screenwriter
-
మందు తాగితే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు: సినీరచయిత
మందుకు బానిసగా మారి తన జీవితంలో పదేళ్లు వృథా చేసుకున్నానంటున్నాడు సినీరచయిత జావేద్ అక్తర్. ఒకప్పుడు తాగుడుకు బానిసైన ఈయన తర్వాత ఆల్కహాల్ మానేశాడు. తాజాగా అతడు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అదేంటో గానీ తాగితే నేను నేనులా ఉండను. ఈ మందు బాటిల్స్‌లో ఏం కలుపుతారో కానీ అది తాగగానే కోపంగా మారిపోతాను. నాలో మృగం బయటకు..అంత కోపంతో నేనెప్పుడూ ఊగిపోను. కానీ తాగినప్పుడు మాత్రం నాకు తెలీకుండానే ప్రమాదకరంగా మారిపోతాను. నాలోని ఓ రాక్షసుడు బయటకు వస్తాడు. మందు మానేయడం నేను చేసిన మంచిపనుల్లో ఒకటి. 1991 జూలై 31న చివరిసారిగా తాగాను. అప్పటినుంచి ఇప్పటివరకు దాని జోలికే వెళ్లలేదు. కానీ యుక్తవయసులో మందుకు బానిసవ్వకుండా ఉండాల్సింది. మద్యపానానికి అలవాటు పడి నా జీవితంలో దశాబ్దకాలం వృథా చేసుకున్నాను.సమయం వృథా చేసుకున్నాఫ్రెంచ్, పర్షియన్ వంటి భాష నేర్చుకోవడమో, సంగీతం నేర్చుకోవడమో.. ఇలా ఏవైనా కొత్తగా ప్రయత్నించాల్సింది. కానీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఈయన చివరగా గతేడాది వచ్చిన ద ఆర్చీస్, డుంకీ, కో గయే హమ్ కహాన్ వంటి చిత్రాలకు పాటరచయితగా పని చేశాడు.చదవండి: 70కి పైగా ఆడిషన్స్.. కాంప్రమైజ్ అడగడంతో ఏడ్చేశా: హీరోయిన్ -
తండ్రిగా ప్రమోషన్ పొందిన తెలుగు సినీ రచయిత, ఫోటో వైరల్
ప్రముఖ సినీ రచయిత గోపీ మోహన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య ప్రవీణ శుక్రవారం నాడు పండంటి బాబుకు జన్మనిచ్చింది. భార్యాబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. తన కొడుకును చేతుల్లోకి తీసుకుని ముచ్చటపడిపోతున్న గోపీ మోహన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ హరీశ్ శంకర్, సాయి రాజేశ్, నటుడు రాహుల్ రవీంద్రన్, వరుణ్ సందేశ్ సహా పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా సినిమాల మీద ఆసక్తితో మొదట డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడు గోపీ మోహన్. నువ్వునేను సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సంతోషం చిత్రానికి తనే స్వయంగా స్క్రీన్‌ప్లే అందించాడు. వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్షా, లక్ష్యం, ఝుమ్మంది నాదం, గ్రీకు వీరుడు, ఓ బేబీ వంటి సినిమాలకు రచయితగా పని చేశాడు. రెడీ, కింగ్, నమో వెంకటేశ, దూకుడు, బాద్షా చిత్రాలకు కథ అందించింది కూడా ఆయనే. Thank you so much brother @itsvarunsandesh 😊❤️ https://t.co/djiBMdBKq6 — Gopi Mohan (@Gopimohan) February 25, 2023 -
విషమంగా 'ఆ నలుగురు' రచయిత ఆరోగ్యం
"ఆ నలుగురు" చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు మదన్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. "పెళ్లయిన కొత్తలో" చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మదన్ స్వస్థలం మదనపల్లి. సినిమాల మీద ఆసక్తితో ఎస్.గోపాల్‌రెడ్డి దగ్గర అసిస్టెంట్ కెమెరామన్‌గా చేరారు. అలా మనసంతా నువ్వే సినిమాకు పని చేశారు. పెళ్లైన కొత్తలో మూవీతో దర్శకుడిగా మారారు. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. చదవండి: మరో విషాదం, నటి మృతి -
'నా పేరు సూర్య..' సినిమా జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాల్సింది!
సినీ రచయితగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వక్కంతం వంశీ. టాలీవుడ్‌కు ఎన్నో హిట్ సినిమాలు అందించిన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా కిక్ అని చెప్పాడు. ఓసారి టెంపర్ ఐడియా తారక్‌కు చెప్పగా.. దానికి నేను సూటవుతానా? అని అతడు అడిగాడు.. అలా జూనియర్ ఎన్టీఆర్‌తో టెంపర్ చేశానని పేర్కొన్నాడు. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు మొదటగా జూనియర్ ఎన్టీఆర్‌నే హీరోగా అనుకున్నట్లు తెలిపాడు. తారక్‌తో ఆ సినిమా చేయాల్సిందని, ఆయనే తనను దర్శకుడిని చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది బన్నీ చేతిలోకి వెళ్లిందన్నాడు. ఇకపోతే ప్రస్తుతం అతడు ఏజెంట్ సినిమాకు రైటర్‌గా పని చేస్తుండగా ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. చదవండి: అది మాటల్లో చెప్పలేను: గౌతమ్ ఘట్టమనేని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మాజీ ప్రపంచ సుందరి -
వెటరన్ స్క్రీన్ రైటర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
Veteran Screenwriter John Paul Puthussery Passed Away At 72: ప్రముఖ బహుముఖ కథా రచయతి జాన్ పాల్ పుతుస్సేరి కన్నుమూశారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. 72 ఏళ్ల జాన్ పాల్ గత రెండు నెలలుగా చికిత్స తీసుకుంటూ శనివారం (ఏప్రిల్ 23) మరణించారు. జాన్ పాల్ మృతిపట్ల కేరళ విద్యాశాఖ మంత్రి శివన కుట్టి సంతాపం వ్యక్తం చేశారు. మలయాళం ఇండస్ట్రీలో వెటరన్ స్క్రీన్ రైటర్‌గా పేరొందిన జాన్ పాల్ సుమారు 100కుపైగా సినిమాలకు పనిచేశారు. 1980లో స్టార్ డైరెక్టర్ భరతన్ దర్శకత్వం వహించిన 'చమరం' సినిమాతో జాన్ పాల్ స్క్రీన్ ప్లే రైటర్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత పాలంగల్, ఓరు మిన్నమినుంగింటే నురుంగు వెట్టం, యాత్రా వంటి క్లాసిక్ చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. డ్రామా, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ వంటి వివిద రకాల జోనర్లకు ఆయన పనిచేశారు. బాలు మహేంద్ర, జోషి, శశి, సేతు మాధవన్ వంటి తదితర డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. శశి దర్శకత్వం వహించిన వెల్లతూవల్ (2009) సినిమా తర్వాత 10 ఏళ్లు కేరీర్ పరంగా సుధీర్ఘ విరామం తీసుకున్నారు. మళ్లీ 2019లో కమల్ డైరెక్ట్ చేసిన ప్రణయామీనుకలుడే కాదల్ సినిమాకు స్క్రిప్ట్ రాయడంతో రీఎంట్రీ ఇచ్చారు. చదవండి: ఇండియాకు వచ్చిన విల్‌స్మిత్.. అతని కోసమేనా ? ఫొటోలు వైరల్.. ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైంపాస్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అపర్ణ సినీ ప్రపూర్ణ
తండ్రి సినిమా క్రిటిక్, తల్లి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ దంపతుల పదేళ్ల కూతురు..ఓ రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ..‘‘అమ్మా నేను భవిష్యత్‌లో మంచి నటిని కాబోతున్నాను’ అని చెప్పింది. తల్లిదండ్రులు ఇద్దరూ సినీపరిశ్రమతో సంబంధాలు ఉన్నవారే అయినప్పటికీ తమ చిన్నారి చెప్పిన బుజ్జిబుజ్జి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అ చిన్నారి పదహారేళ్లకే సత్యజీత్ రే సినిమాలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు ఆరంభమైన అపర్ణాసేన్ ప్రయాణం నటిగా, దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా... ఎడిటర్‌గా అంచలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్ వ్యక్తుల జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ ‘ద రేపిస్ట్’ సినిమా తీసి ప్రతిష్టాత్మక ‘కిమ్ జిసెక్’ పురస్కారాన్ని అపర్ణ గెలుచుకున్నారు. అనేక అంతర్జాతీయ చిత్రాలతో పోటీ పడి ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును దక్కించుకోవడం విశేషం. కుమార్తె కొంకణసేన్ శర్మతో అపర్ణాసేన్ అప్పటి కలకత్తాలోని బెంగాలీ దంపతులు చిదానంద్ దాస్‌గుప్తా, సుప్రియ దాస్‌గుప్తాలకు 1945లో అక్టోబర్ 25న అపర్ణ జని్మంచింది. ఆమె బాల్యం అంతా కలకత్తాలోనే గడిచింది. బిఏ(ఇంగ్లిష్) డిగ్రీ పూర్తిచేసింది. 1961లో మ్యాగ్నమ్ ఫోటోగ్రాఫర్ బ్రేయిన్ బ్రాకేను కలిసిన అపర్ణ అతను తీస్తోన్న మాన్సూన్ సీరిస్‌లో నటించింది. పదహారేళ్లకే మోడల్‌గా మారిన అపర్ణ ..ఈ అనుభవంతో సత్యజీత్రే నిర్మించిన తీన్ కన్యలో మూడో భాగం ‘సమాప్తి’ లో నటించింది. ఈ సినిమాలో అపర్ణాకు మంచి గుర్తింపు లభించింది. మరోపక్క తన చదువును కొనసాగిస్తూనే కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ బిఏ(ఇంగ్లిష్) చదివింది. సమాప్తి తర్వాత ‘బక్సాబాదరల్’, ‘ఆకాశ్ కుసుమ్’లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేదు. తరువాత నటించిన ‘అపరాజితో’ మంచి కమర్షియల్ హిట్‌ను అందించింది. ఒక పక్క సినిమా, మరోపక్క థియేటర్లలో నటిస్తూ సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తరువాత సత్యజీత్ రే నిర్మించిన అనేక సినిమాల్లో నటించింది. రేకు వారసురాలిగా.. అపర్ణ తండ్రి సత్యజిత్ రేలు మంచి స్నేహితులు కావడం, వల్ల రేకు సన్నిహితంగా పెరిగిన అపర్ణ ...తన మొదటి సినిమా కూడా రే దర్శకత్వం వహించడంతో..ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయనలా విభిన్న సినిమాలు తీయడం ప్రారంభించింది. రాజకీయాలు, వివిధ రకాల మానవ సంబంధాలపై అపర్ణా అనేక సినిమాలు నిర్మించారు. 1981లో విడుదలైన ‘36 చౌరంగీ లేన్’ అనే ఇంగ్లిష్ సినిమాతో అపర్ణాకు రచయితగా, డైరెక్టర్‌గా గుర్తింపు లభించింది. అపర్ణ సిని పరిశ్రమకు చేసిన కృషికి గాను 1986లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బెస్ట్ డైరెక్టర్ నేషనల్ అవార్డులను అందుకుంది. జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జ్యూరీగా వ్యవహరించడమేగాక అనేక లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. 2009లో ‘అంతహీన్’ లో నటించగా ..ఈ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ లుకింగ్ ఉమెన్.. బెస్ట్ లుకింగ్ ఇండియన్ ఉమెన్ జాబితాలో నిలిచిన అపర్ణ..నటిగా, దర్శకురాలిగా ఎదిగినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులకు లోనయ్యారు. అయినప్పటికీ తన ఇద్దరు కూతుర్లు, మనవ సంతానంతో ఆమె ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం బెంగాల్లో బాగా పాపులర్ అయిన మహిళా మ్యాగజీన్ ‘సనంద’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాగజీన్ లో సామాజిక సమస్యలపై ఆమె ఎడిటోరియల్స్ రాస్తున్నారు. ద రేపిస్ట్.. ఈ సినిమాను పదిహేనేళ్ల క్రితమే తియ్యాలని అపర్ణాసేన్ అనుకుంది. ఆ తరువాత భారత్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను గమనిస్తూ ఉండేది. ఎవరూ కూడా పుట్టుకతో రేపిస్ట్ కారు. చిన్నప్పుడు అమాయకంగా ఉండే అబ్బాయిలు యవ్వనంలోకి వచ్చాక వారిలో ఎందుకు అత్యాచార మనస్తత్వం ఏర్పడుతుంది? రేపిస్ట్‌గా ఎలా మారుతున్నారు? ఇది కేవలం సమాజంలో ఉన్న అసమానతలు, లేదా జన్యువుల వల్ల జరుగుతోందా? ఇటువంటి ప్రశ్నలు అపర్ణ మనసులో మెదిలాయి. కానీ వేటికీ జవాబు దొరకలేదు. వీటన్నింటికి జవాబులు అన్వేషించే క్రమంలోనే ‘ద రేపిస్ట్’ సినిమా తీశారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో పుస్తకాలు చదివారు, అనేక మంది లాయర్లు, ఫెమినిస్టులు, స్నేహితులతో కలిసి చర్చించి తన కూతురు, ప్రముఖ నటి కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రధారిగా సినిమాను తీశారు. ఇప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా తీయడం, దానికి అంతర్జాతీయ అవార్డు వరించడంతో..75 ఏళ్ల వయసులోనూ తన ప్రతిభను నిరూపించుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
బతుకు పాఠాలు చదివిన రచయిత
రచయితగా, నటుడిగా, దర్శకుడిగా సినీ, నాటక రంగాలపై చెరగని ముద్ర వేసిన పినిశెట్టి శ్రీరామమూర్తి 1985 ఏప్రిల్ 15న కన్నుమూశారు. సినీ నాటక రంగాలు ఉన్నంత వరకు ఆయన చిరస్మరణీయుడు. బతుకు పాఠాలు చదివిన రచయిత.. డిసెంబర్ 30 పినిశెట్టి శ్రీరామమూర్తి శతజయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. సహజ ప్రతిభావంతుడు పినిశెట్టి శ్రీరామమూర్తి. నాటకం, నవల, కథ వంటి సాహితీ ప్రక్రియలను తన రచనలతో సుసంపన్నం చేసిన రచయిత ఆయన. ఆనాటి ప్రతిష్ఠాత్మకమైన సాహితీ పత్రిక ‘భారతి’లో 1940 ప్రాంతాల్లో ఆయన రచనలు ప్రచురితమై, పండితుల దృష్టిని ఆకర్షించాయి. ‘భారతి’లో ప్రచురితమైన కథలను ఏరి కూర్చి, 1946లో ‘సవతితల్లి’ కథాసంపుటిని ప్రచురించారు. గ్రామీణ నేపథ్యంలో ఆయన రాసిన నాటకాలు ప్రజామోదం పొందాయి. ఆయన నాటకాలకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఆంధ్ర నాటక పరిషత్’ పురస్కారాలు లభించాయి. నాటకరంగం మీదుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన వారిలో పినిశెట్టి శ్రీరామమూర్తి కూడా ఒకరు. నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా ప్రేక్షకుల మన్ననలు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి ఆయన. పినిశెట్టి శ్రీరామమూర్తి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 1920 డిసెంబర్ 30న జన్మించారు. ఆయన తల్లి అమ్మణ్ణమ్మ గృహిణి, తండ్రి వెంకటరత్నం కోర్టు అమీను. బాల్యంలోనే రెండేళ్ల వయసులో ఉండగా, తల్లి మరణించింది. ప్రాథమిక పాఠశాలలో చదుకుంటుండగా, పినిశెట్టి తెలివితేటలను గుర్తించిన ఉపాధ్యాయులు ఒకటో తరగతి నుంచి నేరుగా మూడో తరగతికి ప్రమోట్ చేశారు. తండ్రి ఉద్యోగ విరమణతో ఆయన చదువు ప్రాథమిక పాఠశాలతోనే ఆగిపోయింది. పెదతల్లి సలహాతో వ్యవసాయం, టైలరింగ్ నేర్చుకున్నా సంతృప్తి కలగలేదు. తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివేవాడు. ఆయన ఉన్నత పాఠశాలలో చదవకున్నా, జీవిత పాఠశాలలో కష్టాలూ కన్నీళ్లూ బాధలూ వేదనలూ సహాధ్యాయులుగా, సహనం, సంయమనం, తాత్త్వికతలు గురువులుగా ఆయన జీవిత ప్రస్థానం సాగింది. పినిశెట్టి గురించి, ‘పాఠ్యపుస్తకాలు చదవని రచయిత. బతుకు పాఠాలు చదివిన నాటక సినీ రచయిత జీవన కథనం స్ఫూర్తిదాయకం’ అని ప్రముఖ విమర్శకుడు కిరణ్‌ప్రభ ప్రశంసించారు. ఆధునిక తెలుగు నాటక రచనలో పినిశెట్టి ముద్ర ప్రత్యేకం. గ్రామీణ జీవన నేపథ్యంలో సాగేవి ఆయన నాటకాలు. 1944లో ‘ఆదర్శజ్యోతి’ నాటకాన్ని రాసి, ‘ఆదర్శ నాట్యమండలి’ ద్వారా ప్రదర్శించి, నటించి ప్రశంసలు పొందారు. ఆయన 1949లో ‘పల్లెపడుచు’ నాటకం రాశారు. ఆ నాటకాన్ని ‘ఆంధ్ర కళాపరిషత్’ ఆధ్వర్యాన 1950లో కాకినాడలో ప్రదర్శించగా, ఉత్తమ నాటక బహుమతి పొందింది. ఆ నాటకంలో ఆదర్శ రైతు సూరయ్య పాత్ర ధరించిన రచయిత, ఉత్తమ నటుడిగా కూడా బహుమతి పొందారు. ఆనాటి కార్యక్రమానికి ప్రముఖ హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ ముఖ్యఅతిథిగా హాజరై, బహుమతి ప్రదానం చేశారు. అద్భుతమైన సంభాషణలతో కూడిన ‘పల్లెపడుచు’ నాటకాన్ని ప్రదర్శించని పల్లెటూరు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదని రంగస్థల ప్రముఖుడు డాక్టర్ చాట్ల శ్రీరాములు ఒక సందర్భంలో చెప్పారు. ఆ నాటకం అప్పట్లోనే ఏడు ముద్రణలు పొందిందంటే, ఎంతగా ఆనాటి పాఠకులను, ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పినిశెట్టికి పేరు తెచ్చిపెట్టిన నాటకాల్లో ‘అన్నాచెల్లెలు (1952), స్త్రీ పాత్ర లేని ‘ఆడది’ (1952), ‘కన్నకొడుకు’ (1956) వంటివి ముఖ్యమైనవి. పినిశెట్టి 1954లో సినీరంగంలోకి అడుగు పెట్టారు. సినిమారంగంలో ప్రవేశించిన సంవత్సరంలోనే ఆయన రాసిన రెండు నాటకాలు సినిమాలుగా రూపొందాయి. వాటికి ఆయనే సంభాషణలు రాశారు. సినీరంగంలో కొనసాగుతూనే, నాటక ప్రేక్షకుల కోరిక మేరకు 1963లో ‘పంజరంలో పక్షులు’ నాటకం రాశారు. ఈ నాటకాన్ని 1968లో పుస్తకరూపంలో ముద్రించి, ఆ నాటకంలో ప్రధాన పాత్రధారి, ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావుకు అంకితం చేశారు. పినిశెట్టి సినీ ప్రస్థానం బీఏ సుబ్బారావు దర్శకత్వంలోని ‘రాజు–పేద’ (1954) సినిమాతో మొదలైంది. ఆ సినిమాకు ఆయన సంభాషణలు రాశారు. అదే ఏడాది ఆయన నాటకం ‘పల్లెపడుచు’ను బోళ్ల సుబ్బారావు సినిమాగా నిర్మించారు. ఆయన రాసిన ‘అన్నాచెల్లెలు’ నాటకం తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘పరివర్తన’గా అదే ఏడాది వెండితెరపై విడుదలైంది. ఆ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి ఆనాటి అగ్ర నటీనటులు నటించారు. పినిశెట్టి ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడంతో పాటు దర్శకత్వం వహించారు. తోట కృష్ణమూర్తి నిర్మించిన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ‘సంతానం’, ‘ఇలవేల్పు’, ‘రామాలయం’, ‘బంగారు గాజులు’ వంటి దాదాపు అరవై సినిమాలకు సంభాషణలు రాశారు. ‘చిలకా గోరింక’, ‘గృహలక్ష్మి’ వంటి సినిమాల్లో హాస్యపాత్రలు పోషించారు. అప్పట్లో సినిమా పత్రికలు ఆయనను ‘స్వతంత్ర చిత్రరచనా చక్రవర్తి’గా అభివర్ణించాయి. పినిశెట్టి శ్రీరామమూర్తి పెద్దకొడుకు రవిరాజా పినిశెట్టి ప్రముఖ దర్శకుడు. రవిరాజా 1980లో దర్శకత్వం వహించిన ‘వీరభద్రుడు’ సినిమాకు కూడా పినిశెట్టి శ్రీరామమూర్తి మాటలు రాశారు. ఆయన మనవడు ఆది పినిశెట్టి హీరోగా సినీరంగంలో కొనసాగుతున్నారు. - డాక్టర్ పీవీ సుబ్బారావు -
రెండో పెళ్లికి రెడీ అవుతున్న ప్రముఖ స్క్రీన్ రైటర్
బాలీవుడ్ ప్రముఖ స్క్రీన్ రైటర్లు కనికా ధిల్లాన్, హిమాన్షు శర్మ గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళ మధ్య ఉన్న ప్రేమను రెట్టింపు చేసుకునేందుకు ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ మేరకు ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను కనికా తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. 'జడ్జిమెంటల్ హై క్యా', 'మన్మర్జియాన్' సినిమాలకు రచయితగా పని చేసిన కనికాకు గతంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడితో వివాహం జరిగింది. (చదవండి: హిమాంశు, నేనూ విడిపోయాం: స్వరభాస్కర్) ప్రకాష్ దర్శకుడిగా ‘అనగనగా ఓ ధీరుడు’ అనే ఫాంటసీ మూవీ తీసి ఘోరంగా విఫలం అయ్యాడు. ఆ తరువాత ‘జీరో సైజ్’ కూడా అతనికి పెద్దగా పేరు తీసుకురాలేదు. అయితే కొంతకాలానికి కనికా, ప్రకాష్ విడిపోయారు. రియల్ లైఫ్‌లో విడిపోయినా రీల్ లైఫ్‌లో మాత్రం కలిసి పని చేసేవారు. అలా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించగా, కనికా కథను అందించారు. ఇక హిమాన్షు విషయానికి వస్తే.. తను 'వెడ్స్ మను', 'రాణీజానా', 'జీరో' చిత్రాలకు కథ అందించిన ఆయన నటి స్వరభాస్కర్‌తో కొంత కాలం ప్రేమాయణం నడిపారు. అయితే ఇద్దరు దారులు వేరని తెలుసుకుని ఆ బంధానికి ముగింపు పలికారు. (చదవండి: మూడు పువ్వులు... ఆరు కాయలు) View this post on Instagram A post shared by Kanika Dhillon (@kanika.d) -
ఆ మాట ఆస్కార్‌తో సమానం
‘‘ప్రతి రచయితకూ ఓ విజన్ ఉంటుంది. ఆ విజన్‌ని తెరపైకి ఎక్కించడంలో ఓ కిక్ ఉంటుంది. రచయితలు రాసిన కొన్ని కథలు ఒక్కోసారి దర్శకులకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు నిర్మాతలను ఒప్పించి మేమే దర్శకత్వం చేయాలి. మా విజన్‌ని అప్పుడే తెరపై చూపించగలం.. అందుకే నేను రచయిత నుంచి డైరెక్టర్‌గా మారాను’’ అన్నారు శ్రీధర్ సీపాన. ‘నమో వెంకటేశ, అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం, డిక్టేటర్’ వంటి పలు చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీధర్ సీపాన ‘బృందావనమది అందరిది’ చిత్రంతో దర్శకునిగా మారారు. బుధవారం ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ‘బృందావనమది అందరిది’ నా తొలి సినిమా. ఆ చిత్రానికి నా స్నేహితులు శ్రీనివాస్ వంగాల, ప్రభాకర్ నిర్మాతలు. వారికి ఇండస్ట్రీ కొత్త కావడంతో ప్రొడక్షన్ పనులూ నేనే చూసుకున్నాను. దర్శకుడిగా నా రెండో సినిమా చిరంజీవిగారి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఉంటుంది. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది. జీఏ 2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తారు. కల్యాణ్ దేవ్ సినిమా విడుదల తర్వాతే ‘బృందావనమది అందరిది’ చిత్రం విడుదలవుతుంది. కరోనాకి ముందు ‘ఆచార్య’ కోసం కొరటాల శివగారితో కలిసి చిరంజీవిగారితో స్క్రిప్ట్ వర్క్‌లో పాల్గొన్నాను. అప్పుడు కల్యాణ్ దేవ్‌తో తీసే కథని చిరంజీవిగారు, కొరటాలగారు విని బాగా ఎంజాయ్ చేశారు. ‘కథ విన్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను’ అని చిరంజీవిగారు చెప్పారు. ఆ మాటతో ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందం దక్కింది. డైరెక్టర్‌గానే కాదు.. రచయితగానూ కొనసాగుతాను. ప్రస్తుతం డైరెక్టర్ కె.రాఘవేంద్రరావుగారి సినిమాకి, అనిల్ సుంకరగారి ప్రొడక్షన్లో ఓ సినిమాకి డైలాగులు రాస్తున్నాను. మరో రెండు మూడు సినిమాలకు చర్చలు జరిగాయి. ఓ వెబ్ సిరీస్ రెండు మూడు రోజుల్లో ఫైనల్ అవుతుంది’’ అన్నారు. -
‘బాహుబలి’ అభిమానులకు చేదువార్త
వెండితెరపై సంచలనాలు సృష్టించిన బాహుబలి సిరీస్ ఇక కొనసాగదా? అంటే అవుననే అంటున్నారు రచయిత కేవీ విజయేంద్రప్రసాద్. ‘బాహుబలి 3’ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో మూడో భాగం తెరకెక్కిస్తారని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘బాహుబలి కథ ముగిసింది. మూడో భాగం లేదు. నేను, మా అబ్బాయి రాజమౌళి దీని గురించి ప్లాన్ చేయడం లేదు. ఈ పాయింట్ గురించి నేనేమీ రాయడం లేదు. అయితే కామిస్ సిరీస్, టీవీ మాధ్యమం ద్వారా బాహుబలి లెగసీ కొనసాగుతుంద’ని పీటీఐతో చెప్పారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ‘బాహుబలి 3’ ఉండదని ఇంతకుముందు వెల్లడించారు. బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ... బాహుబలి 3 కోసం కథ రెడీగా లేకుండా ప్రేక్షకులను మోసం చేయలేనని అన్నారు. అయితే ఏదో ఒక రూపంలో బాహుబలి సిరీస్ కొనసాగుతుందని చెప్పారు. బాహుబలి మొదటి రెండు భాగాలు ఘన విజయం సాధించిన నేపథ్యంలో దీనిపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే బాహుబలి 3 ఉండదన్న వార్త అభిమానులకు నిరాశ కలిగించేదే. -
హౌ టు మేక్ ఏ మూవీ!
హ్యూమర్‌ప్లస్ ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సుని మూడేళ్లు చదివి, తెలుగులో సినిమా తీసి, జన్మభూమికి సేవ చేద్దామని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాడు. ఎంబిఏ చదివిన ఒక కుర్రాడ్ని పిఏగా పెట్టుకుని రంగంలోకి దిగాడు. ఎన్ఆర్ఐ చెప్పిన ప్రతిదానికి సూపర్ సార్ అనడం వల్ల ఆ పిఏ బాగా నచ్చాడు. జీవితంలో పైకి రావాల్సిన వాడికి ఉండాల్సిన ప్రధాన లక్షణమిది. ఒక్కోసారి ఎన్ఆర్ఐ ఏమీ చెప్పకపోయినా మనవాడు సూపర్ అని ముందే అనేసేవాడు. కృష్ణానగర్ జంక్షన్‌లోనూ, మణికొండ భీమాస్ హోటల్ దగ్గర కనిపించే కుర్రాళ్లని అసిస్టెంట్ డెరైక్టర్లు, కో-డెరైక్టర్లు, కథారచయితలుగా తీసుకోడానికి ఎన్ఆర్ఐ ఇష్టపడలేదు. పేపర్లో యాడ్స్ ఇచ్చి, ఎంట్రెన్స్ టెస్ట్‌లు పెట్టి సెలెక్ట్ చేశాడు. టీం మొత్తాన్ని ఒక హోటల్లో సమావేశపరిచి ఎన్ఆర్ఐ మైక్ తీసుకున్నాడు. ‘ఈ ప్రపంచం మొత్తం భౌతిక రసాయనిక సూత్రాలపైనే ఆధారపడి ఉంది. సినిమా తీయడం ఫిజిక్స్, చూడడం కెమిస్ట్రీ. ఈ రెంటిని మనం మ్యాచ్ చేయాలి. అదేవిధంగా ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అసలు జీవితమే మాథ్స్ టెక్ట్స్ బుక్లాంటిది. అందులో ఉన్నన్ని ప్రాబ్లమ్స్ ఇంకెక్కడా ఉండవు. ప్రపంచంలో ఎక్కడైనా రెండు రెళ్లు నాలుగే తప్ప ఎనిమిది కాదు. అందువల్ల మొదటిసారిగా సినిమాలకి సాలిడ్ ఫిజిక్స్, లిక్విడ్ కెమిస్ట్రీ, కన్ఫ్యూజ్డ్ ట్రిగనామెట్రీ, యానిమల్ ఆల్జీబ్రా ఇవన్నీ అప్లయ్ చేయబోతున్నాను. సినిమా కథ ఏమిటంటే ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఫిజికల్ అని నమ్మే ఒక యువకుడు, ఎనర్జీ మీన్స్ నథింగ్ బట్ కెమికల్ రియాక్షన్ అని నమ్మే ఓ అమ్మాయి. వీళ్ల మధ్య ప్రేమ ఏర్పడుతుంది. చివరికి ప్రేమ ఒక టర్నింగ్ పాయింట్, పెళ్లి ఒక బాయిలింగ్ పాయింట్ అని ఇద్దరూ కొత్త థియరీ కనిపెడతారు. మధ్యలో ఒక విలన్. రైలు పట్టాలు ఎప్పటికైనా కలుస్తాయనేది వాడి ఫిలాసఫి. పగలంతా ఎడమొహం పెడమొహంగా ఉండే భార్యాభర్తలు రాత్రి ఒకటిగా కలిసిపోవడం ఫిజికల్ కెమిస్ట్రీ ప్రకారం ప్రూవ్ అయినపుడు, రైలు పట్టాలు కలవడం మెటలాజికల్ ఫిజిక్స్ వల్ల సాధ్యమేనని నమ్ముతూ ఇంట్లో కొన్ని గాజుపాత్రల్లో సూరేకారం, నల్లకారం, కొరివికారం అన్నీ కలియదిప్పుతూ కింద మంట పెడుతూ ఉంటాడు. చివరికి ఒక రోజు గాజు పాత్రలు పేలిపోవడంతో నిర్వికారంగా మారిపోతాడు..’’ ‘‘సూపర్ సార్’’ చప్పట్లు కొట్టాడు పిఏ. ‘‘కథ ఇంకా పూర్తి కాలేదు’’ ‘‘అక్కర్లేదు, మెతుకు చూస్తే చాలు’’ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రతిదీ ఆర్కిమెడీస్, న్యూటన్, పైథాగరస్ తదితరుల సూత్రాల ప్రకారమే జరిగింది. హీరో హీరోయిన్ల మధ్య ఎంత దూరం ఉండాలో టేప్‌తో కొలిచి మరీ చూపించేవాడు ఎన్ఆర్ఐ. లైటింగ్ ఎంత ఉండాలో ఫిజిక్స్ ప్రొఫెసర్ల సలహాలు తీసుకునేవాడు. హీరోయిన్ ఏడ్చే సీన్లో, అసలు కళ్లలోనుంచి కన్నీళ్లు రావడానికి శరీరంలో ఎన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయో చార్ట్ వేసి చూపించాడు. దాంతో ఆ అమ్మాయి భోరుమని ఏడ్చింది. మానిటర్ని ఏ కంటితో చూస్తే పారడాక్స్ దోషం ఉండదో కెమెరామన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకి రెండురోజులు డయేరియా పట్టుకుంది. ప్రతి టేక్‌లోనూ పిఏ అదును తప్పకుండా ‘సూపర్ సార్’ అని అరిచేవాడు. సినిమా రిలీజైంది. పిఏకి ఎన్ఆర్ఐ ఫోన్ చేశాడు. ‘‘థియేటర్ల దగ్గర తొక్కిసలాట జరుగుతోంది సార్’’ ‘‘సూపర్’’ అని అరిచాడు ఆన్ఆర్ఐ. ‘‘తొక్కిసలాట టికెట్లకోసం కాదు, థియేటర్ నుంచి బయటికి రావడానికి’’రివ్యూ మీటింగ్ పెట్టాడు ఎన్ఆర్ఐ. ‘‘ప్రతిదీ సూత్రప్రకారమే తీసినా సినిమా ఎందుకు పోయింది?’’‘‘అందుకే పోయింది’’ అన్నాడు పిఏ. ‘‘ఎవడైనా మునిగిపోతున్నప్పుడు సూపర్ అని ఎంకరేజ్ చేయడం తెలుగువాళ్ల అలవాటు. ఈ దేశంలో లేక మీకీ విషయం తెలియలేదు. అయినా తెలుగు సినిమాల్లో హీరో కొడితే ఇరవైమంది గాల్లోకి లేస్తారు. కరెంట్ స్తంభాలు విరిగిపోతాయి. రజనీకాంత్ కొడితే రైలు పెట్టెలు కూడా అడ్డంగా చీలిపోతాయి. ఫిజిక్స్ ప్రకారం ఒక మనిషి బరువు, ద్రవ్యరాశి, క్షితిజక్షేత్రం, గరిమనాభి అంటే ఇక్కడ భిక్షాందేహి అనుకోవాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ దేనికీ అందదు తెలుగు సినిమా. ఇదొక మిస్టరీ.’’ విమానం టికెట్ దొరక్కపోతే ముంబయి వరకూ రైల్లో వెళ్లి అక్కడ నుంచి ఓడెక్కి అమెరికా పోయాడు ఎన్ఆర్ఐ. - జి.ఆర్. మహర్షి -
'అది దాటకూడదు కదా'
తనదైన యాసతో ‘చాలా బాగుంది’ సినిమాలో కడుపుబ్బ నవ్వించినా.. మధ్యతరగతి తండ్రి పాత్రలో ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో ఏడ్పించినా.. ఆవేశం పొంగే నటనతో ‘ఛత్రపతి’లో భారీ డైలాగులు చెప్పినా అది ఒక్క ఎల్బీ శ్రీరాంకే సాధ్యమవుతుంది. నవరసాలను అలవోకగా పండించే ఆయనలోని మరో ప్రత్యేక గుణం గొప్ప సాహిత్యం. అప్పుల అప్పారావు, హిట్లర్, అరుంధతి సినిమాలకు రచయితగా పనిచేసి ఎనలేని కీర్తిని గడించారు. స్వయం కృషితో సినీరంగంలో సుస్థిరస్థానం సంపాదించుకున్న శ్రీరాం ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహితీ పండితుడిగా, రచయితగా సమాజంలోని మార్పులను పరిశీలిస్తూనే.. విజయవాడలో అష్టావధాన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ వివరాలు.. సాక్షి : మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? ఎల్బీ శ్రీరాం : మా కుటుంబంలో అందరూ సాహితీవేత్తలే. నాటకరంగంతో సంబంధం ఉన్నవారే. నాలోని రచయితను సంతృప్తి పరచడానికే ఈ రంగంలోకి వచ్చాననుకుంటా. నాటకరంగం నుంచి వచ్చిన నాలోని ప్రతిభను గుర్తించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. సాక్షి : మీరు ఈ రంగంలో ఏం నేర్చుకున్నారు? ఎల్బీ శ్రీరాం : ప్రతి సందర్భంలోనూ పరిస్థితుల ప్రకారం ‘నన్ను నేను మలచుకోవడం’ నేర్చుకున్నాను. సాక్షి : మీరు, నటుడు, దర్శకుడు, మాటల రచయిత కదా.. రంగస్థలాల్లో మీకు ఏ పాత్ర వీలుగా ఉంటుంది? ఎల్బీ శ్రీరాం : నటుడిగా పాత్రలో నటిస్తాను. రచయితగా సమాజంలోని మార్పులను గమనిస్తున్నాను. ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో వర్తమాన సమాజంలో మధ్య తరగతి కుటుంబానికి ప్రతీక నా పాత్ర. నేను 40 సినిమాలకు మాటలు రాశాను. 400 సినిమాల్లో నటించాను. సాక్షి : నేటి హాస్యంపై మీ కామెంట్ ఎల్బీ శ్రీరాం : సభ్యతకు, అసభ్యతకు మధ్య లక్ష్మణరేఖ. అది దాటకూడదు కదా.. సాక్షి : ఓ సాహితీవేత్తగా తెలుగు అంతరించిపోతోందన్న భావనను అంగీకరిస్తారా.. ఎల్బీ శ్రీరాం : భాష నిత్యనూతనం. తెలుగు పరభాషలో కలిసిపోతూ జీవనవాహినిలో కలిసిపోతోంది. సాక్షి : మీరు కొత్తగా షార్ట్‌ఫిల్మ్ రంగంలోకి ప్రవేశించారని అంటున్నారు. నిజమేనా? ఎల్బీ శ్రీరాం : నిజమే.. యువతతోపాటు అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్న రంగం షార్ట్ ఫిల్మ్స్. మూడు గంటల్లో వివరించే అంశాన్ని కొద్ది సమయంలో భావ యుక్తంగా వివరించవచ్చు. సాక్షి : మీ లైబ్రరీ గోడ మీద రాసిన వ్యాఖ్య ఏమిటి? ఎల్బీ శ్రీరాం : ఈ రంగంలోని ప్రవేశించి 40ఏళ్లు అవుతోంది. నా జీవితంలోని అనేక దశల ఫొటోలు కనిపిస్తాయి. నా గమ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.. ‘గమ్యం కాదు-ఆ ప్రయాణం నాకిష్టం’ అని రాసి ఉంటుంది. సాక్షి : అరుంధతి, హిట్లర్, అప్పుల అప్పారావు. మూడు విభిన్నమైన కథాంశాలకు మాటల రచయితగా పనిచేశారు. ఎలా సాధ్యమైంది? ఎల్బీ శ్రీరాం : రచయితలు కథలో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది.