నటుడు ఎల్‌బీ శ్రీరాం
సాక్షి, వరంగల్ రూరల్ : వరంగల్ ఒక అద్భుతమని, తెలుగు వారు తమ ప్రాంతాలకు వెళ్లాలంటే ఓరుగల్లు దాటాల్సిందేనని నటుడు, రచయిత ఎల్‌బీ శ్రీరాం అన్నారు. షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చిన ఆయనను సోమవారం సాక్షి పలకరించింది. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
వరంగల్‌కు అనేక సందర్భాల్లో వచ్చాను. షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం రావడం ఇదే మొదటి సారి. చిన్నప్పుడు నాటకాలు వేసేవాడిని. 17 సంవత్సరాల పాటు నాటికలు రచించి నటించాను. రిహార్సల్‌కు కోసం వరంగల్, నిజామాబాద్ వెళ్లేవాడిని. తెలుగువాళ్లు హైదారాబాద్ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్లాలన్నా, తిరుగుప్రయాణమైనా వరంగల్ దాటాల్సిందే. గేట్ వే ఆఫ్ తెలు గు పీపుల్‌గా ఓరుగల్లుకు సుస్థిర స్థానం ఉంది.
వారం రోజులు.. మూడు షార్ట్ ఫిల్మ్‌లు
షార్ట్ ఫిలిం తీసేందుకు 24 విభాగాలతో కూడిన టీంతో వచ్చాను. కథకు అనువైన ప్రాంతాలను ఎంచుకుని షూట్ చేస్తున్నప్పుడు పొందే అనుభూతే వేరు. వారం రోజుల్లో మూడు షార్ట్ ఫిల్మ్‌లు పూర్తి చేయాలి. ఈ మూడు సినిమాలకు కథలు వరంగల్‌కు చెందిన రచయిత రామచంద్రమౌళి అందించారు.
వరంగల్, హన్మకొండలలో ఉన్న ప్రాంతాలన్నింటినీ తిప్పి చూపించారు. ఆయన రాసిన కథలు ఆయా ఏరియాలతో పెనవేసుకుని ఉన్నాయి. నేను ఒక రచయితగా రామచంద్రమౌళి రచనలను ఎంతగానో ఇష్టపడుతాను. షార్ట్ ఫిలిం షూట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన రచనలు షూట్ చేయాలనుకున్నాను.
మీరు సహకరిస్తే చేస్తా అని చెప్పాను. రామచంద్రమౌళి మరోమాట చెప్పకుండానే అంగీకరించాడు. అన్ని లోకేషన్‌లు వరంగల్‌లో ఉన్నాయని చెప్పారు. వర్ధన్నపేట సర్పంచ్ గాడిపెల్లి రాజేశ్వర్ రావు, కాజీపేట తిరుమలయ్య, మెరుగు సాంబయ్య, చిప్ప వెంకటేశ్వర్లు, డాక్టర్ మురళీకృష్ణ ఎంతగానో సహకరిస్తున్నారు.
కోటల అందాలు..
వరంగల్‌లో ఉన్న వేయిస్థంభాల దేవాలయం, ఖిలావరంగల్, రామప్ప, లక్నవరం ఇలా అన్నీ అద్భుతాలే. వరంగల్‌లో ఏ వీధికి వెళ్లినా మగ్గాలు కన్పిస్తుంటాయి. కాకతీయ కోట, రామప్ప గుడి ఎలా చరిత్రను నిలబెడుతున్నాయో చేనేత కార్మికులు సైతం వాళ్ల వృత్తిని నమ్ముకుని చరిత్రలో నిలిచిపోతారు.
గూగుల్ మాయ..
ఇప్పటి తరం యువకులు ఏది కావాలన్న గూగుల్‌లోనే సెర్చ్ చేస్తున్నారు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు. అలాంటిది నేటి యువత గూగుల్‌కు దాసోహం కావడం బాధేస్తుంది. ప్రస్తుతం మానవ విలువలు హరించుకుపోతున్నాయి. మంచి సందేశంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే షార్ట్ ఫిల్మ్‌లు తీయాలని నిర్ణయానికి వచ్చా.
సంప్రదాయాలకు పెద్దపీట..
మన సంస్కృతి, సంప్రదాయాలు ముందు తరం వాళ్లకు అందించే ప్రయత్నంలో భాగంగానే షార్ట్ ఫిల్మ్‌లు తీస్తున్న. ఇప్పటి వరకు 20 షార్ట్ ఫిల్మ్‌లు తీశాను. ఇతరులు తీసిన 10 షార్ట్ ఫిల్మ్‌లలో నటించాను. డోలు అనే షార్ట్ ఫిల్మ్‌కు నంది అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు తీసిన షార్ట్ ఫిల్మ్‌లను యూట్యూబ్‌లో రెండున్నలక్షలకు పైగా ప్రేక్షకులు వీక్షించారు.
500 సినిమాల్లో నటన..
ఇప్పటి వరకు 500 సినిమాల్లో నటించాను. ఛత్రపతి, చాలా బాగుంది, స్టాలిన్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, సొంత ఊరు, సరైనోడు లాంటి సిని మాలు నాకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. ప్రభుత్వపరంగా నాలుగు నంది అవార్డులు వచ్చాయి. 40 సినిమాలకు డైలాగులు రాశాను.
Comments
Please login to add a commentAdd a comment