
స్టూడెంట్ నంబర్ -1.. ఎల్బీ శ్రీరామ్
అయినవిల్లి మండలం నేదునూరు వీధుల్లో శనివారం ఉదయమే స్కూలు యూనిఫాంతో ఒకరు సైకిల్ తొక్కుకుంటూ, బూరా ఊదుకుంటూ వెళ్తున్నారు. ఆయనను అనుసరిస్తూ సైకిళ్లపై అనేకమంది బాలలు. దూరం నుంచి చూసిన పలువురు ఆ బృందానికి అగ్రభాగాన సాగుతున్నది ఎవరో హైస్కూలు విద్యార్థి అనుకున్నారు. తీరా దగ్గరకు వచ్చాక చూస్తే.. జుట్టు నెరిసిన ఆ స్టూడెంట్ నంబర్-1ను ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్‌గా గుర్తించి సంభ్రమాశ్చర్యాలతో కేరింతలు కొట్టారు.
నేదునూరు (అయినవిల్లి) : నేదునూరు వీధుల్లో శనివారం ఉదయమే స్కూలు యూనిఫారంతో ఒకరు సైకిల్ తొక్కుకుంటూ, విజిల్ ఊదుకుంటూ పోతున్నారు. అతడిని అనుసరిస్తూ సైకిళ్లపై అనేకమంది బాలలు. దూరం నుంచి చూస్తే ఆ బృందానికి అగ్రభాగాన సాగుతున్నది ఎవరో హైస్కూలు విద్యార్థి అనుకున్నారు. అయితే.. ‘సంక్రాంతి సెలవులు కదా..ఇప్పుడు స్కూలుకు వెళ్లేదెవరబ్బా?’ అన్న సందేహమూ కొందరికి కలిగింది. తీరా దగ్గరకు వచ్చాక చూస్తే.. ఆ స్టూడెంట్ నంబర్ :1 జుట్టు నెరిసి ఉంది. వయసు కూడా తాతయ్య వయసు. ‘ఇదేమిటబ్బా..ఇలా ఎస్‌పీఎల్(స్కూల్ ప్యూపిల్స్ లీడర్)లా ఇలా పిల్లల్ని వెంటబెట్టుకుని వెళుతున్నది ఇంత పెద్దాయనా?’ అని విస్తుబోతూనే ఆయనను గుర్తు పట్టి సంభ్రమాశ్చర్యాలతో కేరింతలు కొట్టారు. ఆయనే ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్.
ఈ దృశ్యం ఏదో సినిమా షూటింగ్ కోసమని అనుకున్నా పొరపడ్డట్టే. ఎల్బీ శ్రీరామ్ ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. శనివారం ఆ పాఠశాల స్వర్ణోత్సవాలు నిర్వహించారు. వాటిలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఇలా తన పాఠశాల రోజుల నాటిలా దర్శనమిచ్చారు. కాలాన్ని జయించి, తిరిగి బాల్యంలోకి పయనించే ముచ్చటను తీర్చుకున్నారు. తన చిన్నప్పుడు ఇలానే స్కూల్‌కు వెళ్లేవాడినని ఆయన విలేకరులకు చెప్పారు. తాను చదువు కునే రోజులు చాలా సంతోషకరంగా గడిచాయన్నారు. సైకిల్‌పై స్కూలుకు చేరుకున్న ఆయనను పూర్వ విద్యార్థులు హంస వాహనంపై వేదిక వద్దకు గౌరవపూర్వకంగా తీసుకెళ్లారు.