environmentalists
-
మంచు‘మాయం’
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతోంది. మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి. హిమానీనదాలు క్రమంగా మాయమైపోతున్నాయి. ఆసియాలోని హిందూ కుష్‌తో పాటు పెరూ మంచు పర్వతాల్లోని హిమానీనదాల తగ్గుదల పర్యావరణవేత్తలను, శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలోని హిమానీనదాల్లో దశాబ్ద కాలంలో 332 గిగాటన్నుల మంచు అదృశ్యమైందని అంచనా. ఇక ఆసియాలోని హిందూ కుష్ హిమాలయాలు అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, భారత్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్ మీదుగా 3,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఇవి వేగంగా కరిగిపోతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి వాటి పరిమాణంలో 75 శాతం వరకు కోల్పోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే.. ఈ హిమానీనదాల దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయని, తీవ్ర నీటి ఎద్దడి తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాదాపు 200 కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. హిమాలయ పర్వతాల దిగువున ఉన్న 12 హిమానీనదాల్లోని నీటి లభ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరెస్ట్ శ్రేణుల్లో గత 30 ఏళ్లలోనే 2 వేల సంవత్సరాలకు సంబంధించిన మంచు కరిగిపోయిందని పరిశోధకులు తేల్చారు. భూతాపంతో భారీ నష్టం.. భూతాపాన్ని 1.5 డిగ్రీల వద్ద కట్టడి చేయడంలో ప్రపంచ దేశాలన్నీ విఫలమయ్యాయి. ఫలితంగా సెప్టెంబర్ 17న భూతాపం 2 డిగ్రీల మార్కును చేరుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే హిందూకుష్ హిమానీ నదాలు 2100వ సంవత్సరం నాటికి 30 నుంచి 50 శాతం మేర కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భూతాపం 3 డిగ్రీల మార్కుకు చేరితే నేపాల్, భూటాన్లలో 75 శాతం మేర మంచు కరిగిపోయే ప్రమాదముంది. అదే 4 డిగ్రీలకు పెరిగితే నష్టం 80 శాతానికి చేరుకుంటుంది. పెరూలో దారుణ పరిస్థితి.. ప్రపంచంలోని ఉష్ణమండల హిమానీనదాల్లో 68 శాతం పెరూలో ఉన్నాయి. గత ఆరు దశాబ్దాల్లో తలెత్తిన వాతావరణ మార్పుల వల్ల పెరూలోని హిమానీనదాల వైశాల్యం సగానికి పైగా తగ్గిపోయింది. 2016– 2020 మధ్య తలెత్తిన వాతావరణ మార్పులతో 175 హిమానీనదాలు అంతరించిపోయినట్టు పెరూవియన్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి తాజా పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పెరూలోని కొన్ని పర్వత శ్రేణుల్లో ప్రస్తుతం 1,050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే మంచు ఉంది. 1962వ సంవత్సరంలో 2,399 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం ఇలాగే కొనసాగితే పెను వినాశనం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. -
ఆకాశమంత ఆశ
ఆశావాది కంటే బలవంతుడు ఎవరూ లేరు.ఆశ అనే విత్తనమే చెట్టు అనే విజయానికి మూలం.పర్యావరణ స్పృహకు సంబంధించిన విషయాలను ప్రచారం చేస్తున్న డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ ఆకాష్ రానిసన్కు సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండోర్‌కు చెందిన 28 సంవత్సరాల ఆకాష్ ‘గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్’ ద్వారా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాడు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ అనే పుస్తకం రాశాడు... ఎనిమిది సంవత్సరాల క్రితం... వాతావరణ మార్పులకు సంబంధించిన ఆర్టికల్స్ చదివిన ఆకాష్ అక్కడితో ఆగిపోలేదు. ఈ టాపిక్కు సంబంధించి ఎన్నో యూనివర్శిటీలలో ఎన్నో కోర్సులు చేశాడు. ఫలితంగా వాతావరణ మార్పుల గురించి లోతుగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది.తాను తెలుసుకున్న విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని గట్టిగా అనుకున్నాడు.ఆకాష్లో ఉన్న బలం... ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా, ఆకట్టుకునేలా చెప్పడం. ఆ ప్రతిభ ఇప్పుడు ఉపయోగపడింది. ‘క్లైమెట్ చేంజ్’కు సంబంధించిన విషయాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడానికి ఆర్ట్ ఇన్స్టాలేషన్లు, డాక్యుమెంటరీలు, సోషల్ మీడియా కంటెంట్... ఇలా ఎన్నో దారుల్లో పయనించాడు. తాజాగా ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ పుస్తకం రాశాడు.‘గత పదిసంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు తిరిగాను. రుచికరమైన తిండి కోసమో, అద్భుత నిర్మాణాలను చూడడానికో నేను వెళ్లలేదు. ప్రకృతిని చూసి పరవశించడం కోసం తిరిగాను. ప్రకృతి పట్ల మన ఆరాధన ప్రకృతిని రక్షించుకోవాలనే బలమైన ఆకాంక్షకు కారణం అవుతుంది. పర్యావరణ సంరక్షణ కోసం నా వంతుగా ఏంచేయగలను? అందుకు నాలో ఉన్న నైపుణ్యాలు ఏమిటి? అనే దాని గురించి ఆలోచించాను. నా వంతుగా చేయడానికి ఎన్నో దారులు కనిపించాయి. అది సోషల్ మీడియాలో పర్యావరణ సంరక్షణ ప్రచారం కావచ్చు, పుస్తకం రాయడం కావచ్చు’ అంటాడు ఆకాష్.పుస్తకం రాయడానికి ముందు ఆకాష్‌కు అర్థమైన విషయం ఏమంటే, పర్యావరణ సంరక్షణకు సంబంధించిన సమాచారం చాలా ఎక్కువగా ΄ాశ్చాత్యదేశాలకు సంబంధించే ఉంది. మన దేశంలోని వాతావరణ పరిస్థితులకు అది ఉపయోగపడదు. దీంతో దేశీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని రాశాడు. కర్బన ఉద్గారాల నుంచి క్లైమెట్ ఎమర్జెన్సీ వరకు ఎన్నో అంశాలను ఈ పుస్తకంలో చర్చించాడు. ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ కోసం పర్యావరణవేత్తలు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లతో సంభాషించాడు.గతంలో ఎన్నో మంచి విషయాలు, పద్ధతులు ఉండేవి, అయితే అవి కాలగర్భంలో కలిసిపోయాయి. వాటిని మళ్లీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది అంటాడు ఆకాష్.‘ఇప్పుడు అన్నం మిగిలింది అంటే చెత్తబుట్టలో వేయడమే అన్నట్లుగా ఉంది. ఒకప్పుడు అలా కాదు రకరకాల దినుసులు కలిపి, వేడి చేసి మిగిలిన అన్నాన్ని వృథా కాకుండా చేసేవాళ్లు. చపాతీల విషయంలోనూ ఇంతే. ఈ ఆన్లైన్ ఫుడ్కాలంలో చిటికెలో ఏదైనా తినగలుగుతున్నాం. అయితే వృథా అవుతున్న ఆహారంపై మాత్రం బొత్తిగా దృష్టి పెట్టడం లేదు. ఒకవైపు తిండి దొరకక ఆకలితో అల్లాడే మనుషులు, మరోవైపు ఆహార వృథా గురించి పట్టించుకోని మనుషులు. ఇదొక వైరుధ్యం’ అంటాడు ఆకాష్.ఒక్క ఆహార రంగం మాత్రమే కాదు టెక్ట్స్‌టైల్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో ఇండస్ట్రీలలో జరిగే వృథాను, పర్యావరణ చేటును కళ్లకు కడతాడు ఆకాష్.‘ఇక అంతా అయిపోయినట్లేనా...రానున్నది విలయ విధ్వంస కాలమేనా!’ అనే నిరాశవాదంలోకి ఎప్పుడూ వెళ్లడు. ఎందుకంటే మినిమలిస్ట్ లైఫ్ స్టైల్‌ను గడుపుతున్న ఆకాష్ తనను తాను ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ అని పరిచయం చేసుకుంటాడు. ‘మంచి పనుల ద్వారా మంచి కాలం వస్తుంది’ అని నమ్ముతాడు. -
భూతాపం.. పర్యావరణంపై ప్రతాపం
భూ గ్రహం వేగంగా వేడెక్కుతోంది. మానవ అనుచిత ప్రవర్తన వాతావరణ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. పర్యావరణ క్రియాశీలతలో పెనుమార్పులు తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అడవులు ధ్వంసం కావటం గ్లోబల్ వార్మింగ్ సంకేతాలను బలంగా వినిపిస్తోంది. భూమిపై కర్బన ఉద్గారాల్లో దాదాపు 15 శాతం అటవీ నిర్మూలన కారణంగానే వెలువడుతుండగా.. ఏటా 10 మిలియన్ హెక్టార్లలో ఉష్ణమండల అడవులు తరిగిపోతున్నాయి. దీనిని 2030 నాటికి అరికట్టకుంటే గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగకుండా పరిమితం చేయడం అసాధ్యమని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక హెచ్చరిస్తోంది. – సాక్షి, అమరావతి ఉష్ణ మండలంలో 2002 నుంచి 60 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ అడవుల్ని కోల్పోయామని.. ఇది ఫ్రాన్స్ దేశ పరిమాణానికి సమానమని డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ఉష్ణ మండల అడవుల నరికివేతలో 80 శాతం కంటే ఎక్కువ వ్యవసాయం కోసం చేస్తున్నట్టు గుర్తించింది. 2021లోనే 11.0 మిలియన్ హెక్టార్లలో చెట్లు అంతరించిపోగా.. ఇందులో 3.75 మిలియన్ హెక్టార్లు ఉష్ణ మండల ప్రాథమిక వర్షారణ్యాల ధ్వంసం ఫలితంగా 2.5 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయి. ఇవి భారతదేశంలో వెలువడే వార్షిక శిలాజ ఇంధన ఉద్గారాలతో సమానంగా ఉండటం గమనార్హం. గ్రీన్హౌస్ వాయువులు, కర్బన ఉద్గారాలను 2030 నాటికి కనీసం 43 శాతానికి, 2035 నాటికి 60 శాతానికి తగ్గించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. భూతాపం కట్టడి చేయకపోతే.. పారిశ్రామిక విప్లవానికి ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ప్రపంచంలో సగటున 1.15 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంటే.. భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే పెరగకుండా కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఫలితంగా తీరప్రాంత దేశాలైన భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్ ఏంజిలిస్, న్యూయార్క్, బ్యూనస్ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు వాటిల్లుతుంది. మునుపటి శతాబ్దాల కంటే 1900 నుంచి ప్రపంచ సగటు సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ మించి పెరగకుండా పరిమితం చేయగలిగితే.. వచ్చే 2 వేల సంవత్సరాలలో ప్రపంచ సగటు సముద్ర మట్టం 2 నుంచి 3 మీటర్లు పెరుగుతుంది. 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలతో సముద్రాలు 6 మీటర్లు, 5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలతో సముద్రాలు 22 మీటర్లు వరకు పెరగవచ్చు. దీనివల్ల లోతట్టు ప్రాంతాలు, మొత్తం దేశాలు జలసమాధి అవుతాయి. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. ఇది భూ తాపంపై 1.50 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగకుండా ఉంచేందుకు అడవులను కాపాడాలని డబ్ల్యూఈఎఫ్ సూచిస్తోంది. ఇందుకు 100 బిలియన్ల డాలర్ల నుంచి 390 బిలియన్ల డాలర్ల వరకు ఖర్చవుతుందని భావిస్తోంది. ప్రపంచ జీడీపీలో సగాని కంటే ఎక్కువ.. అంటే దాదాపు 44 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక విలువ ప్రకృతిపై ఆధారపడి ఉంటుందని.. దాదాపు 1.60 బిలియన్ల మంది ప్రజలు ఆహారం, నీరు, కలప, ఉపాధి కోసం అడవులపై ఆధారపడుతున్నారని వెల్లడించింది. మన దేశంలో ఏటా గ్రీస్ దేశమంత అడవికి నష్టం 2021లో భారతదేశంలో వెలువడిన ఇంధన ఉద్గారాల కంటే వర్షారణ్యాల ధ్వంసం ద్వారా వచ్చిన కార్బన్డైఆౖMð్సడ్ ఎక్కువ ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ఇక్కడ ఏటా జరిగే అటవీ నిర్మూలన శాతం గ్రీస్ దేశ పరిమాణానికి దగ్గరగా ఉందని వివరించింది. అటవీ నిర్మూలన, మానవ నివాసాల విస్తరణ, వ్యవసాయం, అడవుల్లో అధికంగా పశువులను మేపడం వంటి కారణాలతో మానవ, జంతువుల మధ్య దాడులకు దారి తీస్తున్నాయి. అడవులు తగ్గిపోతుండటంతో వన్యప్రాణులు తమ భూ భాగాలను కోల్పోతున్నాయి. ఆహారం, ఆశ్రయం లేకపోవడంతో పెద్దఎత్తున బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని మూడు ప్రధాన పులుల అభయారణ్యాలలో చుట్టుపక్కల మానవ–జంతు సంఘర్షణ పెరిగినట్టు నివేదిక పేర్కొంది. -
హిమానీ నదాలు శరవేగంగా కనుమరుగు! విస్మయకర వాస్తవాలు వెలుగులోకి
హిమాలయాల్లో హిమానీ నదులు శరవేగంగా కరిగిపోతున్నాయి. ఎంతగా అంటే, గత 20 ఏళ్లలో కరిగిపోయిన హిమానీ నదాల పరిమాణం ఏకంగా 57 కోట్ల ఏనుగుల బరువుతో సమానమట! అంటే హీనపక్షం 170 కోట్ల టన్నుల పై చిలుకే...! ఈ ప్రమాదకర పరిణామాన్ని పర్యావరణవేత్తలు, సైంటిస్టులు ఆలస్యంగా గుర్తించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే అతి తొందర్లోనే హిమాలయాల్లో పెను మార్పులు చూడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు... 2000 నుంచి 2020 మధ్య కేవలం 20 సంవత్సరాల్లో హిమాలయాల్లో ప్రోగ్లేషియల్ సరస్సులు ఏకంగా 47 శాతం పెరిగాయి. సరస్సుల సంఖ్య పెరిగితే మంచిదే కదా అంటారా? కానే కాదు. ఎందుకంటే హిమానీ నదాలు కరిగిపోయి కనుమరుగయ్యే క్రమంలో ఏర్పడే సరస్సులివి! ఇవి ఎంతగా పెరిగితే హిమానీ నదాలు అంతగా కుంచించుకుపోతున్నట్టు అర్థం! ఈ పరిణామామంతా చాలావరకు భూమి పై పొరకు దిగువన జరుగుతుంది గనుక ఇంతకాలం పర్యావరణవేత్తల దృష్టి దీనిపై పడలేదు. కానీ ఈ సరస్సుల సంఖ్య బాగా పెరిగిపోతుండటంతో ఈ పరిణామంపై వాళ్లు ఇటీవలే దృష్టి సారించారు. హిమాలయాల్లో కరిగిపోతున్న హిమనీ నదాల పరిమాణాన్ని తొలిసారిగా లెక్కగట్టగా ఈ విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్‌లోని సెయింట్ ఆండ్రూస్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కార్నిగీ మెలన్ వర్సిటీలకు చెందిన రీసెర్చర్ల బృందంలో ఇందులో పాల్గొంది. అధ్యయన ఫలితాలను నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘హిమాలయాల వద్ద భూ ఫలకాలు అత్యంత చురుగ్గా ఉంటాయి. నిత్యం కదలికలకు లోనవుతూ ఉంటాయి. దాంతో హిమానీ నదాల ప్రవాహ మార్గాలు తరచూ మారిపోతున్నాయి’’ అన్నారు. హిమాలయాల్లో 6.5 శాతం తగ్గిన మంచు ♦ తాజా అధ్యయనం పలు ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెచ్చింది. వాటిలో ప్రధానమైనవి... ♦ కనుమరుగవుతున్న హిమానీ నదాల రూపంలో గ్రేటర్ హిమాలయాలు ఇప్పటికే తమ మొత్తం మంచులో 6.5 శాతాన్ని కోల్పోయాయి. ♦ మధ్య హిమాలయాల్లో హిమానీ నదాల అంతర్థానం చాలా వేగంగా కొనసాగుతోంది. ♦ గాలోంగ్ కో హిమానీ నదం ఇప్పటికే ఏకంగా 65 శాతం కనుమరుగైంది. ♦ హిమాలయాల్లో 2000–2020 మధ్య ప్రోగ్లేషియల్ సరస్సుల సంఖ్యలో 47 శాతం, విస్తీర్ణంలో 33 శాతం, పరిమాణంలో 42 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది ♦ ఇందుకు కారణం హిమాలయాల్లోని హిమానీ నదుల పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 1.7 గిగాటన్నుల మేరకు తగ్గిపోవడమే. అంటే 1.7 లక్షల కోట్ల కిలోలన్నమాట! ఇది భూమిపై ఉన్న మొత్తం ఏనుగుల బరువుకు కనీసం 1,000 రెట్లు ఎక్కువ!! ♦ ఈ ధోరణి 21వ శతాబ్దం పొడవునా కొనసాగుతుందని పరిశోధకులు అంచనా వేశారు. ♦ ఫలితంగా హిమాలయాల్లోనే గాక ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా హిమానీ నదాలు ప్రస్తుతం భావిస్తున్న దానికంటే అతి వేగంగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మిత్రుడికి ముప్పు!
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కీటకాల పాత్ర కీలకం. మానవాళి కంటే దాదాపు 17 రెట్లు అధికంగా ఉండే కీటకాల జనాభా ప్రస్తుతం ముప్పు ఎదుర్కొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం కీటక జాతులు తగ్గిపోతున్నాయని, మూడో వంతు అంతరించిపోతున్నట్లు బయోలాజికల్ కన్జర్వేషన్ నివేదిక వెల్లడిస్తోంది. జనావాసాల పెరుగుదల, విచ్చలవిడిగా పురుగు మందులు, ఎరువుల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా మిత్ర కీటకాలు నశిస్తున్నాయి. పర్యావరణ నిపుణులు దీన్ని ‘కీటకాల అపోకలిప్స్’గా అభివర్ణిస్తున్నారు. ఆహార చక్రంలో ఎంతో కీలకం ప్రపంచవ్యాప్తంగా 5.5 మిలియన్ జాతుల కీటకాలు ఉన్నట్లు అంచనా వేయగా ఇప్పటివరకు కేవలం ఒక మిలియన్ జాతులను మాత్రమే గుర్తించారు. భూమిపై జంతు జాలంలో 80 శాతం కీటకాలే ఉండటం గమనార్హం. ఆహార పంటల పరాగ సంపర్కంతో పాటు తెగుళ్ల నియంత్రణ వ్యవస్థలుగా, భూమిని రీసైక్లింగ్ చేసే డీకంపోజర్లుగా పర్యావరణాన్ని కీటకాలు కాపాడుతున్నాయి. ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ నివేదిక ప్రకారం భూమిపై ఉన్న 2.50 లక్షల రకాల పుష్పించే మొక్కలను పరాగ సంపర్కం చేయడంలో లక్ష కంటే ఎక్కువ కీటక జాతుల పాత్ర కీలకం. ఇందులో తేనెటీగలు, కందిరీగలు, సీతాకోక చిలుకలు, ఈగలు, బీటిల్స్ లాంటివి ఉన్నాయి. ఆహార చక్రంలో కీలక పాత్ర పోషించే కీటకాలు ఒక్క అమెరికాలోనే ఏటా 70 బిలియన్ డాలర్ల విలువైన సేవలను అందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా 1–2 శాతం క్షీణత.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 నుంచి 2 శాతం కీటకాలు నశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత 30 ఏళ్లలో కీటకాల సంఖ్య దాదాపు 25 శాతం తగ్గింది. పక్షులు, క్షీరదాలు, సరీసృపాల కంటే కీటకాలు అంతరించిపోయే రేటు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. కీటకాల సంఖ్య క్షీణిస్తే ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 35 శాతం ఆహార పంటలకు పరాగ సంపర్కమే ఆధారం కావడం కీటకాల మనుగడ ఆవశ్యకతను సూచిస్తోంది. ♦ మానవులు దాదాపు 2 వేల కీటకాలను ఆహారంగా భుజిస్తారు. ♦ 75 శాతం కంటే ఎక్కువ కీటకాలు పరాగ సంపర్కంతో ఆహార చక్రాన్ని పరిరక్షిస్తాయి. ♦ దీని విలువ ఏటా 577 బిలియన్ల డాలర్లు ఉంటుంది. ♦ ప్రకృతిలో దాదాపు 80 శా>తం అడవి మొక్కలు పరాగ సంపర్కం కోసం కీటకాలపై ఆధారపడతాయి. ♦ గత 150 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 2.50 లక్షల నుంచి 5 లక్షల కీటక జాతులు అంతరించాయి. -
అంటార్కిటికా కరిగిపోతోంది!
పర్యావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటి దెబ్బకు హిమ ఖండమైన అంటార్కిటికాలోనే మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది! ఈ పరిణామంపై పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని దిద్దుబాటు చర్యలకు పూనుకోకుంటే పెను విపత్తులను చేజేతులా ఆహ్వనించినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు! అంటార్కిటికాలో సముద్రపు మంచు పరిమాణం ఫిబ్రవరి 25న ఏకంగా 17.9 లక్షల చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. అక్కడి తేలియాడే మంచు పరిమాణాన్ని ఉపగ్రహ పరిశీలనల సాయంతో ఎప్పటికప్పుడు కచ్చితంగా లెక్కించడం మొదలు పెట్టిన గత 40 ఏళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి ఇదే! ఇలా అంటార్కిటికాలో మంచు పరిమాణం అత్యల్ప స్థాయిలకు పడిపోవడం గత ఆరేళ్లలోనే ఏకంగా ఇది మూడోసారి కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. 2022లో అది 19.2 లక్షల చదరపు కి.మీ.గా తేలింది. 1979లో ఉపగ్రహ ఆధారిత గణన మొదలైన నాటినుంచీ అదే అత్యల్పం! ఈ రికార్డు గత ఫిబ్రవరిలో బద్దలై మంచు పరిమాణం 17.9 లక్షల చదరపు కి.మీ.గా నమోదైంది. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 1.36 లక్షల చదరపు కి.మీ. మేరకు తగ్గిందన్నమాట! ధ్రువ ప్రాంతాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను ఇదిప్పుడు ఎంతగానో కలవరపరుస్తోంది. అంటార్కిటికాలో ఎక్కడ చూసినా మంచు పరిమాణం బాగా తగ్గిపోతోందంటూ ఆ్రస్టేలియాలోని టాస్మేనియా యూనివర్సిటీలో అంటార్కిటికా ఖండపు మంచుపై ఎంతోకాలంగా పరిశోధనలు చేస్తున్న డాక్టర్ విల్ హాబ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖండపు పశ్చిమ భాగంలో గతేడాది మంచు ఊహాతీతంగా కరిగిపోయిందని, ఆ నష్టం నుంచి ఆ ప్రాంతాలింకా తేరుకోనే లేదని చెప్పారాయన. ‘‘నిజానికి సముద్రపు మంచుకు పరావర్తన గుణం చాలా ఎక్కువ. కనుక సూర్యరశ్మి కి పెద్దగా కరగదు. కానీ దాని వెనకాల నీరు చేరితే మాత్రం కిందనుంచి కరుగుతూ వస్తుంది. ఇప్పుడదే జరుగుతోంది’’ అని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ తీరాలన్నీ మునకే! ♦ అంటార్కిటికా మహాసముద్రంలో ఉండే అపార హిమ రాశి తీరానికి కాస్త సమీపంలో ఉండే మంచుపై తుఫాను గాలుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. ఆ హిమ రాశి ప్రస్తుత వేగంతో కరిగిపోతూ ఉంటే అలల తాకిడి వేగం బాగా పెరుగుతుంది. దాంతో సముద్రంలో తీరానికి సమీపంలో ఉన్న మంచూ క్రమంగా బలహీనపడి కరుగుతుంది. తర్వాత ఆ ఖండంలో నేలపై ఉన్న అపారమైన మంచుకు, హిమానీ నదులకు స్థిరత్వమిచ్చే ఈ ఆసరా శాశ్వతంగా కనుమరుగవుతుంది. ♦ పశ్చిమ అంటార్కిటికాలోని అముండ్సెన్, బెలింగ్హసన్ సముద్రాల్లో మంచు ఊహాతీత వేగంతో కరగడం శాస్త్రవేత్తలను మరీ కలవరపెడుతోంది. అంటార్కిటికాలో సగటు మంచు పరిమాణం 2014 దాకా ఎంతో కొంత పెరిగిన సమయంలో కూడా ఈ సముద్రాల్లో మంచు కరుగుతూనే వచ్చింది! ♦ పశ్చిమ అంటార్కిటికాలోనే ఉన్న త్వాయిట్స్ హిమానీ నదం కూడా క్రమంగా కరుగుతోంది. కేవలం ఇదొక్కటి గనక పూర్తిగా కరిగిందంటే సముద్ర మట్టాలు ఏకంగా అర మీటరు పెరుగుతాయి! అందుకే దీన్ని ‘డూమ్స్‌డే గ్లేసియర్’గా పిలుస్తారు! ♦ గత ఫిబ్రవరిలో తొలిసారిగా అంటార్కిటికా ఖండపు తీర రేఖలో ఏకంగా మూడింట రెండు వంతులు ఏ మాత్రం మంచు లేకుండా సముద్రపు జలాలతో బోసిపోయి కనిపించిందట! ♦అంటార్కిటికా సముద్రంలోని అపారమైన మంచు ఇలా కరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు మీటర్ల మేరకు పెరుగుతాయి! ♦ దాంతో తీర ప్రాంతాలన్నీ ముంపు బారిన పడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహా నగరాలెన్నో ఈ జాబితాలోకి వస్తాయి! అది కోట్లాది మందిని నిర్వాసితులను చేసి ఊహించని పెను విషాదానికి దారి తీస్తుంది. మున్ముందు మరింత ముప్పే! సమీప భవిష్యత్తులో అంటార్కిటికాలో మంచు కరిగే వేగం తగ్గే సూచనలేవీ పెద్దగా లేవని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అంటార్కిటికాపై కొన్నేళ్లుగా చాలా పడుతోంది. కనుక సముద్రపు మంచు కరిగే వేగానికి ఇప్పుడప్పట్లో అడ్డుకట్ట పడుతుందని భావించడం అత్యాశే’’ అని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన ఓషనోగ్రాఫర్, వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లండ్ కుండబద్దలు కొట్టారు. అక్కడి మంచు ఈ స్థాయిలో కరగడం కచ్చితంగా పెను ప్రమాద సూచికేనని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు ఇప్పుడు అంటార్కిటికా సముద్రంలోని మంచు ఈ స్థాయిలో కరిగిపోతుండటం వెనక గ్లోబల్ వారి్మంగ్‌తో పాటు ఇంకేమేం కారణాలున్నాయో వెదికి వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు. కోల్‌కతా, చెన్నైలకు ముంపు ముప్పు.. సముద్ర మట్టాల పెంపు వల్ల ముప్పు ముంపున్న మహా నగరాల జాబితాలో కోల్‌కతా, చెన్నై ముందున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే పెరుగుతూ ఉంటే 2100 నాటికి ఆ రెండు నగరాల్లో సముద్ర మట్టాలు 20 నుంచి 30 శాతం దాకా పెరిగే ప్రమాదముందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఆసియాలో యాంగూన్, బ్యాంకాక్, హోచిమిన్ సిటీ, మనీలా కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. ♦ సముద్ర ప్రవాహాల్లో మార్పుల వల్ల సముద్ర మట్టాల్లో పెరుగుదల ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. వీటితో పాటు ఎల్ నినో తదితరాల ప్రభావాలను కూడా అధ్యయనం చేసి న మీదట ఈ నివేదికను రూపొందించారు. విశేషాలు... ♦ సముద్ర మట్టాల్లో పెరుగుదల కేవలం వాతావరణ మార్పులతో పోలిస్తే అంతర్గత వాతావరణ మార్పులూ తోడైనప్పుడు మరో 20, 30 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఎక్కువగా ఉంటుంది! ♦ అమెరికా పశ్చిమ తీరంతో పాటు ఆ్రస్టేలియాకు కూడా ఈ ముంపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ♦ దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కోల్‌కతా, ముంబై తీర ప్రాంతాల్లో వరదలు 2006తో పోలిస్తే 2100 నాటికి కనీసం 18 రెట్ల నుంచి ఏకంగా 96 రెట్ల దాకా పెరిగే ఆస్కారముంది. -
పరవళ్లతో పునరుజ్జీవం
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా ఇసుక మేటలతో ఎడారిని తలపించిన వేదవతి నది ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. గతేడాది ఆగస్టు 3 నుంచి ఈ ఏడాది జనవరి 9 వరకూ అంటే.. 159 రోజులపాటు కర్ణాటకలోని వాణివిలాస రిజర్వాయర్.. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)ల గేట్లను ఎత్తేశారంటే.. వేదవతి ప్రవాహ ఉధృతి ఏ స్థాయిలో సాగిందో అంచనా వేసుకోవచ్చు. వాణివిలాస రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 30.422 టీఎంసీలైతే.. ఆ రిజర్వాయర్‌లోకి 78.32 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఆయకట్టుకు నీళ్లందిస్తూ.. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు 32.179 టీఎంసీలు విడుదల చేశారు. వాణివిలాస రిజర్వాయర్‌కు 109 కి.మీల దిగువన.. కర్ణాటక సరిహద్దుకు 1.5 కి.మీల దూరంలో అనంతపురం జిల్లాలో గుమ్మఘట్ట మండలంలో రెండు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)లోకి 2022 ఆగస్టు 3 నుంచి జనవరి 9 వరకూ 65.63 టీఎంసీల ప్రవాహం వస్తే.. ఆయకట్టుకు నీళ్లందిస్తూ, ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేస్తూ 62 టీఎంసీలను దిగువకు వదిలేశారు. ఆ జలాలు తుంగభద్ర మీదుగా శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరాయి. అంటే.. బీటీపీ సామర్థ్యం కంటే 63 టీఎంసీలు ఎక్కువ వచ్చినట్లు స్పష్టమవుతోంది. 89 ఏళ్ల తర్వాత నిండిన ‘వాణివిలాస’ ► ఇక వేదవతిపై కర్ణాటకలో 1907లో నిర్మించిన వాణివిలాస రిజర్వాయర్ 1933, సెప్టెంబరు 2న నిండింది. ఆ తర్వాత గతేడాది ఆగస్టు 3న అంటే 89 ఏళ్ల తర్వాత నిండింది. దాంతో 50 వేల ఎకరాలకు ఖరీఫ్‌లో నీళ్లందించారు. ► ఇక అనంతపురం జిల్లాలో బీటీపీ ప్రాజెక్టు దశాబ్దం తర్వాత నిండింది. గతేడాది ఆగస్టు 8న 55,574 క్యూసెక్కుల ప్రవాహం డ్యామ్‌లోకి వచ్చింది. డ్యామ్ చరిత్రలో అంటే 1961 నుంచి ఇప్పటివరకూ గరిష్ట వరద ఇదే. ► వర్షాకాలం ముగియడంతో వరద ప్రవాహం నవంబర్లోనే తగ్గింది. ఆ తర్వాత నదిలో సహజసిద్ధ ప్రవాహం ప్రారంభమై.. ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్నిబట్టి చూస్తే.. వేదవతి పునరుజ్జీవం పోసుకున్నట్లేనని పర్యావరణవేత్తలు విశ్లేషిస్తున్నారు. సబ్‌సర్ఫేస్ డ్యామ్‌లు, ఇసుక తవ్వకాల నియంత్రణతో.. ► కృష్ణా నదికి కోయినా, మలప్రభ, ఘటప్రభ, బీమా, తుంగభద్ర, మూసీ, పాలేరు, మున్నేరులతోపాటు వేదవతి కూడా ప్రధాన ఉప నది. కర్ణాటకలో చిక్‌మగళూరు జిల్లాలోని పశ్చిమ కనుమల్లో చంద్రవంక పర్వత శ్రేణుల్లో వేద, అవతి నదులు పురుడుపోసుకుని.. పుర వద్ద రెండు నదులు కలిసి వేదవతిగా మారి కర్ణాటకలో తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి.. రాష్ట్రంలో అనంతపురం, కర్నూల్ జిల్లాల మీదుగా 391 కి.మీలు ప్రవహించి.. బళ్లారి జిల్లా సిరిగుప్ప వద్ద తుంగభద్రలో కలుస్తుంది. ► కృష్ణా నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 2,58,948 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించగా.. అందులో వేదవతి బేసిన్ విస్తీర్ణం 23,590 చ.కి.మీలు (9.1 శాతం). ► వేదవతి జన్మించే చంద్రవంక పర్వతాల్లోనూ.. ప్రవహించే హగరి లోయలోనూ వర్షాభావ పరిస్థితులవల్ల ప్రవాహం లేక ఇసుక మేటలతో జీవం కోల్పోయింది. దాంతో ఎగువ నుంచి వేదవతి ద్వారా కృష్ణా నదిలోకి పెద్దగా వరద ప్రవాహం చేరడంలేదు. ► గత నాలుగేళ్లుగా వేదవతి బేసిన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. నదికి జీవం పోయాలనే లక్ష్యంతో వేదవతిపై అటు కర్ణాటక.. ఇటు రాష్ట్రంలో సబ్ సర్ఫేస్ డ్యామ్‌లు నిర్మించారు. ఇసుక తవ్వకాలను నియంత్రించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం నదిలోకి వచ్చే వరదను నదీ గర్భంలోకి ఇంకింపచేయడంలో సబ్ సర్ఫేస్ డ్యామ్‌లు దోహదం చేశాయి. ఇసుక తవ్వకాలను నియంత్రించడంవల్ల నీటి ప్రవాహంతో వేదవతి జీవం పోసుకుంది. -
ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి.. లంకమలలో కలివి కోడి జాడేది?
వైఎస్సార్ జిల్లాలో ఓ వైపు శేషాచలం.. మరోవైపు నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. అదే జిల్లాలోని సిద్ధవటం–బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఓ పక్షి ‘ట్విక్–టూ.. ట్విక్–టూ’ అని అరుస్తోంది. ఎంత అన్వేషించినా దాని జాడ మాత్రం కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో పెరిగే కలివి పొదల్లో నివసించే ఈ నిశాచర పక్షిని ‘కలివి కోడి’ అని పిలుస్తున్నారు. ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని ప్రపంచం పక్షిశాస్త్ర నిపుణులు తేల్చేయగా.. ఇప్పటికీ సిద్ధవటం అటవీ ప్రాంతంలోని పొదల్లో ఇవి సజీవంగా ఉన్నాయని ఎస్వీ యూనివర్సిటీ బృందం చెబుతోంది. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో కలివి కోడి జాడను కనిపెట్టవచ్చంటోంది. కలివికోడి ఆవాసం కోసం సిద్ధవటం ప్రాంతంలో సుమారు 3 వేల ఎకరాలను రూ.28 కోట్లతో సేకరించి 177 కెమెరాలతో పరిశోధకులు అన్వేషిస్తున్నారు. సాక్షి, అమరావతి: ‘కలివి కోడి’.. నిజానికి ఇది కోడి కాదు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. రంగు రంగుల ఈకలు.. చిన్నపాటి ఆకారం.. వినసొంపైన కూతలతో ఆకట్టుకునే కలివి కోడి (జర్డాన్స్ కోర్సర్) సంక్షోభంలో పడింది. అత్యంత అరుదైన ఈ పక్షి అంతరించిపోతున్న జాతుల్లో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలోని లంకమల అడవుల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా కలివి కోడి కనిపించదు. ఇది వందేళ్ల క్రితమే అంతరించిపోయిందని ప్రపంచ పక్షి శాస్త్రవేత్తలు భావించినా.. లంకమల అడవుల్లో ఇంకా సంచరిస్తూనే ఉందని అడపాదడపా వార్తలు వెలువడుతున్నాయి. వైఎస్సార్ జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో వీటి జాడ కనిపించడంతో ఆ ప్రాంతాన్ని లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట కలివికోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్లపాటు శోధించినా.. కలివి కోళ్ల ఆచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 కోట్లు ఖర్చు చేసి రెండేళ్లపాటు అలుపెరగని ప్రయత్నాలు జరిపినా ఫలితం కనిపించలేదని ఎస్వీ వర్సిటీ జువాలజీ విభాగానికి చెందిన మాణిక్యం తెలిపారు. అన్నీ కాలాలు, అన్ని ప్రాంతాల్లో శోధించి, పరిశోధనలు చేస్తే తప్ప కలివి కోడి పూర్తిగా అంతరించిందని చెప్పలేమంటున్నారు. లంకమల అభయారణ్యంలోని వీటి ఆవాసాలను పోలిన ఆవాసాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని సమగ్ర సర్వే చేస్తే ఈ పక్షి జాతిని గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పక్షి కోసం అన్వేషణను కొనసాగించి.. వీటిని పరిరక్షించడం అందరి బాధ్యతని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం కడపటి చూపు కలివి కోడిని 1848లో పెన్నా నది పరీవాహక ప్రాంతంలో థామస్ జర్డాన్స్ మొదటిసారి కనుగొన్నారు. 1985 జనవరి 5న అట్లూరు మండలం రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్నకు ఈ పక్షి కనిపించగా.. దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ విషయం తెలిసి ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ వెంటనే వచ్చి ఆ పక్షిని పరిశీలించారు. 1998 నుంచి 2002 వరకు తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగం పరిశోధకులు ప్రొఫెసర్ నందకుమార్, అమీర్‌బాషా, మారం రాజశేఖర్ బృందం దాదాపు 8 పక్షులను గుర్తించింది. వీటి ఆవాసాన్ని రిమోట్ సెన్సింగ్ విధానంలో పరిశీలించి ఏ పరిసరాల్లో ఎక్కువగా ఉంటాయి, వాటి అభివృద్ధికి అక్కడ చేయాల్సిన మార్పులు ఏమిటనేది ఆ బృందం సూచించింది. ఆ తర్వాత 2002లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, రాయల్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ సహకారంతో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ కలివి కోడి పాద ముద్రను, కూతను నమోదు చేసింది. ఈ పక్షి ‘ట్విక్–టూ.. ట్విక్–టూ’ అంటూ అరుస్తుంది. పగలు నిద్రించి.. రాత్రి వేటాడుతుంది వీటి జాడ 2002 తర్వాత కనిపించలేదు. ఈ పక్షుల సమగ్ర గణన సైతం జరగలేదు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో వీటి ఆవాసాల్లో గత రెండు దశాబ్దాలుగా వచ్చిన మార్పులను గమనిస్తే.. అరుదైన ఈ పక్షి జాతి ఉనికిని తెలుసుకునే అవకాశం ఉంటుందని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్ ఎం.రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ పక్షి ముదురు గోధుమ రంగులో.. పొడవాటి కాళ్లతో ఉంటుంది. మెడలో రెండు వెండి గొలుసుల వంటి చారలతో ఉంటుంది. ఇతర పక్షుల్లా ఎత్తుకు ఎగరలేవు. పగటిపూట నిద్రపోతూ.. రాత్రి పూట ఆహార సేకరణ కోసం బయటకు వస్తాయి. 2 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు కలివి పొదలు (ముళ్లతో ఉండేవి) వీటి ఆవాసాలు. పొదల మాటున దాగి ఉంటూ వాటి మధ్యలోని ఖాళీ ప్రదేశాల నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. చెదలు, పురుగులు, చీమలు, కీటకాలను తింటూ పంట పొలాలకు వ్యాధుల రాకుండా సంరక్షించడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు ఇవి దోహదపడతాయి. ఇవి గులక రాళ్లను సేకరించి.. వాటి మధ్యలో గుడ్లు పెట్టి ఇతర జంతువులు గుర్తించకుండా జాగ్రత్తపడతాయి. -
International Tiger Day: పులుల భారత్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పర్యావరణ పిరమిడ్‌లో పెద్దపులిని అగ్రసూచిగా భారత్ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 4 వేల వరకు ఉండగా అందులో డెబ్భై శాతానికి మించి మన దేశంలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 53 పులుల అభయారణ్యాలు ఉన్నాయి. 2006లో దేశంలో 1,411 పులులు ఉండగా 2018 నాటికి వాటి సంఖ్య 2,967కు చేరింది. కేవలం పన్నెండేళ్లలో ఇంత వృద్ధి ఓ రికార్డుగా పర్యావరణవేత్తలు అభివర్ణిస్తున్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ స్థాయిలో పెరుగుదల లేదని చెబుతున్నారు. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) జోన్లోనే 63 పులులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణలో పులి పాత్ర కీలకం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గిపోతుండటంతో వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పులుల సంరక్షణపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఎన్ఎస్టీఆర్ దేశంలోనే పెద్దది రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) జోన్ దేశంలోకెల్లా పెద్దది. ఏపీలోని పూర్వపు గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతం పులుల ఆవాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంతం కృష్ణాతో పాటు దాని ఉప నదులు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల బ్యాక్ వాటర్, ఇతర వనరులతో నీటికి కొదవలేకపోవడం, ఎత్తయిన కొండలు, భారీ లోయలతో భౌగోళికంగా అనువుగా ఉండటం పులుల సంచారానికి, వాటి ఎదుగుదలకు ఉపయుక్తంగా ఉంటుంది. నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వరకూ విస్తరించిన ఈ టైగర్ కారిడార్‌లో పులుల సంచారం పెరిగినట్లు అటవీ శాఖ గుర్తించింది. కొన్నేళ్లుగా నల్లమల నుంచి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల వరకూ పులుల సంచారం మొదలైనట్లు గుర్తించారు. శేషాచలం బ్లాకులో మూడేళ్ల క్రితం కొత్తగా 6 పులులు కనిపించగా గతేడాది 3 కనిపించాయి. టైగర్ రిజర్వు ప్రాంతంలో 597 అధునాతన మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కి.మీ కు రెండు కెమెరాలు పెట్టారు. అడవిలో పులులు వెళ్లే ప్రధాన దారుల్లో కెమెరాలు పెట్టారు. ఈ కెమెరాలు వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన లక్షల ఫొటోలను ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించి, పులుల సంఖ్య ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. పులి చర్మంపై ఉండే చారల ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన వాటిని లెక్కిస్తారు. జాతీయ స్థాయిలో ప్రతి నాలుగేళ్లకోసారి, రాష్ట్రాల్లో ప్రతి ఏడాది పులుల గణన జరుగుతుంది. తాజా వివరాలను శుక్రవారం తిరుపతి ఎస్వీ జూ పార్క్‌లో విడుదల చేయనున్నారు. పర్యావరణ వ్యవస్థలో పులులు కీలకం పర్యావరణ వ్యవస్థ శ్రేయస్సుకి పులులు ఎంతో కీలకం. వాటి సంరక్షణ, రక్షణ ద్వారా మనిషి మనుగడకు కీలకమైన పర్యావరణాన్ని కాపాడినట్లే. అనేక జీవరాశుల మనుగడకు పులి అవకాశం కల్పిస్తుంది. పులులను పరిరక్షించడానికి అధిక ప్రాధానత్య ఇస్తున్నాం. – మధుసూదన్‌రెడ్డి, అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వేటను పూర్తిగా నిషేధించాలి పులి అత్యంత సున్నితమైన జంతువు. పులి సౌకర్యంగా జీవించడానికి తగిన పర్యావరణాన్ని ఏర్పరచడం కష్టం. పులికి ఆహారమైన జంతువుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సి ఉన్నందున అడవికి నిప్పు పెట్టడం, జంతువులను వేటాడటం పూర్తిగా నిషేదించాలి. – ఎల్.నాగిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ శాస్త్ర విభాగం, అనంతపురం -
ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?
ఆత్మకూరు రూరల్(కర్నూలు జిల్లా): వృక్షోరక్షితి రక్షతః అంటారు పెద్దలు. అంటే వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే, అన్ని చెట్లు అలాంటివి కావని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కోనో కార్పస్. పచ్చదనం మాటున విరివిగా పెరుగుతున్న ఈ వృక్షాలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారనున్నాయి. దుబాయి చెట్టుగా పిలువబడుతున్న ఈ వృక్షం ఇప్పటికే పలు దేశాలను కలవరపెడుతోంది. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! శంకురూపంలో ఉండే కోకో కార్పస్.. అమెరికా ఖండాల్లోని తీరప్రాంతం మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరిగే ఈచెట్టు పచ్చదనాన్ని అంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అరబ్, మధ్య ప్రాచ్యదేశాల్లో ఏడారినుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుపాన్ల నుంచి, వేడిగాలుల నుంచి రక్షణగా ఉండేందుకు ఈ మొక్క ను దిగుమతి చేసుకుని రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్లలో విస్తృతంగా పెంచుతున్నారు. మనదేశంలోకి ప్రవేశించిందిలా.. వేగంగా పెరుగుతూ అధిక పచ్చదనాన్ని కలిగిన కోనోకార్పస్‌పై మనదేశంలోని నర్సరీ పెంపకం దారులు, ల్యాండ్‌స్కేప్ ఎక్స్‌పర్ట్‌ల దృష్టిపడింది. పచ్చదనంతో వెంచర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రియల్ఎస్టేట్ వ్యాపారులు ఈ మొక్కలను తీసుకొచ్చారు. అలా ఈ మొక్క మనదేశంలో ప్రవేశించింది. అనంతరం నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు మొదలు సాధారణ నగర పంచాయతీల వరకు ఈ మొక్కలను డివైడర్లపై, రహదారుల్లో విరివిగా నాటడం మొదలు పెట్టారు. తూర్పుకనుమల్లో భాగమైన నల్లమల అడవుల కేంద్రీయ స్థానమైన నంద్యాల జిల్లాలో కూడా దుబాయ్ మొక్క ప్రభంజనం తక్కువేమి కాదు. ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ తదితర మున్సిపాలిటీలలో దుబాయ్ మొక్కలను రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెద్ద ఎత్తున నాటుతున్నారు. జీవవైవిధ్యానికి మారు పేరైన నల్లమల సమీప ప్రాంతాల్లో ఈ ఖండాంతర మొక్క ప్రవేశంతో పర్యావరణ పరిస్థితులు తల్లకిందులయ్యే అవకాశం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. కోనోకార్పస్‌ను నిషేధించిన తెలంగాణ సర్కారు పలు పర్యావరణ సమస్యలకు కారణమవుతోందన్న కారణంతో కోనోకార్పస్ మొక్కలను నాటడాన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. హరితవనం కార్యక్రమంలో తొలుత ఈ మొక్కలనే ఎక్కువగా వినియోగించిన ప్రభుత్వం త్వరలోనే వీటి దుష్ప్రభావాలను గుర్తించడం గమనార్హం. వన్యప్రాణులకు సంకటం వేరే ఖండాలనుంచి తెచ్చి పెంచే మొక్కలతో పర్యావరణ సమతుల్యతకు విఘాతమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అలాంటి వాటిని ఎక్సోటిక్ వీడ్ గా పిలుస్తుంటారు. ఇవి ప్రపంచంలో ఒక ప్రాంతం నుంచి సహజంగా అవి ఉండని మరో ప్రాంతంలో ప్రవేశ పెట్టబడినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వీడ్స్(కలుపు మొక్కలు)తో స్థానిక వృక్ష, గడ్డి జాతుల విస్తరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో హెర్బీవోర్స్(గడ్డితినే జంతువులు)కు ఆహార కొరత ఏర్పడి అది కార్నీవోర్స్( మాంసాహార జంతువులు)ఉనికికే ప్రమాదకారణమవుతుంది. కోనోకార్పస్‌తో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తనున్నాయి. ఇది వేగంగా పెరిగే నిత్య పచ్చదనం మొక్క కావడంతో ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి ఇతర స్థానిక జాతి మొక్కలను, గడ్డిని ఎదగనీయదు.అలాగే పక్షులకు తమ జీవావరణంలో వచ్చిన ఈ కొత్త మొక్క గందరగోళానికి గురి చేయడంతో సహజ రక్షణలో గూళ్లు కట్టుకోవడంలో వైఫల్యం చెంది పునరుత్పత్తి అవకాశాలను తగ్గించుకుంటాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలకూ కారణం కోనోకార్పస్‌మొక్కపర్యావరణాన్ని హాని చేయడంతో పాటు ప్రజారోగ్య సమస్యలకు కారణమవుతుందని పొరుగుదేశమైన పాకిస్తాన్ గుర్తించింది. ముఖ్యంగా కరాచీ నగరంలో హఠాత్తుగా పెరుగుతున్న ఊపిరి తిత్తుల వ్యాధిగ్రస్తుల సంఖ్యకు ఈ మొక్కలే కారణమని పరిశోధనల్లో తేల్చింది. గా లిలో ఎక్కువ సంఖ్యలో పుప్పొడి రేణువులు కనిపించడం అవి కోకోకార్పస్ పుష్పాలివిగా తెలియడంతో ఈ మొక్కల పెంపకాన్ని పూర్తిగా నిషేధించింది.అధిక సంఖ్యలో భూగర్భజలాలను వినియోగించుకునే సామర్థ్యం కలిగిన ఈ మొక్కలతో పర్యావరణానికి చేటు అని మరికొన్ని అరబ్‌దేశాలు గుర్తించాయి. దుబాయ్ మొక్కలతో పలు సమస్యలు దుబాయ్ మొక్కలు స్థానిక పర్యావరణ పరిస్థితులకు ముప్పుగా మారుతున్నాయి. చాలా మంది ఈ మొక్క గురించి తెలుసుకోకుండా పెంచుతున్నారు. ఆకురాల్చు అడవులున్న మన ప్రాంతంలో నిత్య పచ్చదనం కలిగిన దుబాయి మొక్కలు ఇతర వృక్షజాతుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయి. వీటి పుష్పాలు వెదజల్లె పుప్పొడి వల్ల పలు శ్యాసకోశ వ్యాధులు, అలర్జీ సమస్యలు తలెత్తుతాయి. – విష్ణువర్ధన్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి,ఆత్మకూరు ఈ మొక్కలను నిషేధించాలి మహారాష్ట్రలోని పూణే, మన పొరుగున ఉన్న తెలంగాణలో దుబాయి మొక్కలను నాటడాన్ని నిషేధించినట్లుగానే మన రాష్ట్రంలో కూడా నిషేధించాలి. పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలిగించే ఏ అంశానైనా ప్రభుత్వాలు అడ్డుకోవాలి. – సుబ్బయ్య ఆచారి, పర్యావరణ ప్రేమికుడు, ఆత్మకూరు -
క్రమబద్దీకరణతో అడవికి ముప్పు..!
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల క్రమబద్దీకరణతో ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోడు ఆక్రమణలకు హక్కులు కట్టబెట్టేందుకు ఆక్రమణదారులు, చట్ట ఉల్లంఘనుల నుంచి దరఖాస్తుల స్వీకరణ సరైంది కాదని వారు అభ్యంతరం చెబుతున్నారు. ఇది మళ్లీ భూపోరాటాలు, భూకబ్జాలకు కారణమవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు ఏళ్లుగా అమలు చేస్తున్న కఠిన వైఖరితో అటవీ ఆక్రమణలు గణనీయంగా తగ్గడమేగాక, 2% దాకా పచ్చదనం పెరిగినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆక్రమణల్లోని వేలాది ఎకరాలను అటవీ శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోడు సమస్యకు పరిష్కారం పేరిట ప్రభుత్వం చేస్తున్న కొత్త ఆలోచనలపై పలువురు పర్యావరణవేత్తలు భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే... పర్యావరణానికి పెద్దదెబ్బ... పర్యావరణం, అడవులు, జీవవైవిధ్య పరిరక్షణ వంటి అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. పోడు క్రమబద్ధీకరణ పేరిట అటవీ ఆక్రమణలకు సర్కార్ పచ్చజెండా ఊపడం పర్యావరణానికి పెద్దదెబ్బ. అడవి, జీవావరణాలతో గిరిపుత్రులకు ఉన్న బంధం.. తల్లీబిడ్డల మధ్యనున్న సంబంధం లాంటిది. ఆక్రమణలు, మైనింగ్, పోడు.. ఇతర రూపాల్లో అడవి క్షీణించినా అది బలహీనమవుతుంది. అటవీ ప్రాంతం తగ్గినా, సన్నగిల్లినా ఆదివాసీలపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. – ప్రొ. కె.పురుషోత్తంరెడ్డి, పర్యావరణ నిపుణులు ఆక్రమణలను సక్రమం చేయడం సరికాదు.. పోడు భూముల క్రమబద్ధీకరణ పేరిట అటవీ ఆక్రమణలను సక్రమం చేయడం సరికాదు. 2006కు ముందే పోడు భూములను వాటిని సాగు చేసుకునే వారికి ఇవ్వాలని, సంబంధిత కుటుంబం మూడు తరాలు వ్యవసాయం చేస్తేనే హక్కులు కల్పించాలని కేంద్ర చట్టంలో ఉంది. మళ్లీ ఇప్పుడు గత 15 ఏళ్ల ఆక్రమణలను క్రమబద్దీకరిస్తామనేది అడవుల విధ్వంసమే. గిరిజనుల ఉపాధి, పునరావాసానికి పోడు అనేదే ప్రధానమైనది కాదు. భూమి కోసం అడవులను ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీడీల ద్వారా ఆదివాసీ, గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అన్వేషించాలి. విద్యాకల్పన, నైపుణ్యాల శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన వంటివి చేయాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న కుట్రగా భావించాలి. – పొట్లపెల్లి వీరభద్రరావు, పర్యావరణవేత్త గిరిజనేతరుల ఆక్రమణలు పెరుగుతాయి... పోడు క్రమబద్ధీకరణను అడ్డం పెట్టుకుని మళ్లీ అటవీ ఆక్రమణలు ఊపందుకోవడం ఖాయం. ఇది అటవీ, పర్యావరణ పరిరక్షణకు తీరని నష్టం. తేనేతుట్టె లాంటి ఈ అంశాన్ని మళ్లీ కదపడం మంచిదికాదు. భూములను క్రమబద్దీకరిస్తామన్న ప్రతీసారి పట్టాలు లభిస్తాయనే ఆశతో గిరిజనేతరుల ఆక్రమణలు పెద్ద ఎత్తున పెరిగాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్య పరిష్కారం కాకపోగా మరింత తీవ్రమౌతుంది. మళ్లీ పోడు ఆక్రమణల క్రమబద్దీకరణకు అవకాశమివ్వడం వల్ల నేడు కాకపోతే రేపు పట్టాలొస్తాయనే ఆశతో ధైర్యంగా కొత్త ఆక్రమణలకు దిగుతారు. – ఇమ్రాన్ సిద్ధిఖీ, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ బయాలజిస్ట్ -
పచ్చదనం కోసం ప్రాణత్యాగం
మన కళ్లముందే ఎవరినైనా అడ్డంగా నరికి చంపేస్తూ ఉంటే మనకెందుకొచ్చిన గొడవలే అని కళ్లుమూసుకుని అక్కడ్నుంచి జారుకునే వాళ్లే ఎక్కువమంది. కొందరు మాత్రం అలా ఉండలేరు. బాధితుల తరపున వకాల్తా పుచ్చుకుని పోరాడతారు. వాళ్లు హక్కుల నేతలు. ఇంకొందరుంటారు. మనుషులనే కాదు పచ్చటి చెట్టుకొమ్మను నరికినా, స్వచ్ఛజలాలను పాడుచేసినా, పీల్చే గాలికి ప్రమాదం ముంచుకొచ్చినా తట్టుకోలేరు. వీళ్లు పర్యావరణవేత్తలు. చిత్రం ఏంటంటే ఈ ఇద్దరూ అంటే అక్రమార్కులకు ముచ్చెమటలే! వీళ్లని ఊరికే ప్రాణాలతో ఉంచడం ఎందుకని కనికరం లేకుండా చంపేస్తూ ఉంటారు. పచ్చదనాన్నీ, పర్యావరణాన్నీ ప్రేమించే ఆకుపచ్చయోధులపై జరిగే హత్యలకు కొలంబియా రాజధానిగా మారిపోయింది. బ్రెజిల్, మెక్సికో, హోండురస్, కొలంబియాల్లో పర్యావరణవేత్తగా పనిచేయడం అంటే మృత్యువుతో సహవాసం చేయడమే. ఆఫ్రికా దేశాల్లోనూ పర్యావరణ వేత్తలపై హత్యాకాండలు ఏటేటా పెరుగుతున్నాయి. కెన్ సారో వివా. నైజీరియాలో ఒగోనీ తెగకు చెందిన మేధావి. రచయిత. టీవీ ప్రొడ్యూసర్. హక్కుల నేత. అంతకు మించి పర్యావరణ వేత్త. రాయల్ డచ్‌కు చెందిన షెల్ ఆయిల్ కంపెనీ నైజీరియాలో అడ్డగోలుగా క్రూడ్ ఆయిల్ కోసం జరిపే తవ్వకాల కారణంగా ఒగోనీ తెగ సాగు చేసుకునే పంటపొలాలు కాలుçష్యంతో నాశనమైపోతున్నాయి. ఈ దుర్మార్గం పైనే కెన్ సారో వివా అహింసాయుత పోరాటం చేశాడు. తన జాతి జనుల కోసం తానే ఓ ఆయుధం అయ్యాడు. 3 లక్షల మందితో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించాడు. ఆయిల్ కంపెనీ పెద్దలతో పాటు సైనిక పాలకులకూ శత్రువైపోయాడు. ఓ హత్యకేసులో ఇరికించి వివాతో పాటు మరో 8 మందిని ఉరితీసి చంపేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా భగ్గుమంది. నైజీరియాను కామన్వెల్త్ దేశాల సభ్యత్వం నుంచి మూడేళ్ల పాటు నిషేధించారు. వివాను హత్యకేసులో ఇరికించిన దొంగసాక్షులు షెల్ కంపెనీ యాజమాన్యం తమకు ఉద్యోగాలు, డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టి అబద్ధపు సాక్ష్యం చెప్పించిందని న్యాయమూర్తి సమక్షంలోనే ఒప్పుకున్నారు. కానీ ఏం లాభం? అప్పటికే వివాను చట్టబద్ధంగా హత్యచేశారు. 2020లోనే ప్రపంచ వ్యాప్తంగా 227 మంది పర్యావరణవేత్తలు దారుణ హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటోన్న హత్యల్లో మూడొంతులు లాటిన్ అమెరికాలోనే కావడం విశేషం. 2019–20లో ఒక్క కొలంబియాలోనే 64 మందిని చంపేశారు. ప్రపంచంలోనే బొగ్గు ఎగుమతుల్లో కొలంబియా 5వ స్థానంలో ఉంది. ఈ బొగ్గంతా కూడా అడవులను అడ్డంగా నరికి, చెట్లను కాల్చి తయారు చేసిందే కావడం ఆందోళన కలిగించే అంశం. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ను పరిరక్షించుకోడానికి కొందరు, ఇష్టారాజ్యంగా గనుల తవ్వకాలతో ఎన్నో తెగలు, జాతుల జీవావరణాలను నాశనం చేస్తున్నారని కొందరు... తమ ప్రాణాలను పణంగా పెట్టారు. పర్యావరణానికి తూట్లు పొడిచే వాళ్లు పొడుస్తూనే పోతే, పర్యావరణ వేత్తలను ఇలాగే చంపుకుంటూ పోతే ఈ ప్రపంచమే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే పర్యావరణ హననంతో రుతుచక్రం గతి తప్పే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు ప్రాణికోటిపై పగబట్టే ప్రమాదం రెట్టింపు అవుతుందంటున్నారు సైంటిస్టులు. పర్యావరణ పరిరక్షణ అంటేనే అదేదో మేధావులకు సంబంధించిన వ్యవహారం కాదు. మనందరి కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పర్యావరణ వేత్తలు ముందుకు వస్తోంటే వారి ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోవడం క్షమించరాని నేరం. సహించరాని ఘోరం. ఒక పర్యావరణ వేత్త తయారు కావాలంటే కొన్నేళ్లు పడుతుంది. అటువంటిది ఒక్క గొడ్డలి వేటుకో, ఒకే ఒక్క తూటాకో పచ్చదనం కోసం పరితపించే మహర్షులను పొట్టన పెట్టుకుంటున్నారు. మాఫియా ముఠాలకు ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నేతలు అండగా నిలవడం వల్లనే ఈ నరమేధం సాగిపోతోంది. మన దేశంలోనూ పారిశ్రామిక కాలుష్యాన్ని ప్రశ్నించినందుకో, గనుల తవ్వకాల పేరిట ఆదివాసీల ఆవాసాలను దెబ్బతీస్తున్నారని పోరాడుతున్నందుకో గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు లేపేస్తోన్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద పెద్ద డ్యామ్‌లను కట్టద్దంటేనూ.. ఇష్టారాజ్యంగా అడవులు తెగనరికేయద్దంటేనూ.. వాటిపై వ్యాపారం చేçసుకునే వాళ్లకీ.. ఆ వ్యాపారుల కొమ్ముకాసే రాజకీయ నేతలకీ మా చెడ్డ కోపం వస్తుంది. ఆ కోపం నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తుంది. ఈ భూమి.. దాని చుట్టూరా ఉన్న ఆవరణం.. చల్లటి సెలయేళ్లు.. ఆకుపచ్చ వనాలు... వాటితో పాటే కోట్లాది జీవరాశులు ఆనందంగా, ఆరోగ్యంగా పదికాలాల పాటు ఉండాలని కోరుకునే పర్యావరణవేత్తల గొంతులు కోయడం అంటే మన ఊపిరిని మనమే అడ్డుకోవడమంతటి మూర్ఖత్వం. ఈ పచ్చదనం మనం ఉన్నంత కాలం అనుభవించాలి. మన తర్వాత తర్వాతి తరాలకు పదిలంగా అందించాలి. దీన్ని అనుభవించే హక్కు మాత్రమే మనకి ఉంది. నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా నాశనం చేస్తోంటే దాన్ని అడ్డుకోవలసిందే. ఆ పనిచేస్తోన్న పర్యావరణవేత్తలను ముందుగా మనం కాపాడుకుంటేనే పర్యావరణం పదిలంగా ఉంటుంది. అలా జరగాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణవేత్తలపై జరుగుతోన్న దాడులకు అడ్డుకట్ట వేయడానికి కృత నిశ్చయంతో ముందుకు కదలాలి. -
1.09 కోట్ల వృక్షాలు నరికారు!
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పేరిట పచ్చని చెట్లు నేలకూలుతున్నాయి. పట్టణాభివృద్ధి, నగరాల విస్తరణ, ఉత్పత్తి, ఉపాధి, ఇతర అవసరాల కోసం మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం ఇలా పేరు ఏదైనా చివరకు చెట్లే అందుకు ఆహుతవుతున్నాయి. అత్యంత వేగంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు, వాటి వల్ల తలెత్తుతున్న ఉపద్రవాలు, ఇతరత్రా సమస్యలకు ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం, పచ్చదనం తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా పర్యావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. 1.09 కోట్ల చెట్ల కొట్టివేత... 2014–19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1,09,75,000 చెట్ల నరికివేతకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతిచ్చింది. ఇటీవల లోక్‌సభలో కేంద్ర అటవీ, పర్యావరణ వాతావరణ మార్పుæ శాఖ చెప్పిన సమాచారం మేరకు పలు అంశాలు వెల్లడయ్యాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2016–19 మధ్యకాలంలో 12,12,753 లక్షల చెట్లను కొట్టేసేందుకు అనుమతినిచ్చినట్లు స్పష్టమైంది. దాదాపు 11 లక్షల చెట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 10 లక్షల చెట్లతో మధ్యప్రదేశ్ మూడోస్థానంలో నిలిచాయి. లోక్‌సభలో ఒకప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి బాబుల్ సుప్రియో సమాధానమిస్తూ వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో మొత్తం 1.09 కోట్ల చెట్లను కూల్చేందుకు అనుమతినిచ్చినట్లు తెలియజేశారు. ముఖ్యంగా 2018–19లో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అత్యధిక సంఖ్యలో 5,22,242 చెట్లు కూల్చేందుకు అనుమతినిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలను బట్టి వెల్లడైంది. చెట్లకు మొక్కలు ప్రత్యామ్నాయమా ? గత మూడేళ్లలో 76,72,337 చెట్లను తొలగించగా, 7.87 కోట్ల కంటే ఎక్కువగా మొక్కలను కంపల్సరీ ఎఫారెస్టేషన్ కింద నాటినట్లు లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడించారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే చెట్లను తొలగిస్తున్నామని, ప్రభుత్వ విధానంలో భాగంగా ప్రత్యామ్నాయంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు తెలియజేశారు. సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన కాజల్మహేశ్వరీ మాత్రం నరికేసే పాత వృక్షాలు, చెట్లకు మొక్కలు ప్రత్యామ్నాయం కాలేవని, వాటి స్థానంలో మొక్కలను చూడలేమని అభిప్రాయపడ్డారు. ‘40–50 ఏళ్ల పాత చెట్లకు హరితహారంలో నాటే మొక్కలు ప్రత్యామ్నాయం కాలేవు. ఎందుకంటే పెద్ద వృక్షాలు వాతావరణంలోకి విడుదల చేసే ఆక్సిజన్, పీల్చుకునే కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని మొక్కలు భర్తీ చేయలేవు. కాబట్టి, చెట్ల నరికివేతతో జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టం అంచనా వేయలేని స్థాయిలో ఉంది’అని పేర్కొన్నారు. చెట్లు (లక్షల్లో) నరికారు ఇలా సంవత్సరం చెట్లు 2014–15 23.3 2015–16 16.9 2016–17 17.01 2017–18 25.5 2018–19 17.38 భారత్‌లో తలసరికి 28 చెట్లే 2018లో ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వివిధ దేశాల్లో ఒక్కొక్కరికి ఉన్న చెట్ల నిష్పత్తి కంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కెనడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తికి 8,953, రష్యాలో 4,461, బ్రెజిల్లో 1,494, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉండగా, మన దేశంలో మాత్రం ఒక్కొక్కరికి 28 చెట్లే ఉన్నాయి. ఒకవైపు చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంతో పాటు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట ఉన్న చెట్లను కొట్టేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిని బట్టి మన దేశంలో చెట్ల సంఖ్య ఏ మేరకు గణనీయంగా తగ్గిపోతోందో స్పష్టమవుతోంది. -
కోతులతో తాజ్‌మహల్‌కి ముప్పు!
ఆగ్రా: ప్రపంచ పాలరాతి అద్భుత కట్టడం పరిసరాల్లో పచ్చదనం క్షీనించిపోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి కొంత కారణం కోతులని వారు పేర్కొవడం గమనార్హం. మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ వేత్తలు బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ‘తాజ్ పరిరక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ 1996 నుంచి సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వాలలో చలనం కనిపించడంలేదు. ప్రస్తుతం పచ్చని అడవులు పోయి.., కాంక్రీటు అరణ్యాలు ఏర్పడుతున్నాయి. బర్జా ప్రాంతంలో బృందావనం నుంచి ఆగ్రా వరకు 12 పెద్ద అడవులు ఉండేవి. ఇప్పుడు వాటిపేర్లే మిగిలాయి. ఆకుపచ్చని ప్రాంతాలన్నీ గోధుమ, పసుపు, బూడిద రంగులోకి మారిపోతున్నాయి. బిల్డర్లు, అవినీతి ప్రభుత్వాలు కలిసి అటవీ భూములను అనైతికంగా వాడుతున్నారు. యమునా నదివరకు చెట్లను నాశనం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ల నిర్మాణం వంటిపేర్లతో పచ్చని చెట్లను నరికేశారు. జాతీయ ప్రమాణాల ప్రకారం 33 శాతం అడవులు ఉండాలి, కానీ అది ఇక్కడ 7 శాతానికి పడిపోయింది. ఈ కారణాలన్నింటికి తోడు.. నాటిన మొక్కలను కోతులు వేళ్లతో సహా పీకేస్తున్నాయి. అటవీ సంరక్షణ చర్యలతోపాటు కోతుల సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంద’ని పేర్కొన్నారు. -
కాప్రా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన
హైదరాబాద్: నగరంలోని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరోజపై పర్యావరణ వేత్తలు నిప్పులు చెరిగారు. ఆమె నిర్లక్ష్యం కారణంగానే కాప్రా చెరువు అన్యాక్రాంతమైందని వారు ఆరోపించారు. అందులోభాగంగా శనివారం కాప్రా సర్కిల్ డిప్యూటి కార్యాలయం ఎదుట పర్యావేరణ వేత్తలు ఆందోళనకు దిగారు. కాప్రా పరిధిలోని చెరువులు అక్రమణలపై తాము ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఆమె నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని పర్యావరణ వేత్తలు మండిపడ్డారు. -
స్వయంకృతం కాశ్మీర్ విలయం
పర్యావరణవేత్తలు పదే పదే చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టినందుకు కాశ్మీర్ మూల్యాన్ని చెల్లించుకోవాల్సివచ్చింది. అతి పెద్ద ప్రశ్న మన ముందు ఇంకా నిలిచే ఉంది. గత తప్పుల నుండి ప్రభుత్వం నేర్చుకుంటుందా, తగు దిద్దుబాటు చర్యలను చేపడుతుందా? హెచ్చరికలను పట్టించుకునే నాధులెవరూ లేరిప్పుడు. అధిక ఆర్థిక వృద్ధిని సాధించాలనే వెర్రి వ్యామోహం సహజ ఫలితంగానే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. కాశ్మీర్ వరద మృతుల అంచనాలు కట్టాక, వరద తీశాక, శ్రీనగర్ తిరిగి మెల్ల మెల్లగా సాధారణ స్థితికి చేరుతోంది. క నీవినీ ఎరుగని విషాదాన్ని ఎదుర్కొన్న ప్రజలు తిరిగి సున్నితమైన పర్యావరణాన్ని నిర్లక్ష్యంగా కొల్లగొడుతూ దైనందిన కార్యకాలాపాల్లో మునిగిపోతారు. 2005లో హఠాత్తుగా ముంబై నగరం వరద తాకిడికి గురయినప్పుడు కూడా ఇలాగే జరగడం చూశాను. మహారాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది మరణించగా, భారత ఆర్థిక రాజధాని ముంబై జల ప్రళయం మాత్రం పతాక శీర్షికలకెక్కింది. జన సమ్మర్ధం ఎక్కువగా ఉన్న ముంబై పారిశ్రామిక ప్రాంతాల గుండా ప్రవహించే 19 కిలో మీటర ్ల మితి నది పోవాయ్, విహార్ సరస్సులను నింపి, ఆ పై మాహిం కయ్య వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆ నది పొంగి పొర్లడమే వరదలకు కారణమంటూ అప్పుడు దాన్ని తప్పు పట్టారు. మితి నది అభివృద్ధి సంస్థ మాత్రం ఇలా పేర్కొంది: ‘‘తుపాను నీటిని సముద్రంలోకి పారేలా చేయడానికి ఉపయోగపడే మితి నది ఏళ్లు గడిచే కొద్దీ ఒక మురుగు కాలువగా క్షీణించి పోయింది.’’ అంతకు ముందు 2000లో హైదరాబాద్ విధ్వంసకర వరద బీభత్సానికి గురైంది. తిరిగి 2009లో కుండపోతగా కురిసిన వర్షాలకు హైదరాబాద్‌లో చాలా భాగాలు, కర్నూలు నగరం పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ‘‘ఆగస్టు 2000 హైదరాబాద్ వరదలను ప్రకృతి విలయం ఫలితంగా పరిగణించడానికి వీల్లేదు. వృద్ధి చెందుతున్న పట్టణ ఆవాసాల ప్రణాళికా రచనలోని లోపాలను ఈ వరదలు నగ్నంగా బట్టబయలు చేశాయి. వింతేమిటంటే 2000 వరదల సమయంలో హైదరాబాద్‌లో 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షం కురవగా, నగరాన్ని ఆనుకొని ఉన్న దుర్భిక్ష ప్రాంతాల్లాంటి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో చెదురుమదురుగా మాత్రమే వానలు పడ్డాయి’’ అని భారత భూగర్భ పరిశోధనా సంస్థ పేర్కొంది. ప్రణాళికాబద్ధంగాని పట్టణీకరణ ఎంత భారీ నష్టాలకు దారితీస్తుందో అవగాహన కలగడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నివేదిక నుండి ఈ ఉల్లేఖనను చూడండి. ‘‘బంజారాహిల్స్ దక్షిణ పర్వత పాదం వద్ద ఉండే మసాబ్ టాంక్గా పిలిచే చెరువు ఇప్పుడు కిక్కిరిసిన నివాస, వాణిజ్య ప్రాంతం. పైగా చెరువు పల్లపు భాగమంతటినీ విజయనగర్, శాంతినగర్ వంటి నివాస ప్రాంతాలుగా మార్చేశారు. దీంతో ఈ ప్రాంతంలో పల్లానికి పారుతుండే వర్షపు నీటి పాయలన్నీ అదృశ్యమైపోయాయి. సహజసిద్ధమైన డ్రైనేజీ వ్యవస్థ అంతర్ధానమైన స్థితిలో ఆ ప్రాంతమంతా ముంపునకు గురికావడం సహజం.’’ బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌కతా, గువాహటి... ఎక్కడ చూసినా ఇదే కథ. మన తప్పును వాతావరణ మార్పులపైకి నెట్టేయడం అత్యంత అనువైనదిగా ఉంటుంది. మనం చేసిన తప్పులను మన తక్షణ నియంత్రణలో లేని కారణాలపైకి తోసేయడం పలాయనవాదం. అది స్వీయ పరాజయానికి హేతువు. వాతావరణం వేడెక్కితే, వానలు ఆలస్యమైతే, వేసవి సుదీర్ఘంగా కొనసాగితే వాతావరణ మార్పులను తప్పుపట్టాలి. వాతావరణ మార్పులు సైతం వాస్తవానికి మన నియంత్రణకు పూర్తిగా బాహ్యమైనవేమీ కాదు. కానీ వాటిని వాస్తవంగా అలా పరిగణించడమే జరుగుతోంది. సమాజంలోని చెడుగులన్నిటికి రాజకీయ నేతలనే తప్పు పట్టడం మనకు అలవాటు. అలాగే అభివృద్ధి ప్రేరితమైన విపత్తులకు కూడా మనం మనల్ని తప్పు పట్టుకోడానికి ఇచ్చగించం. సులువుగా వేరొకరి పైకి బాధ్యతను తోసిపారేయగలిగినప్పుడు మనల్ని మనం తప్పుపట్టుకోవడం ఎందుకు? వందేళ్ల క్రితం 1908లో హైదరాబాద్ మూసీ నది వరద బీభత్సానికి గురైంది. ఆ విపత్తులో 15,000 మంది మరణించారని అంచనా. అలాగే శ్రీనగర్ కూడా 1893లో అతి పెద్ద వరద ముప్పును ఎదుర్కొంది. కాబట్టి నేటి ఈ విప త్తులకు కారణంగా వాతావరణ మార్పులను తప్పు పట్టజాలమని అంగీకరి స్తారని భావిస్తాను. 2013 జూలై నాటి ఉత్తరాఖండ్ వరద బీభత్సానికి కూడా చాలా మంది వాతావరణ మార్పులనే తప్పు పట్టారు. ఆ విపత్తు తర్వాతైనా దేశం గుణ పాఠా లను నేర్చుకుంటుందని అనుకున్నాను. అలాంటిదేమీ జరగలేదు. సరికదా, ప్రణాళికా రహితమైన పట్టణీకరణ సమస్యను లేవనెత్తిన మరుక్షణమే.. మీరంతా అభివృద్ధి వ్యతిరేకులనే గగ్గోలు లేస్తోంది. ఉత్తరాఖండ్, కాశ్మీర్ లకు హిమాలయ పర్వత సునామీల్లా తాకిన ఈ మహా విలయాలకు చలిం చని వర్గానికి చెందినవారిదే ఈ గగ్గోలంతా. ఎంతకాలం డబ్బు చేసుకోగలి గితే అంతకాలం ప్రకృతి వనరులను పూర్తిగా కొల్లగొట్టాలనే ఆసక్తి మాత్ర మే గల వర్గమిది. వేలాది మంది ప్రాణాల మీదికి వచ్చినా, బతికిబట్టకట్టిన లక్షలాది మంది ఏ దుష్ఫలితాలను అనుభవించినా వారికి పట్టదు. ‘‘ప్రతి ఒక్కరికీ తెలిసినా విశ్వసించడానికి నిరాకరించే ముప్పు’’అనే అత్యంత సముచితమైన శీర్షికతో ‘ది ట్రిబ్యూన్’ పత్రిక సెప్టెంబర్ 14, 2014న ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ‘‘ఒక గిన్నె ఆకారంలో ఉన్న శ్రీనగర్ లోకి జీలం నది కట్టలు తెంచుకుని ఒక్కసారిగా వచ్చి పడితే ఆ వరద వెల్లువ బయటకు పోయే మార్గం లేదనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అంతా దాన్ని విస్మరించడాన్నే ఎంచుకున్నారు’’ అని ఆ వ్యాసకర్తలు తెలిపారు. దానితోపాటే ఆ పత్రిక ప్రచురించిన మరో నివేదికలో శ్రీనగర్ లోని 50 శాతం సరస్సులు, కుంటలు, చిత్తడి నేలలను నివాస, వాణిజ్య సముదాయాలుగా మార్చారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చెప్పారు. బందీపుర జిల్లాలోని వులార్ సరస్సు ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు. అది 87.58 చదరపు కిలోమీటర్ల మేరకు కుంచించుకుపోయింది. సుప్రసిద్ధమైన శ్రీనగర్ దాల్ లేక్ విస్తీర్ణం 24 చ.కి.మీ. నుండి 16 చ.కి.మీలకు క్షీణించిపోయింది. వేగంగా పెరుగుతున్న పూడిక కారణంగా సగటు లోతు 3 మీటర్లకు తగ్గిపోయింది. 165 కిలోమీటర్ల పొడవైన జీలం నది పొంగి పొరలినప్పుడు ఈ దురాక్రమణలకు ప్రతీకారం కాచుకుని వేచి చూస్తోంది. పర్యావరణపరమైన రెండు మహా బీభత్సాలు వెంట వెంటనే వచ్చి పడటంతో అధికారంలో ఉన్నవాళ్లు మేల్కొంటారని భావించాను. అది తప్పని తేలింది. మీడియా, వ్యాపార పారిశ్రామిక వర్గాలు, మేధావులు, ప్రణాళికా రచయితలు, అహోరాత్రాలు విస్తృతమైన బహిరంగ చర్చలను నిర్వహించి ముందు ముందు ఇలాంటి పర్యావరణపరమైన నష్టాలను ఎలా కనిష్టం చేసుకోవాలని చర్చిస్తారని భావించాను. కానీ అందుకు విరుద్ధంగా పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతులను నిరాకరిస్తున్నందుకు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను మీడియా అదే పనిగా తప్పు పట్టడం మాత్రమే కనిపిస్తోంది. పర్యావరణంతో ముడిపడి ఉన్న సమస్యలపై హెచ్చరికలు చేసే వారు ఎవరైనా గానీ వారిపై దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగించే వారిగా చిత్రించి సాగుతున్న దాడి అలాంటిది. పదే పదే చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టినందుకు కాశ్మీర్ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. అతి పెద్ద ప్రశ్న మన ముందు ఇంకా నిలిచే ఉంది. గత తప్పుల నుండి ప్రభుత్వం నేర్చుకుంటుం దా, తగు దిద్దుబాటు చర్యలను చేపడుతుందా? (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) దేవేందర్ శర్మ -
హస్తినకు వరద గండం..
న్యూఢిల్లీ: యమునానదిలో వరద మైదానాలు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఢిల్లీ నగరానికి భారీ వరద గండం పొంచి ఉందని పలువురు పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇటీవల యూఎన్ ప్యానెల్ నివేదికలో సైతం ప్రపంచంలోనే అధిక వరద ముప్పు ఉన్న మూడు నగరాల్లో ఢిల్లీ కూడా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. టోక్యో, షాంఘైలకు కూడా ఇటువంటి ప్రమాదమే పొంచి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. గత సోమవారం విడుదలైన ‘వాతావరణ మార్పుల నివేదిక-2014, ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు’లో పర్యావరణ నిపుణులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరద ముప్పు నుంచి తప్పించుకోవాలంటే డ్యాంలు, కాలువలు ఏర్పాటుచేసే బదులు వరద మైదానాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 2070 కల్లా ఆసియా ఖండంలోని ఢాకా, గౌంగ్ఝూ, హో ఛి మిన్హ్ సిటీ, షాంఘై, బ్యాంకాక్, రంగూన్, హాయ్‌పాంగ్ నగరాలతో పాటు ముంబై, కోల్‌కతాలకు సైతం తీర ప్రాంత వరద ముంపు ప్రమాదం పొంచి ఉందని అందులో పేర్కొన్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఢిల్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని నివేదికలో వెల్లడించారు. యూఎన్ ఐపీసీసీ నివేదికలో ఢిల్లీ పర్యావరణ సమస్యలపై ప్రస్తావించడం ఇదే మొదటిసారి. నగరంలో వరదలు వచ్చే అవకాశంపైనే ప్రధానంగా ఈ నివేదికలో చర్చించారు. నగరంలో యము నా వరద మైదానాల అక్రమ వినియోగం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ నగరంలోకి ప్రవేశించేం దుకు ముందే యమునానది నీటిని వ్యవసాయం, తాగునీటి అవసరాల నిమిత్తం మళ్లిస్తున్నారు. ‘ మా అంచనాల ప్రకారం.. పల్లా నుంచి జైత్పూర్ వరకు ఉన్న వరద మైదానాల్లో 30 శాతం ఇప్పటికే వేరే అవసరాలకు కేటాయించేశారు. ఇక్కడ నిర్మించిన అక్షరధామం, బాట్లా హౌస్, మెట్రో స్టేషన్లు, ఇతర శాశ్వత నిర్మాణాలను ఇక్కడి నుంచి తరలించడం సాధ్యం కాదు. ఒక్క టీడీసీ మిల్లేనియం బస్‌డిపో నిర్మాణ ప్రతిపాదనను మాత్రం ఆపేయవచ్చు. వజీరాబాద్ నుంచి ఓఖ్లా వరకు గల పలు వరద మైదానాల్లో చాలావరకు ఇప్పటికే ఆక్రమణకు గురయినట్లు మా సర్వేలో తేలింది..’ అని యమునా జియే అభియాన్‌కు చెంది న మనోజ్ మిశ్రా వివరించారు. ఇదిలా ఉండగా నగరంలో వాతావరణ మార్పులపై కూడా ఐపీసీసీ దృష్టి పెట్టింది. నగరంలో 1970 నుంచి ఇప్పటివరకు పాలెం వాతావరణ కేంద్రంలో ప్రతి యేటా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలపై ఢిల్లీ ఐఐటీ సర్వే చేసింది. సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చి చూసింది. ‘1968లో సఫ్దర్ జంగ్‌తో పోలిస్తే పాలెం ఎడారిలా ఉండేది. ఈ రెండింటి మధ్య ప్రతి ఏడాది వాతావరణంలో వస్తున్న మార్పులను గమనించి నగరీకరణ వల్ల ఉష్ణోగ్రతల్లో ఎలా మార్పులు సంభవిస్తాయో క్రోడీకరించాం. 1980 వరకు ఈ రెండు ప్రాంతాల సరాసరి కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు లేవు. అయితే 2000 సంవత్సరం వచ్చేసరికి పాలెంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం మొదలయ్యాయి. నగరీకరణ వల్లే ఈ మార్పు సంభవించిందని మా అధ్యయనంలో తేలింది..’ అని ఐపీసీసీ రిపోర్ట్ తయారుచేసిన వారిలో ఒకరైన ఐఐటీ ప్రొఫెసర్ మంజు మోహన్ వివరించారు. ఆమె అధ్యయనం ప్రకారం పాలెంలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో అప్పటికంటే ఇప్పుడు ఒక డిగ్రీ ఎక్కువగా నమోదవుతోంది. కాగా, ఈ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల నగరాల్లో వేడిమి సంబంధిత సమస్యలు పెరుగుతాయని సదరు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.