సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పర్యావరణ పిరమిడ్‌లో పెద్దపులిని అగ్రసూచిగా భారత్ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 4 వేల వరకు ఉండగా అందులో డెబ్భై శాతానికి మించి మన దేశంలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 53 పులుల అభయారణ్యాలు ఉన్నాయి. 2006లో దేశంలో 1,411 పులులు ఉండగా 2018 నాటికి వాటి సంఖ్య 2,967కు చేరింది. కేవలం పన్నెండేళ్లలో ఇంత వృద్ధి ఓ రికార్డుగా పర్యావరణవేత్తలు అభివర్ణిస్తున్నారు.
ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ స్థాయిలో పెరుగుదల లేదని చెబుతున్నారు. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్) జోన్‌లోనే 63 పులులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణలో పులి పాత్ర కీలకం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గిపోతుండటంతో వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పులుల సంరక్షణపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటారు.
ఎన్‌ఎస్‌టీఆర్ దేశంలోనే పెద్దది
రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్) జోన్ దేశంలోకెల్లా పెద్దది. ఏపీలోని పూర్వపు గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతం పులుల ఆవాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంతం కృష్ణాతో పాటు దాని ఉప నదులు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల బ్యాక్ వాటర్, ఇతర వనరులతో నీటికి కొదవలేకపోవడం, ఎత్తయిన కొండలు, భారీ లోయలతో భౌగోళికంగా అనువుగా ఉండటం పులుల సంచారానికి, వాటి ఎదుగుదలకు ఉపయుక్తంగా ఉంటుంది.
నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వరకూ విస్తరించిన ఈ టైగర్ కారిడార్‌లో పులుల సంచారం పెరిగినట్లు అటవీ శాఖ గుర్తించింది. కొన్నేళ్లుగా నల్లమల నుంచి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల వరకూ పులుల సంచారం మొదలైనట్లు గుర్తించారు. శేషాచలం బ్లాకులో మూడేళ్ల క్రితం కొత్తగా 6 పులులు కనిపించగా గతేడాది 3 కనిపించాయి. టైగర్ రిజర్వు ప్రాంతంలో 597 అధునాతన మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కి.మీ కు రెండు కెమెరాలు పెట్టారు. అడవిలో పులులు వెళ్లే ప్రధాన దారుల్లో కెమెరాలు పెట్టారు.
ఈ కెమెరాలు వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన లక్షల ఫొటోలను ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా విశ్లేషించి, పులుల సంఖ్య ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. పులి చర్మంపై ఉండే చారల ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన వాటిని లెక్కిస్తారు. జాతీయ స్థాయిలో ప్రతి నాలుగేళ్లకోసారి, రాష్ట్రాల్లో ప్రతి ఏడాది పులుల గణన జరుగుతుంది. తాజా వివరాలను శుక్రవారం తిరుపతి ఎస్వీ జూ పార్క్‌లో విడుదల చేయనున్నారు.
పర్యావరణ వ్యవస్థలో పులులు కీలకం
పర్యావరణ వ్యవస్థ శ్రేయస్సుకి పులులు ఎంతో కీలకం. వాటి సంరక్షణ, రక్షణ ద్వారా మనిషి మనుగడకు కీలకమైన పర్యావరణాన్ని కాపాడినట్లే. అనేక జీవరాశుల మనుగడకు పులి అవకాశం కల్పిస్తుంది. పులులను పరిరక్షించడానికి అధిక ప్రాధానత్య ఇస్తున్నాం.
– మధుసూదన్‌రెడ్డి, అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్
వేటను పూర్తిగా నిషేధించాలి
పులి అత్యంత సున్నితమైన జంతువు. పులి సౌకర్యంగా జీవించడానికి తగిన పర్యావరణాన్ని ఏర్పరచడం కష్టం. పులికి ఆహారమైన జంతువుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సి ఉన్నందున అడవికి నిప్పు పెట్టడం, జంతువులను వేటాడటం పూర్తిగా నిషేదించాలి.
– ఎల్.నాగిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ శాస్త్ర విభాగం, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment