సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లో మగ పులులకంటే ఆడ పులులే ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో 2022 సంవత్సరం పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. మొత్తం 73 పులులు ఉన్నట్లు కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించారు. అందులో 49 ఆడ పులులే. 21 మాత్రమే మగ పులులు ఉన్నాయి. మూడు పులులు ఆడవో, మగవో గుర్తించలేకపోయారు. 2014లో రాష్ట్ర విభజన సమయానికి నల్లమలలో 37 పులులే ఉన్నాయి.
అటవీ శాఖ సంరక్షణ చర్యలు పటిష్టంగా ఉండడంతో వాటి సంఖ్య అనూహ్యంగా 73కి పెరిగింది. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం, దోర్నాల ప్రాంతంలో (బ్లాక్–1) 18 పులులుంటే అందులో 6 మాత్రమే మగవి. 11 ఆడ పులులు. ఒక పులి లింగ నిర్ధారణ కాలేదు. బైర్లూటి, వెలిగోడు, నంద్యాల, గుండ్లబ్రహ్మేశ్వరం, బండి ఆత్మకూరు, చలమ, గుండ్లకమ్మ, తురిమెళ్ల ప్రాంతంలో (బ్లాక్–2) 26 పులులుంటే 8 మాత్రమే మగవి. 17 ఆడ పులులు. ఒక పులి ఆడదో, మగదో గుర్తించలేదు.
ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని జీవీ పల్లి, వై పాలెం, వీపీ సౌత్ ప్రాంతాల్లో (బ్లాక్–3) 20 పులులుంటే ఆడ పులుల సంఖ్య 15. మగ పులులు 5 మాత్రమే. ఇక్కడ ఒక మగ పులికి మూడు ఆడ పులులున్నాయి. కొత్తగా విస్తరించిన ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల పరిధిలోని రుద్రవరం, చలమల, గిద్దలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, కడప, రాయచోటి, బద్వేల్, ఓనిపెంట,పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో (కొత్త కారిడార్) మొత్తం 9 పులులు ఉంటే రెండు మాత్రమే మగవి. 6 పులులు మగవి. ఇక్కడ ఒక మగ పులికి మూడు ఆడ పులులున్నాయి. ఒకదాని లింగ నిర్ధారణ చేయడం కుదరలేదు.
ప్రతి పులి ప్రత్యేకతను గుర్తిస్తారు
నాగార్జున్‌సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వులోని ఆత్మకూరు, మార్కాపురం, నంద్యాల, గిద్దలూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, కడప అటవీ డివిజన్లలో 905 ప్రదేశాల్లో 1800కిపైగా అధునాతన మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కిలోమీటర్లకు రెండు కెమెరాలు పెట్టారు. పులులు వెళ్లే ప్రధాన దారుల్లో రెండు వైపులా రెండు జతల కెమెరాలు అమర్చారు.
ఇవి వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన లక్షలకుపైగా ఫొటోలను ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా విశ్లేíÙంచి పులుల సంఖ్య, ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. పులి చర్మంపై ఉండే చారలు మన చేతి రేఖల్లానే ప్రత్యేకంగా ఉంటాయి. రెండు వైపులా చారలను గుర్తించి వాటి ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన పులులను లెక్కిస్తారు.
ఆడ, మగ పులుల్ని ఇలా గుర్తిస్తారు...
పులుల్ని వాటి అడుగు జాడల (పగ్ మార్క్) ఆధారంగా గుర్తిస్తారు. ఆ అడుగుల్ని బట్టే అవి ఆడవో, మగవో నిర్ధారిస్తారు. మగ పులి అడుగు చతురస్రాకారంలో ఉంటుంది. ఆడ పులి అడుగు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. మగ పులి కాలి మడమ పెద్దగా, ఆడ పులి మడమ చిన్నగా ఉంటుంది.
పటిష్టంగా పులుల పరిరక్షణ
పర్యావరణ వ్యవస్థలో పులుల పరిరక్షణ అత్యంత కీలకం. వాటి పరిరక్షణలో రాష్ట్ర అటవీ శాఖ ముందుంది. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంఖ్య 73కి పెరగడమే ఇందుకు నిదర్శం. నాలుగేళ్లలో పులుల సంఖ్య 60 శాతం పెరగడం మంచి పరిణామం.
– వై మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి
సంరక్షణ చర్యల వల్లే..
2008లో నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో పులులు ఉన్నాయా అనే అనుమానం ఉండేది. అప్పుడు కెమేరా ట్రాప్‌లు పెడితే 2, 3 మాత్రమే ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి వాటి సంరక్షణకు పెద్దఎత్తున చర్యలు చేపట్టడం మొదలైంది. పులుల వేటను దాదాపు నివారించి వాటి ఆవాసాలను పరిరక్షించేందుకు కింది స్థాయిలో అటవీ శాఖ సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. దాని ఫలితంగానే వాటి సంఖ్య ఊహించని విధంగా పెరిగింది.
– విఘ్నేష్ అప్పావు, డిప్యూటీ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్, మార్కాపురం
Comments
Please login to add a commentAdd a comment