సాక్షి, జన్నారం: సార్ ఈరోజు చెక్‌పోస్టు వద్ద ఎవరున్నారు... మీరే ఉన్నారా... రాత్రికి నా బండి వస్తది, జర విడిచిపెట్టండి...ఏదన్న ఉంటే చూసుకుంటా... అని ఓ స్మగ్లర్ చెక్‌పోస్టు డ్యూటీ చేసే సిబ్బందితో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుని కలప తరలిస్తారు. సార్ ఈ రోజు ఉన్నారా మీరు... లేదు... రేపు నాకు డ్యూటీ ఉంటుంది.. రేపు రా అని ఓ అధికారి తన డ్యూటీని ముందుగానే స్మగ్లర్‌కు సమాచారం ఇస్తాడు. ఇలా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ అక్రమంగా కలప తరలిపోవడానికి సహకరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్‌పెట్టెందుకు అధికారులు సమూల మార్పులు తీసుకొస్తున్నారు.
చెక్‌పోస్టులను దాటించిన సంఘటనలు అనేకం:
కలమడుగు అటవి చెక్‌పోస్టు
కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవి డివిజన్‌లో టైగర్‌జోన్ లో నుంచి కలప తరలిపోకుండా రాత్రి పూట వాహనాల రాకపోకలను జరుపకుండా ముత్యంపేట్, తపాలపూర్, పాడ్వాపూర్, కొత్తగూడం, కలమడుగు లలో అటవి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పగలంతా కలప తరలిపోకుండా చూడటమె కాకుండా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భారీ వాహానాలను టైగర్‌జోన్ లో పర్యటన నిషేదించారు. చెక్‌పోస్టు డ్యూటీ దినం, తప్పించి దినం ఇద్దరే చేసే వారు. ఇద్దరే ఉండటం వల్ల రాత్రి పూట ఇసుక తరలించే వారి వాహానాల వద్ద ఎంతో కొంత తీసుకుని వాటిని వదిలివేయడం, ముందుగానే కలప తరలించే వ్యక్తులు డ్యూటీ చేసే వారితో మాట్లాడి కలప దాటించడం జరిగేది. ఇటివల అనేక వాహనాలను చెక్‌పోస్టులు దాటి లక్షేట్టిపేట్ వెళ్తుండగా పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇటివల మామిడిపెల్లి నుంచి వ్యాన్‌లో కలప చెక్‌పోస్టులు దాటి వెళుతుండగా లక్షేట్టిపేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అదే విధంగా చెక్‌పోస్టు దాటించెందుకు వెళ్తుండగా జన్నారం అటవి అధికారులు ఒక కారును పట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మార్పులు తీసుకువచ్చారు.
ఎవరికి డ్యూటీ ఉంటుందో వారికే తెలియదు
డ్యూటీ ఇద్దరికే ఇవ్వడం వల్ల వారితో స్మగ్లర్లు మచ్చిక చేసుకుని కలప తరలిస్తున్నారనే విషయాన్ని గమనించిన అటవిశాఖ ఎఫ్‌డీవో మాధవరావు నూతన డ్యూటీ విధానానికి తెరదించాడు. చెక్‌పోస్టు డ్యూటీ ఇద్దరికే కాకుండా డివిజన్ పరిధిలోని బీట్ అధికారులకు అందరికి వేయాలని యోచించాడు. డివిజన్‌లోని బీట్ అధికారికి ఒక గంట ముందే సమాచారం ఇచ్చి డ్యూటీ చేయాలనే ఆదేశాలను ఇస్తున్నారు. దీంతో చెక్‌పోస్టు వద్ద ఎవ్వరు డ్యూటీ చేస్తారో అనే విషయం స్మగ్లర్లకు తెలియకుండా ఉంటుంది. తనకు డ్యూటీ ఉంటుందనే విషయం ఆ బీట్ అధికారికే తెలియని పరిస్థితి ఉంటున్నందున అక్రమాలు జరిగే అవకాశం లేదు. అదే విధంగా గతంలో చెక్‌పోస్టు డ్యుటీలు చేసిన వారు కూడ తిరిగి బీట్‌లలో వెళ్లాల్సి ఉంటుంది. ఒకే రోజు డ్యూటి ఉంటున్నందున తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి ఎలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండదనేది అధికారుల ఆలొచన.
సీసీ కెమెరాలతో నిఘా
చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలను అమర్చి నిఘా పెట్టారు. గతంలో సీసీ కెమరాలను అమర్చిన వాటి ప్రసారం కేవలం చెక్‌పోస్టు వద్దనే ఉండేది. అయితే ఎఫ్‌డీవో మాధవరావు చెక్‌పోస్టు వద్ద అమర్చిన సీసీ పుటేజీలు తన కార్యాలయంలో, తన మోబైల్‌లో కనిపించేలా తగు ఏర్పాట్లను చేసుకున్నారు. దీంతో చెక్‌పోస్టుల నిర్వహణపై ప్రతి రోజు, ఖాళీ సమయంలో మోబైల్ లో లేదా, తన కార్యాలయంలోని కంప్యూటర్‌లో పరిశీలిస్తున్నారు. గతంలో ఏదైన అవకతవకలు జరిగే క్రమంలో సదరు సిబ్బంది చెక్‌పోస్టు వద్ద కెమరాను బందు చేసి వాహనం వెళ్లాక తిరిగి ఆన్ చేసే అవకాశం ఉండేది ఎందుకంటే కెమరాలోని వివరాలు అక్కడే అమర్చిన కంప్యూటర్లో రికార్డు అయ్యేది. వాటిని అధికారులు ఎప్పుడో ఒక్కసారి పరిశీలించేవారు. కాని ఇప్పుడు ఇక కెమరాలను ఆపి వేసే వీలు కూడ ఉండదు. కొన్ని సమయాల్లో వాహానాలను వదిలిపెడితే అప్పుడే ఫోన్ చేసి అడిగి అనుమానం నివృత్తి చేసుకునే వీలుంటుంది. దీంతో భయానికి చెక్‌పోస్టు వద్ద ఉండే సిబ్బంది అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. చెక్‌పోస్టుల వద్ద పని చేసే సిబ్బంది ఒక్కరోజు మాత్రమే ఉండటం వల్ల తనిఖీలలో అక్రమాలు జరిగే అవకాశం లేదు. ఇలాంటి సమూల మార్పుల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
ఎప్పటికప్పుడు నిఘా పెట్టాను
చెక్‌పోస్టులలో కలప తరలిపొవడమ గమనించాను. సిబ్బందిని పలుమార్లు హెచ్చరించిన అప్పుడప్పుడు ఒకటి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశాము. కొత్త విధానం వల్ల సిబ్బందికి భయం ఉంటుంది. అదే విధంగా డ్యూటీ ఎవ్వరు చేస్తున్నారో తెలియకుండా ఉంటుంది. కేవలం గంట ముందే డ్యూటీ చేసే సిబ్బంది గురించి సంబంధిత రేంజ్ అధికారి వారికి తెలియజేస్తారు. దీంతో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదని ఆశిస్తున్నాం.
– మాధవరావు, ఎఫ్‌డీవో
Comments
Please login to add a commentAdd a comment