వడ్డీకాసులవాడిదే ఎర్రచం‘ధనం’ | The hills are part of Nallamalais sesacalam | Sakshi
Sakshi News home page

వడ్డీకాసులవాడిదే ఎర్రచం‘ధనం’

Published Sun, Aug 10 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

వడ్డీకాసులవాడిదే ఎర్రచం‘ధనం’

వడ్డీకాసులవాడిదే ఎర్రచం‘ధనం’

  •     నల్లమల అడవుల్లో భాగమే శేషాచలం కొండలు
  •      ఆ శేషాచలం కొండలే ‘ఏడు’ కొండలుగా ప్రతీతి
  •      కొండల్లోని చెట్టూ పుట్టా సర్వం శ్రీవారిమయమే
  •      శేషాచలం అడవుల్లోనే విస్తరించిన ఎర్రచందనం
  •      ఇప్పుడు విక్రయిస్తున్న ఎర్రచందనం అక్కడిదే..!
  •      ఆదాయమంతా శ్రీవారికే దక్కాలంటూ డిమాండ్
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం దుంగల విక్రయ టెండర్లలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఎర్రచందనం విక్రయించగా వచ్చే ఆదాయం చేరాల్సింది సర్కారు ఖజానాలో కాదు.. శ్రీవారి బొక్కసంలోననే వాదన బలంగా విన్పిస్తోంది. ఏడుకొండల్లో చెట్టూ పుట్టా శ్రీవారి స్వరూపమేనని విష్ణుపురాణం స్పష్టీకరిస్తోందని వేదపండితులు వివరిస్తున్నారు. ఆ పురాణాన్ని గౌరవించే బ్రిటీషు ప్రభుత్వం 1885లో ఏడు కొండలు శ్రీవారికే చెందుతాయని ఉత్తర్వులు జారీచేసింది.

    ఆ కొండల్లో విస్తారంగా లభించే ఎర్రచందనం వేంకటేశ్వరునికే చెందుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఎర్రచందనం విక్రయిం చగా వచ్చే మొత్తాన్ని టీటీడీ ఖాతాలో జమా చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఇందులో చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో శేషాచలం కొండలున్నాయి. అవే ఏడుకొండలుగా ప్రసిద్ధికెక్కాయి. ఆ ఏడు కొండలపై శ్రీవేంకటేశ్వరుడు కొలువయ్యా డు. ఔషధ గుణాలున్న ఎర్రచందనం వృక్షాలు ఆ కొండల్లో విస్తారంగా వ్యాపించాయి. రెండు దశాబ్దాల క్రితం  ఎర్రచందనం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

    ఇది అంతర్జాతీయ మార్కెట్లలో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ వచ్చేలా చేసింది. ఆ డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు ఎర్రచందనం వృక్షాలను ఎడాపెడా నరికేస్తూ.. అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. అక్రమమార్గాల్లో ఎర్రచందనం దుంగలను తరలించే క్రమంలో పోలీసు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న 8584.1353 టన్నుల ఎర్రచందనం దుంగలు చిత్తూరు, నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప, ప్రకాశం జిల్లాలోని అటవీశాఖ గోదాముల్లో నిల్వ చేశారు.

    ఇందులో ఈనెల 19 నుంచి 26 వరకూ 4,510 టన్నుల ఎర్రచందనం దుంగలను ఈ-టెండర్ కమ్ ఈ-వేలం పద్ధతిలో విక్రయించడానికి గ్లోబల్ టెండర్లను ప్రభుత్వం పిలిచింది. ఈ టెండర్లలో వచ్చే ఆదాయం అంతా సర్కారు ఖజానాలో జమ చేసి.. రుణ మాఫీకి వినియోగిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై ప్రజాసంఘాలు, వేదపండితులు మండిపడుతున్నారు. శేషాచలం కొండలు 4,755.997 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 174 కుటుంబాలకు చెందిన 1500 రకాల జాతుల మొక్కలు ఉన్నాయి. వాటిలో ఎర్రచందనం అత్యంత విలువైంది.

    శేషాచలం కొండల్లో 3,640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం(8.99 లక్షల ఎకరాలు)లో ఎర్రచందనం వృక్షాలు విస్తరించి ఉన్నాయి. ఇదంతా శేషాచలం కొండల్లోని ఏడుకొండల పరిధిలోకే వస్తుంది. బ్రిటీషు, కేంద్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం ఏడుకొండలు శ్రీవేంకటేశ్వరునికే చెందుతాయి. ఆ ఏడుకొండల్లో లభించే ఎర్రచందనం కూడా శ్రీవారికే దక్కుతుందని.. టెండర్లలో వచ్చే ఆదాయంలో ప్రతి పైసా టీటీడీ ఖాతాలోనే జమ చేయాలని ప్రజాసంఘాలు, వేదపండితులు డిమాండ్ చేస్తున్నాయి. ఆ ధనాన్ని టీటీడీ సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచిస్తున్నారు.
     
    శ్రీవారిదే ఎర్రచందనం

    ఏడుకొండల్లో లభించే ప్రతి వస్తువూ శ్రీవెంకటేశ్వరునిదే. దేవతా వృక్షమైన ఎర్రచందనం శ్రీవారి స్వరూపమే. ఎర్రచందనం టెండర్లలో విక్రయించగా వచ్చే ప్రతి పైసా శ్రీవారికే చెందుతుంది. చెందాలి కూడా.. ఆ డబ్బును టీటీడీ సేవా కార్యక్రమాలకు వినియోగించాలి. ప్రభుత్వ ఖజానాలో జమా చేసుకోవడం న్యాయం కాదు. ఎర్రచందనం విక్రయించగా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం టీటీడీ ఖాతాలో జమ చేయకుండా.. తన ఖజానాలో జమా చేసుకుంటే ప్రజాపోరాటాలకు సిద్ధమవుతాయం. ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటం చేస్తాం.
     -మంగాటి గోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు, రైతు సంఘాల సమాఖ్య, చిత్తూరుజిల్లా.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement