
కడెం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్‌లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ మంగళవారం కనిపించింది. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని దోస్త్‌నగర్ అటవీ ప్రాంతంలో దీన్ని గుర్తించినట్లు డీఆర్వో ప్రకాశ్, ఎఫ్‌బీవో ప్రసాద్ తెలిపారు.
‘కలౌల పుల్చ్రా’అని పిలువబడే ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ మైక్రో హాలిడే కుటుంబంలో భాగమైన ఒక చిన్న ప్రత్యేకమైన ఉభయచర జీవి అని డీఆర్వో ప్రకాశ్ చెప్పారు. గుండ్రని శరీరం విలక్షణమైన (గోధుమ, నారింజ, లేదా పసుపు) రంగు కలిగి ఉంటుందన్నారు. ఈ కప్పలు సాధారణంగా అడవుల నుంచి వ్యవసాయ భూములు, నీటి వనరుల ఉన్న చోట ఆవాసం ఏర్పచుకుంటాయని తెలిపారు.
ఈ కప్పల ప్రధాన ఆహారం కీటకాలని, ఇవి రాత్రి పూట సంచరిస్తూ జిగట నాలుకతో కీటకాలను వేటాడి ఆహారంగా తీసుకుంటాయని వివరించారు. పగలు వీటిని గుర్తించడం కష్టమన్నారు. విభిన్న వన్య ప్రాణులకు నిలయమైన కవ్వాల్ టైగర్ జోన్‌లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ కనిపించడం జీవ వైవిధ్యానికి దోహదం చేస్తుందని డీఆర్వో ప్రకాశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment