రేప్- ఇట్స్ యువర్ ఫాల్ట్
సినిమా తెరకెక్కడానికి బుల్లి చిత్రాల్ని ఒక సాధనంగా ఔత్సాహికులు మలచుకుంటుంటే... పెద్ద తారలేమో ‘షార్ట్’ మూవీస్‌లో కనిపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకలా.. అంటే కారణాలనేకం.
షార్ట్‌ఫిలింస్ వేగంగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే పవర్‌ఫుల్ మీడియంగా మారాయి. పెద్ద సినిమా చిత్రీకరణ, విడుదలకు ఉండే హడావుడి ఈ చిత్రాలకు లేకపోయినా, ఇంటర్నెట్ ద్వారా ఇమిడియట్‌గా కోట్లాది మంది వ్యూవర్స్‌ని చేరుకుంటుండడం ఈ చిత్రాలపై ఆసక్తి పెంచుతోంది. దీంతో సినీ తారలు సైతం వీటిని పట్టించుకోక తప్పని పరిస్థితి.
అయితే సంతోషించాల్సిన విషయమేమిటంటే... కమర్షియల్, భారీ బడ్జెట్ సినిమాలలో సాహసించడానికి వీలులేని సందేశాత్మక సామాజిక అంశాలపై స్పందించడానికి వీరు చిన్ని చిత్రాలను ఉపయోగించుకోవడం. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు పొట్టి సినిమాల్లో కనిపిస్తున్నారు. వీరిలో నేటి తరం అలియాభట్, కల్కీ నుంచి నిన్నటి తరం మాధూరీ దీక్షిత్ కూడా ఉన్నారు. దర్శకులదీ ఇదే బాట. ఈ నేపధ్యంలో స్టార్స్ నటించిన కొన్ని పొట్టి చిత్ర విశేషాలివి. వినీల్ మ్యాథ్యూ రూపొందించిన స్టార్ట్ విత్ ద బాయ్స్ అనే బుల్లి సినిమా డొమెస్టిక్ వయోలెన్స్ నేపథ్యంలో చక్కటి సందేశంతో రూపొందింది.
అనేక సందర్భాల్లో సహజంగా వచ్చే ఏడుపును నియంత్రించుకోవటం వల్ల అబ్బాయిల్లో పెరిగే క్రోధం, అది అమ్మాయిల పట్ల హింసగా ఎలా మారుతుందనేది రెండు నిముషాల చిత్రంలో చక్కగా చూపారు. ‘పుట్టినప్పటి నుంచి బాయ్స్ ఏడవకూడదని నేర్పించే తల్లిదండ్రలు, ఇక నుంచి, మగపిల్లలు ఆడవారిని ఏడిపించకూడదు అని నేర్పిస్తే మంచిది’ అని మాధురి చెప్పే మాటలతో ముగుస్తుంది. దీనికి యూట్యూబ్‌లో మంచి హిట్స్ వచ్చాయి.
కల్కీ సంచలనం...
‘రేప్- ఇట్స్ యువర్ ఫాల్ట్’... ఈ సూపర్‌హిట్ షార్ట్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కల్కీ కోచ్‌లీన్ (షాంగై సినిమా ఫేం) నటించింది. యూట్యూబ్‌లో ఇదో సంచలనం. ఆడవారిపై జరిగే అన్యాయాలకు వారే కారణమంటూ అడ్డదిడ్డంగా చేసే వ్యాఖ్యలకు సమాధానంగా రూపొందిన ఈ సినిమాకు అశ్విన్‌శెట్టి దర్శకత్వం.
మరెందరో...
ఇదే తరహాలో ‘యామ్ నాట్ ఏ వుమన్’ షార్ట్‌ఫింలో కూడా బాలీవుడ్‌కి చెందిన రజిత్ కపూర్, మియాంగ్ చాంగ్, అదితి మిట్టల్ తదితరులు నటించారు. ‘దట్ డే ఆఫ్టర్ ఎవ్రీడే’ కూడా మరో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రమే. బయటకు వెళ్లే ఆడపిల్లలు బస్సుల్లో, వీధుల్లో ఎదుర్కునే ఈవ్‌టీజింగ్ సమస్యని ఇందులో చూపారు.
రాధికా ఆప్టే, సంధ్యా మృదుల్, అరణ్యకౌర్ మధ్యతరగతి అమ్మాయిల పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించారు. టాలీవుడ్ నటులు కూడా ఇప్పుడిప్పుడే షార్ట్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. రెగ్యులర్ సినిమా తర్వాత గెలుపు, ఓటమి క్రిటిసిజమ్ లాంటి ఎన్నో అంశాలు ఎదుర్కునే ఈ బడా తారలకు ఈ చిన్ని సినిమాల తర్వాత అల్టిమేట్‌గా మంచి మార్కులు పడుతుండటం విశేషం.
ఓ మధు