లీగల్ : న్యాయ సలహా
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్
పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.
నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి.
భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం
sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment