సాక్షి, హైదరాబాద్
అది టైగర్ షెల్టర్ జోన్.. కానీ అక్కడే పుట్టి పెరిగిన పులి ఒక్కటంటే ఒక్కటి లేదు.. అయినా సరే పక్క రాష్ట్రాల నుంచి పులుల్ని రప్పించేందుకు అధికారులు కోట్లు వెచ్చిస్తున్నారు.. ఆ అడవిలో కృత్రిమంగా పశుగ్రాసం పెంచారు.. నీటి చెలమలు తీశారు.. చెక్‌డ్యాంలు కట్టారు.. అటవీ భూమి చుట్టూ కందకాలు తవ్వించారు.. కానీ పులికి కావాల్సిన తిండిని మాత్రం మరిచారు! పస్తులైనా ఉంటుంది కానీ పచ్చిగడ్డి తినదన్న లాజిక్‌ను మరిచిన అధికారులు.. కోట్లు పోసి లేని పులిని రా.. రమ్మని పిలుస్తున్నారు! అదే సమయంలో పులికి ఆహారమైన దుప్పులు, కృష్ణ జింకలు, మచ్చల జింకలు, మనుబోతులు, కొండ గొర్రెలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వేటగాళ్లు వాటిని యథేచ్ఛగా చంపేస్తున్నా కళ్లు మూసుకుంటున్నారు.
పులులే లేని చోట..
రాష్ట్ర అటవీ శాఖ కేంద్రానికి ఏం నివేదికలు పంపిందో ఏమో గానీ కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అభయారణ్యాన్ని 41వ పులుల సంరక్షణ కేంద్రం(టైగర్ షెల్టర్ జోన్)గా గుర్తించింది. 1,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర అటవీ ప్రాంతాన్ని కవ్వాల్ టైగర్ ప్రాజెక్టుగా ప్రకటించారు. దీని అభివృద్ధికి కేంద్రం రూ.45 కోట్ల నిధులిచ్చింది. ఈ సొమ్ముతో అధికారులు పశుగ్రాసం పెంచారు. పులులు వస్తే తాగటానికి నీటి సాసర్లు, చెలిమలు తీయడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేశారు. పులి అవాసం ఏర్పాటు చేసుకోవటానికి కనీసం 20 నుంచి 30 చ.కి.మీ. దట్టమైన అటవీప్రాంతం అవసరం. ప్రతి చదరపు కిలో మీటరుకు కనీసం 60 నుంచి 70 శాకాహార జంతువులు ఉండాలి. పులి సగటున ప్రతి మూడు రోజులకు ఒకసారైనా వేటాడుతుంది. కానీ కవ్వాల్ ప్రాంతంలో జింకలు, దుప్పులు, ఇతర అటవీ జంతువులు ఏ మేరకు ఉన్నాయన్న కచ్చితమైన లెక్కలు అటవీ శాఖ అధికారుల వద్ద లేవు. విచిత్రమేమిటంటే స్థానికంగా కవ్వాల్ అడవిలో పుట్టి పెరిగిన పెద్దపులి ఒక్కటి కూడా లేదు. అక్కడ పులుల సంచారంపై ఉట్నూరు మండలం కుమ్మరికుంటకు చెందిన భీమ్‌రావ్‌ను అడగ్గా.. ‘‘70 ఏళ్ల నుంచి ఈ అడవిలనే బతుకుతున్న. ఎన్నడూ పులిని చూడలె. దాన్ని జూసినట్టు మా నాయిన కూడా చెప్పలె!’’ అని పేర్కొన్నాడు.
ఏమో.. రాకపోతాయా?
ఈ నెలలో పులుల లెక్కింపు ఉండటంతో రాష్ట్ర అటవీ అధికారులు నానా హైరానా పడుతున్నారు. కవ్వాల్ అభయారణ్యానికి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని తాడోబా, 100 కి.మీ. దూరంలో ఉన్న మరో టైగర్ ప్రాజెక్టు ఇంద్రావతిపైనే ఆశలు పెట్టుకున్నారు. పులుల సంచారానికి అవకాశం ఉన్న దారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గమనిస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ్నుంచి 7 నుంచి 9 పులులు వచ్చినట్లు నివేదికలు రూపొందించారు. ఇందులో ఓ పులి 2015లో వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగలకు తగిలి చనిపోయింది. మిగతా పులులు కవ్వాల్ ప్రాంతంలోనే ఉన్నాయా? వెనక్కి వెళ్లాయా అన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ‘ఏమో.. ఈ నెలలో చేయబోయో పులుల జనాభా లెక్కల్లో తెలుస్తుంది’ అని చెబుతున్నారు. ప్రతి చ.కి.మీ.కు కనీసం 60–70 వరకు శాకాహార జంతువులు లేకుంటే పులులు రావని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉన్న జింకలకు రక్షణేది..?
పులుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఫారెస్టు అధికారులు కవ్వాల్‌కు ఆనుకొనే ఉన్న ప్రాణహిత నదీ తీరంలోని జింకలను పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యానికి మూల్యంగా వెంచపల్లి రిజర్వ్ ఫారెస్టులోని జింకలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దశకు వచ్చాయి. అదిలాబాద్ జిల్లా కోటపల్లి, పారుపల్లి, జనగామ, సుపాక, అర్జునగుట్ట, కిన్నారం గ్రామాల పరిధిలోని ప్రాణహిత నది ఒడ్డున వెంచపల్లి అభయారణ్యం విస్తరించి ఉంది. 1980లో వైల్డ్‌లైఫ్ అభయారణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 250 నుంచి 300 వరకు కృష్ణ జింకలు ఉండేవి. క్రమంగా ఈ సంఖ్య పెరగటంతో 1999లో వెంచంపల్లిని కృష్ణ జింకల అభయారణ్యంగా ప్రకటించారు. కానీ వేటగాళ్లు ఇష్టారాజ్యంగా జింకలను వేటాడారు. 2007లో తీసిన లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 40 జింకలు మాత్రమే ఉన్నట్టు తేలింది. 2015లో మరోసారి లెక్కలు తీయగా.. కేవలం 5 కృష్ణ జింకలు ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత రెండేళ్లకు చేసిన లెక్కల్ని అధికారులు బయటపెట్టలేదు.
కృష్ణా తీరంలో కష్టకాలం
మహబూబ్‌నగర్ జిల్లా తంగడి నుంచి జూరాల ప్రాజెక్టు వరకు 27 కి.మీ. మేర కృష్ణా తీరం ఉంది. నదికి ఉత్తరాన 34 గ్రామాలున్నాయి. ఈ పల్లెల్లో వేల సంఖ్యలో జింకలు ఉన్నాయి. తీరం వెంట గడ్డి లేకపోవటంతో స్థానికంగా పంట పొలాలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. ఇది రిజర్వు ఫారెస్టు ప్రాంతం కాదు. ఫారెస్టు అధికారుల నిఘా పెద్దగా ఉండదు. ఇదే అదునుగా కర్ణాటకలోని రాయచూరు నుంచి వస్తున్న వేటగాళ్లు యథేచ్ఛగా జింకల్ని వేటాడుతున్నారు. ఈ 34 గ్రామాలకు కలిపి ఇద్దరు ఫారెస్టు వాచర్లు మాత్రమే ఉన్నారు. సాధారణంగా ఫోకస్ లైట్‌ను జింక కళ్లలోకి సూటిగా కొడితే అవి కదలకుండా నిలబడతాయి. వెంటనే మరో వ్యక్తి వెనుక నుంచి కర్రతో జింకను బలంగా కొట్టి చంపుతున్నారు.
మూడు మెట్లను వదిలి..
అటవీ ఆవరణ వ్యవస్థలో పులిది చివరి మెట్టు. తొలిమెట్టులో గడ్డిజాతులు, పొదలు, చెట్లు ఉంటే.. రెండో మెట్టులో కుందేళ్లు, జింకలు, దుప్పులు కొండ గొర్రెలు వంటి శాకాహార జంతువులు ఉంటాయి. మూడో మెట్టులో వీటిని తిని బతికే నక్కలు, తోడేళ్లు, ఎలుగుబంటు లాంటి ద్వితీయ మాంసాహార జంతువులు ఉంటాయి. నాలుగో మెట్టులో పులి ఉంటుంది. పులి ఎదగాలంటే ఈ అటవీ ఆవరణ వ్యవస్థ సమతుల్యంగా ఉండాలి. పొదలు, గడ్డిజాతులతో పాటు జింకలు, కుందేళ్లు, కొండ గొర్రెలు, మనుబోతులు తగిన స్థాయిలో ఉండాలి. రాష్ట్ర అటవీ శాఖ అధికారులు పులులను ఆకర్షించే తొలి మూడు మెట్లలోని జీవులను నిర్లక్ష్యం చేస్తూ.. టైగర్ షెల్టర్ జోన్‌ను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment