'అది దాటకూడదు కదా'
తనదైన యాసతో ‘చాలా బాగుంది’ సినిమాలో కడుపుబ్బ నవ్వించినా.. మధ్యతరగతి తండ్రి పాత్రలో ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో ఏడ్పించినా.. ఆవేశం పొంగే నటనతో ‘ఛత్రపతి’లో భారీ డైలాగులు చెప్పినా అది ఒక్క ఎల్బీ శ్రీరాంకే సాధ్యమవుతుంది. నవరసాలను అలవోకగా పండించే ఆయనలోని మరో ప్రత్యేక గుణం గొప్ప సాహిత్యం. అప్పుల అప్పారావు, హిట్లర్, అరుంధతి సినిమాలకు రచయితగా పనిచేసి ఎనలేని కీర్తిని గడించారు. స్వయం కృషితో సినీరంగంలో సుస్థిరస్థానం సంపాదించుకున్న శ్రీరాం ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహితీ పండితుడిగా, రచయితగా సమాజంలోని మార్పులను పరిశీలిస్తూనే.. విజయవాడలో అష్టావధాన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ వివరాలు..
సాక్షి : మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
ఎల్బీ శ్రీరాం : మా కుటుంబంలో అందరూ సాహితీవేత్తలే. నాటకరంగంతో సంబంధం ఉన్నవారే. నాలోని రచయితను సంతృప్తి పరచడానికే ఈ రంగంలోకి వచ్చాననుకుంటా. నాటకరంగం నుంచి వచ్చిన నాలోని ప్రతిభను గుర్తించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ.
సాక్షి : మీరు ఈ రంగంలో ఏం నేర్చుకున్నారు?
ఎల్బీ శ్రీరాం : ప్రతి సందర్భంలోనూ పరిస్థితుల ప్రకారం ‘నన్ను నేను మలచుకోవడం’ నేర్చుకున్నాను.
సాక్షి : మీరు, నటుడు, దర్శకుడు, మాటల రచయిత కదా.. రంగస్థలాల్లో మీకు ఏ పాత్ర వీలుగా ఉంటుంది?
ఎల్బీ శ్రీరాం : నటుడిగా పాత్రలో నటిస్తాను. రచయితగా సమాజంలోని మార్పులను గమనిస్తున్నాను. ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో వర్తమాన సమాజంలో మధ్య తరగతి కుటుంబానికి ప్రతీక నా పాత్ర. నేను 40 సినిమాలకు మాటలు రాశాను. 400 సినిమాల్లో నటించాను.
సాక్షి : నేటి హాస్యంపై మీ కామెంట్
ఎల్బీ శ్రీరాం : సభ్యతకు, అసభ్యతకు మధ్య లక్ష్మణరేఖ. అది దాటకూడదు కదా..
సాక్షి : ఓ సాహితీవేత్తగా తెలుగు అంతరించిపోతోందన్న భావనను అంగీకరిస్తారా..
ఎల్బీ శ్రీరాం : భాష నిత్యనూతనం. తెలుగు పరభాషలో కలిసిపోతూ జీవనవాహినిలో కలిసిపోతోంది.
సాక్షి : మీరు కొత్తగా షార్ట్‌ఫిల్మ్ రంగంలోకి ప్రవేశించారని అంటున్నారు. నిజమేనా?
ఎల్బీ శ్రీరాం : నిజమే.. యువతతోపాటు అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్న రంగం షార్ట్ ఫిల్మ్స్. మూడు గంటల్లో వివరించే అంశాన్ని కొద్ది సమయంలో భావ యుక్తంగా వివరించవచ్చు.
సాక్షి : మీ లైబ్రరీ గోడ మీద రాసిన వ్యాఖ్య ఏమిటి?
ఎల్బీ శ్రీరాం : ఈ రంగంలోని ప్రవేశించి 40ఏళ్లు అవుతోంది. నా జీవితంలోని అనేక దశల ఫొటోలు కనిపిస్తాయి. నా గమ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.. ‘గమ్యం కాదు-ఆ ప్రయాణం నాకిష్టం’ అని రాసి ఉంటుంది.
సాక్షి : అరుంధతి, హిట్లర్, అప్పుల అప్పారావు. మూడు విభిన్నమైన కథాంశాలకు మాటల రచయితగా పనిచేశారు. ఎలా సాధ్యమైంది?
ఎల్బీ శ్రీరాం : రచయితలు కథలో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది.