. వీటిని పంపిన రోహిత్, ఆ ముగ్గురిలో ఇద్దరిని సుశీల్, బసంతిగా గుర్తించాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ నేరం జరిగితే, ఉదయం 9 గంటలకు ఫిర్యాదు వచ్చింది. ఏమాత్రం ఆలస్యమైనా నిందితులు చిక్కరని భావించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
రోహిత్ ఇంటి సమీపంలో రహదారిపై ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పోలీసులు పరిశీలించి, నిందితులు చోరీ చేసిన ఇంటి నుంచి తెలుగు అకాడమీ వరకు నడుచుకుంటూ వెళ్లి, ఆటో ఎక్కినట్లు గుర్తించారు. అయితే ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించకపోవడంతో వాహనం వెళ్లిన దిశను ఆధారంగా చేసుకున్నారు. నిందితులతో ఉన్న ఆటో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్ కమిషనరేట్, ట్రాఫిక్ కమిషనరేట్ మీదుగా ప్రయాణించినట్లు గుర్తించారు. సుశీల్ బిహార్‌కు, బసంతి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని రోహిత్ ద్వారా తెలుసుకున్న పోలీసులు– నిందితులు ఆ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక చోటుకు వెళ్లి ఉంటారని అంచనా వేశారు. అంత సొత్తుతో విమానం ఎక్కే అవకాశం ఉండదని, నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఉంటారని భావించారు.
అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ఫ్లాట్‌ఫామ్స్‌పై ఉన్న సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలించి, ఆ ముగ్గురూ ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారని, అది ఉదయం 6.45 గంటలకు బయలుదేరిందని గుర్తించారు. వెంటనే ఈస్ట్‌జోన్ డీసీపీ బి.బాలస్వామి రైల్వే పోలీసులను అప్రమత్తం చేసి, నిందితుల ఫొటోలు పంపారు. అధికారులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. తనిఖీలు చేపట్టిన రైల్వే పోలీసులకు జనరల్ బోగీలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఈ ముగ్గురూ తారసపడ్డారు. వీరిని పట్టుకుని, రైల్వే పోలీసులు సొత్తు రికవరీ చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో నాగపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న హైదరాబాద్ పోలీసులకు వీరిని అప్పగించారు.
మరోవైపు, రోహిత్ ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అధికారులు సుశీల్‌తో పాటు మోల్హు వేలిముద్రలను సేకరించారు. వీటిని తమ డేటాబేస్‌లో సెర్చ్ చేయగా, 2023 జనవరి 31న దోమలగూడలో జరిగిన స్నేహలతాదేవి హత్యకు సంబంధించిన కీలక ఆధారం దొరికింది. అప్పట్లో ఆమెకు కేర్ టేకర్‌గా పని చేసిన బిహారీ మహేష్‌కుమార్ ముఖియా, మోల్హు ముఖియాతో కలిసి ఆ వృద్ధురాలిని చంపి, రూ.కోటి విలువైన సొత్తుతో ఉడాయించాడు. గత ఏడాది అక్టోబర్‌లో మహేష్ చిక్కినా, మోల్హు పరారీలోనే ఉన్నాడు. కేడియా ఇంట్లో దొరికిన వేలిముద్రల ఆధారంగా నాటి కేసులోనూ మోల్హు నిందితుడని గుర్తించారు. దీంతో ఇతడిని తొలుత నారాయణగూడ, ఆపై దోమలగూడ కేసుల్లో అరెస్టు చేశారు. నిందితులు చిక్కడం ఆలస్యం కావడంతో స్నేహలతాదేవిని చంపి ఎత్తుకుపోయిన సొత్తులో కనీసం ఒక్క రూపాయి కూడా రివకరీ కాలేదు.
∙శ్రీరంగం కామేష్
Comments
Please login to add a commentAdd a comment