హౌ టు మేక్ ఏ మూవీ! | How to Make a Movie! | Sakshi
Sakshi News home page

హౌ టు మేక్ ఏ మూవీ!

Published Sun, Jun 19 2016 10:52 PM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM

హౌ టు మేక్ ఏ మూవీ! - Sakshi

హౌ టు మేక్ ఏ మూవీ!

 హ్యూమర్‌ప్లస్

 

ఒక ఎన్‌ఆర్‌ఐ అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సుని మూడేళ్లు చదివి, తెలుగులో సినిమా తీసి, జన్మభూమికి సేవ చేద్దామని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాడు. ఎంబిఏ చదివిన ఒక కుర్రాడ్ని పిఏగా పెట్టుకుని రంగంలోకి దిగాడు. ఎన్‌ఆర్‌ఐ చెప్పిన ప్రతిదానికి సూపర్ సార్ అనడం వల్ల ఆ పిఏ బాగా నచ్చాడు. జీవితంలో పైకి రావాల్సిన వాడికి ఉండాల్సిన ప్రధాన లక్షణమిది. ఒక్కోసారి ఎన్‌ఆర్‌ఐ ఏమీ చెప్పకపోయినా మనవాడు సూపర్ అని ముందే అనేసేవాడు. కృష్ణానగర్ జంక్షన్‌లోనూ, మణికొండ భీమాస్ హోటల్ దగ్గర కనిపించే కుర్రాళ్లని అసిస్టెంట్ డెరైక్టర్లు, కో-డెరైక్టర్లు, కథారచయితలుగా తీసుకోడానికి ఎన్‌ఆర్‌ఐ ఇష్టపడలేదు. పేపర్లో యాడ్స్ ఇచ్చి, ఎంట్రెన్స్ టెస్ట్‌లు పెట్టి సెలెక్ట్ చేశాడు. టీం మొత్తాన్ని ఒక హోటల్లో సమావేశపరిచి ఎన్‌ఆర్‌ఐ మైక్ తీసుకున్నాడు. ‘ఈ ప్రపంచం మొత్తం భౌతిక రసాయనిక సూత్రాలపైనే ఆధారపడి ఉంది. సినిమా తీయడం ఫిజిక్స్, చూడడం కెమిస్ట్రీ.    ఈ రెంటిని మనం మ్యాచ్ చేయాలి. అదేవిధంగా ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అసలు జీవితమే మాథ్స్ టెక్ట్స్ బుక్‌లాంటిది. అందులో ఉన్నన్ని ప్రాబ్లమ్స్ ఇంకెక్కడా ఉండవు. ప్రపంచంలో ఎక్కడైనా రెండు రెళ్లు నాలుగే తప్ప ఎనిమిది కాదు. అందువల్ల మొదటిసారిగా సినిమాలకి సాలిడ్ ఫిజిక్స్, లిక్విడ్ కెమిస్ట్రీ, కన్‌ఫ్యూజ్‌డ్ ట్రిగనామెట్రీ, యానిమల్ ఆల్జీబ్రా ఇవన్నీ అప్లయ్ చేయబోతున్నాను. సినిమా కథ ఏమిటంటే ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఫిజికల్ అని నమ్మే ఒక యువకుడు, ఎనర్జీ మీన్స్ నథింగ్ బట్ కెమికల్ రియాక్షన్ అని నమ్మే ఓ అమ్మాయి.


వీళ్ల మధ్య ప్రేమ ఏర్పడుతుంది. చివరికి ప్రేమ ఒక టర్నింగ్ పాయింట్, పెళ్లి ఒక బాయిలింగ్ పాయింట్ అని ఇద్దరూ కొత్త థియరీ కనిపెడతారు. మధ్యలో ఒక విలన్. రైలు పట్టాలు ఎప్పటికైనా కలుస్తాయనేది వాడి ఫిలాసఫి. పగలంతా ఎడమొహం పెడమొహంగా ఉండే భార్యాభర్తలు రాత్రి ఒకటిగా కలిసిపోవడం ఫిజికల్ కెమిస్ట్రీ ప్రకారం ప్రూవ్ అయినపుడు, రైలు పట్టాలు కలవడం మెటలాజికల్ ఫిజిక్స్ వల్ల సాధ్యమేనని నమ్ముతూ ఇంట్లో కొన్ని గాజుపాత్రల్లో సూరేకారం, నల్లకారం, కొరివికారం అన్నీ కలియదిప్పుతూ కింద మంట పెడుతూ ఉంటాడు. చివరికి ఒక రోజు గాజు పాత్రలు పేలిపోవడంతో నిర్వికారంగా మారిపోతాడు..’’

 
‘‘సూపర్ సార్’’ చప్పట్లు కొట్టాడు పిఏ. ‘‘కథ ఇంకా పూర్తి కాలేదు’’ ‘‘అక్కర్లేదు, మెతుకు చూస్తే చాలు’’ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రతిదీ ఆర్కిమెడీస్, న్యూటన్, పైథాగరస్ తదితరుల సూత్రాల ప్రకారమే జరిగింది. హీరో హీరోయిన్ల మధ్య ఎంత దూరం ఉండాలో టేప్‌తో కొలిచి మరీ చూపించేవాడు ఎన్‌ఆర్‌ఐ. లైటింగ్ ఎంత ఉండాలో ఫిజిక్స్ ప్రొఫెసర్ల సలహాలు తీసుకునేవాడు. హీరోయిన్ ఏడ్చే సీన్‌లో, అసలు కళ్లలోనుంచి కన్నీళ్లు రావడానికి శరీరంలో ఎన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయో చార్ట్ వేసి చూపించాడు. దాంతో ఆ అమ్మాయి భోరుమని ఏడ్చింది. మానిటర్‌ని ఏ కంటితో చూస్తే పారడాక్స్ దోషం ఉండదో కెమెరామన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆయనకి రెండురోజులు డయేరియా పట్టుకుంది.


ప్రతి టేక్‌లోనూ పిఏ అదును తప్పకుండా ‘సూపర్ సార్’ అని అరిచేవాడు.  సినిమా రిలీజైంది. పిఏకి ఎన్‌ఆర్‌ఐ ఫోన్ చేశాడు.  ‘‘థియేటర్ల దగ్గర తొక్కిసలాట జరుగుతోంది సార్’’  ‘‘సూపర్’’ అని అరిచాడు ఆన్‌ఆర్‌ఐ. ‘‘తొక్కిసలాట టికెట్లకోసం కాదు, థియేటర్ నుంచి బయటికి రావడానికి’’రివ్యూ మీటింగ్ పెట్టాడు ఎన్‌ఆర్‌ఐ. ‘‘ప్రతిదీ సూత్రప్రకారమే తీసినా సినిమా ఎందుకు పోయింది?’’‘‘అందుకే పోయింది’’ అన్నాడు పిఏ.

 
‘‘ఎవడైనా మునిగిపోతున్నప్పుడు సూపర్ అని ఎంకరేజ్ చేయడం తెలుగువాళ్ల అలవాటు. ఈ దేశంలో లేక మీకీ విషయం తెలియలేదు. అయినా తెలుగు సినిమాల్లో హీరో కొడితే ఇరవైమంది గాల్లోకి లేస్తారు. కరెంట్ స్తంభాలు విరిగిపోతాయి. రజనీకాంత్ కొడితే రైలు పెట్టెలు కూడా అడ్డంగా చీలిపోతాయి. ఫిజిక్స్ ప్రకారం ఒక మనిషి బరువు, ద్రవ్యరాశి, క్షితిజక్షేత్రం, గరిమనాభి అంటే ఇక్కడ భిక్షాందేహి అనుకోవాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ దేనికీ అందదు తెలుగు సినిమా. ఇదొక మిస్టరీ.’’ విమానం టికెట్ దొరక్కపోతే ముంబయి వరకూ రైల్లో వెళ్లి అక్కడ నుంచి ఓడెక్కి అమెరికా పోయాడు ఎన్‌ఆర్‌ఐ.

 - జి.ఆర్. మహర్షి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement