ఈవీవీ గుడ్.. | special story to evv satyananrayana | Sakshi
Sakshi News home page

ఈవీవీ గుడ్..

Published Tue, Jun 9 2015 11:09 PM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

ఈవీవీ సత్యనారాయణ

ఈవీవీ సత్యనారాయణ

పరీక్ష బాగా రాస్తే టీచరమ్మ ఎర్ర ఇంకు పెన్నుతో ‘వి వి గుడ్’ అని రాస్తుంది. తెలుగు సినిమాలో ఇ.వి.వి గారి మార్కు, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇ.వి.వికి పడిన మార్కులను చూస్తే ఆయన డిస్టింక్షన్‌లో పాసయ్యాడనే చెప్పాలి. ఈ పుట్టిన రోజుకు ఇ.వి.వి గారు ఉండి ఉంటే డెరైక్షన్‌లో 25 ఏళ్లు పూర్తి చేసి ఉండేవారు. ‘ఉంటే’ ఏంటి..? 100% ఉన్నారు. 50 సినిమాల సాక్షిగా ఉన్నారు. ఆ 50 సినిమాల నుంచి పుట్టిన, పెరిగిన, పరిగెడుతున్న ధోరణిలో ఇ.వి.వి ఇప్పటికీ ఉన్నారు. నవ్వుతూ... నవ్విస్తూ... మనసులను స్పృశిస్తూ... ఇంకొన్నిసార్లు శ్వాసలో పరిమళంలా అనిపిస్తూ... అందరి చేత ‘వి వి గుడ్’ అనిపించుకుంటూ ఉన్నారు. పంచేంద్రియాల్లాంటి అయిదుగురు పంచుకున్న పాతిక విషయాలతో ఇ.వి.వి ఈ ఏడాదికి 25 ఏళ్ల దర్శకత్వాన్ని సెలబ్రేట్ చేసుకుందాం.
 
ఆ కోరికలు మాత్రం నెరవేరలేదు - చలపతిరావు

 అమ్మా నాన్నలను ఎలా గౌరవించాలో, ప్రేమించాలో ఈవీవీని చూసి నేర్చుకోవాల్సిందే. ఈవీవీకి తన అమ్మా, నాన్నలంటే ఎంతో ప్రేమ. ఎంత బిజీగా ఉన్నా నెలకొక సారైనా సొంత ఊరు కోరుమామిడి వెళ్లి వాళ్ల అమ్మా నాన్నలతో  గడిపి వచ్చేవాడు. స్టార్ హోటల్లో ఉండే అవకాశం ఉన్నా కూడా పల్లెటూళ్లో ఆ ఇంట్లోనే ఉండి అమ్మతో తనకు నచ్చిన వంటలన్నీ చేయించుకుని ఆనందపడేవాడు.
 ఉమ్మడి కుటుంబంలోని అనురాగాలూ అనుబంధాలేంటో ఈవీవీకి బాగా తెలుసు. కుటుంబ సభ్యులందరూ ఒకచోటే ఉండాలని ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు, అమ్మానాన్నలకు సొంత ఊళ్లో అయిదు పోర్షన్ల ఇల్లు కట్టించి ఇచ్చాడు.

శ్రీకృష్ణదేవరాయల ‘భువన  విజయం’ తరహాలో ఈవీవీ  దగ్గర ఎప్పుడూ ఆరేడుగురు రచ యితలు ఉండేవారు. ఒక్కొక్కొరూ ఒక్కో వెర్షన్ రాసిస్తే, అందులోంచి మంచినంతా ఏరుకుని ఆయనో స్క్రిప్ట్ రెడీ చే సేవారు. ఏడాదికి రెండు సినిమాలు తప్పనిసరిగా తీసేవాడు. 40-50 మంది ఆర్టిస్టులకు ఓ భరోసా కల్పించేవాడు. అసలెప్పుడూ ఫారిన్ మొహం చూడని వాళ్లను కూడా ఫారిన్ తీసుకెళ్లాడు. ఎవరు వచ్చి వేషం అడిగినా కాదనేవాడు కాదు. తను చేసిన గుప్త దానాలైతే లెక్కే లేదు.

 ఈవీవీ ప్రకృతి ప్రేమికుడు. మొక్కల్ని బాగా ఇష్టపడేవాడు. నర్సరీ కనబడితే కారుకి బ్రేక్ పడాల్సిందే. లోపలకు వెళ్లి ఎన్నెన్నో కొత్త మొక్కలు కొనుక్కొచ్చేవాడు. హైదరాబాద్ శివార్లలో ఓ ఎకరం పొలం కొని, కడియం నుంచి రెండు లక్షల రూపాయలు పెట్టి మొక్కలు తెప్పించాడు. మొక్కల మధ్య, మనుషుల మధ్య, నవ్వుల మధ్య గడపడాన్ని ఎంత ఇష్టపడేవాడంటే అంత ఇష్టపడేవాడు.
 ఈవీవీ బెస్ట్ ఫ్రెండ్ అంటే నేనే. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే అతనే. చిత్రమేమిటంటే తను నాకన్నా ఇరవై ఏళ్లు పైగా చిన్న. ‘ప్రేమఖైదీ’ సినిమా టైం నుంచి మేం క్లోజ్ అయ్యాం. ’ప్రేమఖైదీ’ స్క్రిప్టు నేను ప్రొడ్యూస్ చేయాలని రాయించుకున్నాను. అది ఎన్నో మలుపులు తిరిగి రామానాయుడు గారి దగ్గరకు వెళ్లడం, ఈవీవీ కెరీర్ మలుపు తిరగడం జరిగింది. క్యాన్సర్ వచ్చి చనిపోయే చివరి క్షణం వరకూ కూడా నేను తోడుగా ఉన్నా. తన ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు ఘనంగా చేయాలని, మనవళ్లూ, మనవరాళ్లతో ఆడుకోవాలని ఎంతో తపించాడు. ఆ కోరికలు మాత్రం నెరవేరలేదు. అసలు ఈవీవీ ఇంత త్వరగా వెళ్లిపోయాడంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు.
 
నాకు చాలా ధైర్యం చెప్పాడు- కోట శ్రీనివాసరావు

నేను చాలా మంది హేమాహేమీల్లాంటి దర్శకులతో పనిచేశాను. కానీ ఈవీవీలాగా  నాతో ఇన్నిన్ని  రకాల పాత్రలు చేయించిన దర్శకుడు ఇంకెవరూ లేరు. ఆయన తొలి సినిమా ‘చెవిలో పువ్వు’ మొదలుకుని, చివరి సినిమా ‘కత్తి కాంతారావు’ వరకూ ఏవో రెండు మూడు సినిమాలు మినహా దాదాపు అన్ని సినిమాల్లో నేను నటించాను, అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్సే.
 ఈవీవీ డైరె క్షన్‌లో నేను చేసిన సినిమాల్లో టాప్ ఫైవ్ ఎంచమంటే చాలా కష్టం. తప్పదంటే మాత్రం చెబుతాను.
 1) ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు 2) హలో బ్రదర్  
 3) మా నాన్నకు పెళ్లి 4) ఏవండీ ఆవిడ వచ్చింది 5) ఆమె
 ఈవీవీ మంచి దర్శకుడు. అంతకు మించి మంచి మనిషి. అందరికీ మంచే చేశాడు తప్ప, ఎవ్వరికీ హాని తలపెట్టలేదు. ఉన్నంత కాలం పదిమందికీ భోజనం పెట్టాడు. చాలా మంది కమెడియన్లు ఆయనకు జీవితాంతం రుణపడి ఉండాలి. ఆయన వల్ల ఎన్నో మంచి పాత్రలు దక్కించుకుని, కెరీర్‌ని నిలబెట్టుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయన లేకపోవడం తెలుగు ఇండస్ట్రీకే కాదు, కామెడీ ప్రపంచానికే తీరని లోటు.

 వర్క్... వర్క్... వర్క్... ఇదే ఆయన నమ్మిన సిద్ధాంతం. రోజులో 24 గంటలూ పనిచేసినా అలిసిపోయేవాడు కాదు. తాను కష్టపడి పనిచేసేవాడు. తన చుట్లూ ఉన్నవాళ్లను కూడా అలాగే పనిచేయించేవాడు. మంచి కెప్టెన్ లక్షణాలు ఉన్నాయి తనలో.
 మా అబ్బాయి చనిపోయాక... నేను మానసికంగా బాగా వీక్ అయిపోయా. అలాంటి పరిస్థితుల్లో కూడా మా ఇంటికి వచ్చి నాకు చాలా ధైర్యం చెప్పాడు. ‘‘సినిమాలు మానొద్దు... చేస్తూనే ఉండండి. అప్పుడే త్వరగా కోలుకోగలుగుతారు’’ అని నన్ను ప్రోత్సహించి, నాకు మంచి వేషం ఇచ్చారు. కానీ విధి విలాపం... అదే ఆయన ఆఖరి సినిమా కావడం విషాదం.
 
ఆ విషయంలో ఆయన చాలా బాధపడేవారు- అలీ
నేను బాలనటునిగా మద్రాసు వీధుల్లో తిరుగుతున్న సమయంలో... అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఆయన నాకు పరిచ యం. నేను సైకిల్ మీద అన్ని సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండేవాణ్ణి. ఈయనేమో ట్రస్టుపురం నుంచి టీనగర్ వరకూ నడుచుకుంటూనే వచ్చేసేవారు. క ష్టాలు, కన్నీళ్లు అన్నీ చూసి అంచెలంచెలుగా ఎదిగాడాయన. తాను స్థిరపడటమే కాకుండా తన తమ్ముళ్లను, బావలని ఇంకా చాలా మంది బంధువులను ఇండస్ట్రీకి తీసుకువచ్చి అందరికీ మార్గం చూపించిన మహానుభావుడు.

 ‘చెవిలో పువ్వు’ ఫ్లాప్ కావడంతో ఈవీవీ చాలా అప్‌సెట్ అయ్యారు. ఆ సమయంలో రామానాయుడు గారు అండగా నిలిచారు. ‘ఇంద్రుడు-చంద్రుడు’కి కో-డెరైక్టర్‌గా పనిచేయమన్నారు. ఆ తర్వాత ‘ప్రేమఖైదీ’ చేసే అవకాశం ఇచ్చారు. అందులో శారదగారు తప్ప మిగతా వాళ్లందరూ చిన్న ఆర్టిస్టులే. అయినా పెద్ద హిట్ కొట్టి చూపించారు.

 ఈవీవీ పుట్టినరోజు అంటేనే  పండుగ రోజులా జరిగేది. ఆయన ఇంటిమందు 40-50 కార్లు క్యూ కట్టి ఉండేవి. అదే మనిషి ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. బర్త్‌డే విషెస్ చెప్పడానికి కూడా సక్సెస్, ఫెయిల్యూర్ లెక్కలేంటో అర్థం కాదు. ఈ విషయంలో ఆయన చాలా బాధ పడేవారు. ఇండస్ట్రీ అంటే ఇంతేనా అని ఓ సందర్భంలో నాతో అన్నారు. ఈవీవీ పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో వందమందికి పైగా బతుకుతున్నారు. ఆయనో మహా వృక్షం. దాన్నుంచి ఇంకా ఫలాలు వస్తూనే ఉంటాయి.
 కమెడియన్లు చాలా మంది ఆయనకు జీవితాంతం రుణపడి ఉండాలి. కొంతమంది ఆయన్ను గుర్తు కూడా పెట్టుకోలేదు. నేనైతే ఈవీవీ గారిని ఎప్పటికీ మర్చిపోను. నేను చైల్డ్ ఆర్టిస్టు నుంచి కమెడియన్‌గా టర్న్ అయ్యాక, ‘ప్రేమఖైదీ’తో ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన మహానుభావుడాయన. ఈవీవీ సినిమాల్లో నాకు బాగా నచ్చినవి... ఆలీబాబా అరడజను దొంగలు, ఆ ఒక్కటి అడక్కు, ప్రేమఖైదీ, సీతారత్నంగారి అబ్బాయి, ఆమె.
 
 ఆ స్క్రిప్ట్ ఎందుకనో తెరకెక్కలేదు- ఎల్బీ శ్రీరామ్
 కో-డెరైక్టర్ నుంచి డెరైక్టర్‌గా మారేందుకు ఇ.వి.వి. శ్రమపడుతున్న రోజులవి. చేస్తున్న ఉద్యోగం హఠాత్తుగా మానేసి, మద్రాసెళ్ళి, డైలాగ్ రైటర్‌గా స్థిరపడాలని ప్రయత్నిస్తున్న నన్ను తీసుకెళ్ళి ఇ.వి.వి.కి పరిచయం చేశాడు నటుడు విద్యాసాగర్. ఆ సమయంలో జంధ్యాల గారి సినిమాకి ఇ.వి.వి. డబ్బింగ్ చెప్పిస్తున్నాడు. డబ్బింగ్ ఏదైనా చెబుతానని ముచ్చటపడితే, రెండు పాత్రలకు నాతో డబ్బింగ్ చెప్పించాడు. తరువాత రోజుల్లో ఇ.వి.వి. నాకు ఒక కథ ఇచ్చి, స్క్రిప్టు చేయమన్నారు. నేను రాసిచ్చిన స్క్రిప్టు చదివి, ‘‘నేనంటూ డెరైక్టర్‌నైతే, మీరే రైటర్’’ అన్న ఇ.వి.వి. మెచ్చుకోలు నాకో పెద్ద టానిక్. తరువాత ఆయన డెరైక్టర్, నేను రైటర్ అయ్యాం. కానీ, మమ్మల్ని దగ్గర చేసిన ఆ స్క్రిప్టు ఎందుకనో తెరకెక్కనే లేదు.

జీవితంలో చాలా కష్టపడి పైకొచ్చిన ఇ.వి.వి. అప్పట్లో ఒక చిన్న గదిలో గడిపిన రోజులు నాకు గుర్తే. అమ్మానాన్నల్ని ఊరి నుంచి తీసుకొచ్చి, మద్రాసులో మేడ మీద ఒక చిన్న కొట్టాయమ్ (పర్ణశాల)లో ఇ.వి.వి. ఉంచిన రోజులు... దర్శకుడిగా తాను స్థిరపడ్డాక తన వాళ్ళందరినీ జీవితంలో కుదురుకొనేలా చేయడానికి  పడ్డ తపన... దగ్గర నుంచి చూశా. చిన్న రైతుగా నానా అవస్థలు పడిన నాన్నను వంద ఎకరాల ఆసామిగా చూడాలని, ఊళ్ళో పొలం కొని, వైట్ అండ్ వైట్ డ్రెస్, మారుతీ కారులో తిరగమంటూ తండ్రిని బంగారంలా చూసుకొన్నాడు.

చాలామంది హాస్యానికి పెద్దపీట వేస్తే, ‘ఎవడిగోల వాడిది’, ‘బురిడి’ లాంటి చిత్రాల కోసం కమెడియన్లందరినీ విదేశాలకు తీసుకువెళ్ళి, అక్కడ షూటింగ్ చేసేందుకు ‘పెద్ద ఫ్లయిటే’ ఇ.వి.వి. వేశాడు. నిజానికి, జంధ్యాల గారి దగ్గర పనిచేస్తున్న రోజుల నుంచి ఆర్ట్ ఫిల్మ్స్, ఎక్స్‌పరిమెంటల్ ఫిల్మ్స్ - ఇలా అన్ని రకాల కథలూ ఇ.వి.వి. తయారు చేసుకొనేవాడు. అంత సాధన చేశాడు కాబట్టే, ‘ఆమె’, ‘తాళి’, ‘కన్యాదానం’ లాంటి విభిన్నమైన సినిమాలు తీశాడు. టైటిల్ పెట్టడంలోనే కాదు... టైటిల్ కార్డుల్లో స్టోరీకి ‘అంతులేని కథ’ అనీ, డైలాగ్ రైటర్‌కి ‘కోతల రాయుడు’ అనీ వెరైటీగా చూపెట్టడంలోనూ ఇ.వి.వి.ది ప్రత్యేక ముద్ర. ఆయన ఎంత సౌందర్యారాధకుడంటే, సొంత ఇల్లు కట్టుకున్నాక, దేశదేశాల నుంచి రకరకాల చిత్రమైన వస్తువులు పట్టుకొచ్చి, ఇంటిని నింపేసి, అద్భుతమైన మ్యూజియమ్‌లా తీర్చిదిద్దాడు.

 ఇ.వి.వి.లోని గొప్ప లక్షణం ఏమిటంటే, రైటర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చేవాడు. రచయిత ఏ మంచి పదప్రయోగం చేసినా, మహదానందపడిపోయేవాడు. రైటర్ స్క్రిప్టు చదివి, వినిపించడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. తానే స్క్రిప్టు చదువుకొనేవాడు. స్క్రిప్టు చదువుతున్నప్పుడు ఆయన ముఖంలో కలిగే మార్పుల్ని బట్టి రైటర్‌గా పాసయ్యామో, లేదో తెలిసిపోయేది. ‘ఆ ఒక్కటీ అడక్కు’లో ‘గజ్జికి లేని దురద జాలిమ్ లోషన్‌కు ఎందుకు?’, ఇద్దరి పేర్లను కలిపేసి ‘దాసరి రాఘవేంద్రరావు’ లాంటి వినోద ప్రయోగాల్ని ఎంజాయ్ చేసేవారు.

ఎవరైనా, ఏదైనా కావాలని వస్తే ఇ.వి.వి. ‘లేదు... కుదరదు’ అనేవాడు కాదు. సంపా దించడం, అనుభవించడం, పంచిపెట్టడం, దాచిపెట్టడం - డబ్బుకున్న ఈ 4  లక్షణా లనూ ఆచరించిన వ్యక్తి ఆయన. అందులోనూ, మూడోది ఎక్కువగా తెలిసిన మనిషి. అందుకే, ఒక్కముక్కలో ఇ.వి.వి నా లాంటి ‘ఎందరికో (ఇ) వెలుగునిచ్చిన (వి) వ్యక్తి (వి)’.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement