Nallamala forests
-
గజరాజులతో గస్తీ
పెద్దదోర్నాల: నల్లమల అడవుల పరిరక్షణకు ఏపీ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అమూల్యమైన వృక్షసంపద అక్రమ రవాణాను అరికట్టేందుకు.. అరుదైన వన్యప్రాణులను సంరక్షించి వేసవిలో అగ్నికీలల నుంచి అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఇప్పటికే బేస్ క్యాంప్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్, యాంటీ పోచింగ్ బృందాలను ఏర్పాటు చేసింది. దీంతోపాటు అభయారణ్యాల్లో ఇకపై గజరాజులతో గస్తీ చేపట్టాలని అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు అభయారణ్యాల పరిధిలో..మన రాష్ట్రంలోని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో 3,727.82 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్న అడవిని కేంద్ర ప్రభుత్వం 1983లో అభయారణ్యంగా ప్రకటించింది. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం శిఖరం వరకు రాజీవ్‌గాంధీ అభయారణ్యం.. మార్కాపురం, గిద్దలూరు, ఆత్మకూరు, నంద్యాల డివిజన్ల పరిధిలో గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం విస్తరించి ఉన్నాయి. వీటిలో పులులతోపాటు చిరుత, ఎలుగుబంటి, జింకలు, దుప్పులు, హైనా, నెమళ్లతోపాటు 70 రకాల క్షీరదాలు, సరీసృపాలు, ఎన్నోరకాల వృక్షాలు, ఔషధ మొక్కలు నల్లమల అభయారణ్యంలో ఉన్నాయి. ఇవన్నీ మారుమూల లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను సందర్శించి వాటిని సంరక్షించే బాధ్యత కత్తిమీద సాములా మారింది.మూలమూలల్నీ జల్లెడ పట్టేలా..మారుమూల ప్రాంతాల్లో సైతం వన్యప్రాణులు, వృక్షాలను సంరక్షించేందుకు వీలుగా అటవీ శాఖ ఉన్నతాధికారులు సుశిక్షితులైన సిబ్బంది నేతృత్వంలో ఏనుగులతో గస్తీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు తమకు శిక్షణ పొందిన 9 ఏనుగులు అవసరమవుతాయని గుర్తించారు. తమకు అవసరమైన 9 ఏనుగులను ఇవ్వాల్సిందిగా ఏపీ అటవీ శాఖ అధికారులు కర్ణాటక అటవీ శాఖకు లేఖ రాశారు.దీనిపై స్పందించిన కర్ణాటక అటవీ శాఖ అధికారులు శిక్షణ పొందిన ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు ఏనుగులను కట్టడి చేసేందుకు మావటిలను తయారు చేసేందుకు అటవీశాఖ తమ సిబ్బందిని కర్ణాటక రాష్ట్రానికి పంపనుంది. రాష్ట్రానికి చెందిన సిబ్బంది అక్కడికి వెళ్లి గజరాజుల ఆహారపు అలవాట్లు, వాటి కదలికలు, వాటి ఇతర అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణ పొందనున్నారు.6 ఏనుగులను రాజీవ్‌గాంధీ వన్యప్రాణుల అభయారణ్యానికి, మరో మూడు ఏనుగులను గుండ్లబ్రహ్మేశ్వరం అడవులకు పంపేలా చర్యలు చేపట్టన్నారు. ఏనుగుల్ని తీసుకొస్తే పెద్ద పులులు ఎక్కువగా సంచరించే లోతట్టు ప్రాంతాలైన నెక్కంటి, రేగుమానుపెంట, తూము గుండాలు, ఆలాటం తదితర ప్రాంతాల్లో సైతం ధైర్యంగా పెట్రోలింగ్ చేపట్టవచ్చని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.ఏనుగులతో గస్తీ నిర్వహించేలా చర్యలు అభయారణ్యంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. నడక మార్గంలో సిబ్బంది కొంతమేర వరకు మాత్రమే వెళ్లగలరు. అదే ఏనుగులతో అయితే సుదూర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించవచ్చు. పులులు సంచరించే ప్రదేశాల్లో సైతం భయం లేకుండా పెట్రోలింగ్ నిర్వహించవచ్చు. మనం చేసిన విజ్ఞప్తికి కర్ణాటక అటవీ శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో ఏనుగుల్ని నల్లమలకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – విశ్వేశ్వరరావు, ఫారెస్ట్ రేంజి అధికారి, పెద్దదోర్నాల -
పులి జోన్..పరేషాన్!
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కుగ్రామం దొరవారి తిమ్మాపురం. ఈ గ్రామంలో 25 ఆదివాసీ గిరిజన కుటుంబాలు రెండు శతాబ్దాలుగా నివాసం ఉంటున్నాయి. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పచ్చటి అడవిలో ప్రశాంతమైన జీవనం సాగిస్తున్న ఈ ఆదివాసీ బిడ్డల్లో అలజడి మొదలైంది. ‘ఈ గ్రామానికి వసతులు కల్పించలేం.. మీరు ఖాళీ చేయండి.. మైదాన ప్రాంతంలో మీకు పునరావాసం కల్పిస్తాం..’అంటూ అధికారులు ఒత్తిడి చేయడమే ఇందుకు కారణం. అడవిలో జీవించే తాము ఎక్కడికీ రాలేమని గిరిజనులు తేల్చి చెప్పడంతో ఒత్తిడి పెంచేందుకు అధికారులు త్రీఫేజ్ విద్యుత్‌ను తొలగించారు. అయితే ఇదంతా ఆ గ్రామానికి వసతులు క ల్పించలేక అధికారులు చేస్తున్న పని కాదని, అడవి మధ్యలో ఉన్న ఈ గ్రామాన్ని ఖాళీ చేస్తే ఇక్కడ టైగర్ జోన్ ఏర్పాటు చేయవచ్చని, తద్వారా అటు వన్యప్రాణుల సంరక్షణ, ఇటు అడవుల పరిరక్షణ చేయవచ్చనేది ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఆదివాసీ సంఘాలు, ఇతర సంఘాలు తిమ్మాపురం గిరిజనులకు మద్దతు పలికాయి. అయినా వారిలో ఆందోళన.. అడవి విడిచి పెట్టాల్సి వస్తుందేమో అని ఆవేదన. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ విధమైన తరలింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు సమాచారం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ప్రభుత్వం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు పులుల సంరక్షణ.. అడవుల రక్షణ కోసం ఆదివాసీ గూడేలపై కన్నువేసిందనే ప్రచారం జరుగుతోంది. నల్లమల డీప్ ఫారెస్టుతో పాటు తెలంగాణలోని గోదావరి లోయ ప్రాంతాలైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో టైగర్ జోన్లు ఏర్పాటు చేస్తే గోదావరి లోయ బెల్ట్ అంతా అడవితో నిండి ఉంటుంది. అడవి మధ్యలో గ్రామాలు ఖాళీ చేస్తే పోడు భూములు అడవిలో కలిసిపోతాయి. ఇక ముందు పోడు చేసుకునే అవకాశం కూడా ఉండదు. అందుకోసమే ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా..: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ రిజర్వ్ ఏరియాలోని గ్రామాలైన మైసంపేట, రాంపూర్ ప్రాంతాల గిరిజనులను పులుల అభయారణ్యం నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొత్తం కోర్ ఏరియాలో 39 గూడేలు ఉండగా.. ఇందులో 15 గూడేలను మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ పరిధిలోని మైసంపేట, రాంపూర్ పునరావాస గ్రామాల్లోని 142 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.21.30 కోట్లు పరిహారం ఇచ్చారు. æనల్లమల అడవిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో కోర్ ఏరియాలో ఉన్న చెంచుల పెంటలను అడవి నుంచి బయటకుపంపించే ప్రయత్నాలకు అధికారులు సిద్ధమయ్యారు. సారంపల్లి,కుడిచంతలబైల్ గ్రామస్తులతో సమావేశమయ్యారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారం అందించి పునరావాసం ఏర్పాటు చేస్తామని ఆశ చూపుతున్నారు. ►ములుగు జిల్లా కన్నాయిగూడెం, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, గోవిందరావుపేట మండలాల పరిధిలో మొత్తం 53 గొత్తికోయ గ్రామాలను గుర్తించి 2022 జూన్‌లో సర్వే చేశారు. ప్రస్తుతం గూడేలు ఖాళీ చేయాలని, మంచి ప్యాకేజీలు ఇచ్చి మైదాన ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తామని వారిని బుజ్జగిస్తున్నారని తెలుస్తోంది. ►మహబూబాబాద్‌తో పాటు పక్కనే ఉన్న వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలకమ్మనగర్ ఆదివాసీ గూడేలను కూడా ఖాళీ చేయించే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత దొరవారి తిమ్మాపురం గ్రామంపై దృష్టిపెట్టి ఆ గూడేన్ని ఖాళీ చేయించే పనిలో అధికారులు ఉన్నారు. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, పినపాక అడవి మధ్యలో ఉన్న అడవి రామారం, కాచనపల్లి, గుండాల మధ్యలో ఉన్న బాటన్న నగర్ గ్రామాలపై కూడా ఫారెస్టు అధికారుల కన్నుపడినట్లు సమాచారం. ఈ రెండు గ్రామాలను కూడా ఖాళీ చేయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికి పోవాలి..ఎట్టా బతకాలే.. అడవిలోనే పుట్టా. ఇక్కడే పెరిగాను. జంతువులు అంటే మాకేం భయం. ఇక్కడి నుంచి పొమ్మంటే ఎక్కడికి పోయేది. ఎట్టా బతకాలే.. మా ఊరు విడిచి వెళ్లలేం. ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాం. మా అవ్వ, అయ్యను పెట్టిన జాగలోనే నన్ను పెట్టాలి. – పిడబోయిన లక్ష్మయ్య, దొరవారి తిమ్మాపురం ఖాళీ చేయమని చెప్పొద్దు చుట్టూ అడవి. అడవి మధ్యలో మా ఊరు. అందరం పని చేసుకుంటూ బతుకుతాం. ఇంత మంచిగా ఉన్న మా ఊరును ఖాళీ చేయమంటే మేం ఎట్టా బతికేది. గవర్నమెంటోళ్లు మా ఊరికి రోడ్డు వేసి వసతులు కల్పించాలి. అంతేకానీ..ఖాళీ చేయమని మాత్రం అనొద్దు. – పెరుకు గోవిందమ్మ, దొరవారి తిమ్మాపురం -
దట్టమైన అడవిలో 350 ఏళ్లనాటి దిగుడు బావి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
సాక్షి, తెనాలి(గుంటూరు జిల్లా): అది బావి మాత్రమే కాదు.. ఓ ఇంజనీరింగ్ అద్భుతం.. మన వాళ్ల ప్రతిభకు తార్కాణం.. ప్రకాశం జిల్లాలోని మైలచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న ఆ దిగుడు బావిని చూస్తే.. ఎవరైనా ఔరా అనాల్సిందే. అంత అత్యద్భుతంగా ఉంటుంది దాని నిర్మాణ కౌశలం. లేత గోధుమ రంగు గ్రానైట్ రాళ్లను అందంగా చెక్కి ఆ బావిని నిర్మించారు. తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధక బృందం చిట్టడవిలో ప్రయాణించి మరీ ఈ అందమైన దిగుడు బావిని వెలుగులోకి తెచ్చింది. ఆ విశేషాలను ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ బావి మెట్లు.. కనికట్టు! ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి 109 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలచర్ల అటవీగ్రామం వెలుపల ఉందీ దిగుడు బావి. తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకులైన మొవ్వ మల్లికార్జునరావు, చిట్టినేని సాంబశివరావు, బోడపాటి రాఘవయ్య, ముత్తేవి రవీంద్రనాథ్‌లు ఈ బావి గురించి సూచాయిగా విన్నారు. దీంతో ఆ బావిని సందర్శించాలన్న కోరిక వారికి కలిగింది. గత నెలాఖరులో అక్కడకు ప్రయాణం కట్టారు. చంద్రశేఖరపురం మండలంలోని వేట్ల బయలు(వి.బైలు) అనే గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన మైలచర్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి చిట్టడవిలో కొంత దూరం ప్రయాణించాక వెలుగుచూసింది.. ఆ అద్భుతమైన బావి. ఆ మెట్ల బావి డిజైన్, అనితర సాధ్యమైన నైపుణ్యంతో రూపొందించిన తీరు అద్భుతమని రవీంద్రనాథ్ బృందం చెప్పింది. ఊటబావి చుట్టూ పటిష్టంగా నిర్మించిన రాతి కూర్పు కారణంగా గట్టు నుంచి మట్టి పెళ్లలు విరిగిపడి నీరు కలుషితమయ్యే అవకాశమే లేదు. పటిష్టంగా నిర్మించిన రాతి మెట్ల కారణంగా చివరివరకు కిందికి దిగి శుభ్రమైన మంచినీటిని తీసుకెళ్లే వీలు గ్రామీణులకు లభించింది. ప్రస్తుతం నీరు కొద్దిగా మురికిగా ఉన్నా.. తీయదనాన్ని కోల్పోకపోవడం విశేషం. ఇప్పుడు పరిస్థితి కొంతమేర ఆశాజనకంగానే ఉన్నా.. గతంలో తరచూ దుర్భిక్షం తాండవించే ప్రాంతం అది. బిందెడు మంచినీటి కోసం సుదూర గ్రామాల ప్రజలు మైలచర్ల అటవీ ప్రాంతంలోని సహజసిద్ధమైన మంచినీటి ఊట దగ్గరకు వచ్చేవారట. ‘గండి సోదరుల’ అద్భుత సృష్టి భైరవకోన గుహాలయాల్లో క్రీ.శ 1675 ప్రాంతంలో నివసించిన ఒక సాధువు.. ఆ ప్రాంత ప్రజల తాగునీటి ఇక్కట్లను గమనించి పరిష్కారాన్ని ఆలోచించారు. మైలచర్ల నీటి ఊట దగ్గర ఒక సౌకర్యవంతమైన దిగుడు బావిని నిర్మించాలని తన శిష్యులైన ‘గండి సోదరులు’గా ప్రసిద్ధులైన పశువుల పెంపకందార్లను ఆదేశించడంతో ఈ బావిని వారు నిర్మించినట్టు స్థానికులు చెబుతున్నారు. చదవండి: కుప్పం టీడీపీ కోట కూలడానికి కారణం ఇదేనా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? -
నల్లమలలో కొత్త మొక్క
జడ్చర్ల టౌన్: నల్లమల అడవుల్లో సరికొత్త మొక్కను కనుగొన్నట్టు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర ప్రొఫెసర్ సదాశివయ్య వెల్లడించారు. తన పరిశోధక బృందంతో కలిసి గుర్తించిన ఆ మొక్కకు యూఫోర్బియా తెలంగాణేన్సిస్గా నామకరణం చేసినట్టు ప్రకటించారు. శుక్రవారం ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. సదాశివయ్య బృందం, ఏపీ రాష్ట్ర జీవవైవిధ్య మండలి సభ్యుడు డాక్టర్ ప్రసాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం నుంచి నిర్మలా బాబురావు, రామకృష్ణ సంయుక్తంగా నల్లమల అటవీ ప్రాంతంలో గడ్డి జాతులపై పరిశోధన చేస్తున్నారు. అటవీశాఖ సహకారంతో చేపట్టిన ఈ పరిశోధనలో ఒక కొత్త మొక్కను గుర్తించారు. అది రాజస్తాన్‌లో ఉండే యూఫోర్బియా జోధ్పూరెన్సిస్ అనే మొక్కను పోలి ఉందని.. కానీ కొన్ని లక్షణాల్లో వైవిధ్యం ఉండటంతో కొత్త మొక్కగా తేల్చామని పరిశోధక బృందం తెలిపింది. ఈ మొక్కల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, కేవలం రెండు ప్రాంతాల్లోనే లభ్యమవుతుండటంతో అంతరించిపోతున్న మొక్కల జాబితా కింద చెప్పవచ్చన్నారు.కొత్త మొక్కను కనుగొన్న పరిశోధక బృందాన్ని ఉన్నతవిద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ అభినందించారు. మరింత అధ్యయనం చేస్తాం.. నల్లమలలో కనుగొన్న కొత్త మొక్కపై మరింత అధ్యయనం అవసరమని సదాశివయ్య చెప్పారు. ఈ మొక్క సుమారు 30 సెంటీమీటర్ల పొడవు పెరిగి, మొత్తం పాల వంటి లేటెక్స్ (చిక్కని ద్రవం) ను కలిగి ఉంటుందన్నారు. ఈ మొక్క ఔషధ గుణాలు కలిగి ఉండే అవకాశాలు ఎక్కువన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణ అడవుల్లో 5 కొత్త మొక్కలను కనుగొన్నామని, రాష్ట్రంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అటవీ ప్రదేశాలు చాలా ఉన్నాయని వివరించారు. కాగా.. నల్లమల అటవీప్రాంతం జీవ వైవిధ్యానికి కేంద్రమని, గతంలో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వల్ల పరిశోధనలు జరగలేదని నాగర్‌కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్ గోపిడి చెప్పారు. ప్రస్తుతం మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేసే అవకాశం ఉందన్నారు. -
అంతరించిపోతున్న అరుదైన జీవి.. ప్రపంచంలోనే అతి చిన్న జీవాలు
దుష్టశిక్షణ..శిష్ట రక్షణ కోసం సాక్షాత్తు శ్రీమహావిష్ణువే నరుడు.. సింహం రూపాలతో నరసింహుడిగా అవతరించాడనేది పురాణ గాథ. నల్లమల అడవుల్లో మాత్రం మూషిక మొహం.. జింక దేహంతో ఓ బుల్లి ప్రాణి నరసింహుడి కంటే అంతకు ముందే అవతరించింది. ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్న ప్రాణి అయిన దీనిని మూషిక జింక అంటారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో అప్పటినుంచి ఇప్పటివరకు ఎటువంటి మార్పులు జరగలేదట. అందుకే దీనిని సజీవ శిలాజంగా కూడా పరిగణిస్తారు. పెద్దదోర్నాల (ప్రకాశం): మూషిక జింక.. ప్రపంచంలోనే అతి బుల్లి జింక. ఆంగ్లంలో మౌస్ డీర్ లేదా చెవ్రోటేన్‌గా పిలిచే ఈ జీవి గుండ్రని దేహం.. చిన్న చిన్న కాళ్లతో 25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు, 10 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది. నెమరు వేసుకునే జీవుల్లో పొట్టలో మూడు గదులుండే జీవి ఇదొక్కటే. ప్రపంచంలో క్రమేపీ అంతరించిపోతున్న మూగ జీవాలలో ఒకటైన మూషిక జింకలకు కొమ్ములు ఉండవు. నల్లమల అభయారణ్యంలో సంచరించే అత్యంత చిన్న జీవులు ఇవి. దక్షిణాసియా దేశాలైన భారత్, శ్రీలంక, దేశాలలోనే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గడ్డి పరకలు, ఆకులు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుని జీవిస్తాయి. బరువు తక్కువ.. భయం ఎక్కువ మూడు కిలోల వరకు బరువు పెరిగే ఈ జీవులు కొమ్ములు లేని కారణంగా పగలంతా గుబురు పొదల్లోనే దాగి ఉంటాయి. కేవలం రాత్రి పూట మాత్రమే ఆరు బయట సంచరిస్తుంటాయి. వీటి గర్భధారణ సమయం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. వీటి జీవిత కాలం కూడా ఆరేళ్లకు మించి ఉండదు. అడవిలో సంచరించే ఏ చిన్న మాంసాహార ప్రాణులైనా వీటిని అవలీలగా వేటాడే అవకాశం ఉంటుంది. ఆకాశంలో సంచరించే గద్దలు, గరుడ పక్షులు నుంచి కూడా వీటికి ఎక్కువగా ముప్పు ఉంటుంది. అవి అవలీలగా వీటిని నోటకరుచుకుని ఆకాశంలోకి ఎగిరిపోయే ప్రమాదం ఉన్నందున పగలు చెట్ల పొదల్లోనే దాగి రాత్రి పూట మాత్రమే అడవిలో సంచరిస్తుంటాయి. నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం అంతరించిపోతున్న వన్య ప్రాణుల జాతులను సంరక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కేంద్ర జంతు సాధికార సంస్థ అంతరించిపోతున్న ఒక్కో వన్యప్రాణి జాతిని సంరక్షించే బాధ్యతను ఒక్కో జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించింది. తిరుపతి జూ పార్క్‌కు అడవి కోడి, విశాఖపట్నం జూ పార్క్‌కు వైల్డ్‌డాగ్, హైదరాబాద్ జూ పార్కుకు మౌస్‌డీర్ సంరక్షణ బాధ్యతల్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న మూషిక జింకలను సంరక్షించటంతో పాటు వాటి పునరుత్పత్తి ప్రక్రియను హైదరాబాద్ జూ పార్క్ 2010లో చేపట్టింది. నాలుగు ఆడ మూషిక జింకలు, రెండు మగ మూషిక జింకలతో హైదరాబాద్ జూ పార్క్‌లో వీటి సంరక్షణçతో పాటు పునరుత్పత్తిని ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన ఐదేళ్లలోనే వాటి సంఖ్యను భారీగా పెంచగలిగారు. పునరుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసి మూషిక జింకలను ఆమ్రాబాద్, అచ్చంపేట అడవుల్లో వదిలిపెట్టారు. రాత్రి పూట మాత్రమే సంచరిస్తాయి నల్లమల అభయారణ్యంలో వీటి సంచారం ఎక్కువగా ఉంది. మాంసాహార వన్యప్రాణులు, పక్షుల బారినుంచి కాపాడుకునేందుకు రాత్రి పూట మాత్రమే ఇవి అడవిలో సంచరిస్తుంటాయి. పగటి పూట చెట్ల పొదలోపల నివాసం ఉంటాయి. అంతరించిపోతున్న ఈ జాతిని సంరక్షించేందుకు గతంలో హైదరాబాద్ జూపార్క్ అధికారులు చర్యలు చేపట్టారు. – విశ్వేశ్వరావు, ఫారెస్ట్ రేంజి అధికారి -
ఆడపులుల అడ్డా.. నల్లమల
సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లో మగ పులులకంటే ఆడ పులులే ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో 2022 సంవత్సరం పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. మొత్తం 73 పులులు ఉన్నట్లు కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించారు. అందులో 49 ఆడ పులులే. 21 మాత్రమే మగ పులులు ఉన్నాయి. మూడు పులులు ఆడవో, మగవో గుర్తించలేకపోయారు. 2014లో రాష్ట్ర విభజన సమయానికి నల్లమలలో 37 పులులే ఉన్నాయి. అటవీ శాఖ సంరక్షణ చర్యలు పటిష్టంగా ఉండడంతో వాటి సంఖ్య అనూహ్యంగా 73కి పెరిగింది. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం, దోర్నాల ప్రాంతంలో (బ్లాక్–1) 18 పులులుంటే అందులో 6 మాత్రమే మగవి. 11 ఆడ పులులు. ఒక పులి లింగ నిర్ధారణ కాలేదు. బైర్లూటి, వెలిగోడు, నంద్యాల, గుండ్లబ్రహ్మేశ్వరం, బండి ఆత్మకూరు, చలమ, గుండ్లకమ్మ, తురిమెళ్ల ప్రాంతంలో (బ్లాక్–2) 26 పులులుంటే 8 మాత్రమే మగవి. 17 ఆడ పులులు. ఒక పులి ఆడదో, మగదో గుర్తించలేదు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని జీవీ పల్లి, వై పాలెం, వీపీ సౌత్ ప్రాంతాల్లో (బ్లాక్–3) 20 పులులుంటే ఆడ పులుల సంఖ్య 15. మగ పులులు 5 మాత్రమే. ఇక్కడ ఒక మగ పులికి మూడు ఆడ పులులున్నాయి. కొత్తగా విస్తరించిన ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల పరిధిలోని రుద్రవరం, చలమల, గిద్దలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, కడప, రాయచోటి, బద్వేల్, ఓనిపెంట,పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో (కొత్త కారిడార్) మొత్తం 9 పులులు ఉంటే రెండు మాత్రమే మగవి. 6 పులులు మగవి. ఇక్కడ ఒక మగ పులికి మూడు ఆడ పులులున్నాయి. ఒకదాని లింగ నిర్ధారణ చేయడం కుదరలేదు. ప్రతి పులి ప్రత్యేకతను గుర్తిస్తారు నాగార్జున్‌సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వులోని ఆత్మకూరు, మార్కాపురం, నంద్యాల, గిద్దలూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, కడప అటవీ డివిజన్లలో 905 ప్రదేశాల్లో 1800కిపైగా అధునాతన మోషన్ సెన్సార్ కెమెరాలు అమర్చారు. ప్రతి 4 చదరపు కిలోమీటర్లకు రెండు కెమెరాలు పెట్టారు. పులులు వెళ్లే ప్రధాన దారుల్లో రెండు వైపులా రెండు జతల కెమెరాలు అమర్చారు. ఇవి వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన లక్షలకుపైగా ఫొటోలను ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేíÙంచి పులుల సంఖ్య, ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. పులి చర్మంపై ఉండే చారలు మన చేతి రేఖల్లానే ప్రత్యేకంగా ఉంటాయి. రెండు వైపులా చారలను గుర్తించి వాటి ద్వారా పాత పులులు, కొత్తగా కనిపించిన పులులను లెక్కిస్తారు. ఆడ, మగ పులుల్ని ఇలా గుర్తిస్తారు... పులుల్ని వాటి అడుగు జాడల (పగ్ మార్క్) ఆధారంగా గుర్తిస్తారు. ఆ అడుగుల్ని బట్టే అవి ఆడవో, మగవో నిర్ధారిస్తారు. మగ పులి అడుగు చతురస్రాకారంలో ఉంటుంది. ఆడ పులి అడుగు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. మగ పులి కాలి మడమ పెద్దగా, ఆడ పులి మడమ చిన్నగా ఉంటుంది. పటిష్టంగా పులుల పరిరక్షణ పర్యావరణ వ్యవస్థలో పులుల పరిరక్షణ అత్యంత కీలకం. వాటి పరిరక్షణలో రాష్ట్ర అటవీ శాఖ ముందుంది. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంఖ్య 73కి పెరగడమే ఇందుకు నిదర్శం. నాలుగేళ్లలో పులుల సంఖ్య 60 శాతం పెరగడం మంచి పరిణామం. – వై మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి సంరక్షణ చర్యల వల్లే.. 2008లో నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో పులులు ఉన్నాయా అనే అనుమానం ఉండేది. అప్పుడు కెమేరా ట్రాప్‌లు పెడితే 2, 3 మాత్రమే ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి వాటి సంరక్షణకు పెద్దఎత్తున చర్యలు చేపట్టడం మొదలైంది. పులుల వేటను దాదాపు నివారించి వాటి ఆవాసాలను పరిరక్షించేందుకు కింది స్థాయిలో అటవీ శాఖ సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. దాని ఫలితంగానే వాటి సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. – విఘ్నేష్ అప్పావు, డిప్యూటీ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్, మార్కాపురం -
పెద్దపులే.. వారి పెద్దమ్మ
అది దట్టమైన నల్లమల అడవి.. అందులో నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు వ్యక్తులు ఏవో పాదముద్రలు చూసి ఆగిపోయారు. అవేమిటని నిశితంగా పరిశీలించారు. పెద్దపులి అడుగులుగా (పగ్ మార్క్) నిర్ధారించారు. అంటే దగ్గర్లోనే పులి ఉన్నట్లు గ్రహించారు. ఇంకా ముందుకెళ్తే ప్రమాదమని భావించి అక్కడే ఆగిపోయారు. ఆ అడుగుల ముద్ర చుట్టూ చిన్నచిన్న రాళ్లు పెట్టి వాటిపైన ఒక పారదర్శక అద్దం పెట్టారు. దానిపై స్కెచ్‌తో ఆ అడుగుల్ని గీశారు. అలాగే, ప్లాస్టర్ ఆప్ పారిస్‌తో కూడా ఆ పాదముద్రను సేకరించి వెనుదిరిగారు. – (నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి బి. ఫణికుమార్) ఆ ఐదుగురు ఎవరో కాదు.. పులుల రక్షకులు. నల్లమలలో జీవించే చెంచులు వారు. వన్యప్రాణుల మధ్యే వారి జీవనం. వాటితో తరతరాల అనుబంధం వారిది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని రోళ్లపెంట బేస్ క్యాంపు వద్ద వాళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేర్లు.. దంసం గురవయ్య, దాసరి నాగన్న, దంసం మొగిన్న, దార బయన్న, అంజి నాయక్. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులుల సంఖ్య ఏటా పెరుగుతుండడంలో అటవీ శాఖతోపాటు నల్లమల చెంచుల పాత్ర ఎంతో కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా పులుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఈ ప్రాంతంలో వాటి ఆవాసాలు సురక్షితంగా ఉండడానికి ఈ చెంచులే ప్రధాన కారణం. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో పులుల రక్షణ బాధ్యత వారిదే. ఏడేళ్ల క్రితం అక్కడ కేవలం 37 మాత్రమే పులులు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 73కి పెరిగింది. అటవీ శాఖ తాజా పులుల గణనలో ఈ విషయం తేలింది. 63 బేస్‌క్యాంపుల బాధ్యత వీరికే.. అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగే చెంచులకు అక్కడి దారులు, నీటి చెలమలు, పులులు, మిగిలిన వన్యప్రాణులు, వాటి జీవన విధానం గురించి పూర్తిగా తెలుసు. పులుల్ని వారు పెద్దమ్మగా భావిస్తారు. అందుకే వాటిని సంరక్షిస్తారు. ఆంధ్రా ప్రాంతంలో ద్రవిడుల కంటే ముందు నుంచి చెంచులు నివసిస్తున్నారనే వాదన ఉంది. అనాదిగా నల్లమలలో వన్యప్రాణులతో కలిసి వారు జీవిస్తున్నారు. అడవి ఉంటేనే తమ మనుగడ ఉంటుందని వారు నమ్ముతారు. అందుకే అడవిని, అందులోని వన్యప్రాణుల్ని సంరక్షిస్తారు. వీరికి అడవి ఆనుపానులు తెలుసు కనుకే వారి ద్వారానే అటవీ శాఖ పులుల సంరక్షణను చేపట్టింది. ఇందులో భాగంగా.. ఆత్మకూరు, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల అటవీ డివిజన్లలో మొత్తం 63 బేస్ క్యాంపుల బాధ్యతను వారికే అప్పగించింది. అక్కడి నుంచే పులులు, ఇతర వన్యప్రాణులు, అటవీ సంరక్షణను చేపడుతున్నారు. ప్రతి బేస్ క్యాంపులో ఐదుగురు చెంచులతో ఒక బృందం ఏర్పాటుచేశారు. వీరిని పంచ పాండవులుగా పిలుస్తారు. అనేక తరాలుగా పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణలో చెంచులు భాగమయ్యారు. ఫ్రంట్లైన్లో ఉండి దట్టమైన అడవుల్లో పులులు, ఇతర జంతువులను ట్రాక్ చేయడంతోపాటు వాటి రక్షణ, అడవిలో పెట్రోలింగ్, సమాచారం సేకరించడానికి పనిచేస్తున్నారు. బేస్ క్యాంపులు వచ్చాక.. అంతకుముందు కూడా అటవీ శాఖాధికారులు వీళ్ల ద్వారానే నల్లమలలో పెట్రోలింగ్ చేస్తున్నారు. చెంచులు ఏం చేస్తారంటే.. ► చెంచులకు అటవీ శాఖ శిక్షణనిచ్చింది. మొబైల్లో జీపీఎస్ ద్వారా అడవిలో తిరగడం, చెట్లకు కెమేరా ట్రాప్‌లు అమర్చడం, పులుల అడుగులు గుర్తించి ఆ ముద్రలను సేకరించడం వీరి ప్రధాన విధులు. ► ప్రతిరోజు తమ బేస్ క్యాంపు పరిధిలో 5 నుంచి 7 కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ చేస్తారు. ► ఎం–స్ట్రైప్ అప్లికేషన్ ద్వారా జంతువుల ఫొటోలు తీస్తారు. వాటిని ప్రతి 10 రోజులకు అటవీ శాఖాధికారులకు ఇస్తారు. ► బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా? పులులు, ఇతర జంతువులకు ఏమైనా ఉచ్చులు వేశారా? స్మగ్లింగ్ వంటి సమాచారాన్ని సేకరించి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైర్లెస్ సెట్లో అధికారులకు సమాచారమిస్తారు. ► అడవిలో జరిగే ప్రతి కదలిక తెలిసేలా ఈ చెంచుల ఫ్రంట్‌లైన్ టీమ్ పనిచేస్తుంది. ► మొత్తం 300 మంది ఈ టీముల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ప్రతి క్యాంపులో మరో ముగ్గురు చెంచుల్ని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల ఏరివేతకు నియమించారు. ► ఈ పని ద్వారా అడవులు, పులుల సంరక్షణతోపాటు వారికి అటవీశాఖ ఉపాధి కల్పిస్తోంది. ► ఇక వీరి సేవలను గుర్తించిన నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్టీఎస్ఏ) గతంలోనే బెస్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఇచ్చింది. ► ఆ తర్వాత దేశంలోని మిగిలిన అటవీ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో స్థానిక గిరిజన జాతుల్ని అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వామ్యం చేస్తున్నారు. పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర ముఖ్యమైనది. తాజా లెక్కల ప్రకారం 73 పులులు ఉన్నాయి. ఇది ఏడేళ్లలో ఊహించని పెరుగుదల. తమ శాఖ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇది సాధ్యమైంది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టులో విస్తీర్ణపరంగా దేశంలోనే ఇది అతిపెద్దది. ఇక్కడ పులుల సంఖ్య పెరుగుదలను బట్టి ఈ అభయారణ్యం ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. – శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ కన్జర్వేటర్–డైరెక్టర్, టైగర్ ప్రాజెక్టు చెంచులది కీలకపాత్ర పులుల సంరక్షణలో చెంచులు కీలకంగా ఉన్నారు. బేస్ క్యాంపుల్లో వాళ్లు ఐదుగురు చొప్పున ఉంటారు. వారు పెట్రోలింగ్ చేస్తూ పులుల్ని ట్రాక్ చేస్తారు. పులుల గురించి అన్నీ తెలిసిన వారికే వాటి సంరక్షణలో భాగస్వాముల్ని చేశాం. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం. – సందీప్‌రెడ్డి, సబ్ డీఎఫ్ఓ, ఆత్మకూరు ఫారెస్టు డివిజన్ పులి కనపడితే నిశ్శబ్దంగా ఉండిపోతాం ప్రతిరోజు 5–7 కిలోమీటర్ల మేర అడవిలో తిరుగుతాం. పులి, ఇతర జంతువుల్ని గమనిస్తూ ఉంటాం. అడుగుల్ని బట్టి అవి ఎటు వెళ్తున్నాయో తెలుసుకుంటాం. ఒకవేళ పులి ఎదురైతే నిశ్శబ్దంగా ఉండిపోతాం. దీంతో అది మా వైపు చూసినా వెళ్లిపోతోంది. హడావుడి చేస్తే దాడిచేస్తుంది. – దార బయన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ మంచినీటి కోసం సాసర్ పిట్లు కడతాం మా క్యాంపు చుట్టూ నాలుగైదు రూట్లలో తిరుగుతాం. ఒక్కో రోజు ఒక్కో రూట్లో వెళ్తాం. ఎండాకాలం జంతువులు నీటి కోసం అలమటిస్తాయి. వాటికోసం అడవిలో ఆఫీసర్లు చెప్పినట్లు సాసర్ పిట్లు కట్టి అందులో నీళ్లు నింపుతాం. పులులు, ఇతర జంతువులు వచ్చి ఆ నీటిని తాగుతాయి. – దంసం మొగిన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ పులుల క్రాసింగ్ టైమ్‌లో జాగ్రత్తగా ఉంటాం పులులు క్రాసింగ్ అయ్యే టైమ్‌లో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అవి కలిసే (మేటింగ్) సమయం. ఆ సమయంలో ఎవరైనా కనపడితే విరుచుకుపడిపోతాయి. వేటాడే సమయంలోనూ పులికి కనపడకూడదు. తనను అడ్డుకుంటున్నారని భావించి దాడిచేస్తుంది. మిగిలిన సమయాల్లో మనుషుల్ని చూసినా వెళ్లిపోతుంది. – అంజి నాయక్, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ -
ఉచ్చులు కావు.. ఉరితాళ్లు
ఆత్మకూరురూరల్: నల్లమల అటవీ పరిధిలో జరిగిన పైమూడు ఘటనలు పులులు ఉచ్చులకు బలవుతున్నట్లు తేటతెల్లమవుతోంది. అడవిలో పెద్దపులి, చిరుత పులి మరణించినప్పుడు వృద్ధాప్యంతో, ప్రమాదవశాత్తూ, రెండు పులుల పోరాటంలో గాయపడి మృత్యువాత పడినట్లు అటవీ అధికారులు తరచూ చెబుతూ ఆ అంకాన్ని ముగిస్తుంటారు. అయితే పులుల అసహజ మరణాల వెనుక వేటగాళ్ల ఉచ్చులు ఉన్నట్లు అటవీ సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వన్యప్రాణుల మాంసానికి డిమాండ్ ఉండడంతో ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లె, రుద్రవరం, మహానంది మండలాల్లోని అటవీ సమీప గ్రామాల్లో కొందరు వన్యప్రాణులను వేటాడం వృత్తిగా మార్చుకున్నారు. తనిఖీల్లో తరచూ వన్యప్రాణి మాంసం లభిస్తున్న కేసుల సంఖ్యనే ఇందుకు బలం చేకూర్చుతోంది. శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) మన నల్లమలలో ఏర్పడి పులుల సంరక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. సుమారు 110 పెద్దపులులకు (తెలంగాణా– ఆంధ్రప్రదేశ్) నెలవై శ్రీశైలం – శేషాచలం పులుల కారిడార్‌కు ఎన్ఎస్టీఆర్ పురుడు పోసింది. కాగా ఇటీవలి కొన్ని పరిణామాలను చూస్తే అటవీ శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగేళ్లలో ఆరు పులులు అసాధారణ స్థితిలో మరణించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా పెద్ద పులి ఉద్ధృతంగా ప్రవహించే కృష్ణానదిని అవలీలగా దాటేస్తుంది. అలాంటిది తెలుగు గంగలో పడి మృతి చెందినట్లు అటవీ అధికారులు ప్రకటించడం అనుమానాలకు దారి తీస్తుంది. వేటగాళ్లను కట్టడి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జింకల కోసం ఉచ్చులు.. పులులకు చిక్కులు.. నల్లమల అటవీ సమీప గ్రామాల్లో కొందరు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించడమే ఒక వ్యాపారంగా మలుచుకుని జీవిస్తుంటారు. ముఖ్యంగా కొత్తపల్లె, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, రుద్రవరం మండలంలో కొందరు నేరచరిత్ర ఉన్న వ్యక్తులు నిరంతరం ఇదే పనిలో ఉంటున్నారు. అతికొద్ది మంది తుపాకులతో వేట సాగిస్తే చాలా మంది ఉచ్చులతో వేటాడుతున్నారు. వీరు వేస్తున్న ఉచ్చులే పులుల ఉనికికే ప్రమాదంగా మారాయి. ఉచ్చులతో వేటకు వేసవికాలం అనుకూలం. సహజనీటి వనరులు తరిగిపోయి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఉండే నీటి దొరువుల వద్ద వేటగాళ్లు పొదల్లో ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. నీటి కోసం వచ్చే జింకలు ఈ ఉచ్చుల్లో చిక్కుకుని మరణిస్తుంటాయి. అలాగే జింకలు తమకు అవసరమైన సోడియం లవణ లభ్యత కోసం అడవుల్లో ఉండే జేడె (ఉప్పు నేలలు)లను ఆశ్రయిస్తాయి. వెన్నెల రాత్రులలో జేడెల వద్దకు భూమి పొరలను నాకేందుకు గుంపులు గుంపులుగా చేరుకుంటాయి. ఆ ప్రాంతాల్లో కూడా వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేస్తారు. ఇలా జింకల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులలో పెద్దపులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు చిక్కుకుని బలవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రుద్రవరం అటవీ ప్రాంతంలోని గండ్లేరు రిజర్యాయరులో పులి కళేబరం బయటపడింది. తెలుగుంగ కాల్వలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు మొదట అధికారులు ధ్రువీకరించారు. అనుమానాల నేపథ్యంలో ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా పచ్చర్ల సమీపంలో ఉచ్చులో పడి మృతి చెందినట్లు తేలింది. ఈ ఘటనలో కింది స్థాయి అటవీ సిబ్బందిపై వేటు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. 2018 మార్చి 28న శ్రీశైలం రేంజ్‌లోని పెచ్చెర్వు సమీపంలో నరమామిడి చెరువు వద్ద పెద్దపులి మరణించింది. గుర్తించిన అటవీ సిబ్బంది అర్ధరాత్రి అక్కడే పోస్టుమార్టం చేసి కళేబరాన్ని దహనం చేశారు. రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో మృత్యువాత పడినట్లు ప్రకటించారు. అయితే అధికారుల హడావుడిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పెద్ద పులి ఉచ్చుకు బలైనా అధికారులు దాచి కళేబరాన్ని దహనం చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. 2016లో జీబీఎం, నాగలూటి రేంజ్‌లలో కనిపించిన (ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో) టీ 21, టీ 32, టీ40 (పులి శరీరంపై ఉన్న చారల ఆధారంగా వాటికి ఓ సంఖ్య కేటాయిస్తారు) జాడ ఇంత వరకు లేదు. దాదాపు ఐదేళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఐనముక్కలలో ఓ ఇంట్లో మూడు పులి చర్మాలు లభించాయి. వాటిని సున్నిపెంటకు చెందిన ఓ వ్యక్తి దాచినట్లు తేలగా.. ఈ కేసులో ఆత్మకూరు మండలం సిద్ధేశ్వరానికి చెందిన వేటగాడిని అరెస్ట్ చేశారు. అటవీ చట్టాలు కఠినంగా అమలు చేయాలి వన్యప్రాణి వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. పులి మనుగడకు ముప్పుగా మారిన ఉచ్చుల వేట పూర్తిగా నిర్మూలించాలి. తరచూ పట్టుబడే వన్యప్రాణి వేటగాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేసి శిక్షించాలి. – యన్నం హనుమంతరెడ్డి, న్యాయవాది, వన్యప్రాణి ప్రేమికులు పర్యవేక్షణ కరువై.. ∙ రెగ్యులర్ అటవీ ఉద్యోగులు పగలు బేస్ క్యాంపులకు వెళుతున్నప్పటికీ రాత్రిళ్లు ఉండటం లేదన్న విమర్శలున్నాయి. నిరంతరం ఉచ్చుల నివారణ కోసం పెట్రోలింగ్ చేయాల్సిన చోట తూతూమంత్రంగా సాగుతోంది. ∙ టైగర్ హబ్‌గా భావించే బైర్లూటి, నాగలూటి, వెలుగోడు అటవీ క్షేత్రాధికారులు ఎనిమిదేళ్లుగా ఇక్కడే కొనసాగుతున్నారు. దీంతో పర్యవేక్షణాధికారులకు కిందిస్థాయి సిబ్బందికి సమన్వయం లేకపోవడంతో పులి సంరక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ∙ బ్రిటీష్ కాలం నాటి సరిహద్దులతో ఎంతో పెద్దదైన విస్తీర్ణంతో ఉన్న అటవీ క్షేత్రాలు (రేంజ్‌లు) ఇంతవరకు పునర్విభజనకు నోచుకోక పోవడంతో సిబ్బంది కొరత ఏర్పడి పులుల సంరక్షణకు పెద్ద అవరోధంగా మారింది. రుద్రకోడు రేంజ్ ప్రతిపాదన కొన్నేళ్లుగా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. నిరంతరం నిఘా ఉచ్చుల బారి నుంచి పులు లు, ఇతర జంతువులను రక్షించేందుకు ప్రతిరోజు ప్ర త్యేక డ్రైవ్ చేపడుతున్నాం. అనుమానిత ప్రదేశాల్లో అటవీ సిబ్బంది నిశితంగా పరిశీలించి వేటగాళ్లు ఉంచిన ఉచ్చులను తొలగిస్తున్నారు. అటవీ సమీప ప్రాంతాల్లో తిరిగే అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాం. – దత్తాత్రేయ, ఎఫ్ఆర్వో, వెలుగోడు రేంజ్ -
చలో నల్లమల.. 17 నుంచి టూర్ ప్రారంభం
సాక్షి, నాగర్‌కర్నూల్: అడవి గురించి తెలుసుకునేందుకు, వన్యప్రాణులను ప్రత్య క్షంగా వీక్షేందుకు, ఇక్కడ స్థానికంగా ఉన్న చెంచులతో మాట్లాడి వారి స్థితిగతులను అర్థం చేసుకునేందుకు నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అవకాశం కల్పిస్తోంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తోంది. నల్లమలలోని అరుదైన, ప్రత్యేకమైన వన్యప్రాణులు, పక్షులు, జీవ, వృక్షజాతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అటవీ సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించేలా ప్రత్యేక జంగిల్ స్టే ప్యాకేజీలను అమలుపర్చబోతోంది. జంగిల్ స్టే, సఫారీ, ట్రెక్కింగ్‌తో పాటు స్థానిక గిరిజనులతో మమేకమయ్యేలా ప్యాకేజీలను రూపొందించింది. ఈనెల 17 నుంచి ఆన్లైన్ ద్వారా బుకింగ్ ప్రారంభంకానుంది. 24 కి.మీ. మేర జంగిల్ సఫారీ.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలు గా సఫారీ వాహనంలో అడవిలోకి తీసుకెళ్తారు. అమ్రాబాద్ మండలంలో హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై ఉన్న గుండం చెక్‌పోస్టు నుంచి ఫర్హాబాద్ వ్యూపాయింట్ వరకు తీసుకెళ్తారు. నల్లమలలో జంగిల్‌సఫారీ ఇక్కడ నుంచి నల్లమల అటవీప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది. అక్కడి నుంచి ఫర్హాబాద్ పెంట మీదుగా ఫర్హాబాద్ చెక్‌పోస్టు వరకు సఫారీ ప్రయాణం కొనసాగుతుంది. సుమారు 24 కి.మీ.మేర సాగే ఈ సఫారీలో పులులతో పాటు వివిధ వన్యప్రాణులను ప్రత్యక్షంగా చూసే అవకాశముంది. స్థానికంగా ఉండే చెంచులే టూరిస్టు గైడ్లు.. నల్లమలలో స్థానికంగా నివసించే చెంచులతో మమేకమై వారితో ముచ్చటించేందుకు ఏటీఆర్ అవకాశం కల్పిస్తోంది. చెంచుల స్థితిగతులు, జీవనవిధానంపై నాటిక రూపంలో ప్రదర్శనలు, పాటలను ఆలపిస్తారు. వారు తినే ఆహారం, స్థానికంగా ఉన్న వెరైటీలను సందర్శకులకు కూడా రుచి చూపిస్తారు. మన్ననూరు నుంచి ఉమామహేశ్వర ఆలయం వరకు అడవిలోని కొండల మధ్య ట్రెక్కింగ్‌కు సైతం చెంచులే తీసుకెళ్తారు. నల్లమల అందాలను మనసారా ఆస్వాదించేలా ఫారెస్ట్ స్టే, సఫారీ, ట్రెక్కింగ్‌లను ఏటీఆర్ అధికారులు రూపొందించారు. రెండు రోజుల పాటు అడవిలో గడిపేలా ఈ ప్యాకేజీ ఉంటుంది. -
పచ్చందాలకు నెలవు పచ్చర్ల
శిరివెళ్ల: నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజనులు నివసించే పచ్చర్ల గూడెం నేడు అందాలకు నెలవుగా మారింది. నంద్యాల– ఒంగోలు రహదారిలో పచ్చర్ల వద్ద ఉన్న ఎకో టూరిజం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఎటు చూసినా పచ్చదనమే. వేసవిలో ఆహ్లాదంతోపాటు చల్లదనాన్నిస్తోంది. ప్రభుత్వం రూ.1.25 కోట్లతో ఎకో టూరిజంను నెలకొల్పింది. అందులో భాగంగా 4 ఏసీ కాటేజీలు, రెండు ఆర్మీ బేస్ క్యాంప్ తరçహాలో కాటేజీలను నిర్మించారు. వివిధ రకాల పూల మొక్కల మధ్య కాటేజీలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. 24 గంటలు ఏసీ సదుపాయం.. కాటేజీల్లో విడిది చేసే వారికి 24 గంటల విద్యుత్, ఏసీ సదుపాయాలున్నాయి. దీని కోసం సోలార్, జనరేటర్ ఏర్పాటు చేశారు. 24 గంటలకు కుటుంబానికి రూ.4వేలు అద్దె చెల్లించి విడిది చేయవచ్చు. భోజనం, జంగిల్ సఫారీ çసదుపాయం ఉంది. జంగిల్ సఫారీ ద్వారా అడవిలో ఉన్న జంతువులను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించారు. ఎకో టూరిజంలో పిల్లలు ఆడుకోవడానికి పలు సదుపాయాలున్నాయి. దీని ద్వారా ఏటా రూ.40 లక్షల ఆదాయం వస్తోంది. ఎకో టూరిజం చూడడానికి ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం ఉంది. మరిన్ని వివరాలకు www.nalamalaijunglecamps.com, సెల్ నంబర్లు 94408 10074,70930 08648లో సంప్రదించవచ్చు. -
వన్యప్రాణుల దాహం తీర్చేలా..
మార్కాపురం: గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వేలాది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో జంతువుల తాగునీటి సమస్యకు అటవీ శాఖాధికారులు శాశ్విత పరిష్కారం చూపారు. ఏటా వేసవి ప్రారంభం నుంచి జంతువులకు తాగునీటి సమస్య ఏర్పడేది. అధికారులు ట్యాంకర్ల ద్వార కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ తొట్లు(సాసర్ పిట్స్)ను ఏర్పాటు చేసినప్పటికీ వేసవి తీవ్రతకు నీరు ఆవిరి కావటం, కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్ యజమానులు నీళ్లు పోయకపోవటంతో జంతువులు దప్పికతో అలమటించేవి. సమీపంలోని గ్రామాలకు వెళ్తే ప్రజలు దాడులు చేసే వారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు నల్లమలలోనే శాశ్వితంగా నీటి వనరులు ఏర్పాటు చేసినట్లయితే జంతువులకు ఇబ్బంది ఉండదని భావించారు. 100కు పైగా చిరుతలు... టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ప్రస్తుతం 100కు పైగా చిరుత పులులు, దాదాపు 70 పెద్ద పులులు, సుమారు 3 వేల జింకలు, దుప్పులు, ఇంకా రేచు కుక్కలు, కణతులు, ఎలుగుబంట్లు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటి నీటి సమస్య తీర్చేందుకు నల్లమలలో అధికారులు కొన్ని ప్రాంతాల్లో డీప్‌బోర్లు వేసి సోలార్ సిస్టం ద్వారా మోటార్లు ఏర్పాటు చేసి శాశ్వితంగా నీటి సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. గతంలో ఏటాఫిబ్రవరి నుంచి జూన్ వరకు అటవీ జంతువులకు నీటి సరఫరా కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేసే వారు. 95 సాసర్ పిట్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కొండ అంచు, మిట్ట ప్రాంతాల్లో సాసర్‌పిట్స్‌ను ఏర్పాటు చేశారు. దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, శ్రీశైలం సరిహద్దు, తదితర మండలాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో పిట్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది అటవీశాఖ ఉన్నతాధికారులు శాశ్విత పరిష్కారం కోసం ప్రయోగాత్మకంగా దోర్నాల మండలం పులిచెరువు, యర్రగొండపాలెం మండలం తంగెడివాగు, గుంటూరు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతమైన బొంకులపాడు వద్ద మూడు డీప్‌బోర్లు వేసి సోలార్ ప్యానళ్లను పెట్టి పైపులైన్లు వేసి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి కుంటలకు ఇంజిన్ల ద్వారా నీటిని పంపింగ్ చేశారు. ఇందు కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది ఇలా... ఈ ప్రయోగం విజయవంతం కావటంతో ఈ ఏడాది రూ.5 లక్షలు ఖర్చు పెట్టి నల్లగుంట్ల 2, కొమరోలు, నారుతడికల, బటుకులపాయ ప్రాంతాల్లో ఒక్కొక్క డీప్‌బోరు మోటార్లు ఏర్పాటు చేసి పైపు లైన్ల ద్వారా నీటి సరఫరా చేశారు. ఇందుకోసం గిరిజన యువకులను ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క బోరుకు రూ.45 వేలు ఇవ్వగా, నెడ్ క్యాప్ ద్వారా సోలార్ సిస్టంకు రూ.55 వేలు కేటాయించారు. ఈ విధంగా గత ఏడాది మూడు ప్రాంతాల్లో, ఈ సంవత్సరం ఐదు ప్రాంతాల్లో డీప్‌బోర్లు వేసి నీటి సరఫరా చేయటంతో పెద్ద పులులు, చిరుతలు, జింకలు, రేచు కుక్కలు, ఎలుగు బంట్లు, కణతులకు నీటి సమస్య తీరింది. దీని వలన అవి అటవీ ప్రాంతంలోనే హాయిగా సంచరిస్తుంటాయి. నీటి కోసం అడవి నుంచి బయటకు వచ్చి వేటగాళ్ల బారి నుంచి ప్రమాదాలను తప్పించుకుంటున్నాయి. ఇప్పటికే నల్లమలలోని బేస్ క్యాంప్‌లో ఉన్న పెద్ద చేమ, చిన్న మంతనాల, పులిబోను ప్రాంతాల్లో ఉన్న డీప్‌బోర్లకు మోటార్లు బిగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. మార్కాపురం డీఎఫ్ఓ పరిధిలో గుంటూరు జిల్లా సాగర్, రెంటచింతల, గురజాల, దోర్నాల అటవీ ప్రాంతాలు ఉన్నాయి. నీటి సమస్య తీరినట్లే..జయచంద్రారెడ్డి, డీఎఫ్ఓ, మార్కాపురంనల్లమలలో శాశ్వితంగా జంతువులకు నీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో గత ఏడాది మూడు ప్రాంతాల్లో, ఈ ఏడాది ఐదు ప్రాంతాల్లో డీప్ బోర్లు వేశాం. సోలార్ సిస్టం ద్వారా మోటార్లను ఆన్‌చేసి పైపు లైన్ల ద్వారా సాసర్‌పిట్ ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తున్నాం. దీనితో అటవీ ప్రాంతంలో జంతువులు ఈ ప్రాంతాలకు వచ్చి నీరు తాగి వెళ్తున్నాయి. గతంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో జంతువులు తీవ్రంగా ఇబ్బంది పడేవి. ఇప్పుడు ఆ సమస్య తీరింది. బేస్ క్యాంప్‌ల్లో కూడా ఉన్న డీప్‌బోర్ల వద్ద మోటార్లను బిగించాలన్న ఆలోచన ఉంది. -
నల్ల్లమలలో రోడ్డుపై పులి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం వెళ్లిన పర్యాటకులకు బుధవారం రాత్రి నల్లమల అటవీ ప్రాంతంలో పులి కన్పించింది. నాగర్‌కర్నూలు జిల్లా మన్ననూరు బీట్‌లోని గుండం అనే ప్రాంతం వద్ద రోడ్డు దాటుతున్న పులి కనిపించడంతో వాహనాలు ఆపి సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు. పులి సంచారాన్ని రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు ఇన్చార్జి వినోద్ ధ్రువీకరించారు. గడిచిన 14 ఏళ్ల కాలంలో నల్లమలలో రోడ్డు దాటుతూ పులి కన్పించటం ఇదే తొలిసారి. 2004లో మన్ననూర్ శివారు అటవీ ప్రాంతంలోని కుంచోని మూలఆంజనేయస్వామి దేవాలయం మధ్య చివరిసారి రోడ్డుపై పులి కన్పించింది. ఇటీవల చేసిన పులుల లెక్కింపులో మన్ననూర్ ఎఫ్ఆర్వో శ్రీదేవితో కలిసి ‘సాక్షి’క్షేత్ర స్థాయి పరిశీలన చేసినప్పుడు గుండం ప్రాంతంలోనే పులి పాదముద్రలను, తాజా పెంటికను సేకరించారు. -
మత్తులో మన్యం
మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతం నాటుసారా తయారీతో గుప్పుమంటోంది. మార్కాపురం ఎక్సైజ్ శాఖ పరిధిలోని పెద్దారవీడు, పెద్దదోర్నాల, యర్రగొండపాలెం, అర్ధవీడు, గిద్దలూరు మండలాల్లోని అటవీ సమీప గ్రామాల్లో, చెంచుగూడేల్లో నాటుసారా తయారవుతుంది. చెంచుల జీవితాల్లో వెలుగు తెచ్చేందుకు ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘నవోదయం’ పెద్దగా ఫలితాలు ఇవ్వటం లేదు. ఎక్సైజ్ పోలీసులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సాయంత్రమయ్యే సరికి గిరిజనులు నాటుసారా మత్తులో మునిగి తేలుతున్నారు. దీంతో ఆ మత్తులో పాతకక్షలు మనస్సులో పెట్టుకుని అంబులు వేసుకుంటూ ఒకరినొకరు చంపుకుంటున్నారు. పెద్దదోర్నాల పరిధిలోని కడపరాజుపల్లె, భ్రమరాంబ చెంచుకాలనీ, పణుకుమడుగు, బంధంబావి, కొర్రపోలు, బొమ్మలాపురం, చెర్లోపల్లె, సుందరయ్య కాలనీ, యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లోని శతకోడు, మర్రివేముల, పాలుట్ల, మురికిమళ్ల తండా, నరజాముల తండా, పీఆర్సీ తండా, అక్కపాలెం, తదితర ప్రాంతాల్లో, గిరిజన గూడేల్లో నాటుసారా య«థేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల నామమాత్రపు దాడులతో నాటుసారా తయారీ ఆగటం లేదు. అటవీ సమీప గ్రామాల్లో నాటుసారా బట్టీలను ఏర్పాటు చేసి సారా తయారు చేస్తున్నారు. ఇందు కోసం బెల్లంఊట, తుమ్మచెక్కను ఉపయోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల మత్తు కోసం టాబ్లెట్లను కలుపుతున్నట్లు తెలుస్తోంది. నాటుసారా తయారీకి నాలుగైదు రోజుల సమయం పడుతుంది. ఎక్సైజ్ పోలీసులు నాటుసారా బట్టీలను ధ్వంసం చేస్తున్నారు తప్పితే తయారీదారులపై దృష్టి సారించటం లేదు. సెలవు రోజులు, పండుగ దినాల్లో నాటుసారా తయారీ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల బెల్ట్‌షాపులను తొలగించటంతో పట్టణ సమీప గ్రామాల్లో కూడా నాటుసారా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కనిపించని “నవోదయం’: నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల జీవన స్థితిగతులు మార్చేందుకు, నాటుసారా మాన్పించేందుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం కార్యక్రమాన్ని ఏడాది కిందట ప్రారంభించారు. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, కొంత మంది గ్రామస్తులతో కలిపి గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. నెలకు ఒకసారి సమావేశమై ప్రభుత్వ పథకాలను నిర్వహించటంతో పాటు నాటుసారా తాగడం, తయారు చేయటంపై జరిగే అనర్ధాలను వివరిస్తారు. అయితే, కమిటీలు నామమాత్రం కావటంతో నాటుసారా తయారీ, విక్రయాలు ఆగటం లేదు. ఎక్సైజ్ దాడులు ఇలా... గత ఏడాది మార్కాపురం ఎక్సైజ్ పోలీసులు భ్రమరాంబ చెంచు కాలనీ, కడపరాజుపల్లె, పణుకుమడుగు, కొర్రపోలు, చెర్లోపల్లె, సుందరయ్య కాలనీల్లో 9 కేసులు నమోదు చేసి 9 మందిని అరెస్టు చేశారు. యర్రగొండపాలెంలో 11, గిద్దలూరు 2, కనిగిరిలో 2, దర్శిలో ఒకరిని నాటుసారా విక్రయిస్తున్నారని అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరిలో మూడు కేసులు నమోదయ్యాయి. నాటు సారాను పూర్తిగా నిరోధిస్తాం నవోదయం కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేస్తున్నాం. నల్లమల అటవీ ప్రాంతంలో నాటుసారా నిరో«ధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గిరిజనుల్లో అవగాహన కల్పించి నాటుసారా నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నాం. గతంలో కంటే ఇప్పటికీ నాటుసారా తగ్గింది. నల్లబెల్లం విక్రయించే వారిపై కేసులు పెడుతున్నాం. బెల్ట్‌షాపులను గ్రామాల్లో పూర్తిగా నిరోధించాం. నాటుసారాకు సంబంధించి గత నెలలో 3 కేసులు నమోదు చేశాం. – హనుమంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మార్కాపురం -
వడ్డీకాసులవాడిదే ఎర్రచం‘ధనం’
నల్లమల అడవుల్లో భాగమే శేషాచలం కొండలు ఆ శేషాచలం కొండలే ‘ఏడు’ కొండలుగా ప్రతీతి కొండల్లోని చెట్టూ పుట్టా సర్వం శ్రీవారిమయమే శేషాచలం అడవుల్లోనే విస్తరించిన ఎర్రచందనం ఇప్పుడు విక్రయిస్తున్న ఎర్రచందనం అక్కడిదే..! ఆదాయమంతా శ్రీవారికే దక్కాలంటూ డిమాండ్ సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం దుంగల విక్రయ టెండర్లలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఎర్రచందనం విక్రయించగా వచ్చే ఆదాయం చేరాల్సింది సర్కారు ఖజానాలో కాదు.. శ్రీవారి బొక్కసంలోననే వాదన బలంగా విన్పిస్తోంది. ఏడుకొండల్లో చెట్టూ పుట్టా శ్రీవారి స్వరూపమేనని విష్ణుపురాణం స్పష్టీకరిస్తోందని వేదపండితులు వివరిస్తున్నారు. ఆ పురాణాన్ని గౌరవించే బ్రిటీషు ప్రభుత్వం 1885లో ఏడు కొండలు శ్రీవారికే చెందుతాయని ఉత్తర్వులు జారీచేసింది. ఆ కొండల్లో విస్తారంగా లభించే ఎర్రచందనం వేంకటేశ్వరునికే చెందుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఎర్రచందనం విక్రయిం చగా వచ్చే మొత్తాన్ని టీటీడీ ఖాతాలో జమా చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఇందులో చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో శేషాచలం కొండలున్నాయి. అవే ఏడుకొండలుగా ప్రసిద్ధికెక్కాయి. ఆ ఏడు కొండలపై శ్రీవేంకటేశ్వరుడు కొలువయ్యా డు. ఔషధ గుణాలున్న ఎర్రచందనం వృక్షాలు ఆ కొండల్లో విస్తారంగా వ్యాపించాయి. రెండు దశాబ్దాల క్రితం ఎర్రచందనం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ వచ్చేలా చేసింది. ఆ డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు ఎర్రచందనం వృక్షాలను ఎడాపెడా నరికేస్తూ.. అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. అక్రమమార్గాల్లో ఎర్రచందనం దుంగలను తరలించే క్రమంలో పోలీసు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న 8584.1353 టన్నుల ఎర్రచందనం దుంగలు చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలోని అటవీశాఖ గోదాముల్లో నిల్వ చేశారు. ఇందులో ఈనెల 19 నుంచి 26 వరకూ 4,510 టన్నుల ఎర్రచందనం దుంగలను ఈ-టెండర్ కమ్ ఈ-వేలం పద్ధతిలో విక్రయించడానికి గ్లోబల్ టెండర్లను ప్రభుత్వం పిలిచింది. ఈ టెండర్లలో వచ్చే ఆదాయం అంతా సర్కారు ఖజానాలో జమ చేసి.. రుణ మాఫీకి వినియోగిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై ప్రజాసంఘాలు, వేదపండితులు మండిపడుతున్నారు. శేషాచలం కొండలు 4,755.997 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 174 కుటుంబాలకు చెందిన 1500 రకాల జాతుల మొక్కలు ఉన్నాయి. వాటిలో ఎర్రచందనం అత్యంత విలువైంది. శేషాచలం కొండల్లో 3,640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం(8.99 లక్షల ఎకరాలు)లో ఎర్రచందనం వృక్షాలు విస్తరించి ఉన్నాయి. ఇదంతా శేషాచలం కొండల్లోని ఏడుకొండల పరిధిలోకే వస్తుంది. బ్రిటీషు, కేంద్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం ఏడుకొండలు శ్రీవేంకటేశ్వరునికే చెందుతాయి. ఆ ఏడుకొండల్లో లభించే ఎర్రచందనం కూడా శ్రీవారికే దక్కుతుందని.. టెండర్లలో వచ్చే ఆదాయంలో ప్రతి పైసా టీటీడీ ఖాతాలోనే జమ చేయాలని ప్రజాసంఘాలు, వేదపండితులు డిమాండ్ చేస్తున్నాయి. ఆ ధనాన్ని టీటీడీ సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచిస్తున్నారు. శ్రీవారిదే ఎర్రచందనం ఏడుకొండల్లో లభించే ప్రతి వస్తువూ శ్రీవెంకటేశ్వరునిదే. దేవతా వృక్షమైన ఎర్రచందనం శ్రీవారి స్వరూపమే. ఎర్రచందనం టెండర్లలో విక్రయించగా వచ్చే ప్రతి పైసా శ్రీవారికే చెందుతుంది. చెందాలి కూడా.. ఆ డబ్బును టీటీడీ సేవా కార్యక్రమాలకు వినియోగించాలి. ప్రభుత్వ ఖజానాలో జమా చేసుకోవడం న్యాయం కాదు. ఎర్రచందనం విక్రయించగా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం టీటీడీ ఖాతాలో జమ చేయకుండా.. తన ఖజానాలో జమా చేసుకుంటే ప్రజాపోరాటాలకు సిద్ధమవుతాయం. ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటం చేస్తాం. -మంగాటి గోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు, రైతు సంఘాల సమాఖ్య, చిత్తూరుజిల్లా. -
వీరప్పన్ ఇలాకాలో మావోయిస్టులు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల ద్వారా నల్లమల అడవుల్లోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మూడు కూడళ్లలో విస్తరించిన సత్యమంగళం అడవులను తమ ఉద్యమ విస్తరణకు మావోయిస్టులు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. ఈ అంశాన్ని నిఘా వర్గాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వశాఖ దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ హెచ్చరించింది. గంధపు చెక్కలస్మగ్లర్ వీరప్పన్ ఒకప్పుడు మకాం వేసిన సత్యమంగళం అడవులను గెరిల్లా జోన్‌గా మార్చుకుని దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేసేందుకు మావోయిస్టులు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. తమిళనాడులోని నీలగిరి, కృష్ణగిరి, కేరళలోని సకిలేశ్వపూర్, మాలెమహాదేశ్పూర్ కొండల మీదుగా సత్యమంగళం అటవీ ప్రాంతాలలో ఆ పార్టీ కార్యకలాపాలు ఉధృతం అయినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అక్కడ నుంచి దక్షిణ కర్ణాటకలోని ఉడిపి, షిమోగ, చిక్మగళూర్ జిల్లాలకు ఉద్యమాలను విస్తరిస్తున్నారు. సత్యమంగళం అడవుల్లో మావోయిస్టులు వరుసగా సమావేశాలు నిర్వహించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. మన రాష్ట్రానికి చెందిన మల్లా రాజిరెడ్డి సౌత్ వెస్ట్ రీజినల్ బ్యూరో(ఎస్డబ్ల్యూఆర్బీ) బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కుప్పుస్వామి పేరుతో దక్షిణాది రాష్ట్రాలలో ఉద్యమ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దక్షిణాది రాష్ట్రాల ఉద్యమంతో రాజిరెడ్డికి మంచి సంబంధాలుండటంతో పార్టీ ఆయనకే ఆ బాధ్యతలను అప్పగించింది.