నేటి నుంచి పాక్, ఇంగ్లండ్ మూడో టెస్టు
ఉదయం గం. 10:30 నుంచి ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రత్యక్షప్రసారం
రావల్పిండి: పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి నుంచి నిర్ణయాత్మక మూడో టెస్టు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గగా... గురువారం నుంచి రావల్పిండిలో మూడో టెస్టు మొదలవుతుంది. పరుగుల వరద పారిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు... స్పిన్‌కు అనుకూలించిన రెండో టెస్టులో పరాజయం పాలైంది. దీంతో మూడో టెస్టు కోసం పాకిస్తాన్ జట్టు మరోసారి స్పిన్ పిచ్‌నే సిద్ధం చేసింది.
స్లో బౌలర్లకు సహకరించే విధంగా పొడి వికెట్‌ను తయారు చేసిన పాకిస్తాన్ గత నాలుగు రోజులుగా పిచ్‌ను ఆరబెట్టేందుకు ప్రత్యేకంగా భారీ ఫ్యాన్‌లు ఏర్పాటు చేసింది. రెండో టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్లు నోమాన్ అలీ, సాజిద్ ఖాన్ ఇద్దరే చెలరేగి ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్ చేసి 20 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్న నేపథ్యంలో... మరోసారి స్పిన్ బలంతోనే పాకిస్తాన్ ఫలితం రాబట్టాలని చూస్తోంది.
తొలి రోజు నుంచే బంతి గింగిరాలు తిరిగే అవకాశం ఉండటంతో మరోసారి టాస్ కీలకం కానుంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి... వారి స్థానంలో ఇతర ప్లేయర్లకు అవకాశం ఇచ్చిన తర్వాతే పాకిస్తాన్ రాత మారింది. అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్న కమ్రాన్ గులామ్‌పై అంచనాలు పెరిగిపోగా..కెప్టెన్ షాన్ మసూద్, అబ్దుల్లా షఫీఖ్, సౌద్ షకీల్, రిజ్వాన్ కలిసి కట్టుగా కదం తొక్కాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
మరోవైపు ఇంగ్లండ్ అదనపు స్పిన్నర్‌గా లెగ్‌స్పిన్నర్ రేహాన్ అహ్మద్‌ను బరిలోకి దించనుంది. తొలి టెస్టులో ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్‌తో పాటు జో రూట్, ఓలీ పోప్, బెన్ డకెట్, జాక్ క్రాలీ, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment