పులుల కోసం ఊళ్లు ఖాళీ
కవ్వాల్ అభయారణ్యం నుంచి గిరిజనుల తరలింపునకు రంగం సిద్ధం
జన్నారం: తరతరాలుగా అడవితల్లిని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులు ఉన్నపళంగా జనారణ్యంలోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పులుల సంరక్షణ పేరిట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అడవిబిడ్డలకు శాపంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా జన్నారం అటవీ డివిజన్‌లోని కవ్వాల్ అభయారణ్యం పులుల రక్షిత కేంద్రం (టైగర్ జోన్)లో ఉన్న గిరిజన గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. గిరిజన సంఘాల ఆవేదనను పట్టించుకోకుండానే గిరిపుత్రులను పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు సర్కారు సమాయత్తమవుతోంది. అయితే గిరిజనులు మాత్రం తాము కోరిన ‘పరిహారం’ ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని.. లేకుంటే ఎక్కడికీ వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు.
2012లో కేంద్రం జీవో...
కవ్వాల్ అభయారణాన్ని పులుల రక్షిత కేంద్రంగా గుర్తిస్తూ 2012 ఏప్రిల్ 10న కేంద్ర ప్రభుత్వం జీవో 27 విడుదల చేసింది. పులులు తిరిగేందుకు ఎలాంటి అలజడి ఉండకూడదనే ఉద్దేశంతో అడవిలోని గిరిజన గ్రామాలకు పునరావసం కల్పిస్తూ వారిని అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించింది. పులుల రక్షిత ప్రదేశంలోని అలీనగర్, దొంగపల్లి, మల్యాల గ్రామాలతోపాటు కడెం మండలంలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను తరలించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు పునరావాస కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు.
అధికారుల సర్వే..
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అధ్యక్షతన ఈ నెల 17న టైగర్ జోన్‌లోని గిరిజన గ్రామాల ప్రజలకు పునరావసం కల్పించడంపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేసీ సుందర్ అబ్నార్, ఐటీడీఏ పీవో కర్ణన్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ అద్వైత్ సింగ్, మంచిర్యాల ఆర్డీవో అయేషా ఖనమ్, డీఎప్‌వో రవీందర్‌తోపాటు పలువురు గిరిజనులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మంచిర్యాల ఆర్డీవో ఖనమ్ జన్నారం, దండేపల్లి తహసీల్దార్లు సంపతి శ్రీనివాస్, కుమారస్వామి టైగర్ జోన్‌లోని మల్యాల, అలీనగర్, దొంగపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించారు.
ఒక్కో గ్రామంలో ఎంత మంది గిరిజనులున్నారు.. ఒక్కొక్కరికీ ఎంత భూమి ఉంది... ఇందులో 18 ఏళ్లు దాటిన వారు ఎంత మంది ఉన్నారు వంటి అంశాలపై సర్వే చేపట్టి అలీనగర్ లో 65, దొంగపల్లిలో 69, మల్యాలలో 60 కుటుంబాలను గుర్తించారు. అలాగే ఈ గ్రామాల నుంచి వెళ్లిన వారి భూముల వివరాలను కూడా సేకరించారు. కడెం మండలంలోని మైసంపేట్, రాంపూర్‌లలో ఇంకా సర్వే జరగాల్సి ఉంది. ఏప్రిల్ 10న రెండోసారి సమావేశం అనంతరం పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఇప్పటికే సర్వే పూర్తిచేసి కుటుంబాలను కూడా గుర్తించారు. మూడు గ్రామాల్లోని గిరిజనేతర కుటుంబాలు అడవుల నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా.. 11 పెంటలకు చెందిన గిరిజనులు ససేమిరా అంటున్నారు.
పునరావాసం ఎలా..?
టైగర్ జోన్ పరిధిలోని గిరిజన గ్రామాలకు పునరావాసం కల్పించేందుకు విడుదల చేసిన జీవో ప్రకారం 18 ఏళ్లు పైబడి ఉన్న వారిని వేరే కుటుంబంగా లెక్కిస్తారు. ప్రతి కుటుంబానికి మొదటి అవకాశంగా రూ. 10 లక్షలు.. రెండో అవకాశంగా వ్యవసాయ భూమితోపాటు ఇల్లు నిర్మించి కాలనీ ఏర్పాటు చేసి వసతులు కల్పిస్తారు. అయితే ఈ ప్యాకేజీని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. తమకు మండలంలోని బొమ్మెన గ్రామ సమీపంలో భూమి ఇవ్వాలని, అక్కడే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అలీనగర్ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
బలవంతం వద్దు
గిరిజనులను వెళ్లమని బలవంతం చేయవద్దు. వారు వెళ్లడానికి సిద్ధంగా ఉంటేనే ప్రభుత్వ ప్యాకేజీ ఇచ్చి పంపియ్యాలే. గిరిజనులు బొమ్మెన పక్కన గల భూమి కావాలంటున్నారు. ఇక్కడ అనుకూలంగా ఉంది. వేరే చోట ఇస్తే ఇబ్బంది పడుతరు. అందుకే ఇక్కడే భూమి ఇచ్చేలా చూడాలి.
- కుర్ర పోశం, మల్యాల గ్రామ సర్పంచ్
పైసలే ం చేసుకుంటం..
ఇక్కడి నుంచి ఎల్లిపోతే పైసలిస్తమంటున్నరు.. పైసలిస్తే కొన్ని రోజుల్లో అయిపోతయ్.. మా పోరగాండ్లు, కుటుంబం బతికేదెట్ల.. మాకు ఇక్కడెంత భూమి ఉందో అంత భూమి ఇయ్యాలే. అప్పుడే ఇక్కడ్నుంచి కదులుతం.
- మడావి గంగరాం, అలీనగర్
ఎవరినీ బలవంత పెట్టం
పునరావసం కల్పించడంలో ఎవరినీ బలవంత పెట్టట్లేదు. వారికి ఇష్టమైతేనే ఇక్కడి నుంచి వెళ్లమంటున్నాం. ప్రభుత్వ ప్యాకేజీ ఇస్తాం. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అన్ని పరిశీలించి, ఎవ్వరినీ నొప్పించకుండా, బలవంతం చే యకుండా వారి ఇష్టప్రకారమే పునరావసం కల్పిస్తాం.
- రవీందర్, డిప్యూటీ డెరైక్టర్, టైగర్ జోన్
భూమి ఇయ్యాలే..
మాకు ఇక్కడ నాలుగెకరాల భూమి, ఇల్లు ఉంది. ఇక్కడి నుంచి పోవాలని అంటున్నారు. మేము ఇక్కడి నుంచి పోయిన ఇక్కడ ఎంత భూమి ఉందో అంత భూమి ఇవ్వాలి. అంతే కాని పైసలిచ్చి పొమ్మంటే పోయేది లేదు.
- మడావి నాగుబాయి, అలీనగర్