Kawal Wildlife Sanctuary
-
కవ్వాల్‌లో వైల్డ్ డాగ్స్.. పెద్దపులిని కూడా భయపెడుతూ
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): ప్రసిద్ధి చెందిన కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలో అడవికుక్కల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అభయారణ్యం పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాలు, అధికారులు గుర్తించిన ఆనవాళ్లు ఆధారంగా దాదాపు 200 వరకు అడవి కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్క జన్నారం అటవీ డివిజన్‌లోనే సుమారుగా 90 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పది నుంచి పన్నెండు కుక్కలు గుంపుగా ఉంటూ వన్యప్రాణులపై దాడికి దిగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి గ్రూపులు జన్నారం డి విజన్‌లో 8 వరకు ఉన్నట్లు సమాచారం. ఈ రేసు కుక్కలు గుంపుగా సంచరిస్తూ అడవిలో నిత్యం అ లజడిని సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా పులి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. వీటి సంఖ్య పెరగడంతోనే ఏడాదిగా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని జన్నారం అటవీడివిజన్‌లో పులి అడుగు పెట్టడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దట్టమైన అటవీప్రాంతం.. దట్టమైన అటవీ ప్రాంతం, రకరకాల వన్యప్రాణులు, జలపాతాలు కలబోసిన కవ్వాల్ అడవులు పులులకు అనువుగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్‌లో కవ్వాల్ అభయారణ్యాన్ని టైగర్‌జోన్‌గా ప్రకటించింది. ఈ టైగర్‌జోన్‌లోకి ఉమ్మడి అదిలాబా ద్ జిల్లా అడవులు వస్తాయి. 892.23 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 123.12 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాగా గుర్తించారు. మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్, టైగర్ రిజర్వ్, చతీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్‌జోన్‌లో పులుల సంఖ్య అధికంగా ఉండటంతో కవ్వాల్ టైగర్ జోన్లో పులులు ఆవాసం ఏర్పర్చుకుంటాయని అధికారులు భావించారు. రాక మరిచిన బెబ్బులి.. రేసు కుక్కలుగా గుంపుగా తిరుగుతూ వేటాడుతాయి. వన్యప్రాణులను భయపెట్టే బెబ్బులి సైతం కుక్కల అలజడితో ఇటువైపు తిరిగి చూడటం లేదు. సంఖ్య బలంతో పులిని కూడా అవి భయపెడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో బఫర్ ఏరియా అయిన కాగజ్‌నగర్ డివిజన్లో ఆరుకుపైగా పెద్దపులులు సంచరిస్తుండగా.. వేమనపల్లి, కోటపల్లి ప్రాంతాల్లో కూడా పులి సంచారం ఉంది. కానీ అన్ని విధాలుగా అనుకూలంగా జన్నారం అటవీడివిజన్‌లో మాత్రం సంవత్సర కాలంగా అధికారులు పులి కదలికలను గుర్తించలేదు. పులులకు అనువైన ప్రాంతంగా, ఇక్కడ పదికి పైగా పులులకు సరిపడా వన్యప్రాణులు, ఆవాసాలు ఉన్నట్లు అంచనా వేశారు. తిప్పేశ్వర్, తాడోబా టైగర్ జోన్ల నుంచి కవ్వాల్ టైగర్ జోన్‌కు వచ్చే కారిడర్ నిత్యం అలజడితో ఉండటంతో పులి రాకపోకలు తగ్గిపోయాయి. బఫర్ ప్రాంతాల్లో తిరుగుతున్న పులి.. కోర్ ఏరియాలోకి అడుగు పెట్టకపోవడానికి అనేక కారణాలున్నాయి. రెండేళ్లపాటు రాకపోకలు సాగించిన పులి సంవత్సరం కాలంగా ఇక్కడ కనిపించడం లేదు. కారిడర్ వెంబడి హైవే రోడ్డు పనులు జరుగడం, మధ్యలో రైల్వేలైన్ ఉండటం కూడా ఓ కారణమని అధికారులు పేర్కొంటున్నారు. అలజడితోనే ఇబ్బంది కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో జన్నారం అటవీ డివిజన్ 12 శాతం మా త్రమే ఉంది. ఇక్కడ పులి నివాసానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. డివిజన్ పరిధిలో ఇటీవల అడవి కుక్కల సంఖ్య పెరిగింది. పులి రాకపోవడానికి అవి కూడా కారణం కావచ్చు. కారిడర్లో నిత్యం అలజ డి ఉండటం, పుశువులు, మనుషుల సంచా రం కారణంగా రాకపోకలు తగ్గిపోయాయి. – సిరిపురం మాధవరావు, ఎఫ్‌డీవో, జన్నారం చదవండి: కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స -
పొదల చాటున సంతాన వృద్ధి
జన్నారం (ఖానాపూర్): కవ్వాల్ టైగర్ జోన్లో అటవీశాఖ అధికారులు చేపట్టిన గడ్డి క్షేత్రాల పెంపకం సత్ఫాలితాలను ఇస్తోంది. గడ్డి మైదానాల పెంపకంతో రెండేళ్లలో టైగర్‌జోన్ పరిధి లో 40శాతం శాఖాహార జంతువులు పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పులికి సమృద్ధిగా ఆహారం అందుబాటులో ఉంటుందని వారు భావిస్తున్నారు. అడవిలో వన్యప్రాణుల జనాభా వాటి ఆవాస ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గడ్డి ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. శాఖాహార జంతువులు అధికంగా ఉంటే వాటిపై ఆధారపడిన మాంసాహార జంతువుల జనాభా కూడా పెరుగుతోంది. చదవండి: బంగారు చేప.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు 2018లో ప్రారంభం.. కవ్వాల్ టైగర్ జోన్ 893 హెక్టర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించింది. అప్పటి నుంచి అడపాదడపా పులులు రాకపోకలు సాగిస్తున్నా.. స్థానికంగా స్థిర నివాసం ఏర్పర్చుకున్న దాఖలాలు లేవు. జీవావరణ వ్యవస్థలో గడ్డి జాతుల ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఆహారపు గొలుసులో మొక్కలు ప్రథమ ఉత్పత్తి దారులుగా నిలుస్తాయి. వీటిపై జింకలు, దుప్పులు, సాంబర్లు, నీలుగాయిలు, కొండగొర్రెలు, అడవి దున్నలు, ఇతర వన్యప్రాణులు ఆధారపడి ఉంటాయి. శాఖాహార జంతువులపై ఆధారపడి పెద్ద పులులు, చిరుతలు, నక్కలు, అటవీ కుక్కలు, తోడేళ్లు తదితర జంతువులు మనుగడ సాగిస్తాయి. పులులకు స్థానికంగా తగినంత ఆహారాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో కవ్వాల్ టైగర్ జోన్లో గడ్డి క్షేత్రాల పెంపకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 2018 సంవత్సరంలో మహారాష్ట్రకు చెందిన గడ్డి క్షేత్రాల నిపుణుడు డాక్టర్ జీడీ మురత్కర్ జన్నారం డివిజన్లోని టీడీసీ టైగర్‌జోన్‌లో అటవీశాఖ అధికారులకు గడ్డి పెంపకంపై శిక్షణ ఇచ్చారు. సహజ గడ్డి క్షేత్రాలు, విత్తనాల సేకరణ, ముళ్ల కంచెల తొలగింపు, కలుపుమొక్కల నివారణ, గడ్డి విత్తనాల నిల్వ, సస్యరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదే ఏడాది 600 ఎకరాల్లో గడ్డి మైదానాల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఏటా పెంపకం.. శిక్షణ అనంతరం గడ్డి క్షేత్రాల పెంపకంలో స్థానిక అధికారులు చురుగ్గా పనిచేయడంతో దేశంలోని టైగర్‌జోన్‌లో కవ్వాల్జోన్కు మంచిపేరు వచ్చింది. 2018 సంవత్సరంలో 600 ఎకరాల్లో గడ్డి మైదానాలు పెంచగా.. 2019లో 130 హెక్టర్లలో, 2020లో 200 హెక్టార్లలో, ఈ ఏడాది మరో 180 హెక్టార్లలో గడ్డి మైదానాల పెంపకంపై దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాలలో గడ్డి విత్తనాలను చల్లి సహజసిద్ధంగా గడ్డిని పెంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాలలో సహజసిద్ధంగా మొలిచిన గడ్డి చుట్టూ కంచె వేసి, కలుపు తొలగిస్తారు. అడవిలోని వన్యప్రాణులకు ఆహారం, నీరు ఒకచోట అందుబాటులో ఉండేవిధంగా అధికారులు చొరవ తీసుకుంటున్నారు. నీటి కుంట ఉన్న ప్రాంతంలోనే గడ్డి పెంపకం చేపడితే వన్యప్రాణులు అహారం తిని అక్కడే నీరు తాగి సేదదీరేందుకు వీలుంటుందని వారు భావిస్తున్నారు. పెరుగుతున్న శాఖాహారులు.. గడ్డి క్షేత్రాల పెంపకంతో రెండేళ్లుగా శాఖాహార జంతువుల సంఖ్య 40 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పెరుగుదల ఇదేవిధంగా ఉంటే పది పులులకు సరిపడా ఆహారం స్థానికంగా లభిస్తుందని వారు అంటున్నారు. ప్రస్తుతానికి రెండు పులులు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లోకి రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే స్థానికంగా దట్టమైన అడవులు, సరిపడా శాఖాహార జంతువులు ఉన్నా పులులు స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. తిప్పేశ్వర్, తాడోబా టైగర్‌జోన్‌ల నుంచి కూడా పులుల రాకపోకలు ఉన్నాయి. దట్టమైన అటవీప్రాంతం, గడ్డి మైదానాలు, వేటాడేందుకు సరిపడా వన్యప్రాణుల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. అటవీ ప్రాంతంలో అలికిడిని తగ్గించి పులులు స్థానికంగా ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్రాంతాన్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. విరివిగా గడ్డి మైదానాలు 2018 నుంచి గడ్డి క్షేత్రాలను విరివిగా పెంచుతున్నాం. గతేడాది 200 హెక్టర్లలో గడ్డి మైదానాలు పెంచాం. దాని నిర్వహణ చూస్తూనే ఈ ఏడాది మరో 180 హెక్టార్లలో గడ్డిక్షేత్రాలను విస్తరిస్తున్నాం. కచ్చితమైన సంఖ్య తెలియకున్నా.. డివిజన్ పరిధిలో వన్యప్రాణుల సంతతి పెరుగుతోంది. రాత్రిపూట అడవి గుండా రాకపోకలు నిషేధించాం. వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. - మాధవరావు, డివిజన్ ఫారెస్టు అధికారి -
పెద్ద పులిని కాపాడుకుందామా !
సాక్షి, నిర్మల్ : బెబ్బులిని చూస్తే అడవి భయపడుతుంది. అలాంటి పులి ఇప్పుడు మనిషిని చూసి బెదురుతోంది. జాతీయ జంతువు అన్న భయం.. కనికరం కూడా లేకుండా.. ఎక్కడ కరెంటు షాక్ పెట్టి చంపుతాడో.. ఎందులో విషం కలిపి ఉసురు తీస్తాడో.. అని దట్టమైన అడవిలో గుండె దిటవు చేసుకుని బతుకు జీవుడా.. అంటోంది. గత కొన్నేళ్లుగా అడవుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్‌లో పదుల సంఖ్యలో పులులు వేటగాళ్ల ఉచ్చులకు, స్మగ్లర్ల స్కెచ్లకు బలయ్యాయి. 2018 చివరలోనే వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాపై దృష్టిపెట్టి అటవీశాఖ ప్రక్షాళన చేపట్టారు. అప్పటి నుంచి కొంతలో కొంత మార్పు కనిపిస్తోంది. వనంతో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. నేడు(మార్చి–3) ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా కవ్వాల్ పులులపై కథనం. పెరుగుతున్న పులుల సంఖ్య రాష్ట్రంలోని రెండు అభయారణ్యాల్లో ఒకటైన మన కవ్వాల్ పులుల అభయారణ్యంలో వాటి సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రతీ నాలుగేళ్లకోసారి కేంద్ర అటవీ శాఖ పరిధిలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) రాష్ట్రాల్లోని పులుల సంఖ్యను లెక్కిస్తుంటుంది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వివరాల ప్రకారం తెలంగాణలో 26 పులులు ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి పోలిస్తే వీటి సంఖ్య మరింత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో 10–12 పులులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే పెరిగిన పులులను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నానీ చెబుతున్నారు. నాలుగేళ్లలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) ప్రతి నాలుగేళ్లకోసా పులుల సంఖ్యను వెల్లడిస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక గతేడాది తొలిసారి ఈ వివరాలు వెల్లడయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్‌లు ఇలా అటవీ ప్రాంతాలన్నింటిలో పులులను అంచనా వేసేందుకు 2018 జూన్‌లో ఓ వారంపాటు అధ్యయనం జరిపారు. పులి పాదాల గుర్తులు, అడవుల్లో పెట్టిన కెమెరాలు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం లెక్కించారు. ఏడాదిపాటు శాస్త్రీయ సర్వే చేసిన తర్వాత వివరాలు వెల్లడించారు. వాటి ప్రకారం.. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో పులుల సంఖ్య 68 ఉండగా, అప్పుడు తెలంగాణలో 20 ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కవ్వాల్ అభయారణ్యంలో 3 పులులు ఉన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం కవ్వాల్‌లో 10–12వరకు పులులు ఉండొచ్చని అటవీ అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఖతం కవ్వాల్ అభయారణ్యానికి గతంలో వచ్చిన పులి.. వచ్చినట్లే ఖతమైంది. వేటగాళ్ల ఉచ్చులతో, స్మగ్లర్లు వేసిన స్కెచ్‌లతో పెద్దపులులు ప్రాణాలు కోల్పోయాయి. రెండేళ్లక్రితం వరుసగా కవ్వాల్ అభయారణ్యంలోని పులులను హతమార్చారు. వైల్డ్ లైఫ్ క్రైం సెంట్రల్ టీమ్ సభ్యులు ఇచ్చోడలో పులిచర్మం పట్టుకోవడం అప్పట్లో సంచలనమైంది. ఈ కేసులో కూపీ లాగగా, పెంబి మండలం తాటిగూడకు చెందిన గుగ్లావత్ ప్రకాశ్ అదే మండలంలోని పుల్గంపాండ్రి అడవుల్లో ఆ పులిని చంపినట్లు తేలింది. పుల్గంపాండ్రి గ్రామానికి చెందిన హలావత్ మున్యాతో కలిసి విద్యుత్ ఉచ్చుతో పులిని హతమార్చాడు. మాంసాన్ని కాల్చివేసి, దాని చర్మాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. ఆ తర్వాత పాత మంచిర్యాల బీట్‌లో చిరుతను హతమార్చడం, అదే క్రమంలో శివ్వారం బీట్‌లో ఏకంగా రాయల్ బెంగాల్ టైగర్‌ను మట్టుబెట్టడం తీవ్ర సంచలనం సృష్టించింది. కవ్వాల్ అడవుల్లోకి వచ్చిన పులిని వచ్చినట్లే చంపుతుండటంపై సర్కారు సీరియస్ అయ్యింది. ఏకంగా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్)తో పాటు నాలుగు జిల్లాల్లోని పలువురు డీఎఫ్ఓలు, ఎఫ్ఆర్ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలను బదిలీ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కవ్వాల్ ‘గుడ్’ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు అంటే..నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తోంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో భాగంగా ఉండే కొండలు, దట్టమైన అడవులతో ఉంటుంది. 2012లో కేంద్రంలో దేశంలో 41వ, రాష్ట్రంలో రెండో పులుల అభయారణ్యంగా ప్రకటించింది. దాదాపు 2,020 చదరపు కిలోమీటర్ మేర విస్తరించి ఉంది. ఇందులో 897 చ.కిలోమీటర్లు పెద్ద పులి సంచరించే కోర్ ఏరియాగా, 1,123 చ. కి. వేటాడే బఫర్ ఏరియాగా విభజించారు. తెలంగాణ ఏర్పడక ముందు ఇక్కడ పులులు శాతం చాలా తక్కువ. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మెరుగైన నిర్వహణ పద్ధతులను అవలంబిస్తుండటంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఎన్టీసీఏ జాబితాలో 60.16 శాతంతో కవ్వాల్ రేటింగ్ ‘ఫెయిర్’నుంచి ‘గుడ్’స్థానానికి పెరిగింది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం అనువైన వాతా వరణం కారణంగా క్రమంగా పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు ఫలిస్తున్నాయి. గతంలో కవ్వాల్కు వచ్చిన ఒక్క ఫాల్గుణ పులి ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తిప్పేశ్వర్, తాడోబా తదితర ఏరియాల నుంచి పులులు కవ్వాల్ వైపు వస్తున్నాయి. ‘బచావో’లో భాగంగా అడవులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఏళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బదిలీ వేటు వేసిన సర్కారు వారి స్థానాల్లో కఠినంగా వ్యవహరించే వారిని నియమించింది. ‘జంగిల్ బచావో– జంగిల్ బడావో’నినాదంతో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. సీఎం సీరియస్‌గా ఇచ్చి న ఆదేశాలతో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. అడవులతో పాటు ఇప్పుడు జాతీయ జంతువైన పులిని కూడా రక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా సీఎఫ్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో అభయారణ్యంలో పలు చర్యలు చేపడుతున్నారు. అభయారణ్యంలోకి పులి రాకకు అడ్డంకులుగా మారుతున్న వాటిపై దృష్టిపెట్టారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో అభయారణ్యం పరిధిలో ఉన్న రాంపూర్, మైసంపేట్ గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామాల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు నిధులు ఇవ్వాల్సి ఉంది. -
కడెం డివిజన్లో పులి సంచారంపై అప్రమత్తం
సాక్షి, జన్నారం(ఖానాపూర్): కడెం డివిజన్లోని పాడ్వాపూర్ బీట్ ప్రాంతంలో పులి సంచారం నేపథ్యంలో కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాడ్వాపూర్ బీట్ పరిధిలోని గంగాపూర్ ప్రాంతం, ఇస్లాంపూర్ అడవి నుంచి కవ్వాల్ సెక్షన్లో పులి పర్యటించే అవకాశం ఉంది. దీంతో ఆదివారం ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీనివాసరావు అధ్వర్యంలో అధికారులు కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని కవ్వాల్ సెక్షన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పులి అడుగులు, ఇతర గుర్తింపులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో రహదారులు, వాగులు, ఇతర ప్రాంతాల్లో అధికారులు పులి అడుగుల కోసం అన్వేషించారు. ఎక్కడా అడుగులు కనిపించలేదు. గంగాపూర్ మీదుగా కవ్వాల్కు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఎలాంటి అలజడి లేకుండా, పశువులు రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులి కవ్వాల్ సెక్షన్లో ప్రవేశిస్తే ఇక్కడి సౌకర్యాల దృష్ట్యా తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదనే ఆశాభావం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యాన్ని 2012 జనవరి 10న కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి అసెంబ్లీ స్పీకర్ మనోహర్ కవ్వాల్ అభయారణ్యంలో పర్యటించి ఆయన చేసిన సూచన మేరకు 49వ టైగర్‌జోన్‌గా ఏర్పాటు చేశారు. టైగర్‌జోన్ ఏర్పాటు నుంచి పులి రాక కోసం అధికారులు అన్నిరాకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. మూడేళ్ల క్రితం కొన్ని రోజులు రాకపోకలు కొనసాగించింది. ఈ క్రమంలో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు, అటవీశాఖ అధికారులు పులికి రక్షణ కల్పించారు. కొంత అలజడి వల్ల వచ్చిన పులి మూడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయింది. ఎట్టకేలకు ఈ నెల 15 న కడెం రేంజ్ పరిధిలోని పాడ్వాపూర్ బీట్, గంగాపూర్ పరిధిలో బేస్‌క్యాంపు సిబ్బందికి పులి కనిపించింది. వారు అప్రమత్తమై ఉన్నత అధికారులకు తెలియజేయడంతో కెమరాలు అమర్చడం వల్ల పులి కెమెరాకు చిక్కింది. దీంతో అధికారుల అనుమానం నిజమైంది. అడుగుల సేకరణలో సిబ్బంది కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఇటీవలే పెద్ద పులి కనిపించడంతో అధికారులు వాటి సంఖ్యను క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ నిర్వహించారు. శనివారం కడెం ఆటవీ రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్, బీట్ల ఫరిధిలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో పెద్ద పులి కనిపించడంతో అంతకుముందు దాని పాదలు గుర్తించిన అధికారులు వాటి సంఖ్యను గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ పనిలో ఉన్నారు. కడెం రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్ బీట్లతోపాటు ఇతర బీట్లలో వాటి అనవాళ్లు ఉన్నాయా అనే కోణంలో పరిశీలించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. ఆదివారం హైదరాబాద్ అటవీ శిక్షణ ఎఫ్ఆర్ఓలు శిక్షణకు రావడంతో ఈ ప్రాం తం, జంతువుల వివరాలను అటవీ అధికారులు తెలియజేశారు. ఎఫ్ఆర్వో రమేశ్ రాథోడ్, ఎఫ్‌ఎస్‌ఓలు ప్రభాకర్, మమత పాల్గొన్నారు. -
పెద్దపులి కనిపించిందోచ్!
సాక్షి, నిర్మల్: రాష్ట్రంలో ప్రముఖ టైగర్ కన్జర్వేషన్ జోన్ కవ్వాల్ అభయారణ్యంలో తాజాగా పెద్దపులి కనిపించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ రేంజ్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు పెద్దపులి సంచారాన్ని దాదాపు ఏడాది తర్వాత గుర్తించారు. పెద్దపులి కదలికలు కెమెరా కంటికి చిక్కాయి. కవ్వాల్ అటవీ ప్రాంతంలో మనుషులు, పశువుల సంచారం నియంత్రించడం.. గడ్డిక్షేత్రాలు భారీగా పెంచడంతో సత్ఫలితాలు ఇచ్చిందని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
కవ్వాల్ పులికి ‘ఫుడ్డు’ సవ్వాల్!
సాక్షి, హైదరాబాద్ అది టైగర్ షెల్టర్ జోన్.. కానీ అక్కడే పుట్టి పెరిగిన పులి ఒక్కటంటే ఒక్కటి లేదు.. అయినా సరే పక్క రాష్ట్రాల నుంచి పులుల్ని రప్పించేందుకు అధికారులు కోట్లు వెచ్చిస్తున్నారు.. ఆ అడవిలో కృత్రిమంగా పశుగ్రాసం పెంచారు.. నీటి చెలమలు తీశారు.. చెక్‌డ్యాంలు కట్టారు.. అటవీ భూమి చుట్టూ కందకాలు తవ్వించారు.. కానీ పులికి కావాల్సిన తిండిని మాత్రం మరిచారు! పస్తులైనా ఉంటుంది కానీ పచ్చిగడ్డి తినదన్న లాజిక్‌ను మరిచిన అధికారులు.. కోట్లు పోసి లేని పులిని రా.. రమ్మని పిలుస్తున్నారు! అదే సమయంలో పులికి ఆహారమైన దుప్పులు, కృష్ణ జింకలు, మచ్చల జింకలు, మనుబోతులు, కొండ గొర్రెలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వేటగాళ్లు వాటిని యథేచ్ఛగా చంపేస్తున్నా కళ్లు మూసుకుంటున్నారు. పులులే లేని చోట.. రాష్ట్ర అటవీ శాఖ కేంద్రానికి ఏం నివేదికలు పంపిందో ఏమో గానీ కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అభయారణ్యాన్ని 41వ పులుల సంరక్షణ కేంద్రం(టైగర్ షెల్టర్ జోన్)గా గుర్తించింది. 1,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర అటవీ ప్రాంతాన్ని కవ్వాల్ టైగర్ ప్రాజెక్టుగా ప్రకటించారు. దీని అభివృద్ధికి కేంద్రం రూ.45 కోట్ల నిధులిచ్చింది. ఈ సొమ్ముతో అధికారులు పశుగ్రాసం పెంచారు. పులులు వస్తే తాగటానికి నీటి సాసర్లు, చెలిమలు తీయడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేశారు. పులి అవాసం ఏర్పాటు చేసుకోవటానికి కనీసం 20 నుంచి 30 చ.కి.మీ. దట్టమైన అటవీప్రాంతం అవసరం. ప్రతి చదరపు కిలో మీటరుకు కనీసం 60 నుంచి 70 శాకాహార జంతువులు ఉండాలి. పులి సగటున ప్రతి మూడు రోజులకు ఒకసారైనా వేటాడుతుంది. కానీ కవ్వాల్ ప్రాంతంలో జింకలు, దుప్పులు, ఇతర అటవీ జంతువులు ఏ మేరకు ఉన్నాయన్న కచ్చితమైన లెక్కలు అటవీ శాఖ అధికారుల వద్ద లేవు. విచిత్రమేమిటంటే స్థానికంగా కవ్వాల్ అడవిలో పుట్టి పెరిగిన పెద్దపులి ఒక్కటి కూడా లేదు. అక్కడ పులుల సంచారంపై ఉట్నూరు మండలం కుమ్మరికుంటకు చెందిన భీమ్‌రావ్‌ను అడగ్గా.. ‘‘70 ఏళ్ల నుంచి ఈ అడవిలనే బతుకుతున్న. ఎన్నడూ పులిని చూడలె. దాన్ని జూసినట్టు మా నాయిన కూడా చెప్పలె!’’ అని పేర్కొన్నాడు. ఏమో.. రాకపోతాయా? ఈ నెలలో పులుల లెక్కింపు ఉండటంతో రాష్ట్ర అటవీ అధికారులు నానా హైరానా పడుతున్నారు. కవ్వాల్ అభయారణ్యానికి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని తాడోబా, 100 కి.మీ. దూరంలో ఉన్న మరో టైగర్ ప్రాజెక్టు ఇంద్రావతిపైనే ఆశలు పెట్టుకున్నారు. పులుల సంచారానికి అవకాశం ఉన్న దారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గమనిస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ్నుంచి 7 నుంచి 9 పులులు వచ్చినట్లు నివేదికలు రూపొందించారు. ఇందులో ఓ పులి 2015లో వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగలకు తగిలి చనిపోయింది. మిగతా పులులు కవ్వాల్ ప్రాంతంలోనే ఉన్నాయా? వెనక్కి వెళ్లాయా అన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ‘ఏమో.. ఈ నెలలో చేయబోయో పులుల జనాభా లెక్కల్లో తెలుస్తుంది’ అని చెబుతున్నారు. ప్రతి చ.కి.మీ.కు కనీసం 60–70 వరకు శాకాహార జంతువులు లేకుంటే పులులు రావని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉన్న జింకలకు రక్షణేది..? పులుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఫారెస్టు అధికారులు కవ్వాల్కు ఆనుకొనే ఉన్న ప్రాణహిత నదీ తీరంలోని జింకలను పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యానికి మూల్యంగా వెంచపల్లి రిజర్వ్ ఫారెస్టులోని జింకలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దశకు వచ్చాయి. అదిలాబాద్ జిల్లా కోటపల్లి, పారుపల్లి, జనగామ, సుపాక, అర్జునగుట్ట, కిన్నారం గ్రామాల పరిధిలోని ప్రాణహిత నది ఒడ్డున వెంచపల్లి అభయారణ్యం విస్తరించి ఉంది. 1980లో వైల్డ్‌లైఫ్ అభయారణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 250 నుంచి 300 వరకు కృష్ణ జింకలు ఉండేవి. క్రమంగా ఈ సంఖ్య పెరగటంతో 1999లో వెంచంపల్లిని కృష్ణ జింకల అభయారణ్యంగా ప్రకటించారు. కానీ వేటగాళ్లు ఇష్టారాజ్యంగా జింకలను వేటాడారు. 2007లో తీసిన లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 40 జింకలు మాత్రమే ఉన్నట్టు తేలింది. 2015లో మరోసారి లెక్కలు తీయగా.. కేవలం 5 కృష్ణ జింకలు ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత రెండేళ్లకు చేసిన లెక్కల్ని అధికారులు బయటపెట్టలేదు. కృష్ణా తీరంలో కష్టకాలం మహబూబ్‌నగర్ జిల్లా తంగడి నుంచి జూరాల ప్రాజెక్టు వరకు 27 కి.మీ. మేర కృష్ణా తీరం ఉంది. నదికి ఉత్తరాన 34 గ్రామాలున్నాయి. ఈ పల్లెల్లో వేల సంఖ్యలో జింకలు ఉన్నాయి. తీరం వెంట గడ్డి లేకపోవటంతో స్థానికంగా పంట పొలాలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. ఇది రిజర్వు ఫారెస్టు ప్రాంతం కాదు. ఫారెస్టు అధికారుల నిఘా పెద్దగా ఉండదు. ఇదే అదునుగా కర్ణాటకలోని రాయచూరు నుంచి వస్తున్న వేటగాళ్లు యథేచ్ఛగా జింకల్ని వేటాడుతున్నారు. ఈ 34 గ్రామాలకు కలిపి ఇద్దరు ఫారెస్టు వాచర్లు మాత్రమే ఉన్నారు. సాధారణంగా ఫోకస్ లైట్‌ను జింక కళ్లలోకి సూటిగా కొడితే అవి కదలకుండా నిలబడతాయి. వెంటనే మరో వ్యక్తి వెనుక నుంచి కర్రతో జింకను బలంగా కొట్టి చంపుతున్నారు. మూడు మెట్లను వదిలి.. అటవీ ఆవరణ వ్యవస్థలో పులిది చివరి మెట్టు. తొలిమెట్టులో గడ్డిజాతులు, పొదలు, చెట్లు ఉంటే.. రెండో మెట్టులో కుందేళ్లు, జింకలు, దుప్పులు కొండ గొర్రెలు వంటి శాకాహార జంతువులు ఉంటాయి. మూడో మెట్టులో వీటిని తిని బతికే నక్కలు, తోడేళ్లు, ఎలుగుబంటు లాంటి ద్వితీయ మాంసాహార జంతువులు ఉంటాయి. నాలుగో మెట్టులో పులి ఉంటుంది. పులి ఎదగాలంటే ఈ అటవీ ఆవరణ వ్యవస్థ సమతుల్యంగా ఉండాలి. పొదలు, గడ్డిజాతులతో పాటు జింకలు, కుందేళ్లు, కొండ గొర్రెలు, మనుబోతులు తగిన స్థాయిలో ఉండాలి. రాష్ట్ర అటవీ శాఖ అధికారులు పులులను ఆకర్షించే తొలి మూడు మెట్లలోని జీవులను నిర్లక్ష్యం చేస్తూ.. టైగర్ షెల్టర్ జోన్‌ను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. -
కవ్వాల్ ఖాళీ
ఆగని వనమేధం చోద్యం చూస్తున్న అధికారులు జన్నారం : కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశం.. కవ్వాల్ అభయారణ్యం అని దేశ వ్యాప్తంగా పేరు గాంచిన అడవి రోజురోజుకూ కర్పూరంలా కరిగిపోతోంది. అడవుల రక్షణ చేపట్టాల్సిన అధికారులు, అధికారుల తీరు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువై అడవులు మైదానాలుగా మారుతున్నాయి. కవ్వాల్, కల్లెడ, మహ్మదాబాద్ అటవీ సెక్షన్ల పరిధిలో స్మగ్లర్లు టేకు కలపను అధికారుల కళ్లు కప్పి తరలించడమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.కవ్వాల్ అభయారణ్యం 2012లో పులుల ర క్షిత ప్రదేశంగా మారింది. పులుల రక్షిత ప్రదేశంలో 893 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1,123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాను గుర్తించారు. జన్నారం అటవీ డివిజన్ పరిధిలో 18 సెక్షన్లు, 43 బీట్లు ఉన్నాయి. అడవుల రక్షణ కోసం డివిజన్లో రేంజ్ అధికారుల పర్యవేక్షణలో సెక్షన్ అధికారులు 18, బీట్ అధికారులు 43, ఐదుగురు రేంజ్ ఆఫీసర్లు, 88 మంది బేస్‌క్యాంపు సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ.. కలప తరలింపును అడ్డుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. కానీ.. కలప తరలింపు ఆపడంలో అధికారులు విఫలమవుతున్నారు. టైగర్‌జోన్ ఏర్పాటు నుంచి ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా అవేమీ పట్టనట్లుగా స్మగ్లర్లు తమ పని కానిచ్చేస్తున్నారు. డివిజన్లోని భర్తన్పేట్, కవ్వాల్, మహ్మదాబాద్, కల్లెడ అటవీ సెక్షన్లలో విలువైన టేకు చెట్లు ఇంకా నేలకు ఒరుగుతూనే ఉన్నాయి. స్మగ్లర్లు తమ స్వలాభం కోసం చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి, కలప రూపంలో బయటకు తీసుకుపోతుంటే అడ్డుకట్ట వేయాల్సిన కొందరు అధికారులు వారికి వంత పాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్మగ్లర్ల పని సులవవుతోందని వారు అంటున్నారు. ఎడ్లబండ్లు, సైకిళ్లపై అడవులకు వెళ్లి విలువైన టేకు వృక్షాలను నేల కూల్చి.. అందులో నుంచి వారికి అవసరమైన కలపను ఊరు బయట పెట్టి ముక్కలు చేస్తున్నారు. వాటిని ఇతర పట్టణాలకు తీసుకెళ్లి వేల రుపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. కవ్వాల్ అటవి ప్రాంతం నుంచి కూడా కలప రవాణా కొనసాగుతున్నట్లు సమాచారం. ఉత్సవాల్లో విగ్రహాల్లా బేస్‌క్యాంపులు అడవులను రక్షించడంలో భాగంగా రాత్రి, పగలు అడవుల్లో గస్తీ తిరిగి స్మగ్లింగ్‌కు బ్రేకులు వేయాల్సిన బేస్‌క్యాంపు సిబ్బంది ఉత్సవ విగ్రహాల్లా మారారు. జన్నారం డివిజన్ పరిధిలో నాలుగు బేస్ క్యాంపులు పనిచేస్తున్నాయి. అయితే.. వీరు అడవిని రక్షించాల్సిన పనికి మించి అధికారులు ఏం పని చెప్తే అదే చేయాల్సి వస్తోంది. కర్ర పట్టుకున్న సెక్షన్ అధికారి లేదా బీట్ అధికారి ఫోన్ చేస్తే వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భయపడుతున్న పులి.. గతంలో కవ్వాల్ ప్రాంతంలో మైసమ్మలొద్ది, గొల్లగుట్ట, దొంగపల్లి ప్రాంతంలో తిరిగిన పులి ఇప్పుడు రెండు నెలలుగా కెమెరాలకు చిక్కడం లేదు. అడవుల్లో అలజడి ఎక్కువగా ఉండటంతోనే పులులు బయటకు రావడం లేదని టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు పేర్కొంటున్నారు. మచ్చుకు కొన్ని సంఘటనలు కవ్వాల్ అభయారణ్యం నుంచి నిత్యం ఏదో ఒక ప్రాంతం నుంచి కలప తరలిస్తున్నారు. కవ్వాల్ నుంచి రెండు నెలల క్రితం కలప తరలిస్తున్న మూడు ఆటోలను కలమడుగు చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. అదే విధంగా చింతగూడ నుంచి తరలించిన ఆటోను ఇందన్పల్లి వద్ద పట్టుకున్నారు. మహ్మదాబాద్ బీట్ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే చెట్టును రంపంతో కోసి పట్టుకెళ్లారు. ఇక్కడ అధికారుల సహకారం లేనిదే ఇంత జరుగుతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కవ్వాల్ అటవి బీట్ నుంచి రోజూ కలప తరలిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అటవీ అధికారులు కలప పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల పోలీసులు కలప స్మగ్లింగ్ నిరోధించడానికి రంగంలో దిగారు. ఈ క్రమంలో పలుమార్లు కలప పట్టుకుని అటవి శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. సీఐ మోహన్ పలుసార్లు కలప పట్టుకుని అటవి అధికారులకు అప్పగించారు. పది రోజుల క్రితం కవ్వాల నుంచి ఆటోలో కలప తీసుకువస్తుండగా స్రై్టకింగ్ ఫోర్స్ సెక్షన్ అధికారి వినయ్‌కుమార్ పట్టుకున్నారు. డ్రైవర్ ఎదురు తిరగడంతో పోలీస్ కేసు నమోదు చే శారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి కలప స్మగ్లింగ్ నిరోధించకుంటే రానున్న రోజుల్లో అడవులు మైదానంగా మారే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం సోనాపూర్తండా బీట్ పరిధిలో కలప తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న బీట్ అధికారి ఆడెపు కిరణ్, మరో ఇద్దరు బేస్ క్యాంపు సిబ్బంది కలిసి కామన్పల్లి కెనాల్ మీదుగా సోనాపూర్ వైపు వెళ్లారు. ఎదురుగా వస్తున్న పలువురిని అనుమానాస్పదంగా కనిపించిన వారిని ఎక్కడికెళ్తున్నారని ప్రశ్నించగా.. వారు కిరణ్ అనే అధికారిపై దాడికి దిగారు. నిఘా పెట్టాం బేస్‌క్యాంపులు, స్రై్టకింగ్ ఫోర్స్‌లతో నిఘా పెట్టాం. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా. పోలీసుల సహాయంతో కలప స్మగ్లింగ్ నిరోధిస్తున్నాం. సమాచారం అందిస్తే కలప తరలించిన వారిపై చర్యలు తీసుకుంటాం. కలప తరలింపు నిరోధించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. - ప్రతాప్, రేంజ్ అధికారి