తాతయ్య మహారథి బాటలోనే...
సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని మహారథి మనవడు, దర్శక, నిర్మాత త్రిపురనేని చిట్టి తనయుడు విజయ్ చౌదరి త్రిపురనేని దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘కవ్వింత’. విజయ్ దాట్ల, దీక్షా పంత్, ధన్‌రాజ్, త్రిపురనేని చిట్టి, ఎల్బీ శ్రీరామ్ ముఖ్య తారలు. పువ్వల శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం మేకింగ్ వీడియోను ‘మల్టీ డైమన్షన్’ వాసు ఆవిష్కరించారు. ఈ వేడుకలో దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీరశంకర్, రవికుమార్ చౌదరి, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని థియేటర్ అధినేతలు నేరుగా కొనుక్కునే విధానాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్ శ్రీకన్య థియేటర్ అధినేత వీవీ సత్యనారాయణరాజు ఈ చిత్రాన్ని లక్ష రూపాయలకు కొనుక్కున్నారు.
ఈ సమావేశంలో త్రిపురనేని చిట్టి మాట్లాడుతూ -‘‘దర్శకుడు కావాలనే తన ఆకాంక్షను నేర్చుకోవడానికి విజయ్ ముందు దర్శకత్వ శాఖలో చేరాడు. అనుభవం సంపాదించాకే డెరైక్టర్ అయ్యాడు’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు 22 థియేటర్స్‌కి ఈ సినిమా అమ్ముడుపోయింది. ధనార్జనే ధ్యేయంగా సినిమాలు చేయడంలేదు. ఈ సినిమా తర్వాత నేనే సినిమా చేసినా, నెల జీతానికే చేస్తాను. నిర్మాత శ్రేయస్సు నాకు ముఖ్యం. మా తాతగారు, నాన్నగార్ల బాటలోనే వెళ్లాలన్నది నా ఆకాంక్ష’’ అన్నారు. ఈ చిత్రం ద్వారా వచ్చే ప్రతి రూపాయినీ మా ‘అంజని ఫౌండేషన్’ ద్వారా జరిపే సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: టెంటు లక్ష్ము నాయుడు.