
చిన్న చిత్రాలకు ప్రోత్సాహం
తొలి అంతర్జాతీయ లఘుచిత్రోత్సవ ప్రారంభంలో మంత్రి చందూలాల్
సాక్షి, హన్మకొండ: చిన్న చిత్రాలు, లఘు చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర గిరిజన పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం (షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్)ను శుక్రవారం వరంగల్‌లో మంత్రి ప్రారంభించారు. చందూలాల్ మాట్లాడుతూ వరంగల్‌లో ఇంటర్నేషన్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నం దుకు సంతోషంగా ఉందన్నారు. చిన్న చిత్రాల ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి త్వరలోనే నిర్ణయాలు వెల్లడిస్తామని ప్రకటించారు.
కాకతీయ వీరనారి రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుద్రమదేవి నిర్మించానని, ఈ సినిమా తర్వాత గూగుల్‌లో రుద్రమదేవి, వరంగల్ నగరం గురించి రోజు సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగిందన్నారు. గూగుల్ సెర్చ్ రికార్డుల్లో దేశవ్యాప్తంగా రుద్రమదేవి పేరు మూడో స్థానంలో నిలిచిందన్నారు.
20 దేశాలు.. 144 షార్ట్ ఫిలిమ్స్
ఇరాన్, ఇరాక్, అఫ్ఘానిస్తాన్, ఫ్రాన్స్, బెల్జియం, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, జపాన్ తదితర ఇరవై దేశాలకు చెం దిన 144 షార్ట్‌ఫిల్మ్‌లను శని, ఆదివారం ప్రదర్శిం చనున్నారు. ఇందులో 70 విదేశీ చిత్రాలు ఉండగా, మిగిలినవి మన దేశానికి చెందిన లఘు చిత్రాలు. ప్రతీ చిత్రానికి సబ్‌టైటిల్స్ ఉంటాయి. ఈ చిత్రోత్సవంలో తెలంగాణ చరిత్ర, కోటలకు సంబంధించి మూడు లఘు చిత్రాలున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు చిత్రాలను ప్రదర్శిస్తారు. తొలిరోజు ప్రారంభ చిత్రంగా ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్రపై తీసిని లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. జనవరి 8, 9, 10 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.