నేడు ప్రపంచ అటవీ దినోత్సవం
మన దేశంలో దాదాపు 55 టైగర్ రిజర్వాయర్‌లు ఉన్నాయి. వాటన్నింటినీ తన కెమెరాలో నిక్షిప్తం చేసింది ఆర్జూ ఖురానా. సరిగా చెప్పాలంటే పులి ఉన్న చోటల్లా ఆమె ఉంటుంది.
వృత్తి రీత్యా అడ్వకేట్ అయినా ఆ పని మానేసి కెమెరాను నేస్తంగా అడవిని నివాసంగా చేసుకుని తిరుగుతూ ఆమె తీస్తున్న ఫొటోలు పెద్ద గుర్తింపునిచ్చాయి. ఆర్జూ పరిచయం.
అక్టోబర్ 1, 2023 నుంచి నేటి వరకూ 29 ఏళ్ల ఆర్జూ ఖురానా అడవుల్లోనే ఉంటూ వందల మైళ్లు తిరుగుతూ ఉందంటే నమ్ముతారా? నిజం. ‘ఆల్ టైగర్ రిజర్వ్స్ ప్రాజెక్ట్’ (ఏటిఆర్) కోసం ప్రభుత్వం అప్పజెప్పిన పనిలో ఆమె తలమునకలుగా నిమగ్నమైంది. మన దేశంలో 55 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటికే టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది.
మిగిలిన వాటిని కూడా అందంగా ఫొటోలలో బంధించి, ప్రచారానికి ఉపయోగించి, టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు నిర్దేశించిన ప్రాజెక్టే ఏ.టి.ఆర్. దానిలో భాగంగా అక్టోబర్ 1న రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్‌తో మొదలెట్టి మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 43 టైగర్ రిజర్వ్‌లను కవర్ చేసి మరో రెండు నెలల్లో మిగిలినవి చేసి ఆఖరున నైనిటాల్‌లో ఉన్నా జిమ్ కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఫొటోలు తీయడం ద్వారా ఆమె పని ముగిస్తుంది. ‘రోజుకు 14 గంటలు పని చేస్తున్నాను. మానసికంగా శారీరకంగా చాలా కష్టమైనది ఈ పని. కాని ఇందులో నాకు ఆనందం ఉంది’ అంటుంది ఆర్జూ ఖురానా.
లా చదివి
‘మాది ఢిల్లీ. మా నాన్నకు నేను అడ్వకేట్ కావాలని కోరిక. నాకేమో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కావాలని చిన్నప్పటి నుంచి కల. ఒక్కతే కూతురుని. అడవుల్లో కెమెరా పట్టుకుని తిరగడానికి అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. నాన్న కోసం లా చేశాను కాని చివరకు ఒప్పించి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ని అయ్యాను. ఇందుకోసం నేను ఢిల్లీలో బేసిక్ ఫొటోగ్రఫీ కోర్సును చేశాను. కాని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వేరు. దానికి వేరే శిక్షణ కావాలి.
నెట్‌లో వెతికితే సుధీర్ శివరామ్ అనే ప్రసిద్ధ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ మాలాంటి వారి కోసం క్యాంప్స్ నిర్వహిస్తారని తెలిసింది. ఆయన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ రిజర్వ్‌ఫారెస్ట్‌లో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ క్యాంప్ నిర్వహించినప్పుడు హాజరయ్యి పని కొంత తెలుసుకున్నాను. రెండు సారస్ కొంగల సరదా సంప్రదింపులను నేను మొదటిసారి ఫొటో తీశాను. అది అందరికీ నచ్చింది. ఆ క్షణమే అనుకున్నాను... అరణ్యానికి జనారణ్యానికి మధ్య వారధిగా నేను ఉండగలను అని. అడవుల్లో ఉండే పక్షులు జంతువుల తరఫున వకాల్తా పుచ్చుకోగలను అని’ అంటుంది ఆర్జూ ఖురానా.
కలిసి బతకాలి
‘మనుషులు కలిసి బతకడానికి కష్టపడుతుంటారు. అడవుల్లో తిరిగితే వందల వేల జీవులు ఎలా ఒకదానితో ఒకటి కలిసి బతుకుతాయో తెలుస్తుంది. అవి మనతో కూడా కలిసి బతకాలనే అనుకుంటాయి. కాని మన స్వార్థం కోసం అడవులు ధ్వంసం చేస్తూ వాటిని నాశనం చేస్తున్నాం. గత 50 ఏళ్లలో భూమి మీద ఉన్న జంతువులలో 50 శాతం నశించిపోయాయంటే నమ్ముతారా? ఇది నిజం. మనలో ప్రతి ఒక్కరం అడవుల పరిరక్షణకు, తద్వారా వన్యప్రాణి పరిరక్షణకు పూనుకోవాలి. లేకపోతే మిగిలేదేమీ ఉండదు. ఒక పులి ఉండదు. ఒక నక్కా కనిపించదు’ అంటోంది ఆర్జూ ఖురానా.
Comments
Please login to add a commentAdd a comment