అక్షరం
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం
వైశాలి ష్రాఫ్ చేతిలో మంత్రదండం ఉంది. ఆ మంత్రదండం అడవులను బడులకు రప్పించగలదు. అలనాటి రాక్షస బల్లులతో ఈనాటి పిల్లలను మాట్లాడించగలదు. ఆ మంత్రదండం పేరు కలం.
ముంబైకి చెందిన వైశాలి ష్రాఫ్ పర్యావరణ సంబంధిత విషయాలపై పిల్లల్లో అవగాహన కలిగించడానికి ఎన్నో పుస్తకాలు రాసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్‌లు అందుకుంది...
నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్(సిఎన్‌పీ)కి వెళ్లి వచ్చిన తరువాత వైశాలికి ‘సీతాస్ చిత్వాన్’ అనే పుస్తకం రాయడం ప్రారంభించింది. ఈ పార్క్‌కు వెళ్లడానికి ముందు తన కుటుంబంతో కలిసి మన దేశంలోని ఎన్నో జాతీయ పార్క్‌లను చూసింది వైశాలి. ఏ పార్క్‌కు వెళ్లినా అందులోని జీవవైవిధ్యం తనకు బాగా నచ్చేది.
సాలె పురుగుల నుంచి పెద్ద పిల్లుల వరకు ఏనుగుల నుంచి ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే చెట్ల వరకు తనను అమితంగా ఆకట్టుకునేవి.
‘ప్రకృతిని కాపాడుకుంటేనే బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు’ అనే సత్యాన్ని పిల్లలకు బోధ పరచడానికి ‘సీతాస్ చిత్వాన్’ పుస్తకం రాసింది.
‘పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చిత్తశుద్ధి ఉంటే అడవులను తద్వారా రాబోయే తరాలను కాపాడుకోవచ్చు. అడవి ఒక పాఠశాల. సహనంతోనూ, సాహసోపేతంగా ఉండడాన్ని నేర్పుతుంది. జీవరాశుల పట్ల సానుభూతి కలిగి ఉండడాన్ని నేర్పుతుంది’ అని ‘సీతస్ చిత్వాన్’ ద్వారా చెబుతుంది వైశాలి.
ప్రాపంచిక, పర్యావరణానికి సంబంధించిన విషయాల గురించి తగిన సమాచారంతో ఫిక్షన్ ఫార్మట్‌లో చెప్పడం వైశాలికి ఇష్టం. ఈ ఫార్మట్‌లో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆకట్టుకునే క్యారెక్టర్‌లను సృష్టించింది.
పిల్లలు పుస్తకంలోని పాత్రలతో కనెక్ట్ కావడమే కాకుండా పర్యావరణానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటారు.
తన బామ్మ నుంచి పుస్తక పఠనాన్ని అలవర్చుకుంది వైశాలి.
వైశాలి స్కూల్ రోజుల్లో... తన బామ్మ ఒక మూలన కుర్చీలో కూర్చుని ఏదో ఒక పుస్తకం సీరియస్‌గా చదువుతూ కనిపించేది. బామ్మను అనుకరిస్తూ వైశాలి కూడా ఏదో కథల పుస్తకం చదువుతూ కూర్చునేది. మధ్య మధ్యలో బామ్మను ఆసక్తిగా చూసేది. ఈ అనుకరణ కాస్తా ఆ తరువాత పుస్తకాలు చదివే అలవాటుగా మారింది. ఆ అలవాటే తనని పిల్లల రచయిత్రిని చేసింది.
‘ఫిక్షన్, నాన్ ఫిక్షన్‌లలో నాన్ ఫిక్షన్ రాయడమే కష్టం. నాన్ ఫిక్షన్ పుస్తకాల కోసం బోలెడు సమాచార సేకరణ చేయాల్సి ఉంటుంది’ అంటుంది వైశాలి. మన దేశంలోని రాక్షస బల్లుల గురించి సాధికారమైన సమాచారంతో ఆమె రాసిన ‘బ్లూథింగోసారస్’ నాన్–ఫిక్షన్ పుస్తకానికి ఎంతో మంచి స్పందన వచ్చింది.
వివిధ రకాల వ్యక్తీకరణల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి, కనెక్ట్ కావడానికి భాషలు వీలు కల్పిస్తాయి. వైశాలి తాజా పుస్తకం ‘తాతుంగ్ తతుంగ్ అండ్ అదర్ అమేజింగ్ స్టోరీస్’ పుస్తకం భారతీయ భాషల విస్తృతి, లోతు గురించి పిల్లల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మాతృభాషల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. గుహ గోడలపై ఉన్న చిత్రలిపి నుంచి పురాతన, సమకాలీన స్థానిక భాషలకు సంబంధించిన వివరాలు ఈ పుస్తకంలో ఉంటాయి.
‘తాతుంగ్ తతుంగ్... మన దేశపు అద్భుతమైన భాషా సంప్రదాయాన్ని కళ్లకు కడుతుంది. భాషలు, వాటి గొప్ప వారసత్వాలు కనుమరుగు కాకూడదని హెచ్చరిస్తుంది. ఈ పుస్తకం చదవడం ద్వారా పిల్లలకు తమ మాతృభాష పట్ల మరింత అభిమానం పెరుగుతుంది’ అంటారు రచయిత, రాజకీయ నాయకుడు శశిథరూర్.
‘భిన్నమైన విషయాల గురించి భిన్నమైన పద్ధతుల్లో రాయడం ఇష్టం’ అంటున్న వైశాలి ష్రాఫ్ పిల్లల కోసం మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment