సాజిద్‌ మాయాజాలం | England 267 all out in the first innings | Sakshi
Sakshi News home page

సాజిద్‌ మాయాజాలం

Published Fri, Oct 25 2024 4:00 AM | Last Updated on Fri, Oct 25 2024 4:00 AM

England 267 all out in the first innings

ఆరు వికెట్లతో రాణించిన పాక్‌ స్పిన్నర్‌

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 267 ఆలౌట్‌

89 పరుగులతో ఆదుకున్న జేమీ స్మిత్‌  

రావల్పిండి: ఇంగ్లండ్‌ బ్యాటర్ల బలహీనతపై పాకిస్తాన్‌ దెబ్బ కొట్టింది. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌ను రూపొందించి మూడో టెస్టులో శుభారంభం చేసింది. గురువారం మొదలైన మూడో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 68.2 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ స్పిన్నర్లు సాజిద్‌ అలీ, నోమన్‌ అలీ తమ స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. 

రావల్పిండిలోనూ ఈ ఇద్దరు మరోసారి ఇంగ్లండ్‌ను ఇబ్బంది పెట్టారు. ఆఫ్‌ స్పిన్నర్‌ సాజిద్‌ ఖాన్‌ 128 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... ఎడంచేతి వాటం స్పిన్నర్‌ నోమన్‌ అలీ 88 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మరో వికెట్‌ లెగ్‌ స్పిన్నర్‌ జాహిద్‌ మహమూద్‌కు లభించింది. ఒకదశలో ఇంగ్లండ్‌ జట్టు 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జేమీ స్మిత్‌ (119 బంతుల్లో 89; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) పాక్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగ చకచకా పరుగులు చేశాడు.

గుస్‌ అట్కిన్‌సన్‌ (39; 5 ఫోర్లు)తో కలిసి జేమీ స్మిత్‌ ఏడో వికెట్‌కు 105 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గౌరవప్రద స్కోరు అందించాడు. ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (52; 4 ఫోర్లు, 1 సిక్స్‌), జాక్‌ క్రాలీ (29; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 56 పరుగులు జత చేశారు. క్రాలీని నోమన్‌ అలీ అవుట్‌ చేశాక ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ తడబడింది. 

ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించింది. అబ్దుల్లా షఫీఖ్‌ (14; 1 ఫోర్‌), సయీమ్‌ అయూబ్‌ (19; 1 ఫోర్‌), కమ్రాన్‌ గులామ్‌ (3) అవుటయ్యారు. షాన్‌ మసూద్‌ (16 బ్యాటింగ్‌), సౌద్‌ షకీల్‌ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement