మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మాపురం గ్రామం
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కుగ్రామం దొరవారి తిమ్మాపురం. ఈ గ్రామంలో 25 ఆదివాసీ గిరిజన కుటుంబాలు రెండు శతాబ్దాలుగా నివాసం ఉంటున్నాయి. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పచ్చటి అడవిలో ప్రశాంతమైన జీవనం సాగిస్తున్న ఈ ఆదివాసీ బిడ్డల్లో అలజడి మొదలైంది. ‘ఈ గ్రామానికి వసతులు కల్పించలేం.. మీరు ఖాళీ చేయండి.. మైదాన ప్రాంతంలో మీకు పునరావాసం కల్పిస్తాం..’అంటూ అధికారులు ఒత్తిడి చేయడమే ఇందుకు కారణం.
అడవిలో జీవించే తాము ఎక్కడికీ రాలేమని గిరిజనులు తేల్చి చెప్పడంతో ఒత్తిడి పెంచేందుకు అధికారులు త్రీఫేజ్ విద్యుత్‌ను తొలగించారు. అయితే ఇదంతా ఆ గ్రామానికి వసతులు క ల్పించలేక అధికారులు చేస్తున్న పని కాదని, అడవి మధ్యలో ఉన్న ఈ గ్రామాన్ని ఖాళీ చేస్తే ఇక్కడ టైగర్ జోన్ ఏర్పాటు చేయవచ్చని, తద్వారా అటు వన్యప్రాణుల సంరక్షణ, ఇటు అడవుల పరిరక్షణ చేయవచ్చనేది ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న ఆదివాసీ సంఘాలు, ఇతర సంఘాలు తిమ్మాపురం గిరిజనులకు మద్దతు పలికాయి. అయినా వారిలో ఆందోళన.. అడవి విడిచి పెట్టాల్సి వస్తుందేమో అని ఆవేదన. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ విధమైన తరలింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు సమాచారం.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
ప్రభుత్వం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు పులుల సంరక్షణ.. అడవుల రక్షణ కోసం ఆదివాసీ గూడేలపై కన్నువేసిందనే ప్రచారం జరుగుతోంది. నల్లమల డీప్ ఫారెస్టుతో పాటు తెలంగాణలోని గోదావరి లోయ ప్రాంతాలైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో టైగర్ జోన్లు ఏర్పాటు చేస్తే గోదావరి లోయ బెల్ట్ అంతా అడవితో నిండి ఉంటుంది. అడవి మధ్యలో గ్రామాలు ఖాళీ చేస్తే పోడు భూములు అడవిలో కలిసిపోతాయి. ఇక ముందు పోడు చేసుకునే అవకాశం కూడా ఉండదు. అందుకోసమే ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా..: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ రిజర్వ్ ఏరియాలోని గ్రామాలైన మైసంపేట, రాంపూర్ ప్రాంతాల గిరిజనులను పులుల అభయారణ్యం నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొత్తం కోర్ ఏరియాలో 39 గూడేలు ఉండగా.. ఇందులో 15 గూడేలను మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ పరిధిలోని మైసంపేట, రాంపూర్ పునరావాస గ్రామాల్లోని 142 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.21.30 కోట్లు పరిహారం ఇచ్చారు.
æనల్లమల అడవిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో కోర్ ఏరియాలో ఉన్న చెంచుల పెంటలను అడవి నుంచి బయటకుపంపించే ప్రయత్నాలకు అధికారులు సిద్ధమయ్యారు. సారంపల్లి,కుడిచంతలబైల్ గ్రామస్తులతో సమావేశమయ్యారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల
చొప్పున పరిహారం అందించి పునరావాసం ఏర్పాటు చేస్తామని ఆశ చూపుతున్నారు.
►ములుగు జిల్లా కన్నాయిగూడెం, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, గోవిందరావుపేట మండలాల పరిధిలో మొత్తం 53 గొత్తికోయ గ్రామాలను గుర్తించి 2022 జూన్‌లో సర్వే చేశారు. ప్రస్తుతం గూడేలు ఖాళీ చేయాలని, మంచి ప్యాకేజీలు ఇచ్చి మైదాన ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తామని వారిని బుజ్జగిస్తున్నారని తెలుస్తోంది.
►మహబూబాబాద్‌తో పాటు పక్కనే ఉన్న వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలకమ్మనగర్ ఆదివాసీ గూడేలను కూడా ఖాళీ చేయించే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత దొరవారి తిమ్మాపురం గ్రామంపై దృష్టిపెట్టి ఆ గూడేన్ని ఖాళీ చేయించే పనిలో అధికారులు ఉన్నారు.
►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, పినపాక అడవి మధ్యలో ఉన్న అడవి రామారం, కాచనపల్లి, గుండాల మధ్యలో ఉన్న బాటన్న నగర్ గ్రామాలపై కూడా ఫారెస్టు అధికారుల కన్నుపడినట్లు సమాచారం. ఈ రెండు గ్రామాలను కూడా ఖాళీ చేయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఎక్కడికి పోవాలి..ఎట్టా బతకాలే..
అడవిలోనే పుట్టా. ఇక్కడే పెరిగాను. జంతువులు అంటే మాకేం భయం. ఇక్కడి నుంచి పొమ్మంటే ఎక్కడికి పోయేది. ఎట్టా బతకాలే.. మా ఊరు విడిచి వెళ్లలేం. ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాం. మా అవ్వ, అయ్యను పెట్టిన జాగలోనే నన్ను పెట్టాలి.
– పిడబోయిన లక్ష్మయ్య, దొరవారి తిమ్మాపురం
ఖాళీ చేయమని చెప్పొద్దు
చుట్టూ అడవి. అడవి మధ్యలో మా ఊరు. అందరం పని చేసుకుంటూ బతుకుతాం. ఇంత మంచిగా ఉన్న మా ఊరును ఖాళీ చేయమంటే మేం ఎట్టా బతికేది. గవర్నమెంటోళ్లు మా ఊరికి రోడ్డు వేసి వసతులు కల్పించాలి. అంతేకానీ..ఖాళీ చేయమని మాత్రం అనొద్దు.
– పెరుకు గోవిందమ్మ, దొరవారి తిమ్మాపురం
Comments
Please login to add a commentAdd a comment