మన కళ్లముందే ఎవరినైనా అడ్డంగా నరికి చంపేస్తూ ఉంటే మనకెందుకొచ్చిన గొడవలే అని కళ్లుమూసుకుని అక్కడ్నుంచి జారుకునే వాళ్లే ఎక్కువమంది. కొందరు మాత్రం అలా ఉండలేరు. బాధితుల తరపున వకాల్తా పుచ్చుకుని పోరాడతారు. వాళ్లు హక్కుల నేతలు. ఇంకొందరుంటారు. మనుషులనే కాదు పచ్చటి చెట్టుకొమ్మను నరికినా, స్వచ్ఛజలాలను పాడుచేసినా, పీల్చే గాలికి ప్రమాదం ముంచుకొచ్చినా తట్టుకోలేరు. వీళ్లు పర్యావరణవేత్తలు.
చిత్రం ఏంటంటే ఈ ఇద్దరూ అంటే అక్రమార్కులకు ముచ్చెమటలే! వీళ్లని ఊరికే ప్రాణాలతో ఉంచడం ఎందుకని కనికరం లేకుండా చంపేస్తూ ఉంటారు. పచ్చదనాన్నీ, పర్యావరణాన్నీ ప్రేమించే ఆకుపచ్చయోధులపై జరిగే హత్యలకు కొలంబియా రాజధానిగా మారిపోయింది. బ్రెజిల్, మెక్సికో, హోండురస్, కొలంబియాల్లో పర్యావరణవేత్తగా పనిచేయడం అంటే మృత్యువుతో సహవాసం చేయడమే. ఆఫ్రికా దేశాల్లోనూ పర్యావరణ వేత్తలపై హత్యాకాండలు ఏటేటా పెరుగుతున్నాయి.
కెన్ సారో వివా. నైజీరియాలో ఒగోనీ తెగకు చెందిన మేధావి. రచయిత. టీవీ ప్రొడ్యూసర్. హక్కుల నేత. అంతకు మించి పర్యావరణ వేత్త. రాయల్ డచ్‌కు చెందిన షెల్ ఆయిల్ కంపెనీ నైజీరియాలో అడ్డగోలుగా క్రూడ్ ఆయిల్ కోసం జరిపే తవ్వకాల కారణంగా ఒగోనీ తెగ సాగు చేసుకునే పంటపొలాలు కాలుçష్యంతో నాశనమైపోతున్నాయి. ఈ దుర్మార్గం పైనే కెన్ సారో వివా అహింసాయుత పోరాటం చేశాడు. తన జాతి జనుల కోసం తానే ఓ ఆయుధం అయ్యాడు. 3 లక్షల మందితో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించాడు. ఆయిల్ కంపెనీ పెద్దలతో పాటు సైనిక పాలకులకూ శత్రువైపోయాడు.
ఓ హత్యకేసులో ఇరికించి వివాతో పాటు మరో 8 మందిని ఉరితీసి చంపేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా భగ్గుమంది. నైజీరియాను కామన్వెల్త్ దేశాల సభ్యత్వం నుంచి మూడేళ్ల పాటు నిషేధించారు. వివాను హత్యకేసులో ఇరికించిన దొంగసాక్షులు షెల్ కంపెనీ యాజమాన్యం తమకు ఉద్యోగాలు, డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టి అబద్ధపు సాక్ష్యం చెప్పించిందని న్యాయమూర్తి సమక్షంలోనే ఒప్పుకున్నారు. కానీ ఏం లాభం? అప్పటికే వివాను చట్టబద్ధంగా హత్యచేశారు.
2020లోనే ప్రపంచ వ్యాప్తంగా 227 మంది పర్యావరణవేత్తలు దారుణ హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటోన్న హత్యల్లో మూడొంతులు లాటిన్ అమెరికాలోనే కావడం విశేషం. 2019–20లో ఒక్క కొలంబియాలోనే 64 మందిని చంపేశారు. ప్రపంచంలోనే బొగ్గు ఎగుమతుల్లో కొలంబియా 5వ స్థానంలో ఉంది. ఈ బొగ్గంతా కూడా అడవులను అడ్డంగా నరికి, చెట్లను కాల్చి తయారు చేసిందే కావడం ఆందోళన కలిగించే అంశం. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ను పరిరక్షించుకోడానికి కొందరు, ఇష్టారాజ్యంగా గనుల తవ్వకాలతో ఎన్నో తెగలు, జాతుల జీవావరణాలను నాశనం చేస్తున్నారని కొందరు... తమ ప్రాణాలను పణంగా పెట్టారు.
పర్యావరణానికి తూట్లు పొడిచే వాళ్లు పొడుస్తూనే పోతే, పర్యావరణ వేత్తలను ఇలాగే చంపుకుంటూ పోతే ఈ ప్రపంచమే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే పర్యావరణ హననంతో రుతుచక్రం గతి తప్పే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు ప్రాణికోటిపై పగబట్టే ప్రమాదం రెట్టింపు అవుతుందంటున్నారు సైంటిస్టులు.
పర్యావరణ పరిరక్షణ అంటేనే అదేదో మేధావులకు సంబంధించిన వ్యవహారం కాదు. మనందరి కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పర్యావరణ వేత్తలు ముందుకు వస్తోంటే వారి ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోవడం క్షమించరాని నేరం. సహించరాని ఘోరం. ఒక పర్యావరణ వేత్త తయారు కావాలంటే కొన్నేళ్లు పడుతుంది. అటువంటిది ఒక్క గొడ్డలి వేటుకో, ఒకే ఒక్క తూటాకో పచ్చదనం కోసం పరితపించే మహర్షులను పొట్టన పెట్టుకుంటున్నారు. మాఫియా ముఠాలకు ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నేతలు అండగా నిలవడం వల్లనే ఈ నరమేధం సాగిపోతోంది.
మన దేశంలోనూ పారిశ్రామిక కాలుష్యాన్ని ప్రశ్నించినందుకో, గనుల తవ్వకాల పేరిట ఆదివాసీల ఆవాసాలను దెబ్బతీస్తున్నారని పోరాడుతున్నందుకో గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు లేపేస్తోన్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద పెద్ద డ్యామ్‌లను కట్టద్దంటేనూ.. ఇష్టారాజ్యంగా అడవులు తెగనరికేయద్దంటేనూ.. వాటిపై వ్యాపారం చేçసుకునే వాళ్లకీ.. ఆ వ్యాపారుల కొమ్ముకాసే రాజకీయ నేతలకీ మా చెడ్డ కోపం వస్తుంది. ఆ కోపం నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తుంది.
ఈ భూమి.. దాని చుట్టూరా ఉన్న ఆవరణం.. చల్లటి సెలయేళ్లు.. ఆకుపచ్చ వనాలు... వాటితో పాటే కోట్లాది జీవరాశులు ఆనందంగా, ఆరోగ్యంగా పదికాలాల పాటు ఉండాలని కోరుకునే పర్యావరణవేత్తల గొంతులు కోయడం అంటే మన ఊపిరిని మనమే అడ్డుకోవడమంతటి మూర్ఖత్వం. ఈ పచ్చదనం మనం ఉన్నంత కాలం అనుభవించాలి. మన తర్వాత తర్వాతి తరాలకు పదిలంగా అందించాలి. దీన్ని అనుభవించే హక్కు మాత్రమే మనకి ఉంది. నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా నాశనం చేస్తోంటే దాన్ని అడ్డుకోవలసిందే. ఆ పనిచేస్తోన్న పర్యావరణవేత్తలను ముందుగా మనం కాపాడుకుంటేనే పర్యావరణం పదిలంగా ఉంటుంది. అలా జరగాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణవేత్తలపై జరుగుతోన్న దాడులకు అడ్డుకట్ట వేయడానికి కృత నిశ్చయంతో ముందుకు కదలాలి.
Comments
Please login to add a commentAdd a comment