శ్రుతీహాసన్ ఇసిడ్రో
ఇసిడ్రో అంటే ఏంటి? విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా? ఇదేమీ శ్రుతీహాసన్ కొత్త సినిమా టైటిల్ కాదు. ఈ పేరుతో శ్రుతి సొంతంగా బేనర్ మొదలుపెడుతున్నారు. షార్ట్ ఫిలింస్, డిజిటల్ ఫిలింస్ నిర్మించాలనుకుంటున్నారు. మ్యూజికల్‌గా కూడా ఏదైనా చేయాలనే ప్లాన్ ఆమెకు ఉంది. ‘సినిమా తప్ప మా కుటుంబానికి వేరే తెలియదు. సినిమా లేకపోతే మేం ఉండలేం’ అని శ్రుతి చెబుతుంటారు. అందుకే, నటిగా, గాయనిగా మిగిలిపోకుండా నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ముందు లఘు చిత్రాలు, డిజిటల్ మూవీస్‌తో మొదలుపెట్టి, ఆ తర్వాత వెండితెర కోసం కూడా సినిమాలు నిర్మిస్తారని ఊహించవచ్చు. వాస్తవానికి శ్రుతి చేతిలో ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ఏడు సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా రంగంలోకి దిగాలనుకున్నారంటే పకడ్బందీగా ప్రణాళికలే వేసుకునే ఉంటారు. ఇంతకూ ‘ఇసిడ్రో’ అంటే అర్థం ఏంటంటే... ఆలోచనల పుట్ట. చూస్తుంటే శ్రుతి తన ఆలోచనలతో అద్భుతాలు సృష్టించేటట్టే కనిపిస్తున్నారు.