
ఆటల్లో ఆణిముత్యం ఆటకు ప్రతిభ మాత్రమే కాదు సాధన కూడా ముఖ్యమే. తన ప్రతిభకు
నిరంతర సాధన జోడించి జంప్ రోప్ నుంచి జోడో వరకు ఎన్నో ఆటల్లో అద్భుత విజయాలు సాధిస్తోంది వనిపెంట శ్రావణి. తాజాగా నేపాల్‌లో నిర్వహించిన ఇండో–నేపాల్ జంప్ రోప్ చాంపియన్ షిప్ 2025 టోర్నమెంట్‌లో రెండు బంగారుపతకాలు సాధించి సత్తా చాటింది...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన వనిపెంట శ్రావణి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కలిగిరిలో చిన్న కూరగాయల దుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. రెండో కుమార్తె శ్రావణి చదువుల్లో ముందుంటూనే క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది.
ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు ఆటలపై శ్రావణికి ఉన్న ఆసక్తిని అప్పటి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్, ప్రస్తుత నెల్లూరు జిల్లా జంప్ రోప్ సెక్రటరీ జి.మురళి గుర్తించారు. ఎంతో ప్రోత్సహించారు. మురళి సూచనలు, సలహాలతో శ్రావణి జంప్ రోప్ క్రీడతో పాటు షూటింగ్ బాల్, టార్గెట్ బాల్, జూడోలో ప్రావీణ్యం సాధించింది.
శ్రావణి ఏ టోర్నమెంట్‌లో పాల్గొన్నా పతకాలు సాధించడమే లక్ష్యంగా ప్రతిభ చూపేది. ఇప్పటి వరకు జంప్ రోప్‌లో జిల్లా స్థాయిలో 10, జాతీయ స్థాయిలో 5 గోల్డ్, ఒక సిల్వర్, అంతర్జాతీయ స్థాయిలో రెండు బంగారు పతకాలు సాధించింది. 2023లో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ టోర్నమెంట్‌లో రన్నర్‌గా నిలిచింది. నేపాల్‌లో నిర్వహించిన ఇండో–నేపాల్ జంప్ రోప్ చాంపియన్ షిప్ 2025 టోర్నమెంట్‌లో రెండు బంగారు పతకాలు సాధించి సత్తాచాటింది.
ఐపీఎస్ కావడమే లక్ష్యం
ప్రాక్టీస్ చేయడం నుంచి పోటీల్లో పాల్గొనడం వరకు ఆటల్లో ఉండే ఉత్సాహమే వేరు. ఆటలు ఉత్సాహాన్నే కాదు శక్తిని ఇస్తాయి. జీవితంలో లక్ష్యాన్ని ఏర్పర్చుకునేలా చేస్తాయి. ఆటల్లో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు గెలుచుకోవాలనుకుంటున్నాను.
బాగా చదివి ఐపీఎస్ సాధించాలని ఉంది. మంచి పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకుంటాను. అమ్మ,నాన్న అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుండడంతో బాగా చదవడం తోపాటు క్రీడల్లో రాణించగలుగుతున్నాను.
– రావుల రాజగోపాల్‌రెడ్డి,
సాక్షి, కలిగిరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
(చదవండి: లెడ్‌లైట్ థెరపీ: అన్ని రోగాలకు దివ్యౌషధం..! )
Comments
Please login to add a commentAdd a comment