కవ్వాల్ ఖాళీ
కవ్వాల్ ఖాళీ
Published Tue, Nov 15 2016 2:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
ఆగని వనమేధం
చోద్యం చూస్తున్న అధికారులు
జన్నారం : కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశం.. కవ్వాల్ అభయారణ్యం అని దేశ వ్యాప్తంగా పేరు గాంచిన అడవి రోజురోజుకూ కర్పూరంలా కరిగిపోతోంది. అడవుల రక్షణ చేపట్టాల్సిన అధికారులు, అధికారుల తీరు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువై అడవులు మైదానాలుగా మారుతున్నాయి. కవ్వాల్, కల్లెడ, మహ్మదాబాద్ అటవీ సెక్షన్ల పరిధిలో స్మగ్లర్లు టేకు కలపను అధికారుల కళ్లు కప్పి తరలించడమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.కవ్వాల్ అభయారణ్యం 2012లో పులుల ర క్షిత ప్రదేశంగా మారింది. పులుల రక్షిత ప్రదేశంలో 893 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1,123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాను గుర్తించారు. జన్నారం అటవీ డివిజన్ పరిధిలో 18 సెక్షన్లు, 43 బీట్లు ఉన్నాయి. అడవుల రక్షణ కోసం డివిజన్‌లో రేంజ్ అధికారుల పర్యవేక్షణలో సెక్షన్ అధికారులు 18, బీట్ అధికారులు 43, ఐదుగురు రేంజ్ ఆఫీసర్లు, 88 మంది బేస్‌క్యాంపు సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ.. కలప తరలింపును అడ్డుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు.
కానీ.. కలప తరలింపు ఆపడంలో అధికారులు విఫలమవుతున్నారు. టైగర్‌జోన్ ఏర్పాటు నుంచి ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా అవేమీ పట్టనట్లుగా స్మగ్లర్లు తమ పని కానిచ్చేస్తున్నారు. డివిజన్‌లోని భర్తన్‌పేట్, కవ్వాల్, మహ్మదాబాద్, కల్లెడ అటవీ సెక్షన్లలో విలువైన టేకు చెట్లు ఇంకా నేలకు ఒరుగుతూనే ఉన్నాయి. స్మగ్లర్లు తమ స్వలాభం కోసం చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి, కలప రూపంలో బయటకు తీసుకుపోతుంటే అడ్డుకట్ట వేయాల్సిన కొందరు అధికారులు వారికి వంత పాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్మగ్లర్ల పని సులవవుతోందని వారు అంటున్నారు. ఎడ్లబండ్లు, సైకిళ్లపై అడవులకు వెళ్లి విలువైన టేకు వృక్షాలను నేల కూల్చి.. అందులో నుంచి వారికి అవసరమైన కలపను ఊరు బయట పెట్టి ముక్కలు చేస్తున్నారు. వాటిని ఇతర పట్టణాలకు తీసుకెళ్లి వేల రుపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. కవ్వాల్ అటవి ప్రాంతం నుంచి కూడా కలప రవాణా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఉత్సవాల్లో విగ్రహాల్లా బేస్‌క్యాంపులు
అడవులను రక్షించడంలో భాగంగా రాత్రి, పగలు అడవుల్లో గస్తీ తిరిగి స్మగ్లింగ్‌కు బ్రేకులు వేయాల్సిన బేస్‌క్యాంపు సిబ్బంది ఉత్సవ విగ్రహాల్లా మారారు. జన్నారం డివిజన్ పరిధిలో నాలుగు బేస్ క్యాంపులు పనిచేస్తున్నాయి. అయితే.. వీరు అడవిని రక్షించాల్సిన పనికి మించి అధికారులు ఏం పని చెప్తే అదే చేయాల్సి వస్తోంది. కర్ర పట్టుకున్న సెక్షన్ అధికారి లేదా బీట్ అధికారి ఫోన్ చేస్తే వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భయపడుతున్న పులి..
గతంలో కవ్వాల్ ప్రాంతంలో మైసమ్మలొద్ది, గొల్లగుట్ట, దొంగపల్లి ప్రాంతంలో తిరిగిన పులి ఇప్పుడు రెండు నెలలుగా కెమెరాలకు చిక్కడం లేదు. అడవుల్లో అలజడి ఎక్కువగా ఉండటంతోనే పులులు బయటకు రావడం లేదని టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు పేర్కొంటున్నారు.
మచ్చుకు కొన్ని సంఘటనలు
కవ్వాల్ అభయారణ్యం నుంచి నిత్యం ఏదో ఒక ప్రాంతం నుంచి కలప తరలిస్తున్నారు. కవ్వాల్ నుంచి రెండు నెలల క్రితం కలప తరలిస్తున్న మూడు ఆటోలను కలమడుగు చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు.
అదే విధంగా చింతగూడ నుంచి తరలించిన ఆటోను ఇందన్‌పల్లి వద్ద పట్టుకున్నారు. మహ్మదాబాద్ బీట్ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే చెట్టును రంపంతో కోసి పట్టుకెళ్లారు. ఇక్కడ అధికారుల సహకారం లేనిదే ఇంత జరుగుతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కవ్వాల్ అటవి బీట్ నుంచి రోజూ కలప తరలిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అటవీ అధికారులు కలప పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల పోలీసులు కలప స్మగ్లింగ్ నిరోధించడానికి రంగంలో దిగారు. ఈ క్రమంలో పలుమార్లు కలప పట్టుకుని అటవి శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. సీఐ మోహన్ పలుసార్లు కలప పట్టుకుని అటవి అధికారులకు అప్పగించారు.
పది రోజుల క్రితం కవ్వాల నుంచి ఆటోలో కలప తీసుకువస్తుండగా స్రై్టకింగ్ ఫోర్స్ సెక్షన్ అధికారి వినయ్‌కుమార్ పట్టుకున్నారు. డ్రైవర్ ఎదురు తిరగడంతో పోలీస్ కేసు నమోదు చే శారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి కలప స్మగ్లింగ్ నిరోధించకుంటే రానున్న రోజుల్లో అడవులు మైదానంగా మారే అవకాశం ఉంది.
రెండు రోజుల క్రితం సోనాపూర్‌తండా బీట్ పరిధిలో కలప తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న బీట్ అధికారి ఆడెపు కిరణ్, మరో ఇద్దరు బేస్ క్యాంపు సిబ్బంది కలిసి కామన్‌పల్లి కెనాల్ మీదుగా సోనాపూర్ వైపు వెళ్లారు. ఎదురుగా వస్తున్న పలువురిని అనుమానాస్పదంగా కనిపించిన వారిని ఎక్కడికెళ్తున్నారని ప్రశ్నించగా.. వారు కిరణ్ అనే అధికారిపై దాడికి దిగారు.
నిఘా పెట్టాం
బేస్‌క్యాంపులు, స్రై్టకింగ్ ఫోర్స్‌లతో నిఘా పెట్టాం. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా. పోలీసుల సహాయంతో కలప స్మగ్లింగ్ నిరోధిస్తున్నాం. సమాచారం అందిస్తే కలప తరలించిన వారిపై చర్యలు తీసుకుంటాం. కలప తరలింపు నిరోధించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.
- ప్రతాప్, రేంజ్ అధికారి
Advertisement
Advertisement