నాలుగు నెలలుగా కవ్వాల్‌లో కనిపించని వైనం..
టైగర్‌జోన్‌లో ప్రతికూల వాతావరణం
ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటుందని అభిప్రాయం
జన్నారం : కవ్వాల్ అభయారణ్యంలో పులి జాడ లేకుండా పోయింది. టైగర్‌జోన్‌లో ఏర్పడిన ప్రతికూల వాతావరణం కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జన్నారం అటవీ డివిజన్ కవ్వాల్ అభయారణ్యాన్ని దేశంలో 42వ పులుల రక్షిత ప్రదేశంగా కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్‌లో గుర్తించింది. పులికి అనుకూలమైన ప్రదేశం, ఎక్కువ వన్యప్రాణులు ఉండే ప్రదేశమని టైగర్‌జోన్‌గా ఎంపిక చేసింది. టైగర్ జోన్ ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా పులి రావడం లేదని అటవీశాఖ అధికారులు భావిస్తున్న తరుణంలో పులి చిత్రాలు కెమెరాకు చిక్కడంతో ఆనందం వెల్లివిరిసింది. కాగజ్‌నగర్, చెన్నూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులులు ఒక్కొక్కటిగా కవ్వాల్ టైగర్‌జోన్‌కు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు ఎప్పటికప్పుడు కెమెరాల ద్వారా పులి కదలికలను గుర్తించారు. గత సంవత్సరం జనవరి నుంచి మే వరకు జరిగిన జంతు గణనలో రెండు పులులు ఉన్నట్లు నిర్ధారించారు. తాళ్లపేట్ రేంజ్‌లో ఒకటి, కవ్వాల్ అటవీ సెక్షన్‌లో మరో పులి కెమెరాలకు చిక్కాయి. రెండు పులులు వచ్చినట్లు టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు గుర్తించి ఫొటోలతో సహా అటవీ అధికారులకు అందజేశారు.
రక్షణ కరువు
కవ్వాల్ టైగర్‌జోన్ ఏర్పాటైన మూడేళ్ల తర్వాత పులులు రావడంపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అధికారులు కూడా పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి పులికి రక్షణ కల్పించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. రోజూ అడవిలో తిరగాలని, అలజడి లేకుండా చూడాలని, వేటను పూర్తిగా అరికట్టాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులు మాత్రమే ఆదేశాలను పాటించిన కింది స్థాయి సిబ్బంది ఎప్పటిలాగే మామూలుగా వదిలేశారు. స్మగ్లింగ్ కోసం కొందరు అడవులకు వెళ్లడంతో రాత్రి, పలు కారణాల వల్ల నిత్యం అడవులకు వెళ్లడంతో అలజడి ఏర్పడుతోంది.
మహారాష్ట్రకు మనకు ఎంతో తేడా
మహారాష్ట్రలోని తాడోబాలో పులుల రక్షిత ప్రదేశం ఏర్పాటు చేశారు. అక్కడ చాలా పులులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి రక్షణ కల్పించారు. గత మూడు నెలల క్రితం తాడోబాలోని జై అనే పులి కనిపించడం లేదని అధికారులు గుర్తించి పులి జాడ కోసం గాలిస్తున్నారు. అక్కడి ప్రజలు పులి జాడ కోసం పూజలు చేస్తున్నట్లు, 400 మంది అధికారుల వరకు పులి కోసం వెదుకుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, కోటపల్లి ఏరియాలలో తిష్ట వేసి తిరుగుతున్నారు. పులి కోసం వారు ఎంతో తపన పడుతున్నారు. కాని.. మన వద్ద కవ్వాల్ టైగర్‌జోన్‌లో 2016 అక్టోబర్ నుంచి పులి కనిపించడం లేదు. ఈ విషయమై హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు అధికారులకు తెలియజేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం కాని, పులి కోసం ఆరా తెయడం కాని జరగడం లేదు. తాడోబా నుంచి కవ్వాల్ అభయారణ్యానికి పులి వచ్చేందుకు వీలుగా కారిడార్ ఉంది. ఆ కారిడార్‌లో అలజడి ఉండడం వల్ల పులి అక్కడి నుంచి రాకపోకలను కొనసాగించడం లేదని టైగర్ కన్జర్వేటర్ సొసైటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు రక్షణ కల్పిస్తే తాడోబా నుంచి పులి రాకపోకలు కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కాగజ్‌నగర్ ప్రాంతాల్లో పులి అడుగులు
ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించడంతో టైగర్‌జోన్ కూడా నాలుగు జిల్లాలకు వెళ్లింది. దీంతో ఏ జిల్లాలో పులులున్నాయో గుర్తించడం అధికారులకు కొంచెం ఇబ్బందిగా మారింది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో పులులున్నట్లు అధికారులు కెమరాల ద్వారా గుర్తించారు. తాడొబా నుంచి ఆ ప్రాంతాల్లో పులులు రాకపోకలు కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కారిడార్‌లో అలజడి లేకుంటే కవ్వాల్ టైగర్‌జోన్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పులి కదలికలు గుర్తించి, రక్షణ కల్పిస్తే కవ్వాల్ టైగర్‌జోన్‌లో మరిన్ని పులులు వచ్చే అవకాశం ఉంది.
నాలుగు నెలల నుంచి కనిపించడం లేదు..
కవ్వాల్ టైగర్‌జోన్‌కు రెండు పులులు వచ్చాయి. గత సంవత్సరం వాటికి సంబంధించి 20 ఫొటోలు సేకరించాం. ఈ ఏడాది కెమరాలు అమర్చినా పులులు చిక్కలేదు. కోర్ ఏరియాలో పులి కనిపించలేదు. బఫర్ ఏరియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. కెమరాలు సరిపడా లేవు. కోర్ ఏరియాలో పూర్తి కాగానే బఫర్ ఏరియా అంటే లక్షెట్టిపేట, మంచిర్యాల అటవీ రేంజ్‌లలో కెమరాలు ఏర్పాటు చేస్తాం. హాజీపూర్, దేవాపూర్ ఏరియాలలో అప్పుడప్పుడు వస్తున్నట్లు సమాచారం వచ్చింది.అక్కడ కెమరాలను అమర్చితే పూర్తి వివరాలు తెలుస్తాయి.
– ఇమ్రాన్ సిద్ధిఖి, హెచ్‌టీసీఎస్ చైర్మన్
ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాం
పులి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాం. కెమరాలను అమర్చి వాటి కదలికలను గుర్తిస్తున్నాం. గణన పూర్తి కాగానే పూర్తి విషయాలు తెలియజేస్తాను. – ప్రభాకర్, జిల్లా అటవీశాఖ అధికారి
పులి అదృశ్యం..!
Published Mon, Jan 16 2017 10:33 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
Advertisement