బతుకు పాఠాలు చదివిన రచయిత | Pinisetty Sriramamurthy 100 Birth Anniversary Special Story | Sakshi
Sakshi News home page

బతుకు పాఠాలు చదివిన రచయిత

Published Sun, Dec 27 2020 12:19 PM | Last Updated on Sun, Dec 27 2020 12:19 PM

Pinisetty Sriramamurthy 100 Birth Anniversary Special Story - Sakshi

రచయితగా, నటుడిగా, దర్శకుడిగా సినీ, నాటక రంగాలపై చెరగని ముద్ర వేసిన పినిశెట్టి శ్రీరామమూర్తి 1985 ఏప్రిల్‌ 15న కన్నుమూశారు. సినీ నాటక రంగాలు ఉన్నంత వరకు ఆయన చిరస్మరణీయుడు. 
బతుకు పాఠాలు చదివిన రచయిత..
 డిసెంబర్‌ 30 పినిశెట్టి శ్రీరామమూర్తి శతజయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. 

సహజ ప్రతిభావంతుడు పినిశెట్టి శ్రీరామమూర్తి. నాటకం, నవల, కథ వంటి సాహితీ ప్రక్రియలను తన రచనలతో సుసంపన్నం చేసిన రచయిత ఆయన. ఆనాటి ప్రతిష్ఠాత్మకమైన సాహితీ పత్రిక ‘భారతి’లో 1940 ప్రాంతాల్లో ఆయన రచనలు ప్రచురితమై, పండితుల దృష్టిని ఆకర్షించాయి. ‘భారతి’లో ప్రచురితమైన కథలను ఏరి కూర్చి, 1946లో ‘సవతితల్లి’ కథాసంపుటిని ప్రచురించారు. గ్రామీణ నేపథ్యంలో ఆయన రాసిన నాటకాలు ప్రజామోదం పొందాయి. ఆయన నాటకాలకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఆంధ్ర నాటక పరిషత్‌’ పురస్కారాలు లభించాయి. నాటకరంగం మీదుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన వారిలో పినిశెట్టి శ్రీరామమూర్తి కూడా ఒకరు. నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా ప్రేక్షకుల మన్ననలు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి ఆయన.

పినిశెట్టి శ్రీరామమూర్తి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 1920 డిసెంబర్‌ 30న జన్మించారు. ఆయన తల్లి అమ్మణ్ణమ్మ గృహిణి, తండ్రి వెంకటరత్నం కోర్టు అమీను. బాల్యంలోనే రెండేళ్ల వయసులో ఉండగా, తల్లి మరణించింది. ప్రాథమిక పాఠశాలలో చదుకుంటుండగా, పినిశెట్టి తెలివితేటలను గుర్తించిన ఉపాధ్యాయులు ఒకటో తరగతి నుంచి నేరుగా మూడో తరగతికి ప్రమోట్‌ చేశారు. తండ్రి ఉద్యోగ విరమణతో ఆయన చదువు ప్రాథమిక పాఠశాలతోనే ఆగిపోయింది. పెదతల్లి సలహాతో వ్యవసాయం, టైలరింగ్‌ నేర్చుకున్నా సంతృప్తి కలగలేదు. తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివేవాడు. ఆయన ఉన్నత పాఠశాలలో చదవకున్నా, జీవిత పాఠశాలలో కష్టాలూ కన్నీళ్లూ బాధలూ వేదనలూ సహాధ్యాయులుగా, సహనం, సంయమనం, తాత్త్వికతలు గురువులుగా ఆయన జీవిత ప్రస్థానం సాగింది. పినిశెట్టి గురించి, ‘పాఠ్యపుస్తకాలు చదవని రచయిత. బతుకు పాఠాలు చదివిన నాటక సినీ రచయిత జీవన కథనం స్ఫూర్తిదాయకం’ అని ప్రముఖ విమర్శకుడు కిరణ్‌ప్రభ ప్రశంసించారు.

ఆధునిక తెలుగు నాటక రచనలో పినిశెట్టి ముద్ర ప్రత్యేకం. గ్రామీణ జీవన నేపథ్యంలో సాగేవి ఆయన నాటకాలు. 1944లో ‘ఆదర్శజ్యోతి’ నాటకాన్ని రాసి, ‘ఆదర్శ నాట్యమండలి’ ద్వారా ప్రదర్శించి, నటించి ప్రశంసలు పొందారు. ఆయన 1949లో ‘పల్లెపడుచు’ నాటకం రాశారు. ఆ నాటకాన్ని ‘ఆంధ్ర కళాపరిషత్‌’ ఆధ్వర్యాన 1950లో కాకినాడలో ప్రదర్శించగా, ఉత్తమ నాటక బహుమతి పొందింది. ఆ నాటకంలో ఆదర్శ రైతు సూరయ్య పాత్ర ధరించిన రచయిత, ఉత్తమ నటుడిగా కూడా బహుమతి పొందారు. ఆనాటి కార్యక్రమానికి ప్రముఖ హిందీ నటుడు పృథ్వీరాజ్‌ కపూర్‌ ముఖ్యఅతిథిగా హాజరై, బహుమతి ప్రదానం చేశారు. అద్భుతమైన సంభాషణలతో కూడిన ‘పల్లెపడుచు’ నాటకాన్ని ప్రదర్శించని పల్లెటూరు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదని రంగస్థల ప్రముఖుడు డాక్టర్‌ చాట్ల శ్రీరాములు ఒక సందర్భంలో చెప్పారు. ఆ నాటకం అప్పట్లోనే ఏడు ముద్రణలు పొందిందంటే, ఎంతగా ఆనాటి పాఠకులను, ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పినిశెట్టికి పేరు తెచ్చిపెట్టిన నాటకాల్లో ‘అన్నాచెల్లెలు (1952), స్త్రీ పాత్ర లేని ‘ఆడది’ (1952), ‘కన్నకొడుకు’ (1956) వంటివి ముఖ్యమైనవి. పినిశెట్టి 1954లో సినీరంగంలోకి అడుగు పెట్టారు. సినిమారంగంలో ప్రవేశించిన సంవత్సరంలోనే ఆయన రాసిన రెండు నాటకాలు సినిమాలుగా రూపొందాయి. వాటికి ఆయనే సంభాషణలు రాశారు.
సినీరంగంలో కొనసాగుతూనే, నాటక ప్రేక్షకుల కోరిక మేరకు 1963లో ‘పంజరంలో పక్షులు’ నాటకం రాశారు. ఈ నాటకాన్ని 1968లో పుస్తకరూపంలో ముద్రించి, ఆ నాటకంలో ప్రధాన పాత్రధారి, ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావుకు అంకితం చేశారు. 
పినిశెట్టి సినీ ప్రస్థానం బీఏ సుబ్బారావు దర్శకత్వంలోని ‘రాజు–పేద’ (1954) సినిమాతో మొదలైంది. ఆ సినిమాకు ఆయన సంభాషణలు రాశారు. అదే ఏడాది ఆయన నాటకం ‘పల్లెపడుచు’ను బోళ్ల సుబ్బారావు సినిమాగా నిర్మించారు. ఆయన రాసిన ‘అన్నాచెల్లెలు’ నాటకం తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘పరివర్తన’గా అదే ఏడాది వెండితెరపై విడుదలైంది. ఆ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి ఆనాటి అగ్ర నటీనటులు నటించారు. 
పినిశెట్టి ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడంతో పాటు దర్శకత్వం వహించారు. తోట కృష్ణమూర్తి నిర్మించిన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ‘సంతానం’, ‘ఇలవేల్పు’, ‘రామాలయం’, ‘బంగారు గాజులు’ వంటి దాదాపు అరవై సినిమాలకు సంభాషణలు రాశారు. ‘చిలకా గోరింక’, ‘గృహలక్ష్మి’ వంటి సినిమాల్లో హాస్యపాత్రలు పోషించారు. అప్పట్లో సినిమా పత్రికలు ఆయనను ‘స్వతంత్ర చిత్రరచనా చక్రవర్తి’గా అభివర్ణించాయి. పినిశెట్టి శ్రీరామమూర్తి పెద్దకొడుకు రవిరాజా పినిశెట్టి ప్రముఖ దర్శకుడు. రవిరాజా 1980లో దర్శకత్వం వహించిన ‘వీరభద్రుడు’ సినిమాకు కూడా పినిశెట్టి శ్రీరామమూర్తి మాటలు రాశారు. ఆయన మనవడు ఆది పినిశెట్టి హీరోగా సినీరంగంలో కొనసాగుతున్నారు.
- డాక్టర్‌ పీవీ సుబ్బారావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement