World Forestry Day
-
Vaishali Shroff: సజీవ ప్రపంచంలోకి...
వైశాలి ష్రాఫ్ చేతిలో మంత్రదండం ఉంది. ఆ మంత్రదండం అడవులను బడులకు రప్పించగలదు. అలనాటి రాక్షస బల్లులతో ఈనాటి పిల్లలను మాట్లాడించగలదు. ఆ మంత్రదండం పేరు కలం. ముంబైకి చెందిన వైశాలి ష్రాఫ్ పర్యావరణ సంబంధిత విషయాలపై పిల్లల్లో అవగాహన కలిగించడానికి ఎన్నో పుస్తకాలు రాసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు అందుకుంది... నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్(సిఎన్పీ)కి వెళ్లి వచ్చిన తరువాత వైశాలికి ‘సీతాస్ చిత్వాన్’ అనే పుస్తకం రాయడం ప్రారంభించింది. ఈ పార్క్‌కు వెళ్లడానికి ముందు తన కుటుంబంతో కలిసి మన దేశంలోని ఎన్నో జాతీయ పార్క్‌లను చూసింది వైశాలి. ఏ పార్క్‌కు వెళ్లినా అందులోని జీవవైవిధ్యం తనకు బాగా నచ్చేది. సాలె పురుగుల నుంచి పెద్ద పిల్లుల వరకు ఏనుగుల నుంచి ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే చెట్ల వరకు తనను అమితంగా ఆకట్టుకునేవి. ‘ప్రకృతిని కాపాడుకుంటేనే బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు’ అనే సత్యాన్ని పిల్లలకు బోధ పరచడానికి ‘సీతాస్ చిత్వాన్’ పుస్తకం రాసింది. ‘పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చిత్తశుద్ధి ఉంటే అడవులను తద్వారా రాబోయే తరాలను కాపాడుకోవచ్చు. అడవి ఒక పాఠశాల. సహనంతోనూ, సాహసోపేతంగా ఉండడాన్ని నేర్పుతుంది. జీవరాశుల పట్ల సానుభూతి కలిగి ఉండడాన్ని నేర్పుతుంది’ అని ‘సీతస్ చిత్వాన్’ ద్వారా చెబుతుంది వైశాలి. ప్రాపంచిక, పర్యావరణానికి సంబంధించిన విషయాల గురించి తగిన సమాచారంతో ఫిక్షన్ ఫార్మట్‌లో చెప్పడం వైశాలికి ఇష్టం. ఈ ఫార్మట్‌లో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆకట్టుకునే క్యారెక్టర్లను సృష్టించింది. పిల్లలు పుస్తకంలోని పాత్రలతో కనెక్ట్ కావడమే కాకుండా పర్యావరణానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటారు. తన బామ్మ నుంచి పుస్తక పఠనాన్ని అలవర్చుకుంది వైశాలి. వైశాలి స్కూల్ రోజుల్లో... తన బామ్మ ఒక మూలన కుర్చీలో కూర్చుని ఏదో ఒక పుస్తకం సీరియస్‌గా చదువుతూ కనిపించేది. బామ్మను అనుకరిస్తూ వైశాలి కూడా ఏదో కథల పుస్తకం చదువుతూ కూర్చునేది. మధ్య మధ్యలో బామ్మను ఆసక్తిగా చూసేది. ఈ అనుకరణ కాస్తా ఆ తరువాత పుస్తకాలు చదివే అలవాటుగా మారింది. ఆ అలవాటే తనని పిల్లల రచయిత్రిని చేసింది. ‘ఫిక్షన్, నాన్ ఫిక్షన్లలో నాన్ ఫిక్షన్ రాయడమే కష్టం. నాన్ ఫిక్షన్ పుస్తకాల కోసం బోలెడు సమాచార సేకరణ చేయాల్సి ఉంటుంది’ అంటుంది వైశాలి. మన దేశంలోని రాక్షస బల్లుల గురించి సాధికారమైన సమాచారంతో ఆమె రాసిన ‘బ్లూథింగోసారస్’ నాన్–ఫిక్షన్ పుస్తకానికి ఎంతో మంచి స్పందన వచ్చింది. వివిధ రకాల వ్యక్తీకరణల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి, కనెక్ట్ కావడానికి భాషలు వీలు కల్పిస్తాయి. వైశాలి తాజా పుస్తకం ‘తాతుంగ్ తతుంగ్ అండ్ అదర్ అమేజింగ్ స్టోరీస్’ పుస్తకం భారతీయ భాషల విస్తృతి, లోతు గురించి పిల్లల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మాతృభాషల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. గుహ గోడలపై ఉన్న చిత్రలిపి నుంచి పురాతన, సమకాలీన స్థానిక భాషలకు సంబంధించిన వివరాలు ఈ పుస్తకంలో ఉంటాయి. ‘తాతుంగ్ తతుంగ్... మన దేశపు అద్భుతమైన భాషా సంప్రదాయాన్ని కళ్లకు కడుతుంది. భాషలు, వాటి గొప్ప వారసత్వాలు కనుమరుగు కాకూడదని హెచ్చరిస్తుంది. ఈ పుస్తకం చదవడం ద్వారా పిల్లలకు తమ మాతృభాష పట్ల మరింత అభిమానం పెరుగుతుంది’ అంటారు రచయిత, రాజకీయ నాయకుడు శశిథరూర్. ‘భిన్నమైన విషయాల గురించి భిన్నమైన పద్ధతుల్లో రాయడం ఇష్టం’ అంటున్న వైశాలి ష్రాఫ్ పిల్లల కోసం మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆశిద్దాం. -
పశ్చిమ కనుమలలో ప్రాణదాతలు
‘ప్రాణదాత’ అనే మాట మనుషులకు సంబంధించే ఎక్కువగా వినబడుతుంది. ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’లోని మహిళలు మాత్రం పశ్చిమ కనుమల అరణ్యాలలోని మొక్కల ప్రాణదాతలు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కలు, చెట్లను కాపాడడానికి ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ ద్వారా మొక్కవోని కృషి చేస్తున్నారు. పచ్చటి అడవి పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా కష్టపడుతున్నారు... పశ్చిమ కనుమల అడవులు అపూర్వమైన చెట్లజాతులు, జంతుజాలం, పక్షి, చేప జాతులకు ప్రసిద్ధి పొందాయి. అయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) పశ్చిమ కనుమల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల వల్ల మన దేశంలోని పశ్చిమ కనుమలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రాంతంలోని అడవులను రక్షించుకోవడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి కేరⶠలోని పెరియాలో ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటైన ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ లోని ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’ కృషి చేస్తోంది. 27 మంది మహిళలు ఉన్న ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’ ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’లో అరుదైన మొక్కలను సంరక్షిస్తోంది. ‘మొక్కలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. ప్రమాదంలో ఉన్న మొక్కలకు ఈ గురుకులం శరణార్థి శిబిరంలాంటిది. ఆస్పత్రి కూడా అనుకోవచ్చు. మొక్కలకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మట్టిపాత్రలతో ఉంటుంది’ అంటుంది ఎకోసిస్టమ్ గార్డెనర్ సుప్రభా శేషన్. తొంభై శాతం అడవులు మాయమైన పరిస్థితిని ‘పర్యావరణ మారణహోమం’గా అభివర్ణిస్తుంది సుప్రభా శేషన్. అడవులనే ఇల్లుగా భావిస్తున్న సుప్రభ శేషన్ ‘గ్రీన్ ఆస్కార్’గా గుర్తింపు పొందిన యూకేలోని టాప్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ‘విట్లీ’కి ఎంపికైంది. గురుకుల బొటానికల్ శాంక్చువరీ (జీబిఎస్) అరుదైన మొక్కల ‘స్వర్గధామం’గా పేరు తెచ్చుకుంది పశ్చిమ కనుమల ప్రాంతాలలో 50 లక్షల మందికి పైగా నివసిస్తున్నందున అడవులు ప్రమాదం అంచున ఉన్నాయి. 28 ఏళ్లుగా ‘జీబిఎస్’లో పనిచేస్తున్న సుప్రభా శేషన్ అరణ్యాలకు సంబంధించిన పరిస్థితులు విషమించడాన్ని ప్రత్యక్షంగా చూసింది. ‘అరుదైన మొక్కలను కాపాడడంలోని ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది సీనియర్ గార్డెనర్ లాలీ జోసెఫ్. పాతిక సంవత్సరాలుగా ఈ అభయారణ్యంలో పనిచేస్తున్న జోసెఫ్ ‘మొక్కలు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉండగలం’ అంటోంది. ‘నేను చూస్తుండగా అడవిలో ఒక చెట్టు నేల కూలిపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదు’ అంటుంది లాలీ జోసెఫ్. కీటకాలు, పాముల నుంచి రక్షణగా పెద్ద బూట్లు ధరించిన ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’లోని మహిళలు అడవులలో తిరుగుతుంటారు. ప్రమాదంలో ఉన్న మొక్కలు, చెట్లను రక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. సహజ పదార్థాల నుంచి పురుగు మందులను తయారుచేస్తుంటారు. అడవి గుండె చప్పుడు విని... దిల్లీలో పెరిగిన సుప్రభా శేషన్... కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలోని బ్రోక్వుడ్ పార్క్ సెంటర్ (యూకే)లో చదువుకుంది. అక్కడ ఉన్నప్పుడు తొలిసారిగా కేరళలోని ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ గురించి విన్నది. ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, పార్క్ ల్యాండ్ల చరిత్రపై ప్రాజెక్ట్ చేస్తున్న సుప్రభ శేషన్‌ని కేరళలోని ‘గురుకుల’ ఆకర్షించింది. అమెరికాలోని ల్యాండ్ ఇనిస్టిట్యూట్‌లో ఒక సంవత్సరం పాటు అధ్యయన కార్యక్రమాల్లో భాగం అయిన సుప్రభ ఆ తరువాత మన దేశంలోని ఆదివాసీ గూడేలలో మకాం వేసి అడవుల గుండె చప్పుడు విన్నది. తన ప్రయాణంలో భాగంగా ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ (జీబిఎస్) వ్యవస్థాపకుడు వోల్ఫ్ గాంగ్‌ను కలిసింది. ‘జీబీఎస్’ ద్వారా అడవులను రక్షించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకుంది. అలా లాలీ జోసెఫ్, సుమ కెలోత్లాంటి ఇతర ‘జీబియస్’ సభ్యులతో కలిసి అడవిబాట పట్టింది. పశ్చిమ కనుమలలోని పర్వతాలను అధిరోహించింది. అంతరించిపోతున్న మొక్కల జాతుల గురించి తెలుసుకోవడమే కాదు వాటి పరిరక్షణలో భాగంగా ‘జీబియస్’గా గార్డెనర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ నల్లని రాళ్లలో.. ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’లోని సీనియర్ గార్డెనర్ అయిన లాలీ జోసెఫ్, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కల కోసం అన్వేషిస్తుంటుంది. గురుకులంలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ద్వారా వాటిని బతికించే ప్రయత్నం చేస్తుంది. కొండ, కోనలు తిరుగుతూ మొక్కల యోగక్షేమాలు తెలుసుకుంటుంది. -
Aarzoo Khurana: ఆమె ఉన్న చోట పులి ఉంటుంది
మన దేశంలో దాదాపు 55 టైగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. వాటన్నింటినీ తన కెమెరాలో నిక్షిప్తం చేసింది ఆర్జూ ఖురానా. సరిగా చెప్పాలంటే పులి ఉన్న చోటల్లా ఆమె ఉంటుంది. వృత్తి రీత్యా అడ్వకేట్ అయినా ఆ పని మానేసి కెమెరాను నేస్తంగా అడవిని నివాసంగా చేసుకుని తిరుగుతూ ఆమె తీస్తున్న ఫొటోలు పెద్ద గుర్తింపునిచ్చాయి. ఆర్జూ పరిచయం. అక్టోబర్ 1, 2023 నుంచి నేటి వరకూ 29 ఏళ్ల ఆర్జూ ఖురానా అడవుల్లోనే ఉంటూ వందల మైళ్లు తిరుగుతూ ఉందంటే నమ్ముతారా? నిజం. ‘ఆల్ టైగర్ రిజర్వ్స్ ప్రాజెక్ట్’ (ఏటిఆర్) కోసం ప్రభుత్వం అప్పజెప్పిన పనిలో ఆమె తలమునకలుగా నిమగ్నమైంది. మన దేశంలో 55 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటికే టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. మిగిలిన వాటిని కూడా అందంగా ఫొటోలలో బంధించి, ప్రచారానికి ఉపయోగించి, టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు నిర్దేశించిన ప్రాజెక్టే ఏ.టి.ఆర్. దానిలో భాగంగా అక్టోబర్ 1న రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్‌తో మొదలెట్టి మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 43 టైగర్ రిజర్వ్‌లను కవర్ చేసి మరో రెండు నెలల్లో మిగిలినవి చేసి ఆఖరున నైనిటాల్లో ఉన్నా జిమ్ కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఫొటోలు తీయడం ద్వారా ఆమె పని ముగిస్తుంది. ‘రోజుకు 14 గంటలు పని చేస్తున్నాను. మానసికంగా శారీరకంగా చాలా కష్టమైనది ఈ పని. కాని ఇందులో నాకు ఆనందం ఉంది’ అంటుంది ఆర్జూ ఖురానా. లా చదివి ‘మాది ఢిల్లీ. మా నాన్నకు నేను అడ్వకేట్ కావాలని కోరిక. నాకేమో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కావాలని చిన్నప్పటి నుంచి కల. ఒక్కతే కూతురుని. అడవుల్లో కెమెరా పట్టుకుని తిరగడానికి అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. నాన్న కోసం లా చేశాను కాని చివరకు ఒప్పించి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ని అయ్యాను. ఇందుకోసం నేను ఢిల్లీలో బేసిక్ ఫొటోగ్రఫీ కోర్సును చేశాను. కాని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వేరు. దానికి వేరే శిక్షణ కావాలి. నెట్లో వెతికితే సుధీర్ శివరామ్ అనే ప్రసిద్ధ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ మాలాంటి వారి కోసం క్యాంప్స్ నిర్వహిస్తారని తెలిసింది. ఆయన రాజస్థాన్‌లోని భరత్పూర్ రిజర్వ్‌ఫారెస్ట్‌లో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ క్యాంప్ నిర్వహించినప్పుడు హాజరయ్యి పని కొంత తెలుసుకున్నాను. రెండు సారస్ కొంగల సరదా సంప్రదింపులను నేను మొదటిసారి ఫొటో తీశాను. అది అందరికీ నచ్చింది. ఆ క్షణమే అనుకున్నాను... అరణ్యానికి జనారణ్యానికి మధ్య వారధిగా నేను ఉండగలను అని. అడవుల్లో ఉండే పక్షులు జంతువుల తరఫున వకాల్తా పుచ్చుకోగలను అని’ అంటుంది ఆర్జూ ఖురానా. కలిసి బతకాలి ‘మనుషులు కలిసి బతకడానికి కష్టపడుతుంటారు. అడవుల్లో తిరిగితే వందల వేల జీవులు ఎలా ఒకదానితో ఒకటి కలిసి బతుకుతాయో తెలుస్తుంది. అవి మనతో కూడా కలిసి బతకాలనే అనుకుంటాయి. కాని మన స్వార్థం కోసం అడవులు ధ్వంసం చేస్తూ వాటిని నాశనం చేస్తున్నాం. గత 50 ఏళ్లలో భూమి మీద ఉన్న జంతువులలో 50 శాతం నశించిపోయాయంటే నమ్ముతారా? ఇది నిజం. మనలో ప్రతి ఒక్కరం అడవుల పరిరక్షణకు, తద్వారా వన్యప్రాణి పరిరక్షణకు పూనుకోవాలి. లేకపోతే మిగిలేదేమీ ఉండదు. ఒక పులి ఉండదు. ఒక నక్కా కనిపించదు’ అంటోంది ఆర్జూ ఖురానా. -
సామాజిక వనాల్లో కాసుల వేట
♦ మొక్కలన్నీ లెక్కల్లోనే.. ♦ ఏడాదికి కోటి మొక్కల పంపిణీ లక్ష్యం ♦ మూడో వంతు కూడా సరఫరా కాని వైనం ♦ అన్నీ కాకి లెక్కలు ♦ మొక్కల పెంపకం పేరుతో నిధుల స్వాహా ♦ నేడు ప్రపంచ అటవీ దినోత్సవం సామాజిక వనాల్లో మొక్కల పెంపకం పేరుతో లక్షలు కాజేస్తున్నారు. రికార్డుల్లో లక్షలాది మొక్కలు నాటినట్లు చూపుతున్నా..వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. సరైన పర్యవేక్షణ లేక నర్సరీల్లో అరకొరగా పెంచినవీ ఎండుముఖం పట్టారుు. కోటి మొక్కలు పెంచాలన్నది లక్ష్యం కాగా..పట్టుమని 30 లక్షల మొక్కలు కూడా పంపిణీ కాలేదంటే అవినీతి ఏ స్థారుులో ఉందో అర్థమవుతుంది. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని సామాజిక వనాలపై కథనం.. సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ ఒంగోలు క్రైం: అటవీ శాఖలో సామాజిక వనాల పెంపకం ప్రహసనంగా మారుతోంది. లెక్కల్లో కోట్ల మొక్కలు నాటినట్లు చూపుతున్నా రోడ్లపై మొక్కలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకూ జిల్లాలో నాటిన మొక్కల్లో సగం బతికినా జిల్లా మొత్తం పచ్చదనం పరుచుకునేది. ఒకపక్క విలువైన వృక్ష సంపదను నరికి యథేచ్ఛగా మార్కెట్‌కు తరలిస్తూనే, మరోపక్క సామాజిక వనాల అభివృద్ధి పేరుతో లక్షలు కాజేస్తున్నారు. వేల హెక్టార్లలో మొక్కలు నాటినట్లు కాగితాలపై లెక్కలు చూపిస్తున్నా వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. జిల్లాలో 50 నర్సరీలు ఏర్పాటు చేసి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు 13వ ఆర్ధిక సంఘం నిధులు భారీగా కేటాయించారు. కోటి మొక్కల పెంపకం పథకం కింద సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. జరుగుతోంది ఇదీ... అధికారులు మాత్రం తూ తూ మంత్రంగా మొక్కలు పెంచి అక్రమాలకు పాల్పడుతున్నారు. కనీసం ఏడాదికి 30 లక్షల మొక్కలు కూడా పంపిణీ కావడం లేదన్న విమర్శలున్నాయి. లక్షల నిధులు ఖర్చయినా నర్సరీ నుంచి మొక్క బయటకు పోతే ఒట్టు. రికార్డుల్లో మాత్రం మొక్కలు పంపిణీ చేసినట్లు చూపిస్తూ మొలకెత్తని బెడ్లను పాలిథిన్ కవర్లను ట్రాక్టర్‌తో తొలగించి మొక్కలు పంపిణీ చేసినట్లు అధికారులను వేధించటం పరిపాటిగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, దేవాలయాల ఆవరణ, ఎస్సీల పొలాల్లో మొక్కలు పెంచుకునేందుకు పంపిణీ చేశారు. అయితే మొక్కలు నాటిన తరువాత వర్షాలు లేక పోవటం, నీరు అందకపోవటం, రక్షణ లేక అక్కడక్కడా కొన్ని మొక్కలే బతికి ఉన్నాయి. మిగిలినవన్నీ అక్కడ మొక్కలు నాటారంటే నమ్మే పరిస్థితి కూడా లేదు. ♦ కనిగిరి నియోజకవర్గంలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని కొన్ని చోట్ల మొక్కలు పచ్చగా ఉన్నా, సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలోని నర్సరీల్లో మొక్కల పెంపకం కాగితాలకే పరిమితమైంది. 15 రకాల మొక్కలను ప్రతి ఏడాది ఒక్కో నర్సరీలో 3 వేల చొప్పున ఏడాదికి మూడు లక్షలు పెంచుతున్నట్లు లెక్కలు చూపిస్తూ అధికారులు నిధులు దిగమింగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కనిగిరి నుంచి హనుమంతునిపాడు, వేములపాడు ఘాట్ వరకు నాటిన మొక్కలు నిలువునా ఎండిపోయాయి. హాజీపురం సోషల్ ఫారెస్టులో మొక్కలు పెంచేందుకు ఏర్పాటు చేసిన సిమెంటు బెడ్లు పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగి అధికారుల నిర్లక్ష్యానికి దర్పణంగా మారాయి. ♦ సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఒక్క చీమకుర్తి మండలంలో మాత్రమే అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. చీమకుర్తి మండలం దేవరపాలెం రేంజ్ దాదాపు 5 వేల హెక్టార్ల భూములుంటే కేవలం పల్లామల్లి ఏరియాలోని 50 హెక్టార్లలో మాత్రమే జామాయిల్ మొక్కలు వేసినట్లు అటవీ రేంజర్ వెంకటరావు చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపుగా 70 వేల మొక్కలు నాటినట్లు చూపుతున్నా పదిశాతం మొక్కలు కూడా బతికిన దాఖలాలు లేవు. ♦ గిద్దలూరు నియోజకవర్గంలోని 65 పాఠశాలల్లో 12,500 మొక్కలు పంపిణీ చేశారు. అరకొర పాఠశాలల్లో మినహా ఎక్కువ పాఠశాలల్లో మొక్కలు జీవం పోసుకోలేదు. కంభం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా గతేడాది ఒక్కో విద్యార్థికి ఒకటి చొప్పున 310 మొక్కలు నాటారు. 80 మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో అసలు మొక్కలే కనిపించవు. ఒక్కో మొక్కకు సుమారు రూ.15 నుంచి రూ.25ల వరకు ఖర్చు చేశారని దాదాపు రూ.2.50 లక్షల వరకు నిధులు వృథా చేసినట్లు ఆరోపణలున్నాయి. ♦ మార్కాపురం నియోజకవర్గంలో తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువులో ఏర్పాటు చేసిన నర్సరీలో 50 వేల మొక్కలు పెంచినట్లు ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. మొదటి విడతగా 50 వేల మొక్కలు నాటాల్సి ఉండగా 20 వేల ఎర్రచందనం మొక్కల స్టమ్స్ను ప్రభుత్వం పంపిణీ చేసింది. అవి నాసిరకంగా ఉండటంతో నాటిన కొద్ది రోజులకే చనిపోయాయి. అదే కవర్లలో వాటి స్థానంలో అధికారులు హడావుడిగా బొప్పాయి, మునగ విత్తనాలు నాటారు. అవి బతకలేదు. దీంతో లక్షల ధనం వృథా అయింది. కొనకనమిట్ల మండలంలో పాతపాడు- కనిగిరి మండలం బడుగులేరు వరకు మొక్కలు నాటేందుకు రూ.47 లక్షలు, పెదారికట్ల- ఇరసలగుండం వరకు మొక్కలు నాటేందుకు రూ. 27 లక్షలు వెచ్చించారు. అవి కాక స్థానిక నర్సరీ కేంద్రాల నుంచి మొక్కలు నాటారు. లక్షలు ఖర్చు పెట్టి నాటారు కాని 10 శాతం మొక్కలు ఉపయోగంలోకి రాలేదు. ♦ అద్దంకి నియోజకవర్గం బల్లికురవ, సంతమాగులూరు, కొరిశపాడు, జే పంగులూరు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూముల్లో, రోడ్ల వెంట, చెరువు గట్లు, పొలం గట్ల వెంట నిమ్మ, మామిడి, బత్తాయి, ఖర్జూర, మలబారు వేప, సపోట లాంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టారు. గత సంవత్సరం నాటిని మొక్కల పరిస్థితిని గమనిస్తే అద్దంకి మినహా మిగిలిన మండలాల్లో ఎక్కువ శాతం మొక్కలు మరణించినట్లు క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలింది. కాలం కాని కాలంలో నాటడం వలన మొక్కలు చనిపోయాయని అధికారులు చెబుతున్నారు. ♦ దర్శి నియోజకవర్గంలో దొనకొండ, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, తాళ్లూ రు మండలాల్లో 20 వేల మొక్కలు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, పంచాయతీల్లో పంపిణీ చేశారు.మొక్క లు నాటిన వారు వాటి సంరక్షణను విస్మరించారు. ఫలితంగా అవి పెరుగుదలకు నోచుకోలేదు. వన మహోత్సవం సందర్భంగా అటవీశాఖ టేకు, వేప, కానుగ, మునగ, బొప్పాయి, గోరింట, శీతాఫలం మొక్కలను అందజేసింది. అందుకు సంబంధించిన నిధులను డ్రా చేశారు. ఈ మొక్కల్లో పది శాతం కూడా బతకలేదు. ♦ కొండపి నియోజకవర్గం మర్రిపూడి 14 పంచాయతీల్లో 6 రకాల మొక్కలైన మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, సపోట, సీతాఫల్ తదితర 14 వేల మొక్కలు ఇచ్చారు. అయితే సంరక్షణ లేకపోవడంతో చాలా వరకు మొక్కలు చనిపోయాయి. కొండపి మండలం వావిలేటిపాడు, మర్లపాడు, కొత్తపట్నం, టపాచెట్టు నర్సరీల నుంచి మండలానికి 1600 నీడ మెక్కలను అందించారు. కడియం నర్సరీ నుంచి 10 వేల పండ్ల మొక్కలను తెప్పించారు. ♦ కందుకూరు నియోజకవర్గంలో ప్రధానంగా గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లో అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. చుండి, మాలకొండ గ్రామాల వద్ద 25 హెక్టార్ల చొప్పున మొత్తం 50 హెక్టార్లలో 60 వేల జామాయిల్ మొక్కలు నాటినట్లు రేంజర్ చెబుతున్నారు. అయితే వీటిలో కొంత వరకు మొక్కలు ఎండిపోయాయి. అలాగే ఉలవపాడు మండలంలో 20,800 మొక్కలు పాఠశాలలో నాటినట్లు లెక్కలు చూపిస్తున్నా వీటిలో 10 శాతం మొక్కలు కూడా బతికిన దాఖలాలు లేవు. పాకలరోడ్డు, పాజర్ల, ఊళ్లపాలెం రోడ్డుల్లో 1800 మొక్కలు నాటినట్లు చెప్తున్నారు. వీటి ఆనవాళ్ల ప్రస్తుతం కానరావడం లేదు. లక్ష్యం ఇదీ... జిల్లాలో ఏడాదికి కోటి మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఉద్దేశం నీరుగారుతోంది. ఎన్ఆర్ఈజీఎస్ పథకంతో పాటు నీరు-చె ట్టు పథకాల కింద జిల్లాలో మొత్తం 50 నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అవి సామాజిక అటవీ శాఖతో పాటు టెర్రిటోరియల్, వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ విభాగాల్లోనూ నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలి. వాటిని గ్రామాల్లో నాటడానికి అవసరం అని అడిగిన వెంటనే వాటిని సరఫరా చేయాలి. సామాజిక అటవీ శాఖ పరిధిలో నాలుగు రేంజ్ కార్యాలయాలున్నాయి. ఒంగోలు, మేదరమెట్ల, పొదిలి, మార్కాపురం రేంజ్ కార్యాలయాల పరిధిలో రేంజర్లు నర్సరీల నిర్వహణ చేపట్టాల్సి ఉంది. వీటితో పాటు గిద్దలూరు రెగ్యులర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో 10 నర్సరీల్లో మొక్కలు పెంచాలి. అదేవిధంగా మార్కాపురం వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ పరిధిలోనూ 10 నర్సరీల్లో మొక్కలు పెంచాలి. మొత్తం మీద ప్రతి ఏడాది కోటి మొక్కల చొప్పున పెంచి లక్ష్యాన్ని చేరుకోవాలన్నది అధికారుల లక్ష్యం. ప్రధానంగా నర్సరీల్లో టేకు, ఎర్రచందనం మొక్కలతో పాటు దాదాపు 12 రకాల మొక్కలు పెంచి ప్రజలకు అవసరమైన మేరకు అందించాలి.