Srisailam Tiger Reserve Forest
-
వంద పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో ప్రాచుర్యం పొందిన వంద పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ మధుసూదనరెడ్డి తెలిపారు. జిల్లాలోని అరకు, మారేడుమిల్లి, రంపచోడవరం, గుడిసె, చింతపల్లి తదితర ప్రాంతాలను ఆయన బుధవారం సందర్శించారు. స్థానిక అటవీక్షేత్ర కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. పర్యాటకులు బస చేసేందుకు సౌకర్యవంతమైన కాటేజీలు, ట్రెక్కింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆదివాసీల సేవలు ఉపయోగించుకుని వారికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పర్యాటక ప్రదేశాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పెద్ద పులుల స్థావరంగా నల్లమల: శ్రీశైలం ప్రాజెక్టు పరిసరాల్లో నల్లమల అడవులు పెద్ద పులుల స్థావరంగా మారిందని చెప్పారు. గతంలో ఇక్కడ 45 పులులు మాత్రమే ఉండగా, ఇప్పుడు వీటి సంఖ్య 75కు పెరిగిందన్నారు. పాపికొండల ఏరియాలో గతంలో రెండు పులులు ఉండగా, ప్రస్తుతం మరో రెండు పులులు చేరాయన్నారు. మారేడుమిల్లి, రంపచోడవరం తదితర అటవీ ప్రాంతాల్లో చిరుతల సంచారం బాగా పెరిగిందని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. స్క్వాడ్ డీఎఫ్‌వో త్రిమూర్తులరెడ్డి, స్థానిక ఫారెస్ట్ రేంజర్ అబ్బాయిదొర పాల్గొన్నారు. -
శ్రీశైలం అడవుల్లో అలుగుల అడుగులు
అలుగు.. ఒళ్లంతా పొలుసులు, మందపాటి తోక గల క్షీరద జాతి జంతువు. పగలంతా చెట్ల తొర్రలు, నేల బొరియల్లో దాక్కుని.. రాత్రి వేళ బయట సంచరించే నిశాచర జీవులివి. ఒంటరిగా జీవించడానికే ఇష్టపడే అలుగులు చీమలు, చెద పురుగులనే ఆహారంగా తీసుకుంటాయి. పొడవాటి సన్నని నాలుకతో వాటిని జుర్రుకుని తింటాయి. శత్రువు కనిపిస్తే బంతి మాదిరిగా చుట్టుకుపోయి.. ముప్పు నుంచి తప్పించుకునే నైపుణ్యం గల అలుగులు శ్రీశైలం అడవుల్లో సంచరిస్తున్నట్టు అటవీ శాఖ కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించింది. సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో అరుదైన భారతీయ అలుగుల (ఇండియన్ పాంగోలిన్) ఉనికిని గుర్తించారు. గతంలో ఈ ప్రాంతంలో విస్తృతంగా కనిపించే పాంగోలిన్లు అంతరించే దశకు చేరుకున్నాయి. నల్లమలతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లోనూ వాటి జాడే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నల్లమల అడవుల్లో మళ్లీ వాటి కదలికలను గుర్తించడంతో వన్యప్రాణి ప్రేమికుల్లో ఆశలు చిగురించాయి. శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలోని ఆత్మకూరు, మార్కాపురం పరిసరాల్లో పులుల జాడ కోసం పెట్టిన కెమెరా ట్రాపుల్లో పాంగోలిన్లు కూడా కనిపించాయి. కాకపోతే మిగిలిన జంతువులతో పోలిస్తే వాటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు నల్లమలలో జీవించే చెంచులు, లంబాడీలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాంగోలిన్ల ఉనికి, వాటి ఆవాసాలు, రక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, రాష్ట్ర అటవీ శాఖ సంయుక్తంగా పరిశోధన ప్రారంభించాయి. వాటి ఆవాసాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రాంతాల్లో ఉండేందుకు అవి ఇష్టపడుతున్నాయి, వాటి జనాభా వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. పాంగోలిన్ల బొరియలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తూ వాటి గురించి తెలుసుకుంటున్నారు. అవి ఆహారం తినడానికి తవ్వే బొరియలు, నివాసం కోసం తవ్వే బొరియలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ బొరియల ఆధారంగా వాటి సంఖ్య, ఇతర వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీలైతే అక్కడ కెమెరా ట్రాప్‌లు పెట్టాలని భావిస్తున్నారు. అరుదైన పాంగోలిన్ జాతికి చెందినవి అలుగులను వివిధ ప్రాంతాల్లో వాలుగు, చిప్పల పంది తదితర పేర్లతోనూ పిలుస్తారు. ప్రపంచంలో 8 జాతుల పాంగోలిన్లు ఉన్నాయి. అందులో 4 ఆసియా ఖండంలో, మరో 4 ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ఆసియాలో ఉన్న 4 జాతుల్లో రెండు జాతులు మన దేశంలో కనిపిస్తాయి. ఆ రెండింటిలో అత్యంత అరుదైన ఇండియన్ పాంగోలిన్ (మానిస్ క్రాసికాడాటా) జాతి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. నల్లమలలో గుర్తించింది ఈ జాతినే. ఇది చీమలు, చెద పురుగులను తింటుంది. అన్ని పాంగోలిన్ల మాదిరిగానే ఇండియన్ పాంగోలిన్ మందమైన పొలుసులతో కప్పబడి ఉంటుంది. తమను వేటాడే జంతువుల నుండి రక్షించుకోవడానికి ఈ పొలుసులు రక్షణ కవచంగా ఉపయోగపడతాయి. ప్రాణాపాయం, బెదిరింపులకు గురైతే ఇండియన్ పాంగోలిన్ బంతిలా ముడుచుకుపోతుంది. మన దేశంలోని హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, నేపాల్‌లో చైనీస్ పాంగోలిన్లు కనిపిస్తాయి. పాంగోలిన్ జాతులున్నా అంతరించిపోయే జీవులు జాబితాలో ఉన్నాయి. అవి నివసించే ఆవాసాలు ధ్వంసమవడం, వాటి పొలుసులు, మాంసాన్ని సంప్రదాయ వైద్యంలో వినియోగించడం కోసం అక్రమంగా వేటాడుతుండటంతో పాంగోలిన్ల ఉనికి ప్రమాదంలో పడింది. వాటిపై ఉండే పొలుసులను చైనీస్ మెడిసిన్‌లో విరివిగా వాడతారు. అందుకే వాటిని ఇష్టానుసారం వేటాడటంతో అవి అంతరించిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఎక్కువగా అక్రమ రవాణా అవుతున్న క్షీరదాల్లో మొదటి స్థానం వీటిదే. దక్షిణాదిలో తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో వీటి అక్రమ రవాణా ఎక్కువగా ఉంది. నల్లమలలో రక్షణకు అవకాశం ఎక్కువ ఇండియన్ పాంగోలిన్ అరుదైన జంతువు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇవి ఉన్నా అంతరించే దశలో ఉన్నాయి. శ్రీశైలం రిజర్వు పెద్దది కావడం, ఇక్కడి రక్షణ వ్యవస్థ బాగుండటం, పులుల సంఖ్య పెరుగుతుండటంతో పాంగోలిన్లకు ఎక్కువ రక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే అటవీ శాఖతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. వాటి ఉనికి, హాట్ స్పాట్స్, అక్రమ రవాణా ఏమైనా జరుగుతుందా వంటి వివరాలను తెలుసుకుంటున్నాం. – కంటి మహంతి మూర్తి, తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు -
ఆడపులుల అడ్డా.. నల్లమల
సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లో మగ పులులకంటే ఆడ పులులే ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో 2022 సంవత్సరం పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. మొత్తం 73 పులులు ఉన్నట్లు కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించారు. అందులో 49 ఆడ పులులే. 21 మాత్రమే మగ పులులు ఉన్నాయి. మూడు పులులు ఆడవో, మగవో గుర్తించలేకపోయారు. 2014లో రాష్ట్ర విభజన సమయానికి నల్లమలలో 37 పులులే ఉన్నాయి. అటవీ శాఖ సంరక్షణ చర్యలు పటిష్టంగా ఉండడంతో వాటి సంఖ్య అనూహ్యంగా 73కి పెరిగింది. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం, దోర్నాల ప్రాంతంలో (బ్లాక్–1) 18 పులులుంటే అందులో 6 మాత్రమే మగవి. 11 ఆడ పులులు. ఒక పులి లింగ నిర్ధారణ కాలేదు. బైర్లూటి, వెలిగోడు, నంద్యాల, గుండ్లబ్రహ్మేశ్వరం, బండి ఆత్మకూరు, చలమ, గుండ్లకమ్మ, తురిమెళ్ల ప్రాంతంలో (బ్లాక్–2) 26 పులులుంటే 8 మాత్రమే మగవి. 17 ఆడ పులులు. ఒక పులి ఆడదో, మగదో గుర్తించలేదు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని జీవీ పల్లి, వై పాలెం, వీపీ సౌత్ ప్రాంతాల్లో (బ్లాక్–3) 20 పులులుంటే ఆడ పులుల సంఖ్య 15. మగ పులులు 5 మాత్రమే. ఇక్కడ ఒక మగ పులికి మూడు ఆడ పులులున్నాయి. కొత్తగా విస్తరించిన ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల పరిధిలోని రుద్రవరం, చలమల, గిద్దలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, కడప, రాయచోటి, బద్వేల్, ఓనిపెంట,పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో (కొత్త కారిడార్) మొత్తం 9 పులులు ఉంటే రెండు మాత్రమే మగవి. 6 పులులు మగవి. ఇక్కడ ఒక మగ పులికి మూడు ఆడ పులులున్నాయి. ఒకదాని లింగ నిర్ధారణ చేయడం కుదరలేదు. ప్రతి పులి ప్రత్యేకతను గుర్తిస్తారు నాగార్జున్‌సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వులోని ఆత్మకూరు, మార్కాపురం, నంద్యాల, గిద్దలూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, కడప అటవీ డివిజన్లలో 905 ప్రదేశాల్లో 1800కిపైగా అధునాతన మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కిలోమీటర్లకు రెండు కెమెరాలు పెట్టారు. పులులు వెళ్లే ప్రధాన దారుల్లో రెండు వైపులా రెండు జతల కెమెరాలు అమర్చారు. ఇవి వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన లక్షలకుపైగా ఫొటోలను ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేíÙంచి పులుల సంఖ్య, ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. పులి చర్మంపై ఉండే చారలు మన చేతి రేఖల్లానే ప్రత్యేకంగా ఉంటాయి. రెండు వైపులా చారలను గుర్తించి వాటి ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన పులులను లెక్కిస్తారు. ఆడ, మగ పులుల్ని ఇలా గుర్తిస్తారు... పులుల్ని వాటి అడుగు జాడల (పగ్ మార్క్) ఆధారంగా గుర్తిస్తారు. ఆ అడుగుల్ని బట్టే అవి ఆడవో, మగవో నిర్ధారిస్తారు. మగ పులి అడుగు చతురస్రాకారంలో ఉంటుంది. ఆడ పులి అడుగు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. మగ పులి కాలి మడమ పెద్దగా, ఆడ పులి మడమ చిన్నగా ఉంటుంది. పటిష్టంగా పులుల పరిరక్షణ పర్యావరణ వ్యవస్థలో పులుల పరిరక్షణ అత్యంత కీలకం. వాటి పరిరక్షణలో రాష్ట్ర అటవీ శాఖ ముందుంది. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంఖ్య 73కి పెరగడమే ఇందుకు నిదర్శం. నాలుగేళ్లలో పులుల సంఖ్య 60 శాతం పెరగడం మంచి పరిణామం. – వై మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి సంరక్షణ చర్యల వల్లే.. 2008లో నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో పులులు ఉన్నాయా అనే అనుమానం ఉండేది. అప్పుడు కెమేరా ట్రాప్‌లు పెడితే 2, 3 మాత్రమే ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి వాటి సంరక్షణకు పెద్దఎత్తున చర్యలు చేపట్టడం మొదలైంది. పులుల వేటను దాదాపు నివారించి వాటి ఆవాసాలను పరిరక్షించేందుకు కింది స్థాయిలో అటవీ శాఖ సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. దాని ఫలితంగానే వాటి సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. – విఘ్నేష్ అప్పావు, డిప్యూటీ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్, మార్కాపురం -
International Tiger Day: పులుల భారత్
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పర్యావరణ పిరమిడ్‌లో పెద్దపులిని అగ్రసూచిగా భారత్ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 4 వేల వరకు ఉండగా అందులో డెబ్భై శాతానికి మించి మన దేశంలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 53 పులుల అభయారణ్యాలు ఉన్నాయి. 2006లో దేశంలో 1,411 పులులు ఉండగా 2018 నాటికి వాటి సంఖ్య 2,967కు చేరింది. కేవలం పన్నెండేళ్లలో ఇంత వృద్ధి ఓ రికార్డుగా పర్యావరణవేత్తలు అభివర్ణిస్తున్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ స్థాయిలో పెరుగుదల లేదని చెబుతున్నారు. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) జోన్లోనే 63 పులులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణలో పులి పాత్ర కీలకం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గిపోతుండటంతో వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పులుల సంరక్షణపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఎన్ఎస్టీఆర్ దేశంలోనే పెద్దది రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) జోన్ దేశంలోకెల్లా పెద్దది. ఏపీలోని పూర్వపు గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతం పులుల ఆవాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంతం కృష్ణాతో పాటు దాని ఉప నదులు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల బ్యాక్ వాటర్, ఇతర వనరులతో నీటికి కొదవలేకపోవడం, ఎత్తయిన కొండలు, భారీ లోయలతో భౌగోళికంగా అనువుగా ఉండటం పులుల సంచారానికి, వాటి ఎదుగుదలకు ఉపయుక్తంగా ఉంటుంది. నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వరకూ విస్తరించిన ఈ టైగర్ కారిడార్‌లో పులుల సంచారం పెరిగినట్లు అటవీ శాఖ గుర్తించింది. కొన్నేళ్లుగా నల్లమల నుంచి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల వరకూ పులుల సంచారం మొదలైనట్లు గుర్తించారు. శేషాచలం బ్లాకులో మూడేళ్ల క్రితం కొత్తగా 6 పులులు కనిపించగా గతేడాది 3 కనిపించాయి. టైగర్ రిజర్వు ప్రాంతంలో 597 అధునాతన మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కి.మీ కు రెండు కెమెరాలు పెట్టారు. అడవిలో పులులు వెళ్లే ప్రధాన దారుల్లో కెమెరాలు పెట్టారు. ఈ కెమెరాలు వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన లక్షల ఫొటోలను ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించి, పులుల సంఖ్య ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. పులి చర్మంపై ఉండే చారల ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన వాటిని లెక్కిస్తారు. జాతీయ స్థాయిలో ప్రతి నాలుగేళ్లకోసారి, రాష్ట్రాల్లో ప్రతి ఏడాది పులుల గణన జరుగుతుంది. తాజా వివరాలను శుక్రవారం తిరుపతి ఎస్వీ జూ పార్క్‌లో విడుదల చేయనున్నారు. పర్యావరణ వ్యవస్థలో పులులు కీలకం పర్యావరణ వ్యవస్థ శ్రేయస్సుకి పులులు ఎంతో కీలకం. వాటి సంరక్షణ, రక్షణ ద్వారా మనిషి మనుగడకు కీలకమైన పర్యావరణాన్ని కాపాడినట్లే. అనేక జీవరాశుల మనుగడకు పులి అవకాశం కల్పిస్తుంది. పులులను పరిరక్షించడానికి అధిక ప్రాధానత్య ఇస్తున్నాం. – మధుసూదన్‌రెడ్డి, అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వేటను పూర్తిగా నిషేధించాలి పులి అత్యంత సున్నితమైన జంతువు. పులి సౌకర్యంగా జీవించడానికి తగిన పర్యావరణాన్ని ఏర్పరచడం కష్టం. పులికి ఆహారమైన జంతువుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సి ఉన్నందున అడవికి నిప్పు పెట్టడం, జంతువులను వేటాడటం పూర్తిగా నిషేదించాలి. – ఎల్.నాగిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ శాస్త్ర విభాగం, అనంతపురం -
నల్లమలలో పులులు ఎన్నున్నాయో?
శ్రీశైలం ప్రాజెక్టు: నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు పరిధిలో శుక్రవారం నుంచి పులుల లెక్కింపు ప్రారంభించినట్లు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఖాదర్ వలీ తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు లెక్కింపు ఉంటుందన్నారు. నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో లెక్కింపును చేపట్టామన్నారు. శాస్త్రీయ పద్ధతిలో లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో పులులు ఎన్ని ఉన్నాయనేది లెక్కింపు తర్వాత తెలుస్తోంది. పులుల సంఖ్యపై జంతు ప్రేమికులు ఆసక్తి కనబరుస్తున్నారు.