Jannaram Forestry Division
-
పక్షుల వయ్యారంవీక్షకుల విహారం..
జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో రెండురోజులు నిర్వహించిన బర్డ్ వాక్ ఆదివారం ముగిసింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పక్షిప్రేమికులకు అటవీ అధికారులు శనివారం రాత్రి కామన్పల్లి వాచ్‌టవర్, ఘనిశెట్టికుంటల్లో బస ఏర్పాటు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, జిల్లాలతోపాటు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్, ఫైనార్ట్స్ వర్సిటీ, హైదరాబాద్ ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు బర్డ్‌వాక్ లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు పక్షి ప్రేమికులు కల్పకుంట ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అరుదైన పక్షులను వారు తమ కెమెరాల్లో బంధించారు. ఆసియా, ఐరోపా ఖండాలలో సంచరించే పక్షులు ఇక్కడ కనిపించడం అదృష్టమని హైదరాబాద్‌కు చెందిన ఇర్షాద్, కిశోర్, ఢిల్లీకి చెందిన ఆనందిత తెలిపారు. వివిధ రకాల అరుదైన పక్షులను కవ్వాల్ అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి మైసమ్మ కుంట, ఘనిశెట్టి కుంట ప్రాంతాలలో పర్యటించి అరుదైన పక్షుల ఫొటోలు తీసుకున్నారు. బర్డ్ వాచర్లకు ఎఫ్‌డీవో మాధవరావు, రేంజ్ అధికారులు హఫీజొద్దీన్, రత్నాకర్‌రావు ఏర్పాట్లు చేశారు. అనంతరం గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బర్డ్ వాచర్ల అనుభవాలను తెలుసుకున్నారు. -
వన్యప్రాణులకు ఆయుష్షు పోసే కృత్రిమ మేధస్సు!
జన్నారం(ఖానాపూర్): వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగేసింది. టీ అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎయిమ్) ఆధ్వర్యంలో కార్యాచరణకు పూనుకుంటోంది. వన్యప్రాణుల అభివృద్ధి, కదలికలు, సంతతి అంశాల క్రోడీకరణకు సాంకేతికత రూపొందించడం, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా వివరాలు సేకరించడానికి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌ను ఎంపిక చేసింది. 59 కంపెనీల దరఖాస్తులు కృత్రిమ మేధస్సుతో వన్యప్రాణులపై అధ్యయనం చేసే ప్రాజెక్టును చేపట్టడానికి దేశవ్యాప్తంగా టీ ఎయిమ్స్‌కు 59 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నెల 8న ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, అటవీశాఖ పీసీసీఎప్ డోబ్రియాల్, క్యాప్ జెమిని ఇండియా వైస్ ప్రెసిడెంట్ అనురాగ్ ప్రతాప్ సమక్షంలో నిర్వహించిన సదస్సులో థింక్ ఎవాల్వ్ కన్సల్టెన్సీ కంపెనీ విజేతగా నిలిచి ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టుకు క్యాప్ జెమిని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద(సీఎస్ఆర్) ప్రోత్సాహకంగా రూ.20 లక్షలు అందజేసింది. అధ్యయనం చేసే అంశాలు థింక్ ఎవాల్వ్ కన్సల్టెన్సీ కంపెనీ కృత్రిమ మేధస్సు ద్వారా వన్యప్రాణుల కదలికలు, వాటి ఆహార అలవాట్లు, సంతతి, వాటి సంఖ్య, అవి ఏ ప్రదేశంలో సంచరిస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, వన్యప్రాణుల సంఖ్య పెరగడానికి, తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తుంది. తాను రూపొందించిన సాంకేతికతను వినియోగించి అటవీ శాఖ అధికారుల సహకారంతో అధ్యయనం చేస్తుంది. ఇదీ చదవండి: డాక్టర్ లాస్యసింధుకు జాతీయ హెల్త్‌కేర్ అవార్డు -
పొదల చాటున సంతాన వృద్ధి
జన్నారం (ఖానాపూర్): కవ్వాల్ టైగర్ జోన్లో అటవీశాఖ అధికారులు చేపట్టిన గడ్డి క్షేత్రాల పెంపకం సత్ఫాలితాలను ఇస్తోంది. గడ్డి మైదానాల పెంపకంతో రెండేళ్లలో టైగర్‌జోన్ పరిధి లో 40శాతం శాఖాహార జంతువులు పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పులికి సమృద్ధిగా ఆహారం అందుబాటులో ఉంటుందని వారు భావిస్తున్నారు. అడవిలో వన్యప్రాణుల జనాభా వాటి ఆవాస ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గడ్డి ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. శాఖాహార జంతువులు అధికంగా ఉంటే వాటిపై ఆధారపడిన మాంసాహార జంతువుల జనాభా కూడా పెరుగుతోంది. చదవండి: బంగారు చేప.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు 2018లో ప్రారంభం.. కవ్వాల్ టైగర్ జోన్ 893 హెక్టర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించింది. అప్పటి నుంచి అడపాదడపా పులులు రాకపోకలు సాగిస్తున్నా.. స్థానికంగా స్థిర నివాసం ఏర్పర్చుకున్న దాఖలాలు లేవు. జీవావరణ వ్యవస్థలో గడ్డి జాతుల ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఆహారపు గొలుసులో మొక్కలు ప్రథమ ఉత్పత్తి దారులుగా నిలుస్తాయి. వీటిపై జింకలు, దుప్పులు, సాంబర్లు, నీలుగాయిలు, కొండగొర్రెలు, అడవి దున్నలు, ఇతర వన్యప్రాణులు ఆధారపడి ఉంటాయి. శాఖాహార జంతువులపై ఆధారపడి పెద్ద పులులు, చిరుతలు, నక్కలు, అటవీ కుక్కలు, తోడేళ్లు తదితర జంతువులు మనుగడ సాగిస్తాయి. పులులకు స్థానికంగా తగినంత ఆహారాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో కవ్వాల్ టైగర్ జోన్లో గడ్డి క్షేత్రాల పెంపకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 2018 సంవత్సరంలో మహారాష్ట్రకు చెందిన గడ్డి క్షేత్రాల నిపుణుడు డాక్టర్ జీడీ మురత్కర్ జన్నారం డివిజన్లోని టీడీసీ టైగర్‌జోన్‌లో అటవీశాఖ అధికారులకు గడ్డి పెంపకంపై శిక్షణ ఇచ్చారు. సహజ గడ్డి క్షేత్రాలు, విత్తనాల సేకరణ, ముళ్ల కంచెల తొలగింపు, కలుపుమొక్కల నివారణ, గడ్డి విత్తనాల నిల్వ, సస్యరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదే ఏడాది 600 ఎకరాల్లో గడ్డి మైదానాల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఏటా పెంపకం.. శిక్షణ అనంతరం గడ్డి క్షేత్రాల పెంపకంలో స్థానిక అధికారులు చురుగ్గా పనిచేయడంతో దేశంలోని టైగర్‌జోన్‌లో కవ్వాల్జోన్కు మంచిపేరు వచ్చింది. 2018 సంవత్సరంలో 600 ఎకరాల్లో గడ్డి మైదానాలు పెంచగా.. 2019లో 130 హెక్టర్లలో, 2020లో 200 హెక్టార్లలో, ఈ ఏడాది మరో 180 హెక్టార్లలో గడ్డి మైదానాల పెంపకంపై దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాలలో గడ్డి విత్తనాలను చల్లి సహజసిద్ధంగా గడ్డిని పెంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాలలో సహజసిద్ధంగా మొలిచిన గడ్డి చుట్టూ కంచె వేసి, కలుపు తొలగిస్తారు. అడవిలోని వన్యప్రాణులకు ఆహారం, నీరు ఒకచోట అందుబాటులో ఉండేవిధంగా అధికారులు చొరవ తీసుకుంటున్నారు. నీటి కుంట ఉన్న ప్రాంతంలోనే గడ్డి పెంపకం చేపడితే వన్యప్రాణులు అహారం తిని అక్కడే నీరు తాగి సేదదీరేందుకు వీలుంటుందని వారు భావిస్తున్నారు. పెరుగుతున్న శాఖాహారులు.. గడ్డి క్షేత్రాల పెంపకంతో రెండేళ్లుగా శాఖాహార జంతువుల సంఖ్య 40 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పెరుగుదల ఇదేవిధంగా ఉంటే పది పులులకు సరిపడా ఆహారం స్థానికంగా లభిస్తుందని వారు అంటున్నారు. ప్రస్తుతానికి రెండు పులులు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లోకి రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే స్థానికంగా దట్టమైన అడవులు, సరిపడా శాఖాహార జంతువులు ఉన్నా పులులు స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. తిప్పేశ్వర్, తాడోబా టైగర్‌జోన్‌ల నుంచి కూడా పులుల రాకపోకలు ఉన్నాయి. దట్టమైన అటవీప్రాంతం, గడ్డి మైదానాలు, వేటాడేందుకు సరిపడా వన్యప్రాణుల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. అటవీ ప్రాంతంలో అలికిడిని తగ్గించి పులులు స్థానికంగా ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్రాంతాన్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. విరివిగా గడ్డి మైదానాలు 2018 నుంచి గడ్డి క్షేత్రాలను విరివిగా పెంచుతున్నాం. గతేడాది 200 హెక్టర్లలో గడ్డి మైదానాలు పెంచాం. దాని నిర్వహణ చూస్తూనే ఈ ఏడాది మరో 180 హెక్టార్లలో గడ్డిక్షేత్రాలను విస్తరిస్తున్నాం. కచ్చితమైన సంఖ్య తెలియకున్నా.. డివిజన్ పరిధిలో వన్యప్రాణుల సంతతి పెరుగుతోంది. రాత్రిపూట అడవి గుండా రాకపోకలు నిషేధించాం. వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. - మాధవరావు, డివిజన్ ఫారెస్టు అధికారి -
చెక్‌పోస్టుల అక్రమాలకు చెక్
సాక్షి, జన్నారం: సార్ ఈరోజు చెక్‌పోస్టు వద్ద ఎవరున్నారు... మీరే ఉన్నారా... రాత్రికి నా బండి వస్తది, జర విడిచిపెట్టండి...ఏదన్న ఉంటే చూసుకుంటా... అని ఓ స్మగ్లర్ చెక్‌పోస్టు డ్యూటీ చేసే సిబ్బందితో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుని కలప తరలిస్తారు. సార్ ఈ రోజు ఉన్నారా మీరు... లేదు... రేపు నాకు డ్యూటీ ఉంటుంది.. రేపు రా అని ఓ అధికారి తన డ్యూటీని ముందుగానే స్మగ్లర్‌కు సమాచారం ఇస్తాడు. ఇలా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ అక్రమంగా కలప తరలిపోవడానికి సహకరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్‌పెట్టెందుకు అధికారులు సమూల మార్పులు తీసుకొస్తున్నారు. చెక్‌పోస్టులను దాటించిన సంఘటనలు అనేకం: కలమడుగు అటవి చెక్‌పోస్టు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవి డివిజన్లో టైగర్‌జోన్ లో నుంచి కలప తరలిపోకుండా రాత్రి పూట వాహనాల రాకపోకలను జరుపకుండా ముత్యంపేట్, తపాలపూర్, పాడ్వాపూర్, కొత్తగూడం, కలమడుగు లలో అటవి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పగలంతా కలప తరలిపోకుండా చూడటమె కాకుండా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భారీ వాహానాలను టైగర్‌జోన్ లో పర్యటన నిషేదించారు. చెక్‌పోస్టు డ్యూటీ దినం, తప్పించి దినం ఇద్దరే చేసే వారు. ఇద్దరే ఉండటం వల్ల రాత్రి పూట ఇసుక తరలించే వారి వాహానాల వద్ద ఎంతో కొంత తీసుకుని వాటిని వదిలివేయడం, ముందుగానే కలప తరలించే వ్యక్తులు డ్యూటీ చేసే వారితో మాట్లాడి కలప దాటించడం జరిగేది. ఇటివల అనేక వాహనాలను చెక్‌పోస్టులు దాటి లక్షేట్టిపేట్ వెళ్తుండగా పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇటివల మామిడిపెల్లి నుంచి వ్యాన్‌లో కలప చెక్‌పోస్టులు దాటి వెళుతుండగా లక్షేట్టిపేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అదే విధంగా చెక్‌పోస్టు దాటించెందుకు వెళ్తుండగా జన్నారం అటవి అధికారులు ఒక కారును పట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మార్పులు తీసుకువచ్చారు. ఎవరికి డ్యూటీ ఉంటుందో వారికే తెలియదు డ్యూటీ ఇద్దరికే ఇవ్వడం వల్ల వారితో స్మగ్లర్లు మచ్చిక చేసుకుని కలప తరలిస్తున్నారనే విషయాన్ని గమనించిన అటవిశాఖ ఎఫ్‌డీవో మాధవరావు నూతన డ్యూటీ విధానానికి తెరదించాడు. చెక్‌పోస్టు డ్యూటీ ఇద్దరికే కాకుండా డివిజన్ పరిధిలోని బీట్ అధికారులకు అందరికి వేయాలని యోచించాడు. డివిజన్లోని బీట్ అధికారికి ఒక గంట ముందే సమాచారం ఇచ్చి డ్యూటీ చేయాలనే ఆదేశాలను ఇస్తున్నారు. దీంతో చెక్‌పోస్టు వద్ద ఎవ్వరు డ్యూటీ చేస్తారో అనే విషయం స్మగ్లర్లకు తెలియకుండా ఉంటుంది. తనకు డ్యూటీ ఉంటుందనే విషయం ఆ బీట్ అధికారికే తెలియని పరిస్థితి ఉంటున్నందున అక్రమాలు జరిగే అవకాశం లేదు. అదే విధంగా గతంలో చెక్‌పోస్టు డ్యుటీలు చేసిన వారు కూడ తిరిగి బీట్లలో వెళ్లాల్సి ఉంటుంది. ఒకే రోజు డ్యూటి ఉంటున్నందున తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి ఎలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండదనేది అధికారుల ఆలొచన. సీసీ కెమెరాలతో నిఘా చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలను అమర్చి నిఘా పెట్టారు. గతంలో సీసీ కెమరాలను అమర్చిన వాటి ప్రసారం కేవలం చెక్‌పోస్టు వద్దనే ఉండేది. అయితే ఎఫ్‌డీవో మాధవరావు చెక్‌పోస్టు వద్ద అమర్చిన సీసీ పుటేజీలు తన కార్యాలయంలో, తన మోబైల్లో కనిపించేలా తగు ఏర్పాట్లను చేసుకున్నారు. దీంతో చెక్‌పోస్టుల నిర్వహణపై ప్రతి రోజు, ఖాళీ సమయంలో మోబైల్ లో లేదా, తన కార్యాలయంలోని కంప్యూటర్లో పరిశీలిస్తున్నారు. గతంలో ఏదైన అవకతవకలు జరిగే క్రమంలో సదరు సిబ్బంది చెక్‌పోస్టు వద్ద కెమరాను బందు చేసి వాహనం వెళ్లాక తిరిగి ఆన్ చేసే అవకాశం ఉండేది ఎందుకంటే కెమరాలోని వివరాలు అక్కడే అమర్చిన కంప్యూటర్లో రికార్డు అయ్యేది. వాటిని అధికారులు ఎప్పుడో ఒక్కసారి పరిశీలించేవారు. కాని ఇప్పుడు ఇక కెమరాలను ఆపి వేసే వీలు కూడ ఉండదు. కొన్ని సమయాల్లో వాహానాలను వదిలిపెడితే అప్పుడే ఫోన్ చేసి అడిగి అనుమానం నివృత్తి చేసుకునే వీలుంటుంది. దీంతో భయానికి చెక్‌పోస్టు వద్ద ఉండే సిబ్బంది అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. చెక్‌పోస్టుల వద్ద పని చేసే సిబ్బంది ఒక్కరోజు మాత్రమే ఉండటం వల్ల తనిఖీలలో అక్రమాలు జరిగే అవకాశం లేదు. ఇలాంటి సమూల మార్పుల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాను చెక్‌పోస్టులలో కలప తరలిపొవడమ గమనించాను. సిబ్బందిని పలుమార్లు హెచ్చరించిన అప్పుడప్పుడు ఒకటి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశాము. కొత్త విధానం వల్ల సిబ్బందికి భయం ఉంటుంది. అదే విధంగా డ్యూటీ ఎవ్వరు చేస్తున్నారో తెలియకుండా ఉంటుంది. కేవలం గంట ముందే డ్యూటీ చేసే సిబ్బంది గురించి సంబంధిత రేంజ్ అధికారి వారికి తెలియజేస్తారు. దీంతో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదని ఆశిస్తున్నాం. – మాధవరావు, ఎఫ్‌డీవో -
కడెం డివిజన్లో పులి సంచారంపై అప్రమత్తం
సాక్షి, జన్నారం(ఖానాపూర్): కడెం డివిజన్లోని పాడ్వాపూర్ బీట్ ప్రాంతంలో పులి సంచారం నేపథ్యంలో కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాడ్వాపూర్ బీట్ పరిధిలోని గంగాపూర్ ప్రాంతం, ఇస్లాంపూర్ అడవి నుంచి కవ్వాల్ సెక్షన్లో పులి పర్యటించే అవకాశం ఉంది. దీంతో ఆదివారం ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీనివాసరావు అధ్వర్యంలో అధికారులు కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని కవ్వాల్ సెక్షన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పులి అడుగులు, ఇతర గుర్తింపులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో రహదారులు, వాగులు, ఇతర ప్రాంతాల్లో అధికారులు పులి అడుగుల కోసం అన్వేషించారు. ఎక్కడా అడుగులు కనిపించలేదు. గంగాపూర్ మీదుగా కవ్వాల్కు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఎలాంటి అలజడి లేకుండా, పశువులు రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులి కవ్వాల్ సెక్షన్లో ప్రవేశిస్తే ఇక్కడి సౌకర్యాల దృష్ట్యా తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదనే ఆశాభావం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యాన్ని 2012 జనవరి 10న కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి అసెంబ్లీ స్పీకర్ మనోహర్ కవ్వాల్ అభయారణ్యంలో పర్యటించి ఆయన చేసిన సూచన మేరకు 49వ టైగర్‌జోన్‌గా ఏర్పాటు చేశారు. టైగర్‌జోన్ ఏర్పాటు నుంచి పులి రాక కోసం అధికారులు అన్నిరాకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. మూడేళ్ల క్రితం కొన్ని రోజులు రాకపోకలు కొనసాగించింది. ఈ క్రమంలో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు, అటవీశాఖ అధికారులు పులికి రక్షణ కల్పించారు. కొంత అలజడి వల్ల వచ్చిన పులి మూడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయింది. ఎట్టకేలకు ఈ నెల 15 న కడెం రేంజ్ పరిధిలోని పాడ్వాపూర్ బీట్, గంగాపూర్ పరిధిలో బేస్‌క్యాంపు సిబ్బందికి పులి కనిపించింది. వారు అప్రమత్తమై ఉన్నత అధికారులకు తెలియజేయడంతో కెమరాలు అమర్చడం వల్ల పులి కెమెరాకు చిక్కింది. దీంతో అధికారుల అనుమానం నిజమైంది. అడుగుల సేకరణలో సిబ్బంది కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఇటీవలే పెద్ద పులి కనిపించడంతో అధికారులు వాటి సంఖ్యను క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ నిర్వహించారు. శనివారం కడెం ఆటవీ రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్, బీట్ల ఫరిధిలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో పెద్ద పులి కనిపించడంతో అంతకుముందు దాని పాదలు గుర్తించిన అధికారులు వాటి సంఖ్యను గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ పనిలో ఉన్నారు. కడెం రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్ బీట్లతోపాటు ఇతర బీట్లలో వాటి అనవాళ్లు ఉన్నాయా అనే కోణంలో పరిశీలించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. ఆదివారం హైదరాబాద్ అటవీ శిక్షణ ఎఫ్ఆర్ఓలు శిక్షణకు రావడంతో ఈ ప్రాం తం, జంతువుల వివరాలను అటవీ అధికారులు తెలియజేశారు. ఎఫ్ఆర్వో రమేశ్ రాథోడ్, ఎఫ్‌ఎస్‌ఓలు ప్రభాకర్, మమత పాల్గొన్నారు. -
పులి అదృశ్యం..!
నాలుగు నెలలుగా కవ్వాల్‌లో కనిపించని వైనం.. టైగర్‌జోన్‌లో ప్రతికూల వాతావరణం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటుందని అభిప్రాయం జన్నారం : కవ్వాల్ అభయారణ్యంలో పులి జాడ లేకుండా పోయింది. టైగర్‌జోన్‌లో ఏర్పడిన ప్రతికూల వాతావరణం కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జన్నారం అటవీ డివిజన్ కవ్వాల్ అభయారణ్యాన్ని దేశంలో 42వ పులుల రక్షిత ప్రదేశంగా కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్‌లో గుర్తించింది. పులికి అనుకూలమైన ప్రదేశం, ఎక్కువ వన్యప్రాణులు ఉండే ప్రదేశమని టైగర్‌జోన్‌గా ఎంపిక చేసింది. టైగర్ జోన్ ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా పులి రావడం లేదని అటవీశాఖ అధికారులు భావిస్తున్న తరుణంలో పులి చిత్రాలు కెమెరాకు చిక్కడంతో ఆనందం వెల్లివిరిసింది. కాగజ్‌నగర్, చెన్నూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులులు ఒక్కొక్కటిగా కవ్వాల్ టైగర్‌జోన్‌కు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు ఎప్పటికప్పుడు కెమెరాల ద్వారా పులి కదలికలను గుర్తించారు. గత సంవత్సరం జనవరి నుంచి మే వరకు జరిగిన జంతు గణనలో రెండు పులులు ఉన్నట్లు నిర్ధారించారు. తాళ్లపేట్ రేంజ్లో ఒకటి, కవ్వాల్ అటవీ సెక్షన్లో మరో పులి కెమెరాలకు చిక్కాయి. రెండు పులులు వచ్చినట్లు టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు గుర్తించి ఫొటోలతో సహా అటవీ అధికారులకు అందజేశారు. రక్షణ కరువు కవ్వాల్ టైగర్‌జోన్ ఏర్పాటైన మూడేళ్ల తర్వాత పులులు రావడంపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అధికారులు కూడా పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి పులికి రక్షణ కల్పించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. రోజూ అడవిలో తిరగాలని, అలజడి లేకుండా చూడాలని, వేటను పూర్తిగా అరికట్టాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులు మాత్రమే ఆదేశాలను పాటించిన కింది స్థాయి సిబ్బంది ఎప్పటిలాగే మామూలుగా వదిలేశారు. స్మగ్లింగ్ కోసం కొందరు అడవులకు వెళ్లడంతో రాత్రి, పలు కారణాల వల్ల నిత్యం అడవులకు వెళ్లడంతో అలజడి ఏర్పడుతోంది. మహారాష్ట్రకు మనకు ఎంతో తేడా మహారాష్ట్రలోని తాడోబాలో పులుల రక్షిత ప్రదేశం ఏర్పాటు చేశారు. అక్కడ చాలా పులులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి రక్షణ కల్పించారు. గత మూడు నెలల క్రితం తాడోబాలోని జై అనే పులి కనిపించడం లేదని అధికారులు గుర్తించి పులి జాడ కోసం గాలిస్తున్నారు. అక్కడి ప్రజలు పులి జాడ కోసం పూజలు చేస్తున్నట్లు, 400 మంది అధికారుల వరకు పులి కోసం వెదుకుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, కోటపల్లి ఏరియాలలో తిష్ట వేసి తిరుగుతున్నారు. పులి కోసం వారు ఎంతో తపన పడుతున్నారు. కాని.. మన వద్ద కవ్వాల్ టైగర్‌జోన్‌లో 2016 అక్టోబర్ నుంచి పులి కనిపించడం లేదు. ఈ విషయమై హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు అధికారులకు తెలియజేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం కాని, పులి కోసం ఆరా తెయడం కాని జరగడం లేదు. తాడోబా నుంచి కవ్వాల్ అభయారణ్యానికి పులి వచ్చేందుకు వీలుగా కారిడార్ ఉంది. ఆ కారిడార్‌లో అలజడి ఉండడం వల్ల పులి అక్కడి నుంచి రాకపోకలను కొనసాగించడం లేదని టైగర్ కన్జర్వేటర్ సొసైటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు రక్షణ కల్పిస్తే తాడోబా నుంచి పులి రాకపోకలు కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగజ్‌నగర్ ప్రాంతాల్లో పులి అడుగులు ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించడంతో టైగర్‌జోన్ కూడా నాలుగు జిల్లాలకు వెళ్లింది. దీంతో ఏ జిల్లాలో పులులున్నాయో గుర్తించడం అధికారులకు కొంచెం ఇబ్బందిగా మారింది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో పులులున్నట్లు అధికారులు కెమరాల ద్వారా గుర్తించారు. తాడొబా నుంచి ఆ ప్రాంతాల్లో పులులు రాకపోకలు కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కారిడార్‌లో అలజడి లేకుంటే కవ్వాల్ టైగర్‌జోన్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పులి కదలికలు గుర్తించి, రక్షణ కల్పిస్తే కవ్వాల్ టైగర్‌జోన్‌లో మరిన్ని పులులు వచ్చే అవకాశం ఉంది. నాలుగు నెలల నుంచి కనిపించడం లేదు.. కవ్వాల్ టైగర్‌జోన్‌కు రెండు పులులు వచ్చాయి. గత సంవత్సరం వాటికి సంబంధించి 20 ఫొటోలు సేకరించాం. ఈ ఏడాది కెమరాలు అమర్చినా పులులు చిక్కలేదు. కోర్ ఏరియాలో పులి కనిపించలేదు. బఫర్ ఏరియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. కెమరాలు సరిపడా లేవు. కోర్ ఏరియాలో పూర్తి కాగానే బఫర్ ఏరియా అంటే లక్షెట్టిపేట, మంచిర్యాల అటవీ రేంజ్‌లలో కెమరాలు ఏర్పాటు చేస్తాం. హాజీపూర్, దేవాపూర్ ఏరియాలలో అప్పుడప్పుడు వస్తున్నట్లు సమాచారం వచ్చింది.అక్కడ కెమరాలను అమర్చితే పూర్తి వివరాలు తెలుస్తాయి. – ఇమ్రాన్ సిద్ధిఖి, హెచ్టీసీఎస్ చైర్మన్ ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాం పులి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాం. కెమరాలను అమర్చి వాటి కదలికలను గుర్తిస్తున్నాం. గణన పూర్తి కాగానే పూర్తి విషయాలు తెలియజేస్తాను. – ప్రభాకర్, జిల్లా అటవీశాఖ అధికారి -
టైగర్‌జోన్‌లో కానరాని పులిజాడ
* పెరిగిన చుక్కల దుప్పుల సంతతి * జంతుగణన పూర్తి జన్నారం: కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశంగా ప్రకటించి మూడు సంవత్సరాలు అవుతున్నా అభయారణ్యంలో పులి జాడ కని పించడంలేదు. టైగర్‌జోన్‌గా ప్రకటించిన నుంచి మూడు సం వత్సరాలుగా జంతు గణన జరి గినా ఈ గణనలో పులి అడుగులు ఉన్నట్లు కనిపించలేదు. గత నెల 24 నుంచి 30 వరకు జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి, జన్నారం, తాళ్లపేట్, బీర్షాయిపేట్ అటవి రేంజ్‌లలో జంతుగణన నిర్వహించారు. రేంజ్లలోని బీట్ స్థాయి నుంచి సెక్షన్ స్థాయికి, అక్కడి నుంచి అన్ని సెక్షన్ల నుంచి రేంజ్ కార్యాలయానికి జంతువుల లెక్కలను అందించరు. ఇప్పుడు రేంజ్‌ల నుంచి డివిజన్ కేంద్రానికి వచ్చాయి. వీటిని పరిశీలిస్తే గతంలో పోలిస్తే చిరుత పులల సంఖ్య కూడా పడిపోయినట్లు తెలుస్తుంది. గతంలో చిరుత పులులు 30 వరకు ఉండగా ఇప్పుడు 12 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని చిరుతలు ఇక్కడి నుంచి వెళ్లగా మరి కొన్ని చిరుతలు వేటకు గురయ్యాయని అధికారులు అంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. శాఖాహార జంతువులు చుక్కల దుప్పులు చిన్నవి పెద్దవి కలిపి 662, గండి జింకలు 30, కృష్ణ జింకలు 05, నీలుగాయిలు 198, సాంబర్లు 13, బుర్ర జింకలు 33, అడవి దున్నలు 93, అడవి పందులు 933, అడవి కోళ్లు 3, కొండ ముచ్చులు 382, కుందేళ్లు 57, కొండగొర్రెలు 02, నెమల్లు ఆడ 47, మగ నెమల్లు 73, మాంసాహార జంతువులు చిరుతపులులు 11 మగవి, 1 ఆడ చిరుతపులి, రేసుకుక్కలు 64, ఎలుగుబంట్లు 75, నక్కలు 13, తోడేళ్లు 13, అడవిపిల్లులు 19, కొండ్రిగాడు 2 ఉన్నట్లు ఉన్నాయి. పులి రాక కోసం ఎదురు చూస్తు న్న అధికారులకు ఈ గణనలో పులి జాడ కనిపించకపోవడం అంసతృప్తికి లోను చేస్తోంది. -
వన సంపదను కాపాడుకోవాలి..
జన్నారం/కడెం : కవ్వాల అభయారణ్యంలోని వన సంపదను కాపాడుకోవాలని.. అది అందరి బాధ్యత అని శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం ఆయన జన్నారం అటవీ డివిజన్లోని మైసంపేట, మల్యాల, పాండవాపూర్ తదితర అడవుల్లో పర్యటించారు. ఉద యం 5.30 గంటలకే ఆయన అడవులకు చేరుకున్నారు. అటవీ జంతువులైన దున్నలు, నీలుగాయి, చుక్కల దుప్పి తదితర వాటిని చూసి ఆనందించారు. అనంతరం అటవీశాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వన్యప్రాణుల విభాగాన్ని అభివృద్ధి చేయాల్సినా అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీలకతీతంగా బాధ్యత తీసుకుని.. ఇక్కడ పలువురికి ఉపాధి దొరికేలా చూడాలన్నారు. కవ్వాల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించిందన్నారు. గ్రామాల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా పరిస్థితిని వివరించి అవగాహన కల్పిస్తే వారంతట వారే అడవులు వదిలి బయటకు వస్తారని, ప్రభుత్వం నుంచి ఫలాలు వారికి అందేలా కృషి చేయాలని కోరారు. తాను గతంలోనూ ఇక్కడ పర్యటించానని, కవ్వాల్ అభయారణ్యాన్ని మరింత అభివృద్ధి చేసేలా సీఎంకు వివరిస్తానని చెప్పారు. ఆయన వెంట డీఎఫ్‌వో దామోదర్‌రెడ్డి, టైగర్‌కన్జర్వేషన్ అథారిటీ సభ్యుడు ఇమ్రాన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ హరినాయక్, కడెం ఎఫ్‌ఎస్‌వోలు నజీర్‌ఖాన్, కింగ్‌ఫిషర్, ఎఫ్‌బీవోలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం జిల్లా కో కన్వీనర్ రియాజోద్దీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముజాఫర్‌అలీఖాన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌నాయక్, తదితరులు సన్మానించారు. అలాగే.. కడెం అటవీ క్షేత్రంలోని గంగాపూర్, లక్ష్మీపూర్ సెక్షన్ అడవుల్లోనూ ఆయన పర్యటించారు.