ట్రైబల్‌ కథల్‌ | tribal story upcoming movies in Tollywood | Sakshi
Sakshi News home page

ట్రైబల్‌ కథల్‌

Jul 17 2024 12:12 AM | Updated on Jul 17 2024 4:20 PM

tribal story upcoming movies in Tollywood

ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడతాయి... సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం ఓ వ్యక్తి పోరాటం చేస్తాడు... తమ హక్కుల కోసం పోరాటం చేస్తాడు ఓ గిరిజన తెగ నాయకుడు... ఓ తెగకు చెందిన వ్యక్తి శివభక్తుడిగా మారతాడు... సినిమా పాయింట్‌ ఏదైనా ఈ సినిమాలన్నింటిలోనూ కామన్‌ పాయింట్‌ ‘ట్రైబల్‌’ నేటివిటీ. ఇలా ట్రైబల్‌ కథల్‌తో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

‘కాన్సార్‌ ఎరుపెక్కాలా...’ అంటూ ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ చిత్రంలో ప్రభాస్‌ చెప్పిన డైలాగ్స్‌కి అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల కేకలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్‌’. విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ గత ఏడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాన్సార్‌ సింహాసనం కోసం శౌర్యాంగ, ఘనియార్‌ తెగలు పోటీపడటం, వారికి దక్కకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం మన్నార్‌ తెగకు చెందిన రాజ మన్నార్‌ చేసే ప్రయత్నం... ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం మొదటి భాగంలో చూశాం. చివరికి ఏ తెగవారు కాన్సార్‌ సింహాసనం చేజిక్కించుకున్నారనేది తెలియాలంటే మలి భాగం ‘సలార్‌: శౌర్యాంగపర్వం’ విడుదల వరకూ ఆగాల్సిందే. ఇంకా సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌ ఆరంభం కాలేదు.   

‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర’ కోసం ఎన్టీఆర్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ సినిమా బ్యాక్‌డ్రాప్‌ ఏంటో చెప్పింది. ‘జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న  ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ్రపాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. ఈ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది.  

‘చావుని ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం’ అంటూ ‘తంగలాన్‌’ మూవీ ట్రైలర్‌లో హీరో విక్రమ్‌ చెప్పిన డైలాగ్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. పా. రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ‘తంగలాన్‌’. కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాలతో ఈ  చిత్రం రూపొందింది. బంగారు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్‌ నటించారట. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్‌ కానుంది.  

సూర్య హీరోగా నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమాలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్‌ సాయంతో తన మిషన్‌ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్‌ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్‌ ట్రావెల్‌ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్‌. ఈ సినిమా అక్టోబర్‌ 10న విడుదల కానుంది.  

మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌ బాబు, అక్షయ్‌ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ఓ తెగకు చెందిన తిన్నడు (ఆ తర్వాత శివ భక్తుడు కన్నప్పగా మారారు) పాత్ర చేస్తున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో తిన్నడు వాడిన విల్లు విశిష్టత గురించి ఇటీవల మేకర్స్‌ తెలిపారు. తన బిడ్డ తిన్నడు ధైర్యసాహసాలకు ముగ్దుడైన నాద నాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సాగే సీన్స్‌ ఆసక్తిగా ఉంటాయట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement