Tiger Zone
-
కవ్వాల్ టైగర్‌జోన్‌లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్
కడెం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ మంగళవారం కనిపించింది. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని దోస్త్‌నగర్ అటవీ ప్రాంతంలో దీన్ని గుర్తించినట్లు డీఆర్వో ప్రకాశ్, ఎఫ్‌బీవో ప్రసాద్ తెలిపారు. ‘కలౌల పుల్చ్రా’అని పిలువబడే ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ మైక్రో హాలిడే కుటుంబంలో భాగమైన ఒక చిన్న ప్రత్యేకమైన ఉభయచర జీవి అని డీఆర్వో ప్రకాశ్ చెప్పారు. గుండ్రని శరీరం విలక్షణమైన (గోధుమ, నారింజ, లేదా పసుపు) రంగు కలిగి ఉంటుందన్నారు. ఈ కప్పలు సాధారణంగా అడవుల నుంచి వ్యవసాయ భూములు, నీటి వనరుల ఉన్న చోట ఆవాసం ఏర్పచుకుంటాయని తెలిపారు. ఈ కప్పల ప్రధాన ఆహారం కీటకాలని, ఇవి రాత్రి పూట సంచరిస్తూ జిగట నాలుకతో కీటకాలను వేటాడి ఆహారంగా తీసుకుంటాయని వివరించారు. పగలు వీటిని గుర్తించడం కష్టమన్నారు. విభిన్న వన్య ప్రాణులకు నిలయమైన కవ్వాల్ టైగర్ జోన్లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ కనిపించడం జీవ వైవిధ్యానికి దోహదం చేస్తుందని డీఆర్వో ప్రకాశ్ పేర్కొన్నారు. -
Aarzoo Khurana: ఆమె ఉన్న చోట పులి ఉంటుంది
మన దేశంలో దాదాపు 55 టైగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. వాటన్నింటినీ తన కెమెరాలో నిక్షిప్తం చేసింది ఆర్జూ ఖురానా. సరిగా చెప్పాలంటే పులి ఉన్న చోటల్లా ఆమె ఉంటుంది. వృత్తి రీత్యా అడ్వకేట్ అయినా ఆ పని మానేసి కెమెరాను నేస్తంగా అడవిని నివాసంగా చేసుకుని తిరుగుతూ ఆమె తీస్తున్న ఫొటోలు పెద్ద గుర్తింపునిచ్చాయి. ఆర్జూ పరిచయం. అక్టోబర్ 1, 2023 నుంచి నేటి వరకూ 29 ఏళ్ల ఆర్జూ ఖురానా అడవుల్లోనే ఉంటూ వందల మైళ్లు తిరుగుతూ ఉందంటే నమ్ముతారా? నిజం. ‘ఆల్ టైగర్ రిజర్వ్స్ ప్రాజెక్ట్’ (ఏటిఆర్) కోసం ప్రభుత్వం అప్పజెప్పిన పనిలో ఆమె తలమునకలుగా నిమగ్నమైంది. మన దేశంలో 55 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటికే టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. మిగిలిన వాటిని కూడా అందంగా ఫొటోలలో బంధించి, ప్రచారానికి ఉపయోగించి, టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు నిర్దేశించిన ప్రాజెక్టే ఏ.టి.ఆర్. దానిలో భాగంగా అక్టోబర్ 1న రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్‌తో మొదలెట్టి మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 43 టైగర్ రిజర్వ్‌లను కవర్ చేసి మరో రెండు నెలల్లో మిగిలినవి చేసి ఆఖరున నైనిటాల్లో ఉన్నా జిమ్ కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఫొటోలు తీయడం ద్వారా ఆమె పని ముగిస్తుంది. ‘రోజుకు 14 గంటలు పని చేస్తున్నాను. మానసికంగా శారీరకంగా చాలా కష్టమైనది ఈ పని. కాని ఇందులో నాకు ఆనందం ఉంది’ అంటుంది ఆర్జూ ఖురానా. లా చదివి ‘మాది ఢిల్లీ. మా నాన్నకు నేను అడ్వకేట్ కావాలని కోరిక. నాకేమో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కావాలని చిన్నప్పటి నుంచి కల. ఒక్కతే కూతురుని. అడవుల్లో కెమెరా పట్టుకుని తిరగడానికి అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. నాన్న కోసం లా చేశాను కాని చివరకు ఒప్పించి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ని అయ్యాను. ఇందుకోసం నేను ఢిల్లీలో బేసిక్ ఫొటోగ్రఫీ కోర్సును చేశాను. కాని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వేరు. దానికి వేరే శిక్షణ కావాలి. నెట్లో వెతికితే సుధీర్ శివరామ్ అనే ప్రసిద్ధ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ మాలాంటి వారి కోసం క్యాంప్స్ నిర్వహిస్తారని తెలిసింది. ఆయన రాజస్థాన్‌లోని భరత్పూర్ రిజర్వ్‌ఫారెస్ట్‌లో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ క్యాంప్ నిర్వహించినప్పుడు హాజరయ్యి పని కొంత తెలుసుకున్నాను. రెండు సారస్ కొంగల సరదా సంప్రదింపులను నేను మొదటిసారి ఫొటో తీశాను. అది అందరికీ నచ్చింది. ఆ క్షణమే అనుకున్నాను... అరణ్యానికి జనారణ్యానికి మధ్య వారధిగా నేను ఉండగలను అని. అడవుల్లో ఉండే పక్షులు జంతువుల తరఫున వకాల్తా పుచ్చుకోగలను అని’ అంటుంది ఆర్జూ ఖురానా. కలిసి బతకాలి ‘మనుషులు కలిసి బతకడానికి కష్టపడుతుంటారు. అడవుల్లో తిరిగితే వందల వేల జీవులు ఎలా ఒకదానితో ఒకటి కలిసి బతుకుతాయో తెలుస్తుంది. అవి మనతో కూడా కలిసి బతకాలనే అనుకుంటాయి. కాని మన స్వార్థం కోసం అడవులు ధ్వంసం చేస్తూ వాటిని నాశనం చేస్తున్నాం. గత 50 ఏళ్లలో భూమి మీద ఉన్న జంతువులలో 50 శాతం నశించిపోయాయంటే నమ్ముతారా? ఇది నిజం. మనలో ప్రతి ఒక్కరం అడవుల పరిరక్షణకు, తద్వారా వన్యప్రాణి పరిరక్షణకు పూనుకోవాలి. లేకపోతే మిగిలేదేమీ ఉండదు. ఒక పులి ఉండదు. ఒక నక్కా కనిపించదు’ అంటోంది ఆర్జూ ఖురానా. -
ప్రజల నమ్మకాన్ని చెత్త బుట్టలో పడేశారు
న్యూఢిల్లీ: దేశంలో ప్రఖ్యాతిగాంచిన జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో అడవి మధ్యలో టైగర్ సఫారీల ఏర్పాటును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. వాటి కార్యకలాపాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సఫారీల ఏర్పాటు కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు అక్కడి భారీ వృక్షాలను నరికివేయడంపై మండిపడింది. అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతకు అనువుగా నిబంధనలను తుంగలో తొక్కిన 2021లో బీజేపీ ప్రభుత్వహయాంలో నాటి ఉత్తరాఖండ్ అటవీ మంత్రి హరక్ సింగ్ రావత్, నాటి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కిషన్ చంద్ల పనితీరును తీవ్రంగా ఆక్షేపించింది. ‘‘ ప్రజా విశ్వాసాన్ని బుట్టదాఖలుచేశారు. ఇంతటి విపరీత నిర్ణయాలు కేవలం ఇద్దరే తీసుకున్నారని అనుకోవట్లేము. ఇందులో చాలా మంది ప్రమేయం ఉండొచ్చు’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని పీకే మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాతీయవనంలోని ల్యాన్డౌన్ ఫారెస్ట్ డివిజన్లో పఖ్రో టైగర్ సఫారీ కోసం వేల చెట్లు నరికేశారంటూ పర్యావరణవేత్త, న్యాయవాది గౌరవ్ భన్సల్ వేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ‘‘ అధికారి కిషన్‌ను సస్పెండ్ చేయాలని అటవీ కార్యదర్శి చేసిన సిఫార్సును రావత్ పెడచెవిన పెట్టారు. పైగా కిషన్‌ను సమరి్ధంచారు. రావత్ ఆ పదవి నుంచి దిగిపోయాయే కిషన్ సస్ఫెన్షన్, అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజకీయనేతలు, ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కలిసి చేస్తున్న అక్రమాలకు ప్రబల సాక్ష్యం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఈ ఉదంతంపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు జరుపుతోంది. ఈ ఘటనపై సీబీఐ సమగ్ర నివేదిక మూడు నెలల్లో సమరి్పంచాలి. తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. జిమ్ కార్బైట్ నేషనల్ పార్క్ రాయల్ బెంగాల్ పులులకు ఆవాసం. 1,288.31 చదరపు కి.మీ.లోని ఈ అటవీప్రాంతం పేరు. అత్యంత ఎక్కువ సంఖ్యలో పులులు సంచరించే ప్రాంతంగా ప్రపంచ ప్రసిద్దిగాంచింది. -
పులి జోన్..పరేషాన్!
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కుగ్రామం దొరవారి తిమ్మాపురం. ఈ గ్రామంలో 25 ఆదివాసీ గిరిజన కుటుంబాలు రెండు శతాబ్దాలుగా నివాసం ఉంటున్నాయి. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పచ్చటి అడవిలో ప్రశాంతమైన జీవనం సాగిస్తున్న ఈ ఆదివాసీ బిడ్డల్లో అలజడి మొదలైంది. ‘ఈ గ్రామానికి వసతులు కల్పించలేం.. మీరు ఖాళీ చేయండి.. మైదాన ప్రాంతంలో మీకు పునరావాసం కల్పిస్తాం..’అంటూ అధికారులు ఒత్తిడి చేయడమే ఇందుకు కారణం. అడవిలో జీవించే తాము ఎక్కడికీ రాలేమని గిరిజనులు తేల్చి చెప్పడంతో ఒత్తిడి పెంచేందుకు అధికారులు త్రీఫేజ్ విద్యుత్‌ను తొలగించారు. అయితే ఇదంతా ఆ గ్రామానికి వసతులు క ల్పించలేక అధికారులు చేస్తున్న పని కాదని, అడవి మధ్యలో ఉన్న ఈ గ్రామాన్ని ఖాళీ చేస్తే ఇక్కడ టైగర్ జోన్ ఏర్పాటు చేయవచ్చని, తద్వారా అటు వన్యప్రాణుల సంరక్షణ, ఇటు అడవుల పరిరక్షణ చేయవచ్చనేది ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఆదివాసీ సంఘాలు, ఇతర సంఘాలు తిమ్మాపురం గిరిజనులకు మద్దతు పలికాయి. అయినా వారిలో ఆందోళన.. అడవి విడిచి పెట్టాల్సి వస్తుందేమో అని ఆవేదన. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ విధమైన తరలింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు సమాచారం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ప్రభుత్వం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు పులుల సంరక్షణ.. అడవుల రక్షణ కోసం ఆదివాసీ గూడేలపై కన్నువేసిందనే ప్రచారం జరుగుతోంది. నల్లమల డీప్ ఫారెస్టుతో పాటు తెలంగాణలోని గోదావరి లోయ ప్రాంతాలైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో టైగర్ జోన్లు ఏర్పాటు చేస్తే గోదావరి లోయ బెల్ట్ అంతా అడవితో నిండి ఉంటుంది. అడవి మధ్యలో గ్రామాలు ఖాళీ చేస్తే పోడు భూములు అడవిలో కలిసిపోతాయి. ఇక ముందు పోడు చేసుకునే అవకాశం కూడా ఉండదు. అందుకోసమే ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా..: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ రిజర్వ్ ఏరియాలోని గ్రామాలైన మైసంపేట, రాంపూర్ ప్రాంతాల గిరిజనులను పులుల అభయారణ్యం నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొత్తం కోర్ ఏరియాలో 39 గూడేలు ఉండగా.. ఇందులో 15 గూడేలను మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ పరిధిలోని మైసంపేట, రాంపూర్ పునరావాస గ్రామాల్లోని 142 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.21.30 కోట్లు పరిహారం ఇచ్చారు. æనల్లమల అడవిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో కోర్ ఏరియాలో ఉన్న చెంచుల పెంటలను అడవి నుంచి బయటకుపంపించే ప్రయత్నాలకు అధికారులు సిద్ధమయ్యారు. సారంపల్లి,కుడిచంతలబైల్ గ్రామస్తులతో సమావేశమయ్యారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారం అందించి పునరావాసం ఏర్పాటు చేస్తామని ఆశ చూపుతున్నారు. ►ములుగు జిల్లా కన్నాయిగూడెం, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, గోవిందరావుపేట మండలాల పరిధిలో మొత్తం 53 గొత్తికోయ గ్రామాలను గుర్తించి 2022 జూన్‌లో సర్వే చేశారు. ప్రస్తుతం గూడేలు ఖాళీ చేయాలని, మంచి ప్యాకేజీలు ఇచ్చి మైదాన ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తామని వారిని బుజ్జగిస్తున్నారని తెలుస్తోంది. ►మహబూబాబాద్‌తో పాటు పక్కనే ఉన్న వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలకమ్మనగర్ ఆదివాసీ గూడేలను కూడా ఖాళీ చేయించే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత దొరవారి తిమ్మాపురం గ్రామంపై దృష్టిపెట్టి ఆ గూడేన్ని ఖాళీ చేయించే పనిలో అధికారులు ఉన్నారు. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, పినపాక అడవి మధ్యలో ఉన్న అడవి రామారం, కాచనపల్లి, గుండాల మధ్యలో ఉన్న బాటన్న నగర్ గ్రామాలపై కూడా ఫారెస్టు అధికారుల కన్నుపడినట్లు సమాచారం. ఈ రెండు గ్రామాలను కూడా ఖాళీ చేయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికి పోవాలి..ఎట్టా బతకాలే.. అడవిలోనే పుట్టా. ఇక్కడే పెరిగాను. జంతువులు అంటే మాకేం భయం. ఇక్కడి నుంచి పొమ్మంటే ఎక్కడికి పోయేది. ఎట్టా బతకాలే.. మా ఊరు విడిచి వెళ్లలేం. ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాం. మా అవ్వ, అయ్యను పెట్టిన జాగలోనే నన్ను పెట్టాలి. – పిడబోయిన లక్ష్మయ్య, దొరవారి తిమ్మాపురం ఖాళీ చేయమని చెప్పొద్దు చుట్టూ అడవి. అడవి మధ్యలో మా ఊరు. అందరం పని చేసుకుంటూ బతుకుతాం. ఇంత మంచిగా ఉన్న మా ఊరును ఖాళీ చేయమంటే మేం ఎట్టా బతికేది. గవర్నమెంటోళ్లు మా ఊరికి రోడ్డు వేసి వసతులు కల్పించాలి. అంతేకానీ..ఖాళీ చేయమని మాత్రం అనొద్దు. – పెరుకు గోవిందమ్మ, దొరవారి తిమ్మాపురం -
లారీ డ్రైవర్ కు కనిపించిన పులుల గుంపు..
-
కడెం డివిజన్లో పులి సంచారంపై అప్రమత్తం
సాక్షి, జన్నారం(ఖానాపూర్): కడెం డివిజన్లోని పాడ్వాపూర్ బీట్ ప్రాంతంలో పులి సంచారం నేపథ్యంలో కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాడ్వాపూర్ బీట్ పరిధిలోని గంగాపూర్ ప్రాంతం, ఇస్లాంపూర్ అడవి నుంచి కవ్వాల్ సెక్షన్లో పులి పర్యటించే అవకాశం ఉంది. దీంతో ఆదివారం ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీనివాసరావు అధ్వర్యంలో అధికారులు కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని కవ్వాల్ సెక్షన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పులి అడుగులు, ఇతర గుర్తింపులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో రహదారులు, వాగులు, ఇతర ప్రాంతాల్లో అధికారులు పులి అడుగుల కోసం అన్వేషించారు. ఎక్కడా అడుగులు కనిపించలేదు. గంగాపూర్ మీదుగా కవ్వాల్కు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఎలాంటి అలజడి లేకుండా, పశువులు రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులి కవ్వాల్ సెక్షన్లో ప్రవేశిస్తే ఇక్కడి సౌకర్యాల దృష్ట్యా తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదనే ఆశాభావం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యాన్ని 2012 జనవరి 10న కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి అసెంబ్లీ స్పీకర్ మనోహర్ కవ్వాల్ అభయారణ్యంలో పర్యటించి ఆయన చేసిన సూచన మేరకు 49వ టైగర్‌జోన్‌గా ఏర్పాటు చేశారు. టైగర్‌జోన్ ఏర్పాటు నుంచి పులి రాక కోసం అధికారులు అన్నిరాకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. మూడేళ్ల క్రితం కొన్ని రోజులు రాకపోకలు కొనసాగించింది. ఈ క్రమంలో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు, అటవీశాఖ అధికారులు పులికి రక్షణ కల్పించారు. కొంత అలజడి వల్ల వచ్చిన పులి మూడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయింది. ఎట్టకేలకు ఈ నెల 15 న కడెం రేంజ్ పరిధిలోని పాడ్వాపూర్ బీట్, గంగాపూర్ పరిధిలో బేస్‌క్యాంపు సిబ్బందికి పులి కనిపించింది. వారు అప్రమత్తమై ఉన్నత అధికారులకు తెలియజేయడంతో కెమరాలు అమర్చడం వల్ల పులి కెమెరాకు చిక్కింది. దీంతో అధికారుల అనుమానం నిజమైంది. అడుగుల సేకరణలో సిబ్బంది కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఇటీవలే పెద్ద పులి కనిపించడంతో అధికారులు వాటి సంఖ్యను క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ నిర్వహించారు. శనివారం కడెం ఆటవీ రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్, బీట్ల ఫరిధిలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో పెద్ద పులి కనిపించడంతో అంతకుముందు దాని పాదలు గుర్తించిన అధికారులు వాటి సంఖ్యను గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ పనిలో ఉన్నారు. కడెం రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్ బీట్లతోపాటు ఇతర బీట్లలో వాటి అనవాళ్లు ఉన్నాయా అనే కోణంలో పరిశీలించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. ఆదివారం హైదరాబాద్ అటవీ శిక్షణ ఎఫ్ఆర్ఓలు శిక్షణకు రావడంతో ఈ ప్రాం తం, జంతువుల వివరాలను అటవీ అధికారులు తెలియజేశారు. ఎఫ్ఆర్వో రమేశ్ రాథోడ్, ఎఫ్‌ఎస్‌ఓలు ప్రభాకర్, మమత పాల్గొన్నారు. -
నడక ఆరోగ్యానికి మంచిది..
జన్నారం(ఖానాపూర్) : ప్రకృతికి మన దేహానికి అనేక సంబంధాలున్నాయి. మన ఆరోగ్యం ప్రకృతి చేతిలో ఉంటుందని అందుకే ఈ విషయాన్ని తెలియజేసెందుకే వనదర్శిని కార్యక్రమం చేపడుతున్నట్లు ఫారెస్ట్ డివిజనల్ అధికారి రవీందర్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం టైగర్‌జోన్ పరిధిలోని జన్నారం అటవీ రేంజ్ జన్నారం బీట్ పరిధిలోని 2వ నంబర్ గేట్ నుంచి అడవిలోకి రెండు గంటల పాటు స్థానికులు, అటవీశాఖ అధికారులు వాకింగ్ చేశారు. అనంతరం అటవీ ప్రాంతంలో స్థానికులకు అడవుల ప్రాముఖ్యత, అడవుల వల్ల మానవులకు కలిగే లాభాలు తెలియజేశారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అడవులు అవసరమన్నారు. ప్రకృతిలోని వనాలలో అనేక ఆరోగ్య విషయాలు దాగున్నాయని, వాటి గురించి తెలిస్తే మనం ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చన్నారు. అటవీ శాఖ అధికారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫారెస్ట్ బాథింగ్ పేరుతో నెలకు రెండు మార్లు వనదర్శిని , ప్రకృతి బడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కోన్నారు. ప్రతి రోజు నడక ఆరోగ్యాన్నిస్తుందని, అడవుల్లో నడిస్తే మరింత ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. అందుకే అటవీ అధికారులకు అడవి ప్రాంతంలో నడవాలని సూచించామన్నారు. కార్యక్రమంలో రేంజ్ అధికారి వెంకటేశ్వర్రావు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కట్ట రాజమౌళి, మోటివేషన్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ప్రకాశ్, వర్తక సంఘం అధ్యక్షుడు మారుతీరాజ్, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు జక్కు భూమేశ్ , సభ్యులు అంజితరావు, గోపికృష్ణ, రంగ శ్రీనివాస్, ఎఫ్ఎస్వో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ అధికారిపై దాడి..
శ్రీశైలం ప్రాజెక్ట్: మద్యం మత్తులో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు రెచ్చిపోయారు. అటవీశాఖ శ్రీశైలం సెక్షన్ ఆఫీసర్ జ్యోతిస్వరూప్పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఘటన కర్నూలు జిల్లా శ్రీశైలం పరిధిలోని సున్నిపెంటలో చోటుచేసు కుంది. మంగళవారం రాత్రి సున్నిపెంటలోని అటవీ శాఖ కార్యాలయం సమీపంలో ఆరుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ శ్రీశైలానికి వచ్చే, పోయే వారికి ఆటంకం కల్గించారు. అక్కడ విధుల్లో ఉన్న జ్యోతిస్వరూప్ గమనించి.. ఇది టైగర్‌జోన్ అని, బహిరంగం గా మద్యపానం చేయొద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవా లని వారికి సూచించారు. దీంతో వారు రెచ్చిపోయా రు. అధికారిపై దుర్భాషలాడుతూ చెంపలపై కొట్టా రు. వారిలో ఓ వ్యక్తి.. ‘నేనెవరో తెలుసా? ఎమ్మెల్సీ రంగారెడ్డి కొడుకును. కాళ్లు పట్టుకుంటే వదిలేస్తాం నా కొడకా’ అంటూ దౌర్జన్యం చేస్తూ తీవ్రంగా కొట్టా రు. భయపడిన జ్యోతిస్వరూప్ వారి నుంచి రక్షించుకునేందుకు వాళ్ల కాళ్లను పట్టుకోవాల్సి వచ్చింది. ఇదంతా వారు సెల్ఫోన్లో రికార్డు చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న జ్యోతిస్వరూప్ దాడి విషయా న్ని పై అధికారులకు తెలియజేశారు. నిందితులు వీరే.. అటవీ అధికారిపై దాడి చేసిన వారిని గౌడ్ ఉప్పల్‌లో ఉన్న గోల్డెన్ ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ యజ మాని శ్రీనివాసగౌడ్, బాబునగర్‌కు చెందిన బయో డీజిల్ ఫ్యాక్టరీ యజమాని నాగం అభినయరెడ్డి, డ్రైవర్ దయానంద్, చింతల్‌కు చెందిన ఎంఎస్ఎంఈ లో క్లర్క్‌గా పనిచేస్తున్న మొగల్కౌతర్, చందానగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పిల్లిమడుగుల అశోక్‌కుమార్, ఫతేనగర్‌కు చెందిన సివిల్ సూపర్వైజర్ రాజుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
కవ్వాల్ పులికి ‘ఫుడ్డు’ సవ్వాల్!
సాక్షి, హైదరాబాద్ అది టైగర్ షెల్టర్ జోన్.. కానీ అక్కడే పుట్టి పెరిగిన పులి ఒక్కటంటే ఒక్కటి లేదు.. అయినా సరే పక్క రాష్ట్రాల నుంచి పులుల్ని రప్పించేందుకు అధికారులు కోట్లు వెచ్చిస్తున్నారు.. ఆ అడవిలో కృత్రిమంగా పశుగ్రాసం పెంచారు.. నీటి చెలమలు తీశారు.. చెక్‌డ్యాంలు కట్టారు.. అటవీ భూమి చుట్టూ కందకాలు తవ్వించారు.. కానీ పులికి కావాల్సిన తిండిని మాత్రం మరిచారు! పస్తులైనా ఉంటుంది కానీ పచ్చిగడ్డి తినదన్న లాజిక్‌ను మరిచిన అధికారులు.. కోట్లు పోసి లేని పులిని రా.. రమ్మని పిలుస్తున్నారు! అదే సమయంలో పులికి ఆహారమైన దుప్పులు, కృష్ణ జింకలు, మచ్చల జింకలు, మనుబోతులు, కొండ గొర్రెలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వేటగాళ్లు వాటిని యథేచ్ఛగా చంపేస్తున్నా కళ్లు మూసుకుంటున్నారు. పులులే లేని చోట.. రాష్ట్ర అటవీ శాఖ కేంద్రానికి ఏం నివేదికలు పంపిందో ఏమో గానీ కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అభయారణ్యాన్ని 41వ పులుల సంరక్షణ కేంద్రం(టైగర్ షెల్టర్ జోన్)గా గుర్తించింది. 1,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర అటవీ ప్రాంతాన్ని కవ్వాల్ టైగర్ ప్రాజెక్టుగా ప్రకటించారు. దీని అభివృద్ధికి కేంద్రం రూ.45 కోట్ల నిధులిచ్చింది. ఈ సొమ్ముతో అధికారులు పశుగ్రాసం పెంచారు. పులులు వస్తే తాగటానికి నీటి సాసర్లు, చెలిమలు తీయడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేశారు. పులి అవాసం ఏర్పాటు చేసుకోవటానికి కనీసం 20 నుంచి 30 చ.కి.మీ. దట్టమైన అటవీప్రాంతం అవసరం. ప్రతి చదరపు కిలో మీటరుకు కనీసం 60 నుంచి 70 శాకాహార జంతువులు ఉండాలి. పులి సగటున ప్రతి మూడు రోజులకు ఒకసారైనా వేటాడుతుంది. కానీ కవ్వాల్ ప్రాంతంలో జింకలు, దుప్పులు, ఇతర అటవీ జంతువులు ఏ మేరకు ఉన్నాయన్న కచ్చితమైన లెక్కలు అటవీ శాఖ అధికారుల వద్ద లేవు. విచిత్రమేమిటంటే స్థానికంగా కవ్వాల్ అడవిలో పుట్టి పెరిగిన పెద్దపులి ఒక్కటి కూడా లేదు. అక్కడ పులుల సంచారంపై ఉట్నూరు మండలం కుమ్మరికుంటకు చెందిన భీమ్‌రావ్‌ను అడగ్గా.. ‘‘70 ఏళ్ల నుంచి ఈ అడవిలనే బతుకుతున్న. ఎన్నడూ పులిని చూడలె. దాన్ని జూసినట్టు మా నాయిన కూడా చెప్పలె!’’ అని పేర్కొన్నాడు. ఏమో.. రాకపోతాయా? ఈ నెలలో పులుల లెక్కింపు ఉండటంతో రాష్ట్ర అటవీ అధికారులు నానా హైరానా పడుతున్నారు. కవ్వాల్ అభయారణ్యానికి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని తాడోబా, 100 కి.మీ. దూరంలో ఉన్న మరో టైగర్ ప్రాజెక్టు ఇంద్రావతిపైనే ఆశలు పెట్టుకున్నారు. పులుల సంచారానికి అవకాశం ఉన్న దారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గమనిస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ్నుంచి 7 నుంచి 9 పులులు వచ్చినట్లు నివేదికలు రూపొందించారు. ఇందులో ఓ పులి 2015లో వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగలకు తగిలి చనిపోయింది. మిగతా పులులు కవ్వాల్ ప్రాంతంలోనే ఉన్నాయా? వెనక్కి వెళ్లాయా అన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ‘ఏమో.. ఈ నెలలో చేయబోయో పులుల జనాభా లెక్కల్లో తెలుస్తుంది’ అని చెబుతున్నారు. ప్రతి చ.కి.మీ.కు కనీసం 60–70 వరకు శాకాహార జంతువులు లేకుంటే పులులు రావని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉన్న జింకలకు రక్షణేది..? పులుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఫారెస్టు అధికారులు కవ్వాల్కు ఆనుకొనే ఉన్న ప్రాణహిత నదీ తీరంలోని జింకలను పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యానికి మూల్యంగా వెంచపల్లి రిజర్వ్ ఫారెస్టులోని జింకలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దశకు వచ్చాయి. అదిలాబాద్ జిల్లా కోటపల్లి, పారుపల్లి, జనగామ, సుపాక, అర్జునగుట్ట, కిన్నారం గ్రామాల పరిధిలోని ప్రాణహిత నది ఒడ్డున వెంచపల్లి అభయారణ్యం విస్తరించి ఉంది. 1980లో వైల్డ్‌లైఫ్ అభయారణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 250 నుంచి 300 వరకు కృష్ణ జింకలు ఉండేవి. క్రమంగా ఈ సంఖ్య పెరగటంతో 1999లో వెంచంపల్లిని కృష్ణ జింకల అభయారణ్యంగా ప్రకటించారు. కానీ వేటగాళ్లు ఇష్టారాజ్యంగా జింకలను వేటాడారు. 2007లో తీసిన లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 40 జింకలు మాత్రమే ఉన్నట్టు తేలింది. 2015లో మరోసారి లెక్కలు తీయగా.. కేవలం 5 కృష్ణ జింకలు ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత రెండేళ్లకు చేసిన లెక్కల్ని అధికారులు బయటపెట్టలేదు. కృష్ణా తీరంలో కష్టకాలం మహబూబ్‌నగర్ జిల్లా తంగడి నుంచి జూరాల ప్రాజెక్టు వరకు 27 కి.మీ. మేర కృష్ణా తీరం ఉంది. నదికి ఉత్తరాన 34 గ్రామాలున్నాయి. ఈ పల్లెల్లో వేల సంఖ్యలో జింకలు ఉన్నాయి. తీరం వెంట గడ్డి లేకపోవటంతో స్థానికంగా పంట పొలాలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. ఇది రిజర్వు ఫారెస్టు ప్రాంతం కాదు. ఫారెస్టు అధికారుల నిఘా పెద్దగా ఉండదు. ఇదే అదునుగా కర్ణాటకలోని రాయచూరు నుంచి వస్తున్న వేటగాళ్లు యథేచ్ఛగా జింకల్ని వేటాడుతున్నారు. ఈ 34 గ్రామాలకు కలిపి ఇద్దరు ఫారెస్టు వాచర్లు మాత్రమే ఉన్నారు. సాధారణంగా ఫోకస్ లైట్‌ను జింక కళ్లలోకి సూటిగా కొడితే అవి కదలకుండా నిలబడతాయి. వెంటనే మరో వ్యక్తి వెనుక నుంచి కర్రతో జింకను బలంగా కొట్టి చంపుతున్నారు. మూడు మెట్లను వదిలి.. అటవీ ఆవరణ వ్యవస్థలో పులిది చివరి మెట్టు. తొలిమెట్టులో గడ్డిజాతులు, పొదలు, చెట్లు ఉంటే.. రెండో మెట్టులో కుందేళ్లు, జింకలు, దుప్పులు కొండ గొర్రెలు వంటి శాకాహార జంతువులు ఉంటాయి. మూడో మెట్టులో వీటిని తిని బతికే నక్కలు, తోడేళ్లు, ఎలుగుబంటు లాంటి ద్వితీయ మాంసాహార జంతువులు ఉంటాయి. నాలుగో మెట్టులో పులి ఉంటుంది. పులి ఎదగాలంటే ఈ అటవీ ఆవరణ వ్యవస్థ సమతుల్యంగా ఉండాలి. పొదలు, గడ్డిజాతులతో పాటు జింకలు, కుందేళ్లు, కొండ గొర్రెలు, మనుబోతులు తగిన స్థాయిలో ఉండాలి. రాష్ట్ర అటవీ శాఖ అధికారులు పులులను ఆకర్షించే తొలి మూడు మెట్లలోని జీవులను నిర్లక్ష్యం చేస్తూ.. టైగర్ షెల్టర్ జోన్‌ను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. -
పులి అదృశ్యం..!
నాలుగు నెలలుగా కవ్వాల్‌లో కనిపించని వైనం.. టైగర్‌జోన్‌లో ప్రతికూల వాతావరణం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటుందని అభిప్రాయం జన్నారం : కవ్వాల్ అభయారణ్యంలో పులి జాడ లేకుండా పోయింది. టైగర్‌జోన్‌లో ఏర్పడిన ప్రతికూల వాతావరణం కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జన్నారం అటవీ డివిజన్ కవ్వాల్ అభయారణ్యాన్ని దేశంలో 42వ పులుల రక్షిత ప్రదేశంగా కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్‌లో గుర్తించింది. పులికి అనుకూలమైన ప్రదేశం, ఎక్కువ వన్యప్రాణులు ఉండే ప్రదేశమని టైగర్‌జోన్‌గా ఎంపిక చేసింది. టైగర్ జోన్ ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా పులి రావడం లేదని అటవీశాఖ అధికారులు భావిస్తున్న తరుణంలో పులి చిత్రాలు కెమెరాకు చిక్కడంతో ఆనందం వెల్లివిరిసింది. కాగజ్‌నగర్, చెన్నూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులులు ఒక్కొక్కటిగా కవ్వాల్ టైగర్‌జోన్‌కు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు ఎప్పటికప్పుడు కెమెరాల ద్వారా పులి కదలికలను గుర్తించారు. గత సంవత్సరం జనవరి నుంచి మే వరకు జరిగిన జంతు గణనలో రెండు పులులు ఉన్నట్లు నిర్ధారించారు. తాళ్లపేట్ రేంజ్లో ఒకటి, కవ్వాల్ అటవీ సెక్షన్లో మరో పులి కెమెరాలకు చిక్కాయి. రెండు పులులు వచ్చినట్లు టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు గుర్తించి ఫొటోలతో సహా అటవీ అధికారులకు అందజేశారు. రక్షణ కరువు కవ్వాల్ టైగర్‌జోన్ ఏర్పాటైన మూడేళ్ల తర్వాత పులులు రావడంపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అధికారులు కూడా పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి పులికి రక్షణ కల్పించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. రోజూ అడవిలో తిరగాలని, అలజడి లేకుండా చూడాలని, వేటను పూర్తిగా అరికట్టాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులు మాత్రమే ఆదేశాలను పాటించిన కింది స్థాయి సిబ్బంది ఎప్పటిలాగే మామూలుగా వదిలేశారు. స్మగ్లింగ్ కోసం కొందరు అడవులకు వెళ్లడంతో రాత్రి, పలు కారణాల వల్ల నిత్యం అడవులకు వెళ్లడంతో అలజడి ఏర్పడుతోంది. మహారాష్ట్రకు మనకు ఎంతో తేడా మహారాష్ట్రలోని తాడోబాలో పులుల రక్షిత ప్రదేశం ఏర్పాటు చేశారు. అక్కడ చాలా పులులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి రక్షణ కల్పించారు. గత మూడు నెలల క్రితం తాడోబాలోని జై అనే పులి కనిపించడం లేదని అధికారులు గుర్తించి పులి జాడ కోసం గాలిస్తున్నారు. అక్కడి ప్రజలు పులి జాడ కోసం పూజలు చేస్తున్నట్లు, 400 మంది అధికారుల వరకు పులి కోసం వెదుకుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, కోటపల్లి ఏరియాలలో తిష్ట వేసి తిరుగుతున్నారు. పులి కోసం వారు ఎంతో తపన పడుతున్నారు. కాని.. మన వద్ద కవ్వాల్ టైగర్‌జోన్‌లో 2016 అక్టోబర్ నుంచి పులి కనిపించడం లేదు. ఈ విషయమై హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు అధికారులకు తెలియజేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం కాని, పులి కోసం ఆరా తెయడం కాని జరగడం లేదు. తాడోబా నుంచి కవ్వాల్ అభయారణ్యానికి పులి వచ్చేందుకు వీలుగా కారిడార్ ఉంది. ఆ కారిడార్‌లో అలజడి ఉండడం వల్ల పులి అక్కడి నుంచి రాకపోకలను కొనసాగించడం లేదని టైగర్ కన్జర్వేటర్ సొసైటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు రక్షణ కల్పిస్తే తాడోబా నుంచి పులి రాకపోకలు కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగజ్‌నగర్ ప్రాంతాల్లో పులి అడుగులు ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించడంతో టైగర్‌జోన్ కూడా నాలుగు జిల్లాలకు వెళ్లింది. దీంతో ఏ జిల్లాలో పులులున్నాయో గుర్తించడం అధికారులకు కొంచెం ఇబ్బందిగా మారింది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో పులులున్నట్లు అధికారులు కెమరాల ద్వారా గుర్తించారు. తాడొబా నుంచి ఆ ప్రాంతాల్లో పులులు రాకపోకలు కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కారిడార్‌లో అలజడి లేకుంటే కవ్వాల్ టైగర్‌జోన్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పులి కదలికలు గుర్తించి, రక్షణ కల్పిస్తే కవ్వాల్ టైగర్‌జోన్‌లో మరిన్ని పులులు వచ్చే అవకాశం ఉంది. నాలుగు నెలల నుంచి కనిపించడం లేదు.. కవ్వాల్ టైగర్‌జోన్‌కు రెండు పులులు వచ్చాయి. గత సంవత్సరం వాటికి సంబంధించి 20 ఫొటోలు సేకరించాం. ఈ ఏడాది కెమరాలు అమర్చినా పులులు చిక్కలేదు. కోర్ ఏరియాలో పులి కనిపించలేదు. బఫర్ ఏరియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. కెమరాలు సరిపడా లేవు. కోర్ ఏరియాలో పూర్తి కాగానే బఫర్ ఏరియా అంటే లక్షెట్టిపేట, మంచిర్యాల అటవీ రేంజ్‌లలో కెమరాలు ఏర్పాటు చేస్తాం. హాజీపూర్, దేవాపూర్ ఏరియాలలో అప్పుడప్పుడు వస్తున్నట్లు సమాచారం వచ్చింది.అక్కడ కెమరాలను అమర్చితే పూర్తి వివరాలు తెలుస్తాయి. – ఇమ్రాన్ సిద్ధిఖి, హెచ్టీసీఎస్ చైర్మన్ ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాం పులి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాం. కెమరాలను అమర్చి వాటి కదలికలను గుర్తిస్తున్నాం. గణన పూర్తి కాగానే పూర్తి విషయాలు తెలియజేస్తాను. – ప్రభాకర్, జిల్లా అటవీశాఖ అధికారి -
పులులుంటేనే వాతావరణంలో సమతుల్యం
టైగర్‌జోన్ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ అంతర్జాతీయ పులుల దినోత్సవ ర్యాలీ జన్నారం : పులులతో వాతావరణంలో సమతుల్యత ఉంటుందని, దీంతో మనిషి మనుగడకు ముప్పు వాటిల్లే కాలుష్యం నివారణ అవుతుందని టైగర్‌జోన్ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం పురష్కరించుకుని మండల కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా టీడీసీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కవ్వాల్ టైగర్‌జోన్ కావడం వల్ల ఈ ప్రాంతంలో పులులు వచ్చాయని, వాటి రాక శుభపరిణామమని అన్నారు. పులులను కాపాడుకోవడం అందరి బాధ్యతని, పులులు ఈ ప్రాంతంలో ఉండాలంటే అడవులను సంరక్షించుకోవాలని తెలిపారు. అడవులు దట్టంగా ఉండడం వల్ల శాఖాహార జంతువులు ఉంటాయని, వాటితో పులుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. త్వరలో పులులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని, అందుకు తగ్గినట్లుగా కారిడర్ తయారు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చెటుపల్లి రాజేశ్వరి, రేంజ్ అధికారి సౌకత్ హుస్సెన్, ఎన్సీసీ అధికారి రాజమౌళి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజరాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం, పట్టణ అధ్యక్షుడు భరత్‌కుమార్, డీఆర్వో గులాం మొయినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
పులుల కోసం ఊళ్లు ఖాళీ
కవ్వాల్ అభయారణ్యం నుంచి గిరిజనుల తరలింపునకు రంగం సిద్ధం జన్నారం: తరతరాలుగా అడవితల్లిని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులు ఉన్నపళంగా జనారణ్యంలోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పులుల సంరక్షణ పేరిట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అడవిబిడ్డలకు శాపంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా జన్నారం అటవీ డివిజన్లోని కవ్వాల్ అభయారణ్యం పులుల రక్షిత కేంద్రం (టైగర్ జోన్)లో ఉన్న గిరిజన గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. గిరిజన సంఘాల ఆవేదనను పట్టించుకోకుండానే గిరిపుత్రులను పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు సర్కారు సమాయత్తమవుతోంది. అయితే గిరిజనులు మాత్రం తాము కోరిన ‘పరిహారం’ ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని.. లేకుంటే ఎక్కడికీ వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. 2012లో కేంద్రం జీవో... కవ్వాల్ అభయారణాన్ని పులుల రక్షిత కేంద్రంగా గుర్తిస్తూ 2012 ఏప్రిల్ 10న కేంద్ర ప్రభుత్వం జీవో 27 విడుదల చేసింది. పులులు తిరిగేందుకు ఎలాంటి అలజడి ఉండకూడదనే ఉద్దేశంతో అడవిలోని గిరిజన గ్రామాలకు పునరావసం కల్పిస్తూ వారిని అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించింది. పులుల రక్షిత ప్రదేశంలోని అలీనగర్, దొంగపల్లి, మల్యాల గ్రామాలతోపాటు కడెం మండలంలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను తరలించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు పునరావాస కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. అధికారుల సర్వే.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అధ్యక్షతన ఈ నెల 17న టైగర్ జోన్‌లోని గిరిజన గ్రామాల ప్రజలకు పునరావసం కల్పించడంపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేసీ సుందర్ అబ్నార్, ఐటీడీఏ పీవో కర్ణన్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ అద్వైత్ సింగ్, మంచిర్యాల ఆర్డీవో అయేషా ఖనమ్, డీఎప్వో రవీందర్‌తోపాటు పలువురు గిరిజనులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మంచిర్యాల ఆర్డీవో ఖనమ్ జన్నారం, దండేపల్లి తహసీల్దార్లు సంపతి శ్రీనివాస్, కుమారస్వామి టైగర్ జోన్‌లోని మల్యాల, అలీనగర్, దొంగపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఒక్కో గ్రామంలో ఎంత మంది గిరిజనులున్నారు.. ఒక్కొక్కరికీ ఎంత భూమి ఉంది... ఇందులో 18 ఏళ్లు దాటిన వారు ఎంత మంది ఉన్నారు వంటి అంశాలపై సర్వే చేపట్టి అలీనగర్ లో 65, దొంగపల్లిలో 69, మల్యాలలో 60 కుటుంబాలను గుర్తించారు. అలాగే ఈ గ్రామాల నుంచి వెళ్లిన వారి భూముల వివరాలను కూడా సేకరించారు. కడెం మండలంలోని మైసంపేట్, రాంపూర్లలో ఇంకా సర్వే జరగాల్సి ఉంది. ఏప్రిల్ 10న రెండోసారి సమావేశం అనంతరం పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఇప్పటికే సర్వే పూర్తిచేసి కుటుంబాలను కూడా గుర్తించారు. మూడు గ్రామాల్లోని గిరిజనేతర కుటుంబాలు అడవుల నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా.. 11 పెంటలకు చెందిన గిరిజనులు ససేమిరా అంటున్నారు. పునరావాసం ఎలా..? టైగర్ జోన్ పరిధిలోని గిరిజన గ్రామాలకు పునరావాసం కల్పించేందుకు విడుదల చేసిన జీవో ప్రకారం 18 ఏళ్లు పైబడి ఉన్న వారిని వేరే కుటుంబంగా లెక్కిస్తారు. ప్రతి కుటుంబానికి మొదటి అవకాశంగా రూ. 10 లక్షలు.. రెండో అవకాశంగా వ్యవసాయ భూమితోపాటు ఇల్లు నిర్మించి కాలనీ ఏర్పాటు చేసి వసతులు కల్పిస్తారు. అయితే ఈ ప్యాకేజీని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. తమకు మండలంలోని బొమ్మెన గ్రామ సమీపంలో భూమి ఇవ్వాలని, అక్కడే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అలీనగర్ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. బలవంతం వద్దు గిరిజనులను వెళ్లమని బలవంతం చేయవద్దు. వారు వెళ్లడానికి సిద్ధంగా ఉంటేనే ప్రభుత్వ ప్యాకేజీ ఇచ్చి పంపియ్యాలే. గిరిజనులు బొమ్మెన పక్కన గల భూమి కావాలంటున్నారు. ఇక్కడ అనుకూలంగా ఉంది. వేరే చోట ఇస్తే ఇబ్బంది పడుతరు. అందుకే ఇక్కడే భూమి ఇచ్చేలా చూడాలి. - కుర్ర పోశం, మల్యాల గ్రామ సర్పంచ్ పైసలే ం చేసుకుంటం.. ఇక్కడి నుంచి ఎల్లిపోతే పైసలిస్తమంటున్నరు.. పైసలిస్తే కొన్ని రోజుల్లో అయిపోతయ్.. మా పోరగాండ్లు, కుటుంబం బతికేదెట్ల.. మాకు ఇక్కడెంత భూమి ఉందో అంత భూమి ఇయ్యాలే. అప్పుడే ఇక్కడ్నుంచి కదులుతం. - మడావి గంగరాం, అలీనగర్ ఎవరినీ బలవంత పెట్టం పునరావసం కల్పించడంలో ఎవరినీ బలవంత పెట్టట్లేదు. వారికి ఇష్టమైతేనే ఇక్కడి నుంచి వెళ్లమంటున్నాం. ప్రభుత్వ ప్యాకేజీ ఇస్తాం. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అన్ని పరిశీలించి, ఎవ్వరినీ నొప్పించకుండా, బలవంతం చే యకుండా వారి ఇష్టప్రకారమే పునరావసం కల్పిస్తాం. - రవీందర్, డిప్యూటీ డెరైక్టర్, టైగర్ జోన్ భూమి ఇయ్యాలే.. మాకు ఇక్కడ నాలుగెకరాల భూమి, ఇల్లు ఉంది. ఇక్కడి నుంచి పోవాలని అంటున్నారు. మేము ఇక్కడి నుంచి పోయిన ఇక్కడ ఎంత భూమి ఉందో అంత భూమి ఇవ్వాలి. అంతే కాని పైసలిచ్చి పొమ్మంటే పోయేది లేదు. - మడావి నాగుబాయి, అలీనగర్ -
టైగర్‌జోన్‌లో కానరాని పులిజాడ
* పెరిగిన చుక్కల దుప్పుల సంతతి * జంతుగణన పూర్తి జన్నారం: కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశంగా ప్రకటించి మూడు సంవత్సరాలు అవుతున్నా అభయారణ్యంలో పులి జాడ కని పించడంలేదు. టైగర్‌జోన్‌గా ప్రకటించిన నుంచి మూడు సం వత్సరాలుగా జంతు గణన జరి గినా ఈ గణనలో పులి అడుగులు ఉన్నట్లు కనిపించలేదు. గత నెల 24 నుంచి 30 వరకు జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి, జన్నారం, తాళ్లపేట్, బీర్షాయిపేట్ అటవి రేంజ్‌లలో జంతుగణన నిర్వహించారు. రేంజ్లలోని బీట్ స్థాయి నుంచి సెక్షన్ స్థాయికి, అక్కడి నుంచి అన్ని సెక్షన్ల నుంచి రేంజ్ కార్యాలయానికి జంతువుల లెక్కలను అందించరు. ఇప్పుడు రేంజ్‌ల నుంచి డివిజన్ కేంద్రానికి వచ్చాయి. వీటిని పరిశీలిస్తే గతంలో పోలిస్తే చిరుత పులల సంఖ్య కూడా పడిపోయినట్లు తెలుస్తుంది. గతంలో చిరుత పులులు 30 వరకు ఉండగా ఇప్పుడు 12 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని చిరుతలు ఇక్కడి నుంచి వెళ్లగా మరి కొన్ని చిరుతలు వేటకు గురయ్యాయని అధికారులు అంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. శాఖాహార జంతువులు చుక్కల దుప్పులు చిన్నవి పెద్దవి కలిపి 662, గండి జింకలు 30, కృష్ణ జింకలు 05, నీలుగాయిలు 198, సాంబర్లు 13, బుర్ర జింకలు 33, అడవి దున్నలు 93, అడవి పందులు 933, అడవి కోళ్లు 3, కొండ ముచ్చులు 382, కుందేళ్లు 57, కొండగొర్రెలు 02, నెమల్లు ఆడ 47, మగ నెమల్లు 73, మాంసాహార జంతువులు చిరుతపులులు 11 మగవి, 1 ఆడ చిరుతపులి, రేసుకుక్కలు 64, ఎలుగుబంట్లు 75, నక్కలు 13, తోడేళ్లు 13, అడవిపిల్లులు 19, కొండ్రిగాడు 2 ఉన్నట్లు ఉన్నాయి. పులి రాక కోసం ఎదురు చూస్తు న్న అధికారులకు ఈ గణనలో పులి జాడ కనిపించకపోవడం అంసతృప్తికి లోను చేస్తోంది.