ఒక స్పీల్‌బర్గ్!
ఆ లఘుచిత్రాలను చూడటానికి చుట్టుపక్కలవారిని 25 సెంట్లకు అనుమతించేవాడు. ఇక వాళ్ల చెల్లేమో ఆ వచ్చిన ‘ప్రేక్షకులకు’ పాప్‌కార్న్ అమ్మేది.
మొన్న కరీంనగర్లో ‘న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ కాన్సెప్ట్‌తో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఒక సలహా ఇచ్చాడు, అతితక్కువ ఖర్చుతో సినిమాలు చేస్తూ, వాటిని స్థానికంగా చూపించి గిట్టుబాటు చేసుకొమ్మనీ, తద్వారా ఎదుగుదలకు బాటలు పరుచుకొమ్మనీ! అది అయ్యేపనేనా? అని ఎవరైనా అడిగివుంటే, బహుశా, స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను ఉదాహరణగా చూపించేవాడేమో!
‘అన్నింటికంటే మించి ఒక మంచి ఇమాజినేషన్ మాత్రమే ఎవరినైనా దర్శకుడిని చేయగలదు. మంచి ఊహవుండి, బాగా కథలు చెప్పే ఆసక్తివుండి, నీ ఆలోచనల్ని కొత్తవారికి చేరవేయగలిగే నేర్పు గనకవుంటే... నువ్వు రాయాలి, లేదా 8ఎంఎం సినిమా మొదలెట్టాలి,’ అంటాడు స్పీల్‌బర్గ్.
తన కౌమారదశలో, వాళ్ల నాన్న బహూకరించిన కెమెరాతో కొన్ని 8ఎంఎం లఘుచిత్రాలు తీశాడు స్పీల్‌బర్గ్. వాటిని ‘అడ్వెంచర్’ సినిమాలనేవాడు. వాటిని చూడటానికి చుట్టుపక్కలవారిని 25 సెంట్లకు అనుమతించేవాడు. ఇక వాళ్ల చెల్లేమో ఆ వచ్చిన ‘ప్రేక్షకులకు’ పాప్‌కార్న్ అమ్మేది. మనసులో కళ, మెదడులో ‘వెల’! ఈ గుణాలే భవిష్యత్తుల్లో ఆయన్ని అత్యధిక వసూళ్లు రాబట్టిన మేటి హాలీవుడ్ దర్శకుడిగా నిలబెట్టాయి. తన పదహారో ఏట పూర్తి నిడివి ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘ఫైర్‌లైట్’ తీశాడు. 1975లో హాలీవుడ్ హిట్‌గా ‘జాస్’ నిలిచినప్పుడు స్పీల్‌బర్గ్ వయసు 26 ఏళ్లు! అలాగని వసూళ్లు మాత్రమే ఆయన ఐడెంటిటీ కాదు!
ఉత్తినే ఆయన సినిమాల పేర్లను తలుచుకోవడంలోనే ఒక విజువల్ ప్లెజర్ ఏదో ఉంది. ఇ.టి., జురాసిక్ పార్క్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... ఇదొక వరుస! ఇండియానా జోన్స్ సీరిస్ ఒక వరుస! క్యాచ్ మి ఇఫ్ యు కెన్, ద టెర్మినల్... మరొక వరుస! మ్యూనిక్, అమిస్టాడ్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, కలర్ పర్పుల్, లింకన్... ఇంకో వరుస! ఏ వరుసలో చూసినా, సాంకేతికత పరిజ్ఞానానికి మానవీయ స్పృహను అద్దడమే స్పీల్‌బర్గ్ చేసింది.
ప్రతి చిత్రమూ తనను భయపెడుతుందంటాడు స్పీల్. ‘అది కచ్చితంగా భయం కూడా కాదు. తెలియనిదానికోసం ఎదురుచూడటం! ఆ భయాన్ని ఇతరుల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా నా భయాల్ని నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తాను. అయినా ఆ సినిమా పూర్తయ్యాక కూడా ఆ భయం ఛాతీలోంచి తొలగిపోదు’. అందుకే మరోటి మొదలుపెడతాడు.
అయితే, ‘చిన్నప్పుడు కెమెరాతో స్నేహితుల మీద పెత్తనం చలాయించడమే సినిమాగా ఉండేది. కానీ పెద్దయ్యేకొద్దీ సినిమా అంటే, నీ చుట్టుపక్కల ఉన్నవారి ప్రతిభను అభినందించడమేననీ, నువ్వు మాత్రమే ఈ సినిమాలు చేయగలిగేవాడివి కాదనీ తెలుసుకోవడం!’ అంటాడు. సినిమా అనేది నీ కుటుంబంతో కాకుండా ఇంకో కుటుంబంతో కూడా సంబంధం ఉండటంగా అభివర్ణిస్తాడు. ‘ఒక కుటుంబంతో కలిసివుంటావు, ఒక కుటుంబంతో పనిచేస్తావు’!
అయితే, ‘సినిమా కథల్లాగా తన జీవితకథను కూడా రాసుకోగలిగితే బాగుండే’దంటాడు. తల్లిదండ్రులు విడిపోవడం ఆయన్ని కలవరపరిచింది. సినిమా కథలన్నీ, ఇంకా చెప్పాలంటే ఏ కథైనా ఏమార్చిన ఆత్మకథలే! అందువల్లేనేమో, స్పీల్‌బర్గ్ తొలిదశ సినిమాల్లో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగానో, పట్టనట్టుగానో ఉన్న తండ్రి పాత్ర కనబడుతుంది. అదే వాళ్ల నాన్నను పూర్తిగా అర్థం చేసుకుని, తండ్రీకొడుకుల మధ్య తిరిగి బంధం బలపడ్డాక, కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి తపనపడే తండ్రుల పాత్రలు ప్రవేశించాయి.
మతపరమైన విశ్వాసాలు గాఢంగా లేకపోయినా, ‘షిండ్లర్స్ లిస్ట్’ తీస్తున్నప్పుడు తాను కేవలం ఫిలిం మేకర్‌గా మాత్రమే ఉండలేకపోయాననీ, యూదుడిగానే మిగిలాననీ దుఃఖిస్తాడు. జర్మనీలో యూదుల మీద నాజీల దురాగతాలని కేంద్రంగా చేసుకున్న ఆ సినిమాను సినిమాగా కాకుండా, పూర్తిగా తనకోసమే... ‘ఎవరు చూడకపోయినా ఫర్లే’దన్నట్టుగా, బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రించాడు. అయినా అది క్లాసిక్‌గా అందరికీ చేరువ కావడానికి కారణం, మనిషి పట్ల మనిషి మనిషిలాగా ప్రవర్తించాల్సిన అవసరం ఇంకా ఇంకా పెరుగుతూ ఉండటమే!
స్పీల్‌బర్గ్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తూ, రోజర్ ఎబెర్ట్ ఒక పాటను ఉటంకిస్తాడు. ‘పత్రికలవాళ్లు అత్యంత ఆసక్తికర మనుషుల్ని కలుస్తారు’ అని దాని సారాంశం. అది నిజమేనేమోగానీ స్పీల్‌బర్గ్‌ను కలిసే అవకాశం అందరికీ రాదు, కనీసం తెలుగు పాత్రికేయుడికి!
- ఆర్.ఆర్.