షార్ట్‌.. ఓకే | Short Film Trend in West Godavari | Sakshi
Sakshi News home page

షార్ట్‌.. ఓకే

Published Mon, Jun 3 2019 1:22 PM | Last Updated on Mon, Jun 3 2019 1:22 PM

Short Film Trend in West Godavari - Sakshi

బిజీబిజీ లైఫ్‌లో.. రెండున్నర గంటల సినిమా అంటే కష్టం..అంతసేపు థియేటర్‌లో కూర్చొనే ఓపిక ఎవరికీ ఉండటం లేదు.. ఏదైనా, షార్ట్‌కట్‌లో సింపుల్‌గా చెబితేనే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.. అందుకే ప్రస్తుతం షార్ట్‌ ఫిల్ముల హవా కొనసాగుతోంది.. చిన్న చిత్రాలైనా.. పెద్ద సందేశాలతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.. మన జిల్లాలో గోదావరి పరిసరాల్లోని యువత ఇటువంటి షార్ట్‌ ఫిలింలు తీసి హిట్టు టాక్‌ సొంతం చేసుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా..–కొవ్వూరు రూరల్‌

సినిమాలను తలదన్నే ఇతివృత్తాలతో జిల్లాలోని యువత షార్ట్‌ ఫిలింలు రూపొందిస్తున్నారు. సమాజానికి మంచి సందేశాలను అందిస్తున్నారు. చిత్ర నిర్మాణంపై ఉన్న ఆసక్తితో పలువురు యువకులు ఒక బృందంగా ఏర్పడి నిర్మించిన షార్ట్‌ ఫిలింలు ఆలోచింపజేస్తున్నాయి. తమ పాకెట్‌ మనీతో చిన్ని చిత్రాలను రూపొందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీరికి అవసరమైన సహాయం అందిస్తే పెద్ద చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని లఘు చిత్రాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నేడు కొందరు యువత చెడు మార్గంలో పయనిస్తుంటే.. తమకొచ్చిన చిన్న పాటి ఆలోచనలను చిత్రాలు రూపొందిస్తూ తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు.

 పబ్జి ప్రభావం షార్ట్‌ ఫిలింలో ఓ సన్నివేశం
చుట్టుపక్కల సంఘటనలేఇతివృత్తాలు
సమాజంలో తమ చుట్టూ జరిగే యదార్థ సంఘటనలనే ఇతి వృత్తాలుగా యువత కథాంశాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ, బంధాలు, బం«ధుత్వాలు, స్నేహం వాటికి ఉన్న విలువలను ప్రస్పుటంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం యువత తెరకెక్కిస్తున్న చిత్రాల్లో మనం సమాజానికి ఏమి చేయగలం అనే ఆంశాలను చూపిస్తున్నారు. మానవ విలువలను చాటిచెబుతున్నారు.  దీంతో అవి యూట్యూబ్‌లో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమే
యువతలోనే ఉన్న ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకు ప్రొత్సాహం తోడైతే వారు సినీ దర్శకులుగా, నటి నటులుగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారి ద్వారా మంచి సందేశాత్మక చిత్రాలు సమాజానికి అందుతాయి.

సెల్‌ఫోన్లు,చిన్న కెమెరాలతోనే షూటింగ్‌
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్లలోనే యువత షార్ట్‌ ఫిలింలు రూపొందిస్తున్నారు. నటనపై ఆసక్తి ఉన్న వారు, దర్శకత్వం చేయగలిగిన యువకులు కలిసి ఒక బృందంగా ఏర్పడి ఈ లఘు చిత్రాలు రూపొందిస్తున్నారు. ఒకరు స్నేహమేరా జీవితం అంటే, మరొకరు కుటుంబ వ్యవస్థను మించింది లేదని, ఇంకొకరు కులాల కుంపట్ల వల్ల సమాజం దెబ్బతింటుందని, రాజకీయ వ్యవస్థ మారాలంటూ పలు సందేశాలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. అయితే కొందరు ఔత్సాహికులు ప్రతిఫలం ఆశించకుండా పెట్టుబడికి ముందుకు రావడంతో ఖర్చు వెనుకాడకుండా మంచి కెమెరాలు, డ్రోన్‌లతో షూటింగ్‌ జరపడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

నిర్మాతలు కావలెను
షార్ట్‌ ఫిలిం నిర్మించాలన్నా తమకు చాలా ఖర్చు అవుతోందని కొందరు యువత వాపోతున్నారు. ఆసక్తి కొలదీ నటీనటులు, దర్శకుడు ఉన్నా పెట్టుబడి పెద్ద సమస్యగా మారుతోంది. నిర్మాణం పూర్తైన దానికి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్, కెమెరా వంటివి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఆసక్తి ఉన్నా మధ్యలోనే వదిలేస్తున్నారు. అయితే తాజాగా నెట్‌లో పలు రకాల యాప్‌లు అందుబాటులోకి రావడంతో వాటి ద్వారానే ఎడిటింగ్, డబ్బింగ్‌ వంటి ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అయితే వాటిలో అంతగా క్వాలిటీ లేకపోవడంతో మంచి సందేశం ఉన్నా ఆంతగా ఆదరణ నోచుకోవడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖర్చులేనిలొకేషన్లు
కొవ్వూరు పరిసరాల్లో పలు ప్రాంతాలు షూటింగ్‌కు అనువుగా ఉండటంతో షార్ట్‌ ఫిలింల నిర్మాణం జోరందుకుంటుంది. ముఖ్యంగా కొవ్వూరు గోష్పాదక్షేత్రం, కుమారదేవం, వాడపల్లితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పెద్ద పెద్ద దర్శకులు చిత్రాలను నిర్మించడంతో, ఆ ప్రభావం ఈ ప్రాంత యువతపై పడిందని చెప్పవచ్చు. ఎక్కువగా కొవ్వూరు నుంచి పోలవరం వరకూ పెద్ద చిత్రాల షూటింగ్‌ జరుగుతోంది. వీటి ప్రేరణతోనే లఘ చిత్రాలను తీస్తున్నామని ఈ ప్రాంత యువత చెబుతున్నారు.

ఎన్నో కథలు ఉన్నాయి
షార్ట్‌ ఫిలింలు నిర్మించడానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో కథలు ఉన్నాయి. ఒక్కో షార్ట్‌ ఫిలిం నిర్మించాలంటే అతి తక్కువగా రూ.20 వేల నుంచి 50 వేల వరకూ అవుతుంది. అయితే పెట్టుబడి లేకపోవడంతో మాకు అందుబాటులో ఉన్న వాటితోనే నిర్మిస్తున్నాం. మాలాంటి యువతకు ఫిలిం మేకింగ్‌తో ఉచితంగా శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహం లభిస్తే మంచి సందేశాలు ఉన్న షార్ట్‌ ఫిలింలు నిర్మించ గలుగుతాం.   –పి. భరత్‌కుమార్, షార్ట్‌ ఫిలిం డైరెక్టర్, కొవ్వూరు

సొంత ఖర్చుతోనే నిర్మాణం
సినిమాలపై ఉన్న ఆసక్తితో సొంత ఖర్చుతోనే షార్ట్‌ ఫిలింలు నిర్మిస్తున్నాం. సమాజానికి మంచి సందేశం ఇవ్వడంతో పాటు, మాలో ఉన్న ప్రతిభను భయపెట్టేందుకు అవి ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. అయితే రానురాను షార్ట్‌ ఫిలింల నిర్మాణంలో ఖర్చు పెరుగుతుంది.–బి. ప్రసాద్, కొవ్వూరు

నటనపై ఆసక్తి ఉంది
నటించాలన్న ఆసక్తి ఉంది. అందుకే షార్ట్‌ ఫిలింలో నటిస్తున్నాను. చిన్ననాటి స్నేహితులమందరం కలిసి షార్ట్‌ ఫిలింలు నిర్మించి, నటిస్తున్నాం. మంచి సందేశం ఉన్న చిత్రాలను నిర్మించాలన్నదే లక్ష్యంగా ఉన్నాం. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తే మరిన్ని చిత్రాలు తీయవచ్చు–కొత్తమాసు వినయ్‌కుమార్‌

మార్పు కోసమే లఘు చిత్రాలు
సమాజంలో ఎంతో కొంత మార్పు తేవాలన్న ఉద్దేశంతో షార్ట్‌ ఫిలింలు తీస్తున్నా. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో “్ఙమార్పు’’ అనే పేరుతో ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై సందేశాన్ని ఇచ్చాను. అయితే షార్ట్‌ ఫిలింలు తీసే వారికి ప్రభుత్వం సహాయం చేస్తే మంచి చిత్రాలు అందించవచ్చు.                            –ఎన్‌ఎస్‌వీఎస్‌ఎం సాయి పవన్‌ కృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement