చిన్న సినిమాకు పెద్ద ప్రోత్సాహం
చిత్రపరిశ్రమ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం తీర్మానాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సినిమా థియేటర్లలో రోజూ 5 ఆటలు ప్రదర్శించాలని, అందులో ఒక ఆటను చిన్న సినిమాకు కేటాయించాలని తీర్మానించింది. సాయంత్రం 4 గంటలకు ఈ చిన్న సినిమాను ప్రదర్శించాలని పేర్కొంది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.
ఈ సందర్భంగా పలు నిర్ణయాలపై తీర్మానాలు చేసింది. సినిమా షూటింగ్‌లకు అనుమతిచ్చే విషయంలో జరుగుతున్న తాత్సారాన్ని నివారించాలని, దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే అనుమతులు మంజూరు చేయాలని సబ్‌కమిటీ తీర్మానించింది. షూటింగ్ కోసం ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ)కు దరఖాస్తు చేసుకుంటే పోలీసు, టూరిజం, ఫారెస్టు, మున్సిపల్ కార్పొరేషన్, ఆర్కియాలజీ తదితర శాఖలను సమన్వయ పరిచి 48 గంటల్లోపు అనుమతివ్వాలని నిర్ణయించింది.
ఎన్‌వోసీ కాలపరిమితి పెంపు
చిన్న నిర్మాతలు కోరుతున్నట్టుగా లో బడ్జెట్ చిత్రాలకు 35 స్క్రీన్స్ నుంచి 50కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సినిమా థియేటర్ల యాజమాన్యాలు రోడ్లు భవనాల శాఖ, అగ్ని మాపక శాఖల నుంచి పొందే నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కాలపరిమితిని 3 సంవత్సరాల నుంచి ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ తరహాలో హైదరాబాద్‌లో నిర్మించ తలబెట్టిన ప్రపంచస్థాయి ఇన్‌స్టిట్యూట్‌కు స్థల సేకరణ, విధి విధానాల తయారీ బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారికి అప్పగించారు. థియేటర్లు లేని మండల కేంద్రాల్లో 200 సీట్ల సామర్థ్యం గల మిని కల్చరల్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే అనుమతించాలని ఉప సంఘం నిర్ణయించింది. సినీ కార్మికుల ఇళ్ల కోసం చిత్రపురి కాలనీని ఆనుకొని ఉన్న తొమ్మిదెకరాల స్థలం కేటాయింపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. చిత్రపురి కాలనీలో రోడ్డు, ఆరోగ్యకేంద్రం, రేషన్‌షాపు, వైఫై సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
‘నంది’కి కొత్త పేరుపై కమిటీ
ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ చలన చిత్రాలకు ఇచ్చే నంది అవార్డుల పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ‘నంది’కి బదులుగా ఏ పేరు పెట్టాలన్న అంశంపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి ఉత్తమ చలన చిత్ర అవార్డులకు పేరు సూచించే బాధ్యతను అప్పగించాలని సబ్‌కమిటీ నిర్ణయించింది. సమావేశంలో కేబినెట్ సబ్‌కమిటీ సభ్యులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, కేవీ రమణాచారి, సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే బాబుమోహన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు అజయ్‌మిశ్రా, రాజీవ్ త్రివేది, నవీన్‌మిట్టల్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందనరావు, సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, దగ్గుబాటి సురేశ్‌బాబు, మురళీమోహన్, జి.ఆదిశే షగిరిరావు, శ్యాంప్రసాద్‌రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, రామ్మోహన్‌రావు, విజయేందర్‌రెడ్డి, కొమరం వెంకటేశ్ పాల్గొన్నారు.