ఆశావాది కంటే బలవంతుడు ఎవరూ లేరు.ఆశ అనే విత్తనమే చెట్టు అనే విజయానికి మూలం.పర్యావరణ స్పృహకు సంబంధించిన విషయాలను ప్రచారం చేస్తున్న డిజిటల్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఆకాష్ రానిసన్‌కు సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండోర్‌కు చెందిన 28 సంవత్సరాల ఆకాష్ ‘గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్’ ద్వారా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాడు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ అనే పుస్తకం రాశాడు...
ఎనిమిది సంవత్సరాల క్రితం...
వాతావరణ మార్పులకు సంబంధించిన ఆర్టికల్స్ చదివిన ఆకాష్ అక్కడితో ఆగిపోలేదు. ఈ టాపిక్‌కు సంబంధించి ఎన్నో యూనివర్శిటీలలో ఎన్నో కోర్సులు చేశాడు. ఫలితంగా వాతావరణ మార్పుల గురించి లోతుగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది.తాను తెలుసుకున్న విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని గట్టిగా అనుకున్నాడు.ఆకాష్‌లో ఉన్న బలం... ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా, ఆకట్టుకునేలా చెప్పడం. ఆ ప్రతిభ ఇప్పుడు ఉపయోగపడింది.
‘క్లైమెట్ చేంజ్’కు సంబంధించిన విషయాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడానికి ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లు, డాక్యుమెంటరీలు, సోషల్ మీడియా కంటెంట్... ఇలా ఎన్నో దారుల్లో పయనించాడు. తాజాగా ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ పుస్తకం రాశాడు.‘గత పదిసంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు తిరిగాను. రుచికరమైన తిండి కోసమో, అద్భుత నిర్మాణాలను చూడడానికో నేను వెళ్లలేదు. ప్రకృతిని చూసి పరవశించడం కోసం తిరిగాను. ప్రకృతి పట్ల మన ఆరాధన ప్రకృతిని రక్షించుకోవాలనే బలమైన ఆకాంక్షకు కారణం అవుతుంది.
పర్యావరణ సంరక్షణ కోసం నా వంతుగా ఏంచేయగలను? అందుకు నాలో ఉన్న నైపుణ్యాలు ఏమిటి? అనే దాని గురించి ఆలోచించాను. నా వంతుగా చేయడానికి ఎన్నో దారులు కనిపించాయి. అది సోషల్ మీడియాలో పర్యావరణ సంరక్షణ ప్రచారం కావచ్చు, పుస్తకం రాయడం కావచ్చు’ అంటాడు ఆకాష్.పుస్తకం రాయడానికి ముందు ఆకాష్‌కు అర్థమైన విషయం ఏమంటే, పర్యావరణ సంరక్షణకు సంబంధించిన సమాచారం చాలా ఎక్కువగా ΄ాశ్చాత్యదేశాలకు సంబంధించే ఉంది. మన దేశంలోని వాతావరణ పరిస్థితులకు అది ఉపయోగపడదు. దీంతో దేశీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని రాశాడు. కర్బన ఉద్గారాల నుంచి క్లైమెట్ ఎమర్జెన్సీ వరకు ఎన్నో అంశాలను ఈ పుస్తకంలో చర్చించాడు.
‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ కోసం పర్యావరణవేత్తలు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లతో సంభాషించాడు.గతంలో ఎన్నో మంచి విషయాలు, పద్ధతులు ఉండేవి, అయితే అవి కాలగర్భంలో కలిసిపోయాయి. వాటిని మళ్లీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది అంటాడు ఆకాష్.‘ఇప్పుడు అన్నం మిగిలింది అంటే చెత్తబుట్టలో వేయడమే అన్నట్లుగా ఉంది. ఒకప్పుడు అలా కాదు రకరకాల దినుసులు కలిపి, వేడి చేసి మిగిలిన అన్నాన్ని వృథా కాకుండా చేసేవాళ్లు. చపాతీల విషయంలోనూ ఇంతే. ఈ ఆన్‌లైన్ ఫుడ్‌కాలంలో చిటికెలో ఏదైనా తినగలుగుతున్నాం.
అయితే వృథా అవుతున్న ఆహారంపై మాత్రం బొత్తిగా దృష్టి పెట్టడం లేదు. ఒకవైపు తిండి దొరకక ఆకలితో అల్లాడే మనుషులు, మరోవైపు ఆహార వృథా గురించి పట్టించుకోని మనుషులు. ఇదొక వైరుధ్యం’ అంటాడు ఆకాష్.ఒక్క ఆహార రంగం మాత్రమే కాదు టెక్ట్స్‌టైల్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో ఇండస్ట్రీలలో జరిగే వృథాను, పర్యావరణ చేటును కళ్లకు కడతాడు ఆకాష్.‘ఇక అంతా అయిపోయినట్లేనా...రానున్నది విలయ విధ్వంస కాలమేనా!’ అనే నిరాశవాదంలోకి ఎప్పుడూ వెళ్లడు. ఎందుకంటే మినిమలిస్ట్ లైఫ్ స్టైల్‌ను గడుపుతున్న ఆకాష్ తనను తాను ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ అని పరిచయం చేసుకుంటాడు. ‘మంచి పనుల ద్వారా మంచి కాలం వస్తుంది’ అని నమ్ముతాడు.
Comments
Please login to add a commentAdd a comment