షార్ట్‌గా.. షార్ప్‌గా.. | SV Krishna Reddy Wins Third prize In Short Films | Sakshi
Sakshi News home page

షార్ట్‌గా.. షార్ప్‌గా..

Published Mon, May 14 2018 11:10 AM | Last Updated on Mon, May 14 2018 11:10 AM

SV Krishna Reddy Wins Third prize In Short Films - Sakshi

సినీ దర్శకుడు వీఎన్‌ ఆదిత్య నుంచి ఉత్తమ తృతీయ షార్ట్‌ ఫిల్మ్‌ బహుమతిని అందుకుంటున్న చేంజ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ టీమ్‌

తూర్పు గోదావరి, రాయవరం (మండపేట): ఏదో సాధించాలనే తపన..పదిమందిలో ఒకరిగా నిలవాలనే పట్టుదల.. వీటికి తోడు నిరంతర కృషి ఎవరినైనా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. తాను రాసిన కథలు, దర్శకత్వం ద్వారా పసలపూడికి గుర్తింపు తీసుకుని వచ్చిన సినీ దర్శకుడు ‘వంశీ’ బాటలో నడుస్తున్నాడు మరో యువకుడు. కెమెరామన్‌గా, దర్శకుడిగా షార్ట్‌ ఫిల్మస్‌ చేస్తూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తున్న ఆయన రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ ఉత్తమ తృతీయ బహుమతిని గెల్చుకుంది.

తృతీయ బహుమతి గెల్చుకున్న‘చేంజ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌’..
సోషల్‌ మీడియా ఫర్‌ సొసైటీ(ఎస్‌ఎంఎస్‌) నేటి చదువులు అనే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో షార్ట్‌ ఫిల్మ్స్‌ పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 73 లఘుచిత్రాలు పోటీలో పాల్గొనగా, 11 చివరి పోటీకి నిలిచాయి. వీటిని వీక్షించిన కమిటీ రాయవరం మండలం పసలపూడికి చెందిన లఘు చిత్రాల దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘చేంజ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ తృతీయ బహుమతిని గెల్చుకొంది. సీని దర్శకుడు వీఎన్‌ ఆదిత్య న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. కాన్వెంట్‌ చదువుల పేరుతో బాల్యాన్ని పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్న చదువులు, నేటి చదువుల్లో రావాల్సిన మార్పులపై ఎస్‌వీ కృష్ణారెడ్డి రూపొందించిన చేంజ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ న్యాయ నిర్ణేతలను ఆలోచింపజేసింది.

కెమెరామెన్, దర్శకుడిగా..
2012 నుంచి ఇప్పటి వరకు కృష్ణారెడ్డి కెమెరామెన్‌గా, దర్శకుడిగా తనదైన శైలిలో లఘుచిత్రాలను రూపొందించాడు. సామాజిక ఇతివృత్తాలను ప్రధానంగా తీసుకుని ఇప్పటి వరకు 25 లఘుచిత్రాలకు కెమెరామెన్‌గా, దర్శకుడిగా పనిచేశాడు. స్నేహం గొప్పదనాన్ని తెలియజేసేలా ‘నేనెందుకు’ అనే లఘుచిత్రంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. యువత ఖాళీగా ఉండకూడదంటూ ‘టైమ్‌ వేస్ట్‌ చెయ్యొద్దు’ అనే లఘుచిత్రంతో పాటు ప్రేమ పేరుతో జీవితాలను పాడు చేసుకోవద్దంటూ ‘గాల్లో ప్రేమ కథలు’, సమాజం కోసం పోరాడాలంటూ ‘భీష్మ’, నిజమైన ప్రేమ గొప్పదనాన్ని తెలియజేసే ‘ట్రు లవ్‌’ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చవద్దంటూ ‘శిల్పి’ తదితర 25 లఘుచిత్రాలను కృష్ణారెడ్డి రూపొందించారు.

సినీ దర్శకుడిగా రాణించడమే లక్ష్యం..
సినీ దర్శకుడిగా రాణించడమే తన లక్ష్యం. నాలో ఉన్న ఆలోచనలకు పదును పెట్టుకుంటూ.. కెమెరామన్‌గా, దర్శకుడిగా షార్ట్‌ ఫిల్మŠస్‌ రూపొందిస్తున్నాను. సమాజానికి సందేశాన్నిచ్చే మరిన్ని లఘు చిత్రాలను రూపొందిస్తాను. చేంజ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ తృతీయ బహుమతి గెల్చుకోవడం సంతోషాన్నిచ్చింది. నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. చేంజ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ షార్ట్‌ ఫిల్మ్‌కు నిర్మాతగా కేశవ సూర్య(రాజోలు), రచయితగా కుమార్‌(కుతుకులూరు), సహ దర్శకుడిగా మురుగదాస్‌(నెలపర్తిపాడు), కో–డైరెక్టర్‌గా ఆర్‌కే(జి.మామిడాడ), కార్య నిర్వాహక దర్శకుడిగా కర్రి రామారెడ్డి సహకారం అందించారు. 
– ఎస్‌వీ కృష్ణారెడ్డి, షార్ట్‌ ఫిల్మŠస్‌ దర్శకుడు, పసలపూడి, రాయవరం మండలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement