అలుగు.. ఒళ్లంతా పొలుసులు, మందపాటి తోక గల క్షీరద జాతి జంతువు. పగలంతా చెట్ల తొర్రలు, నేల బొరియల్లో దాక్కుని.. రాత్రి వేళ బయట సంచరించే నిశాచర జీవులివి. ఒంటరిగా జీవించడానికే ఇష్టపడే అలుగులు చీమలు, చెద పురుగులనే ఆహారంగా తీసుకుంటాయి. పొడవాటి సన్నని నాలుకతో వాటిని జుర్రుకుని తింటాయి. శత్రువు కనిపిస్తే బంతి మాదిరిగా చుట్టుకుపోయి.. ముప్పు నుంచి తప్పించుకునే నైపుణ్యం గల అలుగులు శ్రీశైలం అడవుల్లో సంచరిస్తున్నట్టు అటవీ శాఖ కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించింది.
సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో అరుదైన భారతీయ అలుగుల (ఇండియన్ పాంగోలిన్) ఉనికిని గుర్తించారు. గతంలో ఈ ప్రాంతంలో విస్తృతంగా కనిపించే పాంగోలిన్లు అంతరించే దశకు చేరుకున్నాయి. నల్లమలతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లోనూ వాటి జాడే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నల్లమల అడవుల్లో మళ్లీ వాటి కదలికలను గుర్తించడంతో వన్యప్రాణి ప్రేమికుల్లో ఆశలు చిగురించాయి.
శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలోని ఆత్మకూరు, మార్కాపురం పరిసరాల్లో పులుల జాడ కోసం పెట్టిన కెమెరా ట్రాపుల్లో పాంగోలిన్లు కూడా కనిపించాయి. కాకపోతే మిగిలిన జంతువులతో పోలిస్తే వాటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు నల్లమలలో జీవించే చెంచులు, లంబాడీలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాంగోలిన్ల ఉనికి, వాటి ఆవాసాలు, రక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, రాష్ట్ర అటవీ శాఖ సంయుక్తంగా పరిశోధన ప్రారంభించాయి.
వాటి ఆవాసాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రాంతాల్లో ఉండేందుకు అవి ఇష్టపడుతున్నాయి, వాటి జనాభా వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. పాంగోలిన్ల బొరియలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తూ వాటి గురించి తెలుసుకుంటున్నారు. అవి ఆహారం తినడానికి తవ్వే బొరియలు, నివాసం కోసం తవ్వే బొరియలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ బొరియల ఆధారంగా వాటి సంఖ్య, ఇతర వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీలైతే అక్కడ కెమెరా ట్రాప్‌లు పెట్టాలని భావిస్తున్నారు.
అరుదైన పాంగోలిన్ జాతికి చెందినవి
అలుగులను వివిధ ప్రాంతాల్లో వాలుగు, చిప్పల పంది తదితర పేర్లతోనూ పిలుస్తారు. ప్రపంచంలో 8 జాతుల పాంగోలిన్లు ఉన్నాయి. అందులో 4 ఆసియా ఖండంలో, మరో 4 ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ఆసియాలో ఉన్న 4 జాతుల్లో రెండు జాతులు మన దేశంలో కనిపిస్తాయి. ఆ రెండింటిలో అత్యంత అరుదైన ఇండియన్ పాంగోలిన్ (మానిస్ క్రాసికాడాటా) జాతి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. నల్లమలలో గుర్తించింది ఈ జాతినే.
ఇది చీమలు, చెద పురుగులను తింటుంది. అన్ని పాంగోలిన్ల మాదిరిగానే ఇండియన్ పాంగోలిన్ మందమైన పొలుసులతో కప్పబడి ఉంటుంది. తమను వేటాడే జంతువుల నుండి రక్షించుకోవడానికి ఈ పొలుసులు రక్షణ కవచంగా ఉపయోగపడతాయి. ప్రాణాపాయం, బెదిరింపులకు గురైతే ఇండియన్ పాంగోలిన్ బంతిలా ముడుచుకుపోతుంది. మన దేశంలోని హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, నేపాల్‌లో చైనీస్ పాంగోలిన్లు కనిపిస్తాయి.
పాంగోలిన్ జాతులున్నా అంతరించిపోయే జీవులు జాబితాలో ఉన్నాయి. అవి నివసించే ఆవాసాలు ధ్వంసమవడం, వాటి పొలుసులు, మాంసాన్ని సంప్రదాయ వైద్యంలో వినియోగించడం కోసం అక్రమంగా వేటాడుతుండటంతో పాంగోలిన్ల ఉనికి ప్రమాదంలో పడింది. వాటిపై ఉండే పొలుసులను చైనీస్ మెడిసిన్‌లో విరివిగా వాడతారు.
అందుకే వాటిని ఇష్టానుసారం వేటాడటంతో అవి అంతరించిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఎక్కువగా అక్రమ రవాణా అవుతున్న క్షీరదాల్లో మొదటి స్థానం వీటిదే. దక్షిణాదిలో తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో వీటి అక్రమ రవాణా ఎక్కువగా ఉంది.
నల్లమలలో రక్షణకు అవకాశం ఎక్కువ
ఇండియన్ పాంగోలిన్ అరుదైన జంతువు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇవి ఉన్నా అంతరించే దశలో ఉన్నాయి. శ్రీశైలం రిజర్వు పెద్దది కావడం, ఇక్కడి రక్షణ వ్యవస్థ బాగుండటం, పులుల సంఖ్య పెరుగుతుండటంతో పాంగోలిన్లకు ఎక్కువ రక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే అటవీ శాఖతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. వాటి ఉనికి, హాట్ స్పాట్స్, అక్రమ రవాణా ఏమైనా జరుగుతుందా వంటి వివరాలను తెలుసుకుంటున్నాం.
– కంటి మహంతి మూర్తి, తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment