LB Sriram
-
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
'ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు' అన్నారు పెద్దలు. 'ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి' అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో 'లగ్గం' మూవీని మొదలుపెట్టి శరవేగంగా తాజాగా 'లగ్గం' టాకీ పార్ట్ పూర్తయింది.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)రాజేంద్ర ప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, రోహిణి, రఘు బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు సంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను తీసినట్లు తెలుస్తోంది. చరణ్ అర్జున్ సంగీతమందించారు. 'బేబి' ఫేమ్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ గురించి చెబుతారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
మీరు ఇ వి వి గారి పేరు తీస్తే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి
-
నా తోటి కమెడియన్స్ వెళ్ళిపోయాక నేను...!
-
నేను చిరంజీవికి పెద్ద అభిమానిని: LB శ్రీరామ్
-
కవిసామ్రాట్ సినిమా ఎందుకు చేయాలనిపించింది అంటే
-
అమృతం సీరియల్ చేయడానికి కారణం ఇదే..!
-
మనిద్దరం పక్షిలా ఎగిరిపోదాం అన్నయ్య: LB శ్రీరామ్
-
నా తమ్ముడి వల్లే నేను ఈ స్థాయికి వచ్చా
-
చిరంజీవి లెవెల్లో ఎలివేషన్ ఇచ్చాడు నాకు: LB శ్రీరామ్
-
LB శ్రీరామ్ గారిని ఎలా ఏడుస్తున్నాడో చూడండి..!
-
ప్రకృతిలో ఉన్న గొప్పతనం నీకు తెలియదు: LB శ్రీరామ్
-
దేవుని పాట ఎంత బాగా పాడారో వినండి
-
మా నాన్న కి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు: LB శ్రీరామ్
-
సినిమాల్లో ట్రై చేద్దామనుకుంటున్నా: ఎల్బీ శ్రీరామ్
'చాలా బాగుంది' సినిమాతో నటుడిగా బ్రేక్ అందుకున్నాడు ఎల్బీ శ్రీరామ్. కమెడియన్‌గా ఎన్నో సినిమాలు చేసిన ఆయన 'అమ్మో ఒకటో తారీఖు' చిత్రంతో సీరియస్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించాడు. ముప్పై ఏళ్ల సినీ ప్రయాణంలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన షార్ట్ ఫిలింస్ కూడా చేశాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బును షార్ట్ ఫిలింస్‌కు ఖర్చు చేస్తూ సమాజానికి ఉపయోగపడే కథలను ప్రేక్షకులకు చేరవేస్తున్నాడు. తాజాగా ఆయన కొత్త సంవత్సరానికి వెరైటీగా వెల్కమ్ చెప్పాడు. 'హాయ్ ఫ్రెండ్స్.. కొత్త సంవత్సరంలో కొత్తకొత్తగా ఏదైనా చేద్దాం.. నేను సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా! కొత్త కుర్రాణ్ణి కనక కుర్ర వేషాలేస్తున్నా' అంటూ పసుపు రంగు చొక్కాలో తెల్ల రంగు నిక్కర్లో స్టైల్‌గా నడుస్తున్న ఓ ఫోటోను ట్విటర్లో షేర్ చేశాడు శ్రీరామ్. ఇది చూసిన అభిమానులు 'రచయితలకి వయసేంటి మాస్టారు? మీరు నిత్య యవ్వనులు, రచనాప్రత్యుత్పత్తి నిరంతరాయప్రక్రియ', 'లవర్ బాయ్(ఎల్బీ)గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు', 'ముసలితనం మనిషికి కానీ మనస్సుకు కాదు సార్.. మీరు ఏం చెప్పినా అది నూతనమే, ఆధునాతనమే..' అంటూ న్యూఇయర్ విషెస్ చెప్తున్నారు. Hii🙋♂️FRIENDS Happy😍NewYear కొత్త సంవత్సరంలో కొత్తకొత్తగా ఏదైనా చేద్దాం.. నేను సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను.. కొత్త కుర్రాణ్ణి కనక.. కుర్రవేషాలేస్తున్నా! pic.twitter.com/CX825KPCR7 — LB Sriram (@LB_Sriram) January 1, 2023 చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లను షాపింగ్‌కు తీసుకెళ్తానన్న ప్రభాస్ ఆ విషయంలో నాకు, చరణ్‌కు పోలికే లేదు: చిరంజీవి -
సినిమాలకు ఎల్బీ శ్రీరాం ఎందుకు దూరమయ్యారు?.. కారణం ఇదే
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): నాకు నచ్చనిది ఏదైనా వదులుకుంటా.. నచ్చిన చోటే సంతృప్తిగా జీవిస్తా.. పదేళ్ల పాటు సినీ నటుడిగా ఎన్నో హాస్య, సందేశాత్మక చిత్రాల్లో నటించా.. అక్కడ మంచి క్యారెక్టర్లు చేసి సంతృప్తి చెందా.. హాస్య నటుడి నుంచి బయటపడాలనే సినిమాలకు స్వస్తి చెప్పి సామాజిక సందేశాలిచ్చే లఘు చిత్రాల రూపకల్పన, నిర్మాణాలపైనే దృష్టి పెట్టానని సినీ, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, ఎల్బీ హార్ట్ ఫిలిం మేకర్ ఎల్బీ శ్రీరామ్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్ భవనంలో ఆయన విలేకర్లతో శనివారం రాత్రి మాట్లాడారు. అమలాపురంలో అమర గాయకుడు శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్మించిన ఘంటసాల విగ్రహాన్ని ఎల్బీ శ్రీరామ్ ఆదివారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ఈ లోగా ఆయన తన మనోగతాన్ని విలేకర్ల సమావేశంలో ఆవిష్కరించారు. తమ సొంతూరు కోనసీమలోని అయినవిల్లి మండలం నేదునూరు అగ్రహారం అని ఆయన తెలిపారు. ఏడుగురు అన్నదమ్ముల్లో ఒకడైన తాను 23 ఏళ్ల కిందట సినీ అవకాశాలను అన్వేషించుకుంటూ సినీ పరిశ్రమకు వెళ్లానని శ్రీరామ్ చెప్పారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆరిస్ట్‌గా తనను చిత్ర పరిశ్రమ గుర్తించిందన్నారు. ఈ ఒరవడిలోనే ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రంలో నటన ద్వారా పరిశ్రమ తనలో కొత్త నటుడిని చూసిందని శ్రీరామ్ వివరించారు. ఇప్పటి వరకూ 500 చిత్రాల్లో నటించానని పేర్కొన్నారు. ఆరేళ్లుగా పరిశ్రమకు దూరంగా... ఆరేళ్ల నుంచి తాను పావుగంట సమయంలో సందేశాత్మకతను అందించే లఘు చిత్రాల నిర్మాణంపై దృష్టి పెట్టానని ఎల్బీ శ్రీరామ్ అన్నారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నానన్నారు. హాస్య నటుడి ముద్ర నుంచి బయట పడాలనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ ఆరేళ్లలో 60 లఘు చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించానని అన్నారు. ప్రతి లఘు చిత్రంలోనూ సమాజానికి ఎన్నో సందేశాత్మక కథాంశాలు అందించానన్న సంతృప్తి ఉందన్నారు. ఇదే ఉత్సాహం, సంతృప్తితో మరి కొన్నేళ్లు సమాజానికి పనికి వచ్చే లఘు చిత్రాలు నిర్మిస్తానని శ్రీరామ్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో తానున్న సమయంలో దాదాపు 40 మంది హాస్య నటులు ఉండేవారని, అందులో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నానని వివరించారు. ఇప్పుడు సమాజ హితం కోసం లఘు చిత్రాలు నిర్మిస్తున్నానని అన్నారు. వుడయార్ శిల్పకళాధామం అత్యద్భుతం కొత్తపేట: వుడయార్ శిల్పకళాధామం అత్యద్భుతం.. శిల్పాలకు ప్రాణం పోసినట్టు ఈ ప్రాంగణంలో విగ్రహాలు జీవకళతో ఉట్టిపడుతున్నాయంటూ ప్రముఖ సినీ హాస్య, క్యారెక్టర్ ఆర్టిస్టు, సినీ నాటక రచయిత, దర్శకుడు ఎల్బీ శ్రీరామ్ అన్నారు. సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ రూపొందించగా ఆ విగ్రహాన్ని అమలాపురంలో నెలకొల్పారు. దానిని ఆదివారం ఎల్బీ శ్రీరామ్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. అమలాపురం వెళుతూ శ్రీరామ్ మార్గం మధ్యలో కొత్తపేటలో వుడయార్ శిల్పకళాధామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిల్పి రాజ్‌కుమార్ మలిచిన విగ్రహాలు రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పగా చూశానన్నా రు. ఈ శిల్పి గురించి విన్నానని, ఎప్పటి నుంచో ఈ శిల్పకళాధామాన్ని సందర్శించాలనే కోరిక ఇప్పటికి నెరవేరిందన్నారు. ఈ ప్రాంగణంలో విగ్రహాలు కళాఖ ండాలని, అన్నీ జీవకళ ఉట్టిపడుతున్నాయంటూ వుడయార్ శిల్పకళా నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం ఎల్బీ శ్రీరామ్‌ను శిల్పి రాజ్‌కుమార్ శాలువా, పూలమాల, మెమెంటోతో ఘనంగా సత్కరించారు. చదవండి: టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా : హీరోయిన్ -
అందుకే అరవై షార్ట్ ఫిలింస్ తీశా!
‘‘నేటి యువత చదువు, నా కుటుంబం, నా ఉద్యోగం, నా సంపాదన అంటూ ఉరుకులు పరుగులు పెడుతోంది. అలాంటి యువతరానికి విలువల గురించి చెప్పాలని తీసిన చిత్రం ‘కవి సమ్రాట్’. విలువల కోసం యువత పరుగులు పెడితే భారతదేశం గతం కంటే వంద రెట్లు బాగుంటుంది’’ అని ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ అన్నారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారగ్రహీత, కవి విశ్వనాథ సత్యనారాయణ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కవి సమ్రాట్’. ఎల్బీ శ్రీరామ్ టైటిల్ రోల్లో నటించి, నిర్మించారు. సవిత్ సి. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 22 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ పంచుకున్న విశేషాలు. ► పాఠశాల స్థాయిలోనే నాటకాలు రాసి, దర్శకత్వం వహించి, నటించేవాణ్ణి. సామాజిక అంశాలపైనే నా నాటక రచనలు ఉండేవి. ఆ తర్వాత నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. అయితే నటుల మధ్య ఎక్కువ పోటీ ఉండటంతో పన్నెండేళ్ల పాటు రచయితగా చేశాను. నా గురువు ఈవీవీ సత్యనారాయణగారి వద్ద చాలా సినిమాలకు రచయితగా చేశాను. ► ఈవీవీగారి ‘చాలా బాగుంది’ నటుడిగా నాకు బ్రేక్ ఇచ్చింది. అయితే ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో నా పాత్ర సీరియస్‌గా ఉండటంతో అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చేవి. ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. డైరెక్టర్లు చెప్పినట్లు చేస్తే డబ్బులు వస్తాయి.. కానీ, డబ్బుకన్నా సంతృప్తి ముఖ్యం. దాంతో చాలా సినిమాలు వదులుకున్నాను. నా మనసుకు నచ్చిన, విలువలతో కూడిన అంశాలను ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. అందుకే అరవై షార్ట్ ఫిలింస్ తీశాను. ► భారతదేశంలోని ధ్వజస్తంభాల్లాంటి మహనీయుల్లో కొందరి చరిత్రలైనా చెబుదామనిపించింది. ఈ క్రమంలో యువతని ప్రోత్సహించాలనుకున్నాను. ప్రతిభావంతులైన తొమ్మిది మందిని ఎంచుకుని, కథలు రాయమన్నాను. వాటిల్లో విశ్వనాథ సత్యనారాయణగారిపై సవిత్ సి. చంద్ర రాసిన కథ నచ్చడంతో తన దర్శకత్వంలోనే ‘కవి సమ్రాట్’ నిర్మించాను. తన తాతగారు సి. సుందరరామ శర్మగారు విశ్వనాథ సత్యనారాయణగారిపై రాసిన పుస్తకం ఆధారంగా సవిత్ ‘కవి సమ్రాట్’ కథని రాసి, అద్భుతంగా తెరకెక్కించాడు. ► విశ్వనాథ సత్య నారాయణగారి ఆశీర్వాదాలతోనే ఆయన పాత్రలో నటించి, నిర్మించాను. విశ్వనాథ సత్యనారాయణగారిపై కథ రాసుకుని నా వద్దకు వచ్చిన సవిత్కి, ఇలాంటి విలువలున్న చిత్రాన్ని ‘ఆహా’లో విడుదల చేసే అవకాశం కల్పించిన అల్లు అరవింద్‌గారికి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ► నేటి యువత తమను తాము నిరూపించుకోవాలనే ఆకాంక్షతో ఇండస్ట్రీకి వస్తున్నారు. అయితే వారు తమ ఆకాంక్షను బలమైన సంకల్పంగా మార్చుకున్నప్పుడే విజయం సాధిస్తారు. ప్రస్తుతం నా టీమ్‌లో నేను తప్ప మిగిలిన వారందరూ పాతికేళ్లలోపు కుర్రాళ్లే. వారి కొత్త ఆలోచనలకు నేను తోడుగా నిలబడి నటించడంతో పాటు నిర్మించి వారికి ధైర్యం ఇస్తున్నా. ► ముప్పై ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఒక నటుడిగా ఇప్పటికీ నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలు మాత్రమే చేయాలనే ఆలోచన నాకు లేదు. అందుకే.. షార్ట్ ఫిలింస్ ద్వారా సమాజానికి ఉపయోగపడే కథలను ప్రేక్షకులకు చెబుతున్నాను. సినిమాల్లో సంపాదించిన డబ్బుని షార్ట్ ఫిలింస్‌కి ఖర్చు చేసేశాను. ఈ జర్నీలో లాభ, నష్టాల గురించి ఆలోచించను.. ఈ ప్రయాణాన్ని ఆపను. మూడు నాలుగు సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. అవి రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. మరికొన్ని కథలు వింటున్నాను. ► గతంలో నేను పోటీ పడ్డ తోటి హాస్యనటుల్లో చాలామంది ఇప్పుడు లేరు. అలాగే నాకు విరివిగా అవకాశాలు ఇచ్చి, ప్రోత్సహించిన దర్శకులు కూడా లేరు. పైగా గతంతో పోలిస్తే ప్రస్తుత సినిమాల్లో హాస్యనటులకు ప్రాధాన్యం ఉండటం లేదు.. అలా వచ్చి, వెళ్లిపోయే చిన్న చిన్న పాత్రలు రాస్తున్నారు. ఈ మధ్య నాకు వస్తున్న పాత్రలు మూస ధోరణిలో ఉండటంతో ఒప్పుకోవడం లేదు.. అందుకే నేను బిజీగా ఉండటం లేదు (నవ్వుతూ). వైవిధ్యమైన పాత్రలొస్తే నేనెప్పుడూ సిద్ధమే. -
కవి సామ్రాట్ మూవీ టీమ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
-
వరంగల్ ఒక అద్భుతం : ఎల్బీ శ్రీరామ్
సాక్షి, వరంగల్ రూరల్ : వరంగల్ ఒక అద్భుతమని, తెలుగు వారు తమ ప్రాంతాలకు వెళ్లాలంటే ఓరుగల్లు దాటాల్సిందేనని నటుడు, రచయిత ఎల్బీ శ్రీరాం అన్నారు. షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చిన ఆయనను సోమవారం సాక్షి పలకరించింది. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... వరంగల్‌కు అనేక సందర్భాల్లో వచ్చాను. షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం రావడం ఇదే మొదటి సారి. చిన్నప్పుడు నాటకాలు వేసేవాడిని. 17 సంవత్సరాల పాటు నాటికలు రచించి నటించాను. రిహార్సల్‌కు కోసం వరంగల్, నిజామాబాద్ వెళ్లేవాడిని. తెలుగువాళ్లు హైదారాబాద్ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్లాలన్నా, తిరుగుప్రయాణమైనా వరంగల్ దాటాల్సిందే. గేట్ వే ఆఫ్ తెలు గు పీపుల్‌గా ఓరుగల్లుకు సుస్థిర స్థానం ఉంది. వారం రోజులు.. మూడు షార్ట్ ఫిల్మ్‌లు షార్ట్ ఫిలిం తీసేందుకు 24 విభాగాలతో కూడిన టీంతో వచ్చాను. కథకు అనువైన ప్రాంతాలను ఎంచుకుని షూట్ చేస్తున్నప్పుడు పొందే అనుభూతే వేరు. వారం రోజుల్లో మూడు షార్ట్ ఫిల్మ్‌లు పూర్తి చేయాలి. ఈ మూడు సినిమాలకు కథలు వరంగల్‌కు చెందిన రచయిత రామచంద్రమౌళి అందించారు. వరంగల్, హన్మకొండలలో ఉన్న ప్రాంతాలన్నింటినీ తిప్పి చూపించారు. ఆయన రాసిన కథలు ఆయా ఏరియాలతో పెనవేసుకుని ఉన్నాయి. నేను ఒక రచయితగా రామచంద్రమౌళి రచనలను ఎంతగానో ఇష్టపడుతాను. షార్ట్ ఫిలిం షూట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన రచనలు షూట్ చేయాలనుకున్నాను. మీరు సహకరిస్తే చేస్తా అని చెప్పాను. రామచంద్రమౌళి మరోమాట చెప్పకుండానే అంగీకరించాడు. అన్ని లోకేషన్లు వరంగల్‌లో ఉన్నాయని చెప్పారు. వర్ధన్నపేట సర్పంచ్ గాడిపెల్లి రాజేశ్వర్ రావు, కాజీపేట తిరుమలయ్య, మెరుగు సాంబయ్య, చిప్ప వెంకటేశ్వర్లు, డాక్టర్ మురళీకృష్ణ ఎంతగానో సహకరిస్తున్నారు. కోటల అందాలు.. వరంగల్‌లో ఉన్న వేయిస్థంభాల దేవాలయం, ఖిలావరంగల్, రామప్ప, లక్నవరం ఇలా అన్నీ అద్భుతాలే. వరంగల్‌లో ఏ వీధికి వెళ్లినా మగ్గాలు కన్పిస్తుంటాయి. కాకతీయ కోట, రామప్ప గుడి ఎలా చరిత్రను నిలబెడుతున్నాయో చేనేత కార్మికులు సైతం వాళ్ల వృత్తిని నమ్ముకుని చరిత్రలో నిలిచిపోతారు. గూగుల్ మాయ.. ఇప్పటి తరం యువకులు ఏది కావాలన్న గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నారు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు. అలాంటిది నేటి యువత గూగుల్‌కు దాసోహం కావడం బాధేస్తుంది. ప్రస్తుతం మానవ విలువలు హరించుకుపోతున్నాయి. మంచి సందేశంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే షార్ట్ ఫిల్మ్‌లు తీయాలని నిర్ణయానికి వచ్చా. సంప్రదాయాలకు పెద్దపీట.. మన సంస్కృతి, సంప్రదాయాలు ముందు తరం వాళ్లకు అందించే ప్రయత్నంలో భాగంగానే షార్ట్ ఫిల్మ్‌లు తీస్తున్న. ఇప్పటి వరకు 20 షార్ట్ ఫిల్మ్‌లు తీశాను. ఇతరులు తీసిన 10 షార్ట్ ఫిల్మ్‌లలో నటించాను. డోలు అనే షార్ట్ ఫిల్మ్‌కు నంది అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు తీసిన షార్ట్ ఫిల్మ్‌లను యూట్యూబ్‌లో రెండున్నలక్షలకు పైగా ప్రేక్షకులు వీక్షించారు. 500 సినిమాల్లో నటన.. ఇప్పటి వరకు 500 సినిమాల్లో నటించాను. ఛత్రపతి, చాలా బాగుంది, స్టాలిన్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, సొంత ఊరు, సరైనోడు లాంటి సిని మాలు నాకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. ప్రభుత్వపరంగా నాలుగు నంది అవార్డులు వచ్చాయి. 40 సినిమాలకు డైలాగులు రాశాను. -
దేవుడు ఎక్కువే ఇస్తాడు
డబ్బాలో చెయ్యి పెట్టి గుప్పెడు బియ్యం తీసుకుంటాం. గుప్పెడు వాయువును ఊపిరిగా గుండెలో నింపుకుంటాం. గ్లాసును గుప్పెట పట్టి నీటితో దాహాన్ని తీర్చుకుంటాం. దేవుడు అంతకంటే ఎక్కువే ఇచ్చాడు.అవసరానికి సరిపడా ఇచ్చాడు. అనవసరానికే.. ఇవ్వలేదేమో! చక్కగా చూసుకునే కుటుంబం... ప్రేమించే స్నేహితులు... ఆదరించే పిల్లలు.. ఇవన్నీ ఒక్కో గుప్పెడు. ఇలాంటి ఎన్నో గుప్పెళ్లు కలిపితే.. అదే .. దేవుడి అనుగ్రహం. అవును. దేవుడు ఎక్కువే ఇచ్చాడు! రచయితగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు ఎల్.బి.శ్రీరామ్. దైవం గురించి ఈ నటుడి అభిప్రాయం తెలుసుకోవడానికి బంజారాహిల్స్‌లోని వారింటికి వెళ్లినప్పుడు ఫోన్ మాట్లాడుతూ కనిపించారు. ‘వచ్చే పౌర్ణమికి గుళ్లో షూటింగ్. అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి..’ అని అవతలి వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఫోన్ సంభాషణ పూర్తయిన తర్వాత .. గుడిలో షూటింగ్ అంటున్నారు... దేని గురించి? ఎల్.బి.శ్రీరామ్: పిల్లలకు, పెద్దలకు మన ఆలయాలు, వాటి ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన విషయాలను షార్ట్ ఫిల్మ్‌గా తీస్తున్నాను. దాని గురించే రోజూ చర్చలు.. ఈ షార్ట్ ఫిల్మ్‌లు ఎప్పటి నుంచి తీస్తున్నారు? అదీ గుడికి సంబంధించిన విషయాలు అంటున్నారు. దాదాపు ఐదారేళ్లయ్యింది. ‘లైఫ్ బ్యూటీఫుల్ క్రియేషన్స్’ అని పెట్టుకొని ఇరవై వరకు షార్ట్ ఫిల్మ్‌లు తీసాను. అన్నీ పది నిమిషాల నిడివితో ఉంటాయి. సంప్రదాయాలు, దేవుళ్లకు సంబంధించిన పాజిటివ్ విషయాలను, మరిచిపోయినవి గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈసారి మొత్తం గుడి గురించే! రాముడు, కృష్ణుడు, గణేషుడు.. దేవుడిని మనం ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. అదే ఆలోచనతో ‘ఏ పేరుతో పిలిచినా... ’ అనే ఫిల్మ్ ప్లాన్ చేశాను. పౌర్ణమి రోజున గుళ్లో షూట్ ఉంది. ఇందుకు ఓ ఆలయాన్ని ఎంపిక చేసుకున్నాం. అందులో తాత, మనవడు పాత్రలు ఉంటాయి. ఒక తాత (తాతగా ఎల్.బి.శ్రీరామ్) మనవడు ఇద్దరికీ ఒకే తిథిన పుట్టినరోజులు. ఇద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించి ఆ రోజు గుడికి వెళతారు. అక్కడ మనవడికి అన్నీ సందేహాలే! తాతను అడుగుతుంటాడు. గుళ్లో ఇంత పెద్ద గుమ్మం ఎందుకు? గోపురం ఎందుకంత ఎత్తుగా ఉంటుంది? ధ్వజస్తంభం అంటే ఏంటి? గర్భ గుడి చుట్టూ మూడు సార్లే ఎందుకు ప్రదక్షణ చేయాలి? ఇలా మనవడు అడిగిన వాటికి తాత ఓపికగా, అర్థవంతంగా సమాధానాలు చెబుతుంటాడు. గుడి ఎందుకు? దేవుడు అంటే ఏమిటి? పిల్లలకు ఇదొక ఒక ‘చదువు’లా చెప్పాలనుకున్నాను. వీటిలో సందేశాలు ఏమీ ఉండవు. హృదయానికి హత్తుకునే చిన్న చిన్న కథలను వీటి ద్వారా చెబుతాను. ఇలాగే కిందటేడాది ‘డోలు–సన్నాయి’ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. ఏ శుభకార్యానికైనా ఈ సంగీత వాయిద్యాలను వాడుతారు. డోలు–సన్నాయి ఒక్కలా ఉండవు. కానీ, ఏ శుభకార్యమైనా ఇవి ఉండాల్సిందే! వీటినే భార్యభర్తలుగా థీమ్ తీసుకున్నాను. సాధారణంగానే చూడండి ఒకేలా ఉండి, ఒకేలా ఆలోచించే వారిని భార్యభర్తలను చేయడు దేవుడు. ఇదంతా నేర్చుకోవడానికే! నటుడిగా ఉన్న మీరు గుడి, దైవం, సంప్రదాయం.. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీయాలనే ఆలోచన ఎందుకు కలిగింది? మన జీవితమే నేర్చుకోవడానికి. పుట్టిన క్షణాన ‘కెవ్వు’ మనడం నేర్చుకున్నాడు మనిషి. చచ్చిపోయే క్షణంలో కూడా ఏదో నేర్చుకునే పోతాడు. పుట్టడం, పెరగడం, పెళ్ళి పిల్లలు, తర్వాత ముసలితనం.. ఎన్నో విషయాలు. జీవితమంతా తెలుసుకుంటూనే ఉంటాడు. దేవాలయాలు, సంప్రదాయ పద్ధతులు వీటిని తెలుసుకోవడానికి ఎక్కడ బీజం పడింది? మా నాన్న వేంకటరామశాస్త్రి సోయయాజులు. వంద యజ్ఞాలు చేసి సోమయాజులు అయ్యారు. నాలుగు వేదాలు చదివాడు. ఆయన భువి మీద నడిచే దైవంలా కనిపించేవాడు మాకు. అమ్మ అనసూయ సోమిదేవమ్మ సాక్షాత్తూ అన్నపూర్ణమ్మే! ఎవ్వరికీ లేదనకుండా వండటం, వడ్డించడం ఇదే పని ఆవిడకు. మాకున్న రెండు గదుల్లో ఒక గదిలో నిత్యాగ్నిహోత్రం వెలుగుతూనే ఉండేది. ఎప్పుడైనా అగ్నిహోత్రం కొండెక్కితే తిరిగి నిప్పు పుట్టించడానికి అగ్గిపుల్లలు వాడేవారు కాదు. మడి కట్టుకొని, చెక్కతో గంటల తరబడి రాపాడించేవారు. జబ్బులు నొప్పి చేసినా.. ప్రతీది నిష్టగా చేసేవారు. దేవుడి అనుగ్రహం పొందాలంటే ఇంత కష్టపడాలా? ఇన్ని యాగాలు చేయాలా? చెయ్యాలి. మన మంచి చెడ్డలు, గమనాగమనాలు చూస్తున్నవాడిని మనం చూసుకోకపోతే ఎలా? ఏదో మిడి మిడి జ్ఞానంతో ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తుంటారు. కానీ, ధర్మశాస్త్రాల్లో చెబుతున్నదంతా ఇప్పుడు సైన్స్‌లోనూ ఉంది. సైన్స్ కూడా దైవాన్ని నమ్ముకునే సాగుతుంది. దేవుడిని మనం ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉండాలి. తమిళనాడులో ఒక చోట బెల్లం విఘ్నేశ్వరుడిని చేస్తుంటారు. మళ్ళీ ఆయనకు బెల్లమే నైవేద్యమే పెట్టాలి. సమయానికి బెల్లం లేకపోతే ఆ విఘ్నేశ్వరుడి బెల్లం విగ్రహానే కొద్దిగా ముక్క తుంచి నైవేద్యం పెడతారు. ఒక పక్షి ఎగిరినా, ఒక మొక్క ఎదిగినా .. అన్నీ ఈ భూమి నుంచి పుట్టినవే! తిరిగి ఈ భూమిలోనే కలిసిపోవాలి. ఈ భూమి మీద ఇంత సృష్టిని నిలిపినవాడిని అనుక్షణం తలుచుకుంటూ ఉండాలి. దైవం మీద ఇలాంటి భావన మీ చిన్నతనంలోనే బలంగా పడినట్టు ఉంది. మాది తూర్పుగోదావరి జిల్లా నేదునూరులోని అగ్రహారం. ఏడుగురు అన్నదమ్ములం, ఒక అక్క. ఇంట్లో పూజలు, పద్ధతలు చాలా నిష్టగా జరిగేవి. దేవుడి మీద గురి ఎప్పుడూ దూరం కాకూడదని అప్పుడే పడింది. దైవం నుంచి మన దృష్టి తప్పుకోకుండా ఉండాలంటే ఏదైనా ఒక రూపం ఏర్పరుచుకోవాలి. అది ఏ రూపమైనా కావచ్చు. రాయిని తొలవకముందు అది రాయే. దానికో రూపం ఇస్తే దైవం. కూరలు రకరకాల రుచులు ఉంటాయి. అవి నాలుక వరకే! కడుపులోకి చేరాక అన్నీ ఒకటే. అక్కడ ఏ రుచీ ఉండదు. అంతెందుకు...ఈ పెన్ను, పుస్తకం, టేబుల్,.. అన్నీ దేవుడి రూపాలే! కానీ, వాటిని మనం వాడుకోవాలి. వాటినో పక్కన పెట్టి పూజిస్తే పనులు అవవు. నాటి రాజులు అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని వదిలేవారు. అది ఎంత దూరం వెళితే అంత భూమి వారిదే! అలాగే, మనం బతకడానికి, మన బాధ్యతలు చక్కగా చూసుకోవడానికి పని కోసం మనమూ గుర్రాన్ని ఎప్పుడూ వదులుతుండాలి. ఆ గుర్రం కూడా మనమే! దేవుడి పూజ చేయాలి కానీ, ఆస్తమానూ అదే ద్యాసలో ఉండకూడదు. ఈ రోజు ఉపవాసం ఉండాలి అని నిర్ణయించుకున్నాం అనుకోండి. ఏమీ తినద్దు, మడి కట్టుకొని ఎవరినీ ముట్టుకోకుండా శుభ్రంగా ఉండాలి అనుకుంటే ఎక్కడికీ కదల్లేవు. పనులు చేయవు. బాధ్యతలు నిర్వర్తించలేవు. అప్పుడు దేవుడు మన మీద పెట్టిన బాధ్యతలు సంపూర్ణంగా చేయలేం కదా! పనులు చేయాలంటే నాది అనే కొంత స్వార్థం కూడా ఉండాలి. నా ఇల్లు, నా పిల్లలు.. ఇలా! అప్పుడే మనిషి పనులు చేస్తాడు. మన చిన్నప్పుడు కొన్ని విధి విధానాలు పెట్టేస్తారు పెద్దవాళ్లు. నిద్ర లేవగానే అరచేతి రేఖలు చూసుకోవాలి, అమ్మకు, దేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఇలాంటి పద్ధతులు జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా! ఎక్కడకెళ్లినా, ఏ చిన్న తప్పు చేసినా వెంటనే మన మూలాలను గుర్తుచేస్తాయి. మా అమ్మనాన్నలు ఆ మూలాలను బలంగా వేశారు. దేవుడి పేరుతో పద్ధతులన్నీ పెట్టారు కాబట్టి ఒక క్రమశిక్షణ అలవడింది. దేవుడి మీద భారమేసే సినిమా రంగంలోకి వచ్చారా? అకడమిక్‌గా బి.కామ్ చదివాను. కానీ, అది నా జీవన పోషణకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. రచనలు కూడా పుస్తకాలు చదివి రాసింది లేదు. మా కులవృత్తి ఉదరపోషణకు సరిపోదని ఇంగ్లీషు నేర్చుకున్నాం. నాటకాల మీద బాగా మోజు ఉండేది. పోటీ నాటకంలో పాల్గొనేవాడిని. వేల మందిలో పోటీ పడేవాడిని. వందల్లో, పదుల్లో ఉండటానికి ఇంకా పోటీ పడేవాడిని. ఏవేవో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ, మానేస్తూ సినిమా రంగానికి చేరాను. ఈ రంగంలో కూడా చాలా మంది దగ్గర పనిచేశాను. నా మొదటి సినిమా ‘కోకిల.’ నా రాతకు, నా నటనకు విలువ వచ్చింది ఇ.వి.వి.సత్యనారాయణ దగ్గర. ఫలానా ఉద్యోగం కావాలనో, అవకాశం రావాలనో దేవుడిని ఎప్పుడూ కోరుకోలేదా? దేవుడిని ఏమీ కోరుకోకూడదని తెలుసుకున్నాను. మన అర్హతను బట్టి ఏం కావాలో దేవుడే ఇస్తాడు. నాకు తెలిసిన ఓ కథ చెబుతాను. ఒకతను చాలా కష్టాల్లో ఉంyì కూడా ఎప్పుడూ దేవున్ని ఏమీ అడగలేదట. కానీ, ఒక రోజు ఆ కష్టాలకు ఓర్చుకోలేక తాడో పేడో తేల్చుకుందామని దేవుడి దగ్గరకు వెళ్లాడట. నాకు డబ్బు కావాలని దేవుడిని అడిగాడు. ఎంత కావాలని దేవుడు అడిగాడట. లక్ష రూపాయలు కావాలి చాలా కష్టాల్లో ఉన్నాను అన్నాడట. ఒరే, రాత్రే నీ గురించి నేనూ మా మిసెస్ లక్ష్మి మాట్లాడుకున్నాం. పెట్టిన పరీక్షలన్నీ వీడు చాలా ఓపికగా భరించాడు. ఇక గట్టెక్కించాలి. రేపు ఎలాగూ కోరుకోవడానికి వాడొస్తాడు. కోటి రూపాయలు ఇచ్చేద్దాం అని డిస్కస్ చేసుకున్నాం. లక్ష్మీదేవి కూడా సరే అంది. తీరా చూస్తే నువ్వేమో లక్ష రూపాయలే అడిగావు. తీసుకోపో.. అన్నాడట. వాడు బిక్కమొహం వేశాడట. అందుకే మనకేం కావాలో ఆయనకు తెలుసు. మనం అడగకూడదు. మరొకడు దేవుడిని లక్షరూపాయలు అడిగాడట. ఒరే ఎప్పుడైనా కష్టపడి పనిచేసిన పాపాన పోయావా! నీ బ్యాంక్ బ్యాలెన్స్ 10 రూపాయలు ఉండేలా చూసుకున్నావా? ఇన్నేళ్లలో ఏదైనా మంచి జరిగితే నాకు ఒక్క థ్యాంక్స్ చెప్పావా! నీకు ఏం అర్హత ఉందని అడుగుతున్నావురా.. అని ఓ కథలో చెప్పాను. మనమో విషయం తెలుసుకోవాలి. ఈ జన్మ దేనికి లింకు. దీనికి ముందు మన జన్మ ఏంటి? ఇప్పుడు అన్ని అవయవాలు సక్రమంగా ఉండి, శక్తితో జీవించే అదృష్టాన్ని ఇచ్చాడు దేవుడు. ఇంకా ఏం కావాలి? ఈ జన్మ సాఫల్యత ఏంటి? అని ఆలోచించకుండా అస్తమానూ కోరికలు కోరుకోకూడదు. దేవుడు ఉన్నాడు అనిపించిన సంఘటన? దేవుడు ఉన్నాడని ప్రతీక్షణం నమ్ముతాను. పనే దైవంగా భావిస్తాను. నేను రాసే డైలాగులో ఉన్నాడు. చేసే నటనలో ఉన్నాడు. ‘నమ్మినవాడికి ఫలం ఉంది. నమ్మకపోతే ఏముంది? నమ్మీనమ్మని మూఢజనులకు మోక్షం దూరంగా ఉంది’ అని ఒక పద్యం ఉంది. సైకిలే తొక్కలేనివాడిని విమానాల్లో వెళ్ళాను. విదేశాలు చూశాను. ఇంకా ఏం కావాలి ఈ జన్మకు అనిపిస్తుంది. దేవుడు లేడని ఏ సందర్భంలోనైనా అనిపించిందా? దేవుడు లేడనుకుంటే ప్రతీ క్షణం టెన్షనేగా. లేమి కుటుంబమే అయినా ఎప్పుడూ దుఃఖం రాలేదంటూ ఆ స్వామి ఎప్పుడూ నాతోనే ఉన్నాడు. మీ పిల్లలకు, మీ మనవళ్లకు దైవం, సంప్రదాయాల గురించి ఎలా పరిచయం చేస్తున్నారు? నా కొడుక్కి కూతురు. కొడుక్కి ఇద్దరు కూతుళ్లు. పండగలు, ప్రత్యేక రోజుల్లో అంతా కలుసుకుంటాం. వాళ్లు నా వద్దకు వచ్చినప్పుడే చెప్పగలుగుతాను తప్ప ఎప్పుడూ వారితో ఉండలేను. నేను ఏదైనా చెబితే ముగ్గుచెప్పాల్సింది ముగ్గురికే కాదు ముందు తరాలకూ తెలియాలనేది నా తాపత్రయం. నిత్యం దైవాన్ని ఎలా తలుచుకుంటారు? రోజులో ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు దేవుడు. ఓ గంటసేపు దేవుడిని తలుచుకుంటే మంచిదేగా! రోజూ కనీసం గంటన్నర నిత్య పూజ చేస్తాను. పని ఉంటే ఓ అరగంట తక్కువ ఉంటుంది. ఈ పూజలో దేవుడిని ఏమీ కోరుకోను. దేవుడి మీద దృష్టి. నాకేం అర్హత ఉందో అంతవరకు ఆ దేవుడే ఇస్తాడు. దేవుడి గురించి ఆలోచన ఎలా మొదలైంది? చిన్నతనంలో మా అన్నదమ్ముల్లో నేను ఎక్కువ మాట్లాడలేకపోయేవాడిని. నేను ‘అవును, కాదు’ అని సమాధానం చెబితే ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోయేవారు వీడు మాట్లాడుతున్నాడే అని. మిగతా అన్నదమ్ములందరినీ గమనించడంలోనే సరిపోయేది నాకు. ఈ గమనింపు వల్ల కొన్ని తెలుసుకున్నాను. దేవుడు రెండు చెవులిచ్చాడు, ఒక్కటే నోరిచ్చాడు ఎందుకు? అంటే, ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ నా అరుపులను పేపర్ మీద పెట్టేవాడిని. ఒక్కొక్కరు ఒక్కోలా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నేనెలా గుర్తింపు తెచ్చుకోవాలి.. నాకున్న బలం ఏంటి? ఆ ఆలోచనతో రాసేవాడిని. మేం నాటకాలు వేస్తే మినీ సురభి అనేవాళ్లు. ఆ నాటకాల్లోని పాత్రలకు నేను మాటలు రాసేవాడిని. అయితే, కాలక్రమంలో మిగతా ఆరుగురు వేరే వేరే ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. నేను నాటక, సినీ రంగంలో నిలదొక్కుకోవాలని ఎక్కువ కష్టపడేవాడిని. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
ఫిల్మ్ ఇండస్ట్రీని విజయవాడకు రప్పిస్తాం..
సాక్షి, విజయవాడ : చలన చిత్ర రంగాన్ని విజయవాడకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ పేర్కొన్నారు. జాషువా జయంతి ఉత్సవాల్లో భాగంగా గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. చిన్న సినిమాలను ఏపీలో తీస్తే ప్రత్యేకమైన రాయితీ ఇవ్వడం ద్వారా చిత్ర నిర్మాణాన్ని రాష్ట్రానికి తీసుకురావాలనుకుంటున్నామని వెల్లడించారు. షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు, నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. అమరావతి కథలు పేరిట షార్ట్ ఫిల్మ్ రూపొందించడం తన ఆశయమన్నారు. అందుకు ఎఫ్డీసీ గానీ, ఎన్నారైలు కానీ ఆర్థిక సహకారమందించాలని కోరారు. జాషువా మనమడు సుశీల్‌కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో రుగ్మతలు, అసమానతలను రచనల ద్వారా శక్తివంతంగా ఎత్తిచూపిన తన తాత గారి ఆశయాల మేరకు సమాజ సేవలో ఇతోధికంగా పాల్గొంటున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జాషువా సాంస్కృతిక వేదిక బాధ్యుడు, సీనియర్ జర్నలిస్టు జీవీ రంగారెడ్డి ప్రారంభించగా.. గుండు నారాయణరావు గౌరవ అధ్యక్షత వహించారు. సభలో సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్ పాల్గొన్నారు. -
'అది దాటకూడదు కదా'
తనదైన యాసతో ‘చాలా బాగుంది’ సినిమాలో కడుపుబ్బ నవ్వించినా.. మధ్యతరగతి తండ్రి పాత్రలో ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో ఏడ్పించినా.. ఆవేశం పొంగే నటనతో ‘ఛత్రపతి’లో భారీ డైలాగులు చెప్పినా అది ఒక్క ఎల్బీ శ్రీరాంకే సాధ్యమవుతుంది. నవరసాలను అలవోకగా పండించే ఆయనలోని మరో ప్రత్యేక గుణం గొప్ప సాహిత్యం. అప్పుల అప్పారావు, హిట్లర్, అరుంధతి సినిమాలకు రచయితగా పనిచేసి ఎనలేని కీర్తిని గడించారు. స్వయం కృషితో సినీరంగంలో సుస్థిరస్థానం సంపాదించుకున్న శ్రీరాం ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహితీ పండితుడిగా, రచయితగా సమాజంలోని మార్పులను పరిశీలిస్తూనే.. విజయవాడలో అష్టావధాన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ వివరాలు.. సాక్షి : మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? ఎల్బీ శ్రీరాం : మా కుటుంబంలో అందరూ సాహితీవేత్తలే. నాటకరంగంతో సంబంధం ఉన్నవారే. నాలోని రచయితను సంతృప్తి పరచడానికే ఈ రంగంలోకి వచ్చాననుకుంటా. నాటకరంగం నుంచి వచ్చిన నాలోని ప్రతిభను గుర్తించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. సాక్షి : మీరు ఈ రంగంలో ఏం నేర్చుకున్నారు? ఎల్బీ శ్రీరాం : ప్రతి సందర్భంలోనూ పరిస్థితుల ప్రకారం ‘నన్ను నేను మలచుకోవడం’ నేర్చుకున్నాను. సాక్షి : మీరు, నటుడు, దర్శకుడు, మాటల రచయిత కదా.. రంగస్థలాల్లో మీకు ఏ పాత్ర వీలుగా ఉంటుంది? ఎల్బీ శ్రీరాం : నటుడిగా పాత్రలో నటిస్తాను. రచయితగా సమాజంలోని మార్పులను గమనిస్తున్నాను. ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో వర్తమాన సమాజంలో మధ్య తరగతి కుటుంబానికి ప్రతీక నా పాత్ర. నేను 40 సినిమాలకు మాటలు రాశాను. 400 సినిమాల్లో నటించాను. సాక్షి : నేటి హాస్యంపై మీ కామెంట్ ఎల్బీ శ్రీరాం : సభ్యతకు, అసభ్యతకు మధ్య లక్ష్మణరేఖ. అది దాటకూడదు కదా.. సాక్షి : ఓ సాహితీవేత్తగా తెలుగు అంతరించిపోతోందన్న భావనను అంగీకరిస్తారా.. ఎల్బీ శ్రీరాం : భాష నిత్యనూతనం. తెలుగు పరభాషలో కలిసిపోతూ జీవనవాహినిలో కలిసిపోతోంది. సాక్షి : మీరు కొత్తగా షార్ట్‌ఫిల్మ్ రంగంలోకి ప్రవేశించారని అంటున్నారు. నిజమేనా? ఎల్బీ శ్రీరాం : నిజమే.. యువతతోపాటు అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్న రంగం షార్ట్ ఫిల్మ్స్. మూడు గంటల్లో వివరించే అంశాన్ని కొద్ది సమయంలో భావ యుక్తంగా వివరించవచ్చు. సాక్షి : మీ లైబ్రరీ గోడ మీద రాసిన వ్యాఖ్య ఏమిటి? ఎల్బీ శ్రీరాం : ఈ రంగంలోని ప్రవేశించి 40ఏళ్లు అవుతోంది. నా జీవితంలోని అనేక దశల ఫొటోలు కనిపిస్తాయి. నా గమ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.. ‘గమ్యం కాదు-ఆ ప్రయాణం నాకిష్టం’ అని రాసి ఉంటుంది. సాక్షి : అరుంధతి, హిట్లర్, అప్పుల అప్పారావు. మూడు విభిన్నమైన కథాంశాలకు మాటల రచయితగా పనిచేశారు. ఎలా సాధ్యమైంది? ఎల్బీ శ్రీరాం : రచయితలు కథలో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. -
అదే... మర్రదే... పుసుక్కున ఫీలైపోతాడు!
ఎల్బీ శ్రీరామ్‌లో గొప్ప నటుడు దాగున్నాడని బయటకు లాక్కొచ్చి పుసుక్కున చూపించిన సినిమా ‘చాలా బాగుంది’. ఈవీవీ ఇచ్చిన ఈ ట్విస్టుకి ఎల్బీ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆయన కెరీర్‌కి బ్రేకూ, యాక్సిలేటరూ ఈ పాత్రే. వెస్టు గోదావరి జిల్లా ఈస్టు దిక్కునుండే పల్లెటూరు కోరుమామిడి. ఆ చుట్టుపక్కల జమానాలో ఈ ఊరెంత ఫేమస్సో, ఈ ఊళ్లో గంటస్తంభం వెంకటేశ్వర్రావు అంత ఫేమస్సు. మీకేమన్నా డౌటా? ఓసారి మీరు కలిశారంటే - నా సామి రంగా మరిచిపోమన్నా మరిచిపోలేరు. మరి అతన్నెలా గుర్తుపట్టడం? చాలా ఈజీ. ఎలక్షన్ బేనర్లని ఒంటికి లుంగీ లాగా ఎవడైతే కట్టుకుంటాడో వాడే గంటస్తంభం వెంకటేశ్వర్రావు. మరి అతణ్ణి పరిచయం చేసుకోవడమెలా? అబ్బో... అంత సీను మనకివ్వడు. పెద్ద పుడింగులాగా తనే మధ్యలో దూరిపోతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ చూడండి. నిడదవోలు స్టేషన్లో రైలాగింది. ఫ్రెండు తాతారావు కూతురి పెళ్లికి ఫ్యామిలీతో సహా దిగాడు పొట్టి ప్రసాద్. ఆ తాతారావుకి క్లోజాతి క్లోజు ఫ్రెండు మన గంటస్తంభం. తాతారావు, గంటస్తంభం ఇద్దరూ పొట్టి ప్రసాద్‌ను రిసీవింగ్ చేసుకోడానికి వెళ్లారు. పొట్టి ప్రసాద్‌ను చూడగానే తాతారావ్ మొహం వెలిగిపోతుంది. ‘‘ఏరా బావున్నావా?’’ అడిగాడు తాతారావు చాలా ఆప్యాయంగా. పానకంలో పుడకలాగా మన గంటస్తంభం ఎంటరైపోయాడు. ‘‘బుద్ధుందా నీకు? బియ్యం బస్తాలాగా పిటపిటలాడతా ఉంటే బాగున్నావా అని అడుగుతావేంటి?’’ అని లటిక్కున అనేశాడు. పొట్టి ప్రసాద్ కంగారుపడిపోయాడు. తాతారావుకివన్నీ అలవాటే కాబట్టి, ఏం పట్టించుకోలేదు. పొట్టి ప్రసాద్ పక్కనే ఒకావిడ నిలబడి ఉంది. ‘‘మనమ్మాయిగారా అండి? అచ్చం తమరి పోలికే’’ అనేశాడు పొట్టి ప్రసాద్. ఇక చూడాలి పొట్టి ప్రసాద్ మొహం. ఫ్యూజులు మొత్తం కొట్టేసి, షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా ఫేసు పెట్టాడు. అయినా రిప్లయ్ ఇవ్వాలి కదా... తప్పదు. ‘‘అది నా కూతురు కాదు... మా ఆవిడ’’ అన్నాడు కొంచెం కోపంగా. ‘‘అయ్యో... మన ఆవిడగారా అండి. అబ్బాయిగారి పక్కన అక్కలా ఉంటే కూతురనేసుకుని అడిగేశా. పుసుక్కున ఫీలయి పోమాకండి.’’ పొట్టి ప్రసాద్‌కి ఇతని విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈ పెళ్లి నాలుగు రోజులూ తనను వేపుకొని తింటాడని అర్థమైపోయింది. గంటస్తంభంతో గడిపే కన్నా, కరెంట్ స్తంభం ఎక్కి కూర్చోవడం బెటరని ఫిక్సయిపోయాడు. చూశారా... ఒక్క సీన్‌కే గంటస్తంభం ఎలా గంట మోగించేశాడు. ఇంకొకడెవడైనా ఇలా చేస్తే స్తంభానికి కట్టేసి మరీ కొట్టేవాళ్లు. కానీ మన గంటస్తంభంకుండే ఫ్లాష్‌బ్యాక్... ‘సింహాద్రి’ సినిమాలో ఎన్టీఆర్ ఫ్లాష్‌బ్యాక్ కన్నా పవర్ఫుల్. మన గంటస్తంభం ఒకప్పుడు బాగా బతికి చెడ్డోడు. ఉన్న నాలుగెకరాల్లో పత్తి పండించి, అప్పులు పాలై, పురుగుల మందు తాగేశాడు. అప్పట్నుంచీ కాస్త మెంటలెక్కేసిందన్న మాట. ఇల్లూ, పొలం పోయాయి. మూగ పెళ్లాం... ముగ్గురాడ పిల్లలు మాత్రం మిగిలారు. తాతారావు కూతురి పెళ్లి జరుగుతోంది. సందడంతా గంటస్తంభానిదే. ‘‘శుభలేఖలు అందరికిచ్చేశావా? ఎవరన్నా దిగడ్డారా?’’ అడిగాడు తాతారావ్. గంటస్తంభానికి పుసుక్కున కోపం వచ్చేసింది. ‘‘అదే.. మర్రదే... దిగడరా? పనికిమాలిన ఎదవలందరికీ శుభలేఖ లేశావ్. ఇద్దరు ముఖ్యమైన వాళ్లను మాత్రం మరిచిపోయావ్?’’ అన్నాడు. తాతారావ్ కంగారు పడిపోయి, ‘‘ఎవర్రా వాళ్లు?’’ అనడిగాడు. ‘‘ఢిల్లీ వాజ్‌పేయి కేశావా? హైదరాబాద్ నారా చంద్రబాబునాయుడికేశావా?’’ అని గంటస్తంభం క్వశ్చనింగ్సేసేసరికి, తాతారావ్ అదిరిపోయాడు. ‘‘వాళ్లకెందుకురా?’’ అనడిగాడు. ‘‘నువ్వసలు గడ్డి తింటున్నావా? వన్నం తింటున్నావా? కడుపుకి! జన్మభూమని, వాటర్ షెడ్డని, దీపమని బోలెడు పథకాలు పెడితే అన్నీ శుభ్రంగా వాడుకు దొబ్బలే... తీరా మోసి ఇంట్లో శుభకార్యానికి అందర్నీ పిలిచి, వాళ్లిద్దర్నీ మానేస్తావా? ఇవన్నీ మనసులో ఎట్టుకోరు రేపూ...!’’ అని గంటస్తంభం గడగడా చెప్పేసరికి తాతారావుకి పట్టపగలే కళ్లముందు నక్షత్రాలు కనబడ్డాయి. కానీ ఏం చేయగలడు? ఏమన్నా చేద్దామన్నా... గూట్లో పురుగుల మందు స్టాక్ పెట్టుకున్నాడాయె! గంటస్తంభం వెంకటేశ్వర్రావుకి ముగ్గురు కూతుళ్లని చెప్పాం కదా. పెద్ద కూతురు సీతామహాలక్ష్మిని తొలిచూపులోనే అమితంగా ఇష్టపడ్డాడు వంశీ. కాణీ కట్నం తీసుకోకుండా పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఆ రోజు గేదె ఈనింది. భార్య జున్ను చేసింది. గంటస్తంభం ఆ జున్నును కావిడిబద్దకు కట్టుకుని, కోరుమామిడి నుంచి హైదరాబాద్ బయలుదేరాడు రైల్లో. ‘‘ఎదవ రైలు... స్టేషన్ కనబడితే ఆగిపోద్ది... మున్సిపాల్టీ ఎద్దులాగా! అయిదు పెట్టెలకు ఒకటే ఇంజిను..! ఏం ఒక్కో పెట్టెకు ఒక్కో ఇంజిను దొబ్బిచ్చుకోవచ్చుగా...! బుర్రకాయలుండవ్’’ అని విసుక్కున్నాడు. అడ్రస్ తెలీదు. ఫోన్ నంబర్ తెలీదు. ఇంకేం డీటైల్స్ లేవు. కానీ కావిడి బద్దేసుకుని హైదరాబాద్ అంతా కలియతిరిగేస్తున్నాడు గంటస్తంభం వెంకటేశ్వర్రావు. ‘‘మా అల్లుడిగారి ఇల్లెక్కడ? మా అమ్మాయి ఇల్లెక్కడ?’’ అని కనబడ్డ ప్రతివాణ్ణీ అడుగుతుంటాడు తప్ప... వాళ్లు ఏ హిల్స్‌లో ఉంటారో, ఏ గుట్టలో ఉంటారో, ఏ బాదులో ఉంటారో మాత్రం చెప్పలేకపోతున్నాడు. దాంతో ఇదెక్కడి గోలరా బాబూ అని అందరూ ఒకటే గ్యాలప్. ఈ గంటస్తంభానికి ఇంకో ఎర్రిబాగులోడు ఎదురుపడ్డాడు. అడ్రస్ కోసం గంటస్తంభం ఆరేడు వారాల నుంచి వెతుకుతుంటే, ఆ ఎర్రిబాగులోడు రెండేళ్ల నుంచి వెతుకుతున్నాడట. ఆ ఎర్రిబాగులోడు వచ్చి వచ్చి, తిన్నగా గంటస్తంభాన్నే అడ్రస్ అడిగాడు. ఈ గంటస్తంభానికేదో బాగా తెలుసన్నట్టుగా ‘‘ఏది అడ్రస్ చూపించు’’ అనడిగాడు. ‘‘డోర్ నంబర్ 7-9-2511/6/3/311/ఎబి-2’’ అంటూ చాంతాండంత అడ్రస్ చదివి వినిపించాడు వాడు. ‘‘ఇంత ఇవరంగా ఉంటే... ఇన్నాళ్లు ఎతుకుతున్నావా?’’ అని గంటస్తంభం ఎటకరించాడు. ‘‘ఏంటి నీకు తెలుసా..? చెప్పవా ప్లీజ్’’ అని బతిమిలాడాడు. గంటస్తంభం చెప్పడం మొదలెట్టాడు. ‘‘సెంటర్‌కెళ్లి ఆటో అట్టుకో. రైల్వే స్టేషన్ కెళ్లి రెలైక్కు. నిడదవోలులో దిగు. అక్కడ గుర్రపు బండి అట్టుకో. అమ్మోరు గుడి పక్కనే సందులోకెళ్లు. అక్కడ కుంటి ఎంకడు కనిపిస్తాడు. వాడితో మాత్రం మాట్లాడకు. ఆడు నాకు ఎగస్పార్టీ. కొంచెం ముందుకెళ్తే పొట్టి భద్రంగాడి కొట్టు కనిపిస్తుంది. వాడు లేకపోయినా వాడి కొడుకుంటాడు. వాణ్ణడిగితే - వెంకట్రామా అండ్ కో... ఎక్కాల బుక్కు చేతిలో పెడతాడు. నువ్వు చూపించిన అంకెలన్నీ అందులో ఉంటాయ్’’ అనేసి చక్కా పోయాడు మన గంటస్తంభం. మరి మన గంటస్తంభం తన అల్లుడింటికి చేరాడంటారా? చేరే ఉంటాడు లెండి. రెండు వారాల నుంచి అలా జున్నును మురగబెట్టి మురగబెట్టి ఉంచాడు కదా. ఆ సువాసనకు మున్సిపాల్టీ వాళ్లు కచ్చితంగా వెంటబడే ఉంటారు. వాళ్లే తొట్టిలో కూర్చోబెట్టి మరీ మన గంటస్తంభాన్ని అల్లుడి గారింటికి చేర్చి ఉంటారని ఆశిద్దాం. లేకపోతే దొబ్బేయడు మరి! - పులగం చిన్నారాయణ వాడే ఈ పాత్రకు ఇన్స్పిరేషన్ నటుడిగా నాకో జన్మనిచ్చిన పాత్ర ఇది. ఈ పాత్ర లేకపోతే నేను లేను. ఈవీవీగారు ‘చాలా బాగుంది’ చేస్తున్న టైమ్‌లో నేను వెళ్లి కలిసి వేషమడిగాను. చలపతిరావు అసిస్టెంట్‌గా రెండు సీన్ల తింగరోడి వేషం వెంటనే ఇచ్చేశారు. ‘మరీ... రెండు సీన్లేనా’ అని నా మనసులో అసంతృప్తి. దీనికి ముందే ‘రామసక్కనోడు’లో మతిభ్రమించిన పాత్రొకటి చేశా. ఆ పాత్ర యాస భిన్నంగా ఉంటుంది. ఈవీవీ గారు అది చూసి, అదే యాసలో ఈ పాత్ర మొత్తం డిజైన్ చేయమన్నారు. రెండు సీన్ల వేషం కాస్తా, అయిదు సీన్లు... అలా అలా పెరుగుతూ పోయింది. ఈ పాత్ర కోసం స్క్రిప్టులో మార్పులూ చేర్పులూ చేశారు. నేను మా ఊరెళ్లి ఈ పాత్రను ఎంతవరకు డెవలప్ చేయొచ్చో అంత లెవెల్లో చేశా. మా ఊళ్లో ఇంటింటికీ నీళ్లు మోసే ఓ తింగరబుచ్చి ఉన్నాడు. వాడే ఈ పాత్రకు ఇన్స్పిరేషన్. ఇక ‘గంటస్తంభం వెంకటేశ్వరరావు’ అనే పేరు ఎందుకు పెట్టామంటే - కంచుస్తంభం వెంకటేశ్వరరావు అని నా ఫ్రెండొకడు ఉన్నాడు. ఇంటిపేరు గమ్మత్తుగా ఉండాలని ‘కంచు’ బదులు ‘గంట’ పెట్టామంతే. ఈ పాత్ర విషయంలో ఇంత స్వేచ్ఛ ఇచ్చిన మహానుభావులు ఈవీవీ గారిని ఎప్పటికీ మరిచిపోను. సినిమాకి కొత్త కామెడీ పట్టుకొచ్చానని ఈ పాత్ర గురించి ఎన్ని ప్రశంసలొచ్చాయో! ఆ ప్రశంసలన్నీ మోయాలంటే ఒక కావిడిబద్ద సరిపోదండీ! చిన్న చిన్న పిల్లకాయలు, ఐఏయస్ ఆఫీసర్లక్కూడా పుసుక్కున నచ్చేసింది. - ఎల్బీ శ్రీరామ్, నటుడు - రచయిత -
ఈవీవీ గుడ్..
పరీక్ష బాగా రాస్తే టీచరమ్మ ఎర్ర ఇంకు పెన్నుతో ‘వి వి గుడ్’ అని రాస్తుంది. తెలుగు సినిమాలో ఇ.వి.వి గారి మార్కు, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇ.వి.వికి పడిన మార్కులను చూస్తే ఆయన డిస్టింక్షన్లో పాసయ్యాడనే చెప్పాలి. ఈ పుట్టిన రోజుకు ఇ.వి.వి గారు ఉండి ఉంటే డెరైక్షన్‌లో 25 ఏళ్లు పూర్తి చేసి ఉండేవారు. ‘ఉంటే’ ఏంటి..? 100% ఉన్నారు. 50 సినిమాల సాక్షిగా ఉన్నారు. ఆ 50 సినిమాల నుంచి పుట్టిన, పెరిగిన, పరిగెడుతున్న ధోరణిలో ఇ.వి.వి ఇప్పటికీ ఉన్నారు. నవ్వుతూ... నవ్విస్తూ... మనసులను స్పృశిస్తూ... ఇంకొన్నిసార్లు శ్వాసలో పరిమళంలా అనిపిస్తూ... అందరి చేత ‘వి వి గుడ్’ అనిపించుకుంటూ ఉన్నారు. పంచేంద్రియాల్లాంటి అయిదుగురు పంచుకున్న పాతిక విషయాలతో ఇ.వి.వి ఈ ఏడాదికి 25 ఏళ్ల దర్శకత్వాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఆ కోరికలు మాత్రం నెరవేరలేదు - చలపతిరావు అమ్మా నాన్నలను ఎలా గౌరవించాలో, ప్రేమించాలో ఈవీవీని చూసి నేర్చుకోవాల్సిందే. ఈవీవీకి తన అమ్మా, నాన్నలంటే ఎంతో ప్రేమ. ఎంత బిజీగా ఉన్నా నెలకొక సారైనా సొంత ఊరు కోరుమామిడి వెళ్లి వాళ్ల అమ్మా నాన్నలతో గడిపి వచ్చేవాడు. స్టార్ హోటల్లో ఉండే అవకాశం ఉన్నా కూడా పల్లెటూళ్లో ఆ ఇంట్లోనే ఉండి అమ్మతో తనకు నచ్చిన వంటలన్నీ చేయించుకుని ఆనందపడేవాడు. ఉమ్మడి కుటుంబంలోని అనురాగాలూ అనుబంధాలేంటో ఈవీవీకి బాగా తెలుసు. కుటుంబ సభ్యులందరూ ఒకచోటే ఉండాలని ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు, అమ్మానాన్నలకు సొంత ఊళ్లో అయిదు పోర్షన్ల ఇల్లు కట్టించి ఇచ్చాడు. శ్రీకృష్ణదేవరాయల ‘భువన విజయం’ తరహాలో ఈవీవీ దగ్గర ఎప్పుడూ ఆరేడుగురు రచ యితలు ఉండేవారు. ఒక్కొక్కొరూ ఒక్కో వెర్షన్ రాసిస్తే, అందులోంచి మంచినంతా ఏరుకుని ఆయనో స్క్రిప్ట్ రెడీ చే సేవారు. ఏడాదికి రెండు సినిమాలు తప్పనిసరిగా తీసేవాడు. 40-50 మంది ఆర్టిస్టులకు ఓ భరోసా కల్పించేవాడు. అసలెప్పుడూ ఫారిన్ మొహం చూడని వాళ్లను కూడా ఫారిన్ తీసుకెళ్లాడు. ఎవరు వచ్చి వేషం అడిగినా కాదనేవాడు కాదు. తను చేసిన గుప్త దానాలైతే లెక్కే లేదు. ఈవీవీ ప్రకృతి ప్రేమికుడు. మొక్కల్ని బాగా ఇష్టపడేవాడు. నర్సరీ కనబడితే కారుకి బ్రేక్ పడాల్సిందే. లోపలకు వెళ్లి ఎన్నెన్నో కొత్త మొక్కలు కొనుక్కొచ్చేవాడు. హైదరాబాద్ శివార్లలో ఓ ఎకరం పొలం కొని, కడియం నుంచి రెండు లక్షల రూపాయలు పెట్టి మొక్కలు తెప్పించాడు. మొక్కల మధ్య, మనుషుల మధ్య, నవ్వుల మధ్య గడపడాన్ని ఎంత ఇష్టపడేవాడంటే అంత ఇష్టపడేవాడు. ఈవీవీ బెస్ట్ ఫ్రెండ్ అంటే నేనే. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే అతనే. చిత్రమేమిటంటే తను నాకన్నా ఇరవై ఏళ్లు పైగా చిన్న. ‘ప్రేమఖైదీ’ సినిమా టైం నుంచి మేం క్లోజ్ అయ్యాం. ’ప్రేమఖైదీ’ స్క్రిప్టు నేను ప్రొడ్యూస్ చేయాలని రాయించుకున్నాను. అది ఎన్నో మలుపులు తిరిగి రామానాయుడు గారి దగ్గరకు వెళ్లడం, ఈవీవీ కెరీర్ మలుపు తిరగడం జరిగింది. క్యాన్సర్ వచ్చి చనిపోయే చివరి క్షణం వరకూ కూడా నేను తోడుగా ఉన్నా. తన ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు ఘనంగా చేయాలని, మనవళ్లూ, మనవరాళ్లతో ఆడుకోవాలని ఎంతో తపించాడు. ఆ కోరికలు మాత్రం నెరవేరలేదు. అసలు ఈవీవీ ఇంత త్వరగా వెళ్లిపోయాడంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. నాకు చాలా ధైర్యం చెప్పాడు- కోట శ్రీనివాసరావు నేను చాలా మంది హేమాహేమీల్లాంటి దర్శకులతో పనిచేశాను. కానీ ఈవీవీలాగా నాతో ఇన్నిన్ని రకాల పాత్రలు చేయించిన దర్శకుడు ఇంకెవరూ లేరు. ఆయన తొలి సినిమా ‘చెవిలో పువ్వు’ మొదలుకుని, చివరి సినిమా ‘కత్తి కాంతారావు’ వరకూ ఏవో రెండు మూడు సినిమాలు మినహా దాదాపు అన్ని సినిమాల్లో నేను నటించాను, అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్సే. ఈవీవీ డైరె క్షన్లో నేను చేసిన సినిమాల్లో టాప్ ఫైవ్ ఎంచమంటే చాలా కష్టం. తప్పదంటే మాత్రం చెబుతాను. 1) ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు 2) హలో బ్రదర్ 3) మా నాన్నకు పెళ్లి 4) ఏవండీ ఆవిడ వచ్చింది 5) ఆమె ఈవీవీ మంచి దర్శకుడు. అంతకు మించి మంచి మనిషి. అందరికీ మంచే చేశాడు తప్ప, ఎవ్వరికీ హాని తలపెట్టలేదు. ఉన్నంత కాలం పదిమందికీ భోజనం పెట్టాడు. చాలా మంది కమెడియన్లు ఆయనకు జీవితాంతం రుణపడి ఉండాలి. ఆయన వల్ల ఎన్నో మంచి పాత్రలు దక్కించుకుని, కెరీర్‌ని నిలబెట్టుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయన లేకపోవడం తెలుగు ఇండస్ట్రీకే కాదు, కామెడీ ప్రపంచానికే తీరని లోటు. వర్క్... వర్క్... వర్క్... ఇదే ఆయన నమ్మిన సిద్ధాంతం. రోజులో 24 గంటలూ పనిచేసినా అలిసిపోయేవాడు కాదు. తాను కష్టపడి పనిచేసేవాడు. తన చుట్లూ ఉన్నవాళ్లను కూడా అలాగే పనిచేయించేవాడు. మంచి కెప్టెన్ లక్షణాలు ఉన్నాయి తనలో. మా అబ్బాయి చనిపోయాక... నేను మానసికంగా బాగా వీక్ అయిపోయా. అలాంటి పరిస్థితుల్లో కూడా మా ఇంటికి వచ్చి నాకు చాలా ధైర్యం చెప్పాడు. ‘‘సినిమాలు మానొద్దు... చేస్తూనే ఉండండి. అప్పుడే త్వరగా కోలుకోగలుగుతారు’’ అని నన్ను ప్రోత్సహించి, నాకు మంచి వేషం ఇచ్చారు. కానీ విధి విలాపం... అదే ఆయన ఆఖరి సినిమా కావడం విషాదం. ఆ విషయంలో ఆయన చాలా బాధపడేవారు- అలీ నేను బాలనటునిగా మద్రాసు వీధుల్లో తిరుగుతున్న సమయంలో... అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఆయన నాకు పరిచ యం. నేను సైకిల్ మీద అన్ని సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండేవాణ్ణి. ఈయనేమో ట్రస్టుపురం నుంచి టీనగర్ వరకూ నడుచుకుంటూనే వచ్చేసేవారు. క ష్టాలు, కన్నీళ్లు అన్నీ చూసి అంచెలంచెలుగా ఎదిగాడాయన. తాను స్థిరపడటమే కాకుండా తన తమ్ముళ్లను, బావలని ఇంకా చాలా మంది బంధువులను ఇండస్ట్రీకి తీసుకువచ్చి అందరికీ మార్గం చూపించిన మహానుభావుడు. ‘చెవిలో పువ్వు’ ఫ్లాప్ కావడంతో ఈవీవీ చాలా అప్సెట్ అయ్యారు. ఆ సమయంలో రామానాయుడు గారు అండగా నిలిచారు. ‘ఇంద్రుడు-చంద్రుడు’కి కో-డెరైక్టర్‌గా పనిచేయమన్నారు. ఆ తర్వాత ‘ప్రేమఖైదీ’ చేసే అవకాశం ఇచ్చారు. అందులో శారదగారు తప్ప మిగతా వాళ్లందరూ చిన్న ఆర్టిస్టులే. అయినా పెద్ద హిట్ కొట్టి చూపించారు. ఈవీవీ పుట్టినరోజు అంటేనే పండుగ రోజులా జరిగేది. ఆయన ఇంటిమందు 40-50 కార్లు క్యూ కట్టి ఉండేవి. అదే మనిషి ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. బర్త్‌డే విషెస్ చెప్పడానికి కూడా సక్సెస్, ఫెయిల్యూర్ లెక్కలేంటో అర్థం కాదు. ఈ విషయంలో ఆయన చాలా బాధ పడేవారు. ఇండస్ట్రీ అంటే ఇంతేనా అని ఓ సందర్భంలో నాతో అన్నారు. ఈవీవీ పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో వందమందికి పైగా బతుకుతున్నారు. ఆయనో మహా వృక్షం. దాన్నుంచి ఇంకా ఫలాలు వస్తూనే ఉంటాయి. కమెడియన్లు చాలా మంది ఆయనకు జీవితాంతం రుణపడి ఉండాలి. కొంతమంది ఆయన్ను గుర్తు కూడా పెట్టుకోలేదు. నేనైతే ఈవీవీ గారిని ఎప్పటికీ మర్చిపోను. నేను చైల్డ్ ఆర్టిస్టు నుంచి కమెడియన్‌గా టర్న్ అయ్యాక, ‘ప్రేమఖైదీ’తో ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన మహానుభావుడాయన. ఈవీవీ సినిమాల్లో నాకు బాగా నచ్చినవి... ఆలీబాబా అరడజను దొంగలు, ఆ ఒక్కటి అడక్కు, ప్రేమఖైదీ, సీతారత్నంగారి అబ్బాయి, ఆమె. ఆ స్క్రిప్ట్ ఎందుకనో తెరకెక్కలేదు- ఎల్బీ శ్రీరామ్ కో-డెరైక్టర్ నుంచి డెరైక్టర్‌గా మారేందుకు ఇ.వి.వి. శ్రమపడుతున్న రోజులవి. చేస్తున్న ఉద్యోగం హఠాత్తుగా మానేసి, మద్రాసెళ్ళి, డైలాగ్ రైటర్‌గా స్థిరపడాలని ప్రయత్నిస్తున్న నన్ను తీసుకెళ్ళి ఇ.వి.వి.కి పరిచయం చేశాడు నటుడు విద్యాసాగర్. ఆ సమయంలో జంధ్యాల గారి సినిమాకి ఇ.వి.వి. డబ్బింగ్ చెప్పిస్తున్నాడు. డబ్బింగ్ ఏదైనా చెబుతానని ముచ్చటపడితే, రెండు పాత్రలకు నాతో డబ్బింగ్ చెప్పించాడు. తరువాత రోజుల్లో ఇ.వి.వి. నాకు ఒక కథ ఇచ్చి, స్క్రిప్టు చేయమన్నారు. నేను రాసిచ్చిన స్క్రిప్టు చదివి, ‘‘నేనంటూ డెరైక్టర్నైతే, మీరే రైటర్’’ అన్న ఇ.వి.వి. మెచ్చుకోలు నాకో పెద్ద టానిక్. తరువాత ఆయన డెరైక్టర్, నేను రైటర్ అయ్యాం. కానీ, మమ్మల్ని దగ్గర చేసిన ఆ స్క్రిప్టు ఎందుకనో తెరకెక్కనే లేదు. జీవితంలో చాలా కష్టపడి పైకొచ్చిన ఇ.వి.వి. అప్పట్లో ఒక చిన్న గదిలో గడిపిన రోజులు నాకు గుర్తే. అమ్మానాన్నల్ని ఊరి నుంచి తీసుకొచ్చి, మద్రాసులో మేడ మీద ఒక చిన్న కొట్టాయమ్ (పర్ణశాల)లో ఇ.వి.వి. ఉంచిన రోజులు... దర్శకుడిగా తాను స్థిరపడ్డాక తన వాళ్ళందరినీ జీవితంలో కుదురుకొనేలా చేయడానికి పడ్డ తపన... దగ్గర నుంచి చూశా. చిన్న రైతుగా నానా అవస్థలు పడిన నాన్నను వంద ఎకరాల ఆసామిగా చూడాలని, ఊళ్ళో పొలం కొని, వైట్ అండ్ వైట్ డ్రెస్, మారుతీ కారులో తిరగమంటూ తండ్రిని బంగారంలా చూసుకొన్నాడు. చాలామంది హాస్యానికి పెద్దపీట వేస్తే, ‘ఎవడిగోల వాడిది’, ‘బురిడి’ లాంటి చిత్రాల కోసం కమెడియన్లందరినీ విదేశాలకు తీసుకువెళ్ళి, అక్కడ షూటింగ్ చేసేందుకు ‘పెద్ద ఫ్లయిటే’ ఇ.వి.వి. వేశాడు. నిజానికి, జంధ్యాల గారి దగ్గర పనిచేస్తున్న రోజుల నుంచి ఆర్ట్ ఫిల్మ్స్, ఎక్స్పరిమెంటల్ ఫిల్మ్స్ - ఇలా అన్ని రకాల కథలూ ఇ.వి.వి. తయారు చేసుకొనేవాడు. అంత సాధన చేశాడు కాబట్టే, ‘ఆమె’, ‘తాళి’, ‘కన్యాదానం’ లాంటి విభిన్నమైన సినిమాలు తీశాడు. టైటిల్ పెట్టడంలోనే కాదు... టైటిల్ కార్డుల్లో స్టోరీకి ‘అంతులేని కథ’ అనీ, డైలాగ్ రైటర్‌కి ‘కోతల రాయుడు’ అనీ వెరైటీగా చూపెట్టడంలోనూ ఇ.వి.వి.ది ప్రత్యేక ముద్ర. ఆయన ఎంత సౌందర్యారాధకుడంటే, సొంత ఇల్లు కట్టుకున్నాక, దేశదేశాల నుంచి రకరకాల చిత్రమైన వస్తువులు పట్టుకొచ్చి, ఇంటిని నింపేసి, అద్భుతమైన మ్యూజియమ్లా తీర్చిదిద్దాడు. ఇ.వి.వి.లోని గొప్ప లక్షణం ఏమిటంటే, రైటర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చేవాడు. రచయిత ఏ మంచి పదప్రయోగం చేసినా, మహదానందపడిపోయేవాడు. రైటర్ స్క్రిప్టు చదివి, వినిపించడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. తానే స్క్రిప్టు చదువుకొనేవాడు. స్క్రిప్టు చదువుతున్నప్పుడు ఆయన ముఖంలో కలిగే మార్పుల్ని బట్టి రైటర్‌గా పాసయ్యామో, లేదో తెలిసిపోయేది. ‘ఆ ఒక్కటీ అడక్కు’లో ‘గజ్జికి లేని దురద జాలిమ్ లోషన్‌కు ఎందుకు?’, ఇద్దరి పేర్లను కలిపేసి ‘దాసరి రాఘవేంద్రరావు’ లాంటి వినోద ప్రయోగాల్ని ఎంజాయ్ చేసేవారు. ఎవరైనా, ఏదైనా కావాలని వస్తే ఇ.వి.వి. ‘లేదు... కుదరదు’ అనేవాడు కాదు. సంపా దించడం, అనుభవించడం, పంచిపెట్టడం, దాచిపెట్టడం - డబ్బుకున్న ఈ 4 లక్షణా లనూ ఆచరించిన వ్యక్తి ఆయన. అందులోనూ, మూడోది ఎక్కువగా తెలిసిన మనిషి. అందుకే, ఒక్కముక్కలో ఇ.వి.వి నా లాంటి ‘ఎందరికో (ఇ) వెలుగునిచ్చిన (వి) వ్యక్తి (వి)’. -
కొత్త నిర్మాతలెందరికో.. దారిదీపం..
-
'ఎంఎస్‌తో అవే నా చివరి మాటలు'
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ గురించి ఎంత చెప్పినా తనివి తీరదని హాస్యనటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్ అన్నారు. ఆయన శుక్రవారం కిమ్స్‌లో ఎంఎస్ నారాయణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ తామిద్దరం కలిసి అనేక సినిమాల్లో నటించామన్నారు. ఇటీవలే ఎంఎస్ నారాయణ తనకు ఫోన్ చేసి అరగంట మాట్లాడారన్నారు. ఆయన ఇటీవల తాను నటించిన ఓ సినిమాలో నటించికపోయినా...తన నటనను అభినందించారన్నారు. తన సినిమా ఇంకా విడుదల కాలేదని, అయితే ప్రివ్యూ చూసిన ఎంఎస్ నారాయణ... ఉండబట్టలేక తనకు ఫోన్ చేశానని చెప్పారన్నారు. 'ఎల్బీగారు మీ సినిమా చూశాను. అద్భుతంగా నటించారు. మీరు ఏడ్వకుండా..చూసేవారిని ఏడ్పించారని' ఎంఎస్ తనతో అన్నారని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అదే ఆయనతో తాను చివరిగా మాట్లాడటం అని తెలిపారు. తెల్లారి లేస్తే ఎంతోమందిని నవ్వించే కమెడియన్లకు అదే టానిక్ అని... అందర్ని నవ్వేంచేవాళ్లు భౌతికంగా లేకున్నా వందేళ్లు బతకాలని ఎల్బీ శ్రీరామ్ అన్నారు.